Skip to main content

గ్రూప్-2లో ఎకానమీపై పట్టు సాధించండిలా..

గ్రూప్-2 మూడో పేపర్ సిలబస్ పూర్తిగా ఎకానమీకి సంబంధించి ఉంటుంది. రెండు సెక్షన్లుగా ఉన్న సిలబస్‌లో మొదటి సెక్షన్‌లో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఇవ్వగా, 2వ సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను ఇచ్చారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశంపై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరి. ఈ దిశగా ప్రామాణిక పుస్తకాలను చదివితే విషయ పరిజ్ఞానంతోపాటు విజయావకాశాలు మెరుగవుతాయని అభ్యర్థులు గుర్తించాలి.
ప్రశ్నపత్రంలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 75 ప్రశ్నలు భారత ఆర్థిక వ్యవస్థ నుంచి, మరో 75 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాల నుంచిఅడుగుతారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించేందుకు సిలబస్‌లోని అన్ని అంశాలపైనా సమగ్ర అవగాహన తప్పనిసరి.

భారత ఆర్థిక వ్యవస్థ
మొదటి చాప్టర్‌లో స్థూలంగా ప్రణాళికలు, సంస్కరణలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ప్రణాళికలను అధ్యయనం చేసే క్రమంలో ప్రణాళికల లక్ష్యాలు, వివిధ రంగాల మధ్య వనరుల కేటాయింపు,పణాళికల వారీగా సాధించిన వృద్ధి, ప్రణాళికా వ్యూహాలు, విజయాలు, వైఫల్యాలను పరిశీలించాలి. ప్రణాళికల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడి ఆధారాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

మొదటి తరం సంస్కరణల్లో భాగంగా రాజీవ్‌గాంధీ హయాంలో 1985లో ప్రవేశపెట్టిన సంస్కరణలు, 1991లో పి.వి.నరసింహారావు నేతృత్వంలో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. రెండో తరం సంస్కరణల్లో భాగంగా 2001-02 నుంచి ఇటీవల కాలంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి సడలింపు, వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) గురించి తెలుసుకోవాలి. ప్రణాళికల్లో భాగంగా పేదరిక, నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రారంభించిన పథకాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు 11వ ప్రణాళిక ప్రగతి, 12వ ప్రణాళిక ముఖ్యాంశాలు, సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్‌పై అవగాహన పెంపొందించుకోవాలి.

రెండో చాప్టర్‌లో వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు, ద్రవ్య, కోశ విధానాలు, ద్రవ్య అసమతుల్యత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కరెంట్ అకౌంట్ వంటి అంశాలను పొందుపరిచారు. వ్యవసాయ విధానాలకు సంబంధించి వ్యవసాయ రంగంలో సాంకేతికపరమైన సంస్కరణ విధానాలు, సంస్థాపరమైన సంస్కరణలు, మార్కెటింగ్, ధరలకు సంబంధించిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

పారిశ్రామిక విధానాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1956, 1977, 1980, 1990, 1991 పారిశ్రామిక తీర్మానాల్లోని ముఖ్యాంశాలను పరిశీలించాలి. ద్రవ్య సరఫరా నియంత్రణకు రిజర్‌‌వబ్యాంక్ అవలంబించే ద్రవ్య విధాన లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు ద్రవ్య విధాన లక్ష్యాల సాధనలో రిజర్‌‌వ బ్యాంక్ వైఫల్యానికి గల కారణాలను కూడా అధ్యయనం చేయాలి. నూతన విదేశీ వాణిజ్యం 2015-20కు సంబంధించిన ముఖ్యాంశాలను పరిశీలించాలి. భారతదేశం కరెంటు అకౌంట్ లోటును ఎదుర్కోవడానికి గల కారణాలు, కరెంట్ అకౌంట్‌లోటును నియంత్రించేందుకు ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను పరిశీలించాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి వివిధ రంగాల్లో ఎఫ్‌ఢీఐల పరిమితి, రాష్ట్రాలు, రంగాల వారీగా ఎఫ్‌డీఐల ప్రవాహంపై నోట్స్ రూపొందించుకోవాలి.

మూడో చాప్టర్:
ఇందులో జనాభా పరమైన అంశాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా 0-6 వయోవర్గ జనాభా, 60 ఏళ్లకు పైబడినజనాభాకు సంబంధించిన జనాభా వృద్ధి, పురుషులు, మహిళలకు సంబంధించిన గణాంకాలను సేకరించాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌పై అవగాహన అవసరం. మానవాభివృద్ధి సూచీ రూపకల్పనలో వినియోగించే సూచికలు, ఆయా సూచికల విషయంలో భారతదేశానికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేయాలి.

నాలుగో చాప్టర్
ఇందులో ద్రవ్యం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ద్రవ్యం విధులు, సమష్టి ద్రవ్య వనరులు, ద్రవ్యత్వ వనరులు (L1, L2, L3), నూతన ద్రవ్య వనరులు (NM1, NM2, NM3)పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు ద్రవ్య డిమాండ్ సిద్ధాంతాల్లో(ఫిషర్, మార్షల్, పిగూ, రాబర్‌‌టసన్, కీన్‌‌స, ఫ్రీడ్‌మన్, టోబిన్)ని ముఖ్యాంశాలను పరిశీలించాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వాణిజ్య బ్యాంకులు పరపతిని ఏ విధంగా సృష్టిస్తాయి? పరపతి సృష్టికి ఉన్న అవరోధాలపై నోట్స్ రూపొందించుకోవాలి. జాతీయీకరణకు ముందు, జాతీయీకరణకు తర్వాత వాణిజ్య బ్యాంకుల ప్రగతిలో భాగంగా రికవరీ కాని రుణాలు, డిపాజిట్లపై అవగాహన అవసరం. దీంతోపాటు బ్యాంకుల విలీనాలపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ప్రారంభమైన పేమెంట్ బ్యాంకులపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణ రకాలు, ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం, స్టాగ్‌ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, ఫిలిప్స్ రేఖ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, కోశలోటు, రెవెన్యూ, ప్రాథమికలోటుతోపాటు పన్ను, పన్నేతర మార్గాలపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వస్తు, సేవల పన్నులో భాగంగా జీఎస్టీ బిల్లులోని ముఖ్యాంశాలను తప్పనిసరిగా చదవాలి.

ఐదో చాప్టర్:
ఇందులో ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి నిర్వచనాలను అధ్యయనం చేయాలి. దీంతోపాటు భారతదేశం వంటి అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లక్షణాలపై తప్పనిసరిగా అవగాహన కలిగుండాలి. మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు (కార్పొరేటు) రంగం, కుటుంబ రంగాల్లో వృద్ధిని పరిశీలించాలి. వృద్ధి వ్యూహాలకు సంబంధించి సంతులిత, అసంతులిత వృద్ధి సిద్ధాంతాలతోపాటు మార్‌‌క్స, రాబిన్‌సన్, లూయిస్, ప్రెబిష్ సింగర్ వృద్ధి సిద్ధాంతాలను అధ్యయనం చేయాలి.

ఆరో చాప్టర్‌లో జాతీయాదాయ భావనలను పొందుపరిచారు. జీడీపీ, ఎన్‌డీపీ, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద వ్యష్టి వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయ భావనలపై నోట్స్ రూపొందించుకోవాలి. ఇటీవల కాలంలో వివిధ రంగాల వాటాకు సంబంధించిన గణాంకాలను సేకరించాలి. స్థూలంగా స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానంతరం జాతీయాదాయ లెక్కింపు పద్ధతులపై అవగాహన ఉండాలి. ప్రధానంగా జాతీయాదాయాన్ని మదించే పద్ధతులైన ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
మొదటి చాప్టర్:
ఆంధ్రప్రదేశ్ ఆదాయం, ఉపాధి కల్పన, నూతన ఆంధ్రప్రదేశ్ అవతరణానంతర అంశాలను పొందుపరిచారు. ఈ చాప్టర్ నుంచి భూ సంస్కరణల లక్ష్యాలు, చట్టాలు, భూ పంపిణీ, కౌలు సంస్కరణలు, మధ్యవర్తిత్వ వ్యవస్థ రద్దు, కమతాలపై గరిష్ట పరిమితికి సంబంధించిన మార్గదర్శకాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటితోపాటు అభ్యర్థులు ప్రధానంగా పంటల తీరుకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ పరపతికి సంబంధించి సంస్థాపరం కాని ఆధారాలు, సంస్థాపర ఆధారాలైన వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇచ్చిన పరపతితోపాటు వ్యవసాయ పరపతికి సంబంధించి నాబార్‌‌డ గురించి నోట్స్ రూపొందించుకోవాలి. రాష్ర్టంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయంతోపాటు లబ్ధి పొందే జిల్లాలు, ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల పొందే భూ విస్తీర్ణం వంటి అంశాలను పరిశీలించాలి. దీంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థల లక్ష్యాలు, లక్షిత, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థలు, ఇటీవల కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను అధ్యయనం చేయాలి.

రెండో చాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పంచవర్ష ప్రణాళికల పరంగా జరిగిన వ్యయం, ప్రణాళికా యుగంలో రాష్ర్టంలో సాంఘిక- ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు వివిధ ప్రణాళికలు సాధించిన వృద్ధి రేటు, ప్రణాళికల్లో భాగంగా వివిధ రంగాల మధ్య వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత వివిధ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలు, సిఫార్సులను పరిశీలించాలి.

మూడో చాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, సహకార వ్యవస్థ, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానాల్లోని ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, గ్రోత్ సెంటర్లు, పారిశ్రామిక కారిడార్, ముఖ్య పరిశ్రమలు-అవి ఏర్పాటైన ప్రదేశాలకు సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

సహకార వ్యవస్థకు సంబంధించి సహకార వ్యవస్థ ప్రగతి, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా, సహకార సంఘాలు ఎదుర్కొంటోన్న సమస్యలను అధ్యయనం చేయాలి. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సోలార్ ఎనర్జీ, పవన విద్యుత్, హైడల్ పవర్ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకున్న చర్యలతోపాటు వాటి ప్రగతిపై అవగాహన అవసరం.

నాలుగో చాప్టర్‌లో నుంచి రాష్ర్టంలో సేవా రంగ ప్రాధాన్యత, ఉప సేవా రంగాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్న రంగాలు, విద్యుత్ ఉత్పాదన, తలసరి విద్యుత్ వినియోగం, విద్యుత్ వినియోగంలో గృహ, వ్యవసాయ, పరిశ్రమల వాటా, విద్యుచ్ఛక్తి కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటితోపాటు రాష్ర్ట పర్యాటక విధానంలోని ముఖ్యాంశాలు, పర్యాటక కేంద్రాలు, రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ, స్వదేశీ పర్యాటకులు-ఏ జిల్లాలను అధికంగా సందర్శించారు? పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాలి.

సమాచార సాంకేతిక విజ్ఞాన రంగానికి సంబంధించి నూతన ఐటీ విధానం 2015 -20, జవహర్ నాలెడ్‌‌జ కేంద్రాలు, ఈ- ప్రగతి, మీ-సేవ వంటి విధానాలను పరిశీలించాలి. రోడ్డు, రైలు రవాణాలతోపాటు పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధిని అధ్యయనం చేయాలి.

ఐదో చాప్టర్‌లో రాష్ర్టంలో అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సామాజిక ఆర్థిక, సంక్షేమ పథకాలకు సంబంధించిన ముఖ్యాంశాలను పరిశీలించాలి.

రిఫరెన్స్‌ బుక్స్
1947 తర్వాతభారత ఆర్థికాభివృద్ధి - ఉమా కపిల
ఇండియన్ ఎకానమీ - ఇష్యూస్ ఇన్ డెవలప్‌మెంట్, ప్లానింగ్, సెక్టోరల్ ఇష్యూస్ - ఉమా కపిల
ఇండియన్ ఎకానమీ - మిశ్రా అండ్ పూరీ
50 Years of Andhra Pradesh - CESS
ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2015-16
యోజన
కురుక్షేత్ర
తెలుగు అకాడమీ ప్రచురణలు
Published date : 22 Dec 2016 12:46PM

Photo Stories