Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ సక్సెస్ ప్లాన్..

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దాంతో మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులకు మరింత సమయం లభించినట్లయింది.

రెండు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉండటంతో ఇప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివినా పరీక్షలో విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్1 మెయిన్ అభ్యర్థులకు ఉపయోగపడేలా విజయ ప్రణాళిక..

గ్రూప్ 1 మెయిన్ షెడ్యూల్ :

పరీక్ష తేదీ సజ్జెక్ట్
ఫిబ్రవరి 4, 2020 తెలుగు
ఫిబ్రవరి 5, 2020 ఇంగ్లిష్
ఫిబ్రవరి 7, 2020 పేపర్ 1
ఫిబ్రవరి 10, 2020 పేపర్ 2
ఫిబ్రవరి 12, 2020 పేపర్ 3
ఫిబ్రవరి 14, 2020 పేపర్ 4
ఫిబ్రవరి 16, 2020 పేపర్ 5

ఏడు పేపర్లు :
గ్రూప్ 1 మెయిన్ పాత విధానంలో ఇంగ్లిష్ పేపర్‌తో కలిపి మొత్తం 6 పేపర్లు ఉండేవి. నూతన విధానంలో తెలుగు పేపర్‌ను చేర్చడంతో మెయిన్ పేపర్ల సంఖ్య 7కు చేరింది. దీంతోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లలో విభాగాల వారీగా మార్కులు కేటాయించారు. ఈ రెండింటినీ కేవలం అర్హత పేపర్లుగానే పరిగణిస్తారు.

ప్రిపరేషన్ ప్లాన్ ఇలా :
 • అభ్యర్థులకు ఇంకా సమయం అందుబాటులో ఉంది. ఈ ఉన్న సమయంలో పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తే విజయం సాధించొచ్చు. ఎస్సే-10 రోజులు, పేపర్ 2-15 రోజులు, పేపర్ 3-15 రోజులు, పేపర్ 4-15 రోజులు.. ఇలా సమయ ప్రాణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
 • ప్రతిరోజూ 12గంటల పాటు ప్రిపేర్ కావాలి. రోజూ ఒక యూనిట్ అధ్యయనాన్ని పూర్తి చేయాలి. ఒక్కో యూనిట్‌లో 12 చాప్టర్లు ఉంటాయి. అంటే.. గంటకో చాప్టర్ చొప్పున చదవాలి.
 • రోజూ ప్రిపరేషన్ ముగించే ముందు చదివిన అంశాలను రివిజన్ చేసుకోవాలి.
 • ప్రతి పేపర్‌లో సగటున 15 యూనిట్‌లు ఉన్నాయి. కాబట్టి 15 రోజుల్లో ఆయా యూనిట్ల ప్రిపరేషన్‌ను పూర్తి చేయాలి.

 

360 డిగ్రీలు : ఆయా అంశాలను 360 డిగ్రీల కోణంలో ప్రిపేర్‌కావాలి. ఉదాహరణకు ద్రవ్యోల్బణాన్నే తీసుకుంటే.. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణానికి కారణాలు, ద్రవ్యోల్బణ ప్రభావం (సానుకూల, ప్రతికూల), ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల్లో లోపాలు, సూచనలు తదితర కోణాల్లో ప్రిపేర్‌కావాలి.


ఎస్సే రాసేటప్పుడు..కింది అంశాలు తప్పనిసరి గుర్తుంచుకొండి :
గూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా అనేక కాంపిటీటివ్ పరీక్షలు మల్టిపుల్ చాయిస్ విధానంలో జరుగుతాయి. గ్రూప్ 1 మెయిన్ డిస్క్రిప్టివ్ అనే సరికి చాలా మంది అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి వారంతా పాఠశాల నుంచి కళాశాల వరకు... డిస్క్రిప్టివ్ విధానంలోనే పరీక్షలు రాశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గత ప్రశ్నపత్రాల్లో అడిగిన ఎస్సేలు, టెస్టు సిరీసుల్లోని ఎస్సేలను ఎంపిక చేసుకొని ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయాలి. తద్వారా నిర్దేశిత సమయంలో ఎస్సేలు రాయగలిగే సామర్థ్యం పెరుగుతుంది.

 

 • ఎస్సే రాసేటప్పుడు పలు కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా సదరు ఎస్సేకు నిర్దేశిత నిర్మాణం ఉండేలా చూసుకోవాలి. అలాగే రాసే సమాధానం అడిగిన అంశానికి సంబంధించినదిగానే ఉండాలి. ఇతరత్రా అంశాల జోలికి పోరాదు. వినూత్నంగా రాసేందుకు ప్రయత్నించాలి.
 • పరిచయం(ఎత్తుగడ)ను పేరాగ్రాఫ్‌లో రాయాలి. ప్రయోజనాలు, ప్రతికూలతలను పాయింట్ల రూపంలో రాయాలి.
 • గణాంకాలను, ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు న్యూమోనియాను ఎదుర్కోలేకపోతున్న ప్రపంచం? కారణాలను చర్చించండి? అని ప్రశ్న అడిగితే... సమాధానంలో 2018లో ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా వల్ల ఐదేళ్లలోపు వయసున్న 8 లక్షల మంది పిల్లలు మరణించారు, న్యూమోనియా మరణాల్లో భారత్ రెండో స్థానం (1,27,000) స్థానంలో ఉందని పేర్కొంటూ.. సమాధానం రాయాలి.
 • పదాల్లో తప్పులు దొర్లినా పర్లేదుకానీ, వాక్య నిర్మాణంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. చేతిరాత పేపర్ దిద్దే వ్యక్తికి అర్థమయ్యేలా ఉండాలి.
 • ముగింపు బాగుండేలా చూసుకోవాలి.
 • ఎస్సే పేపర్‌కు సంబంధించి కనీసం 30 అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వీటిలో స్టాటిక్ అంశాలకు సంబంధించి విద్య, ఆరోగ్యం, వాతావరణ మార్పులు, హరితగృహ ప్రభావం తదితరాలను అధ్యయనం చేయాలి. అలాగే డైనమిక్ (మారేవి) అంశాలకు సంబంధించి నవరత్నాలు (ఏపీలోని తాజా సంక్షేమ పథకాలు), ఆరోగ్య శ్రీ, ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ తదితరాలు ప్రిపేర్‌కావాలి.


నవరత్నాలు ఇలా రాయండి..
ఉదాహరణకు ‘నవరత్నాలు’పై ఎస్సే రాస్తుంటే...

 • నవరత్నాలు ఏవి.? బ లబ్ధిదారులు ఎవరు?
 • ఆర్థిక సహాయం
 • సమాజంపై నవరత్నాల ప్రభావం
 • సామాజిక, విద్య, ఆర్థిక, ఆరోగ్య పరంగా వెనుకబడిన వర్గాలకు నవరత్నాలతో జరిగే మేలు, ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాలు సామాజిక సంక్షేమ విప్లవానికి ఏవిధంగా నాంది పలికాయి.
 • సమర్థవంతంగా నవరత్నాల అమలుకు సలహాలు, సూచనలు.
 • మొత్తంగా నవరత్నాలు ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలిపేలా అన్ని కోణాలను చర్చించాలి.

జీఎస్ పేపర్స్ :
జనరల్ స్టడీస్‌కు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా ప్రిపేర్‌కావాలి. కరెంట్ అఫైర్స్‌కు అనుబంధంగా అడిగేందుకు ఆస్కారమున్న ప్రశ్నలను అంచనా వేయాలి. ఉదాహరణకు సిలబస్‌లోపేర్కొన్న స్పేస్ టెక్నాలజీనే తీసుకుంటే.. దాన్నుంచి చంద్రయాన్-2, దాని లక్ష్యాలు, పేలోడ్స్, విజయవంతం/విఫలం తదితరాలను అధ్యయనం చేయాలి.

ఆ పేపర్లల్లో స్కోర్..
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ పేపర్లలో మంచి స్కోరు సాధించేందుకు కృషిచేయాలి. కాబట్టి ఆయా పేపర్లపై ప్రత్యేక దృష్టిపెట్టి కనీసం మూడుసార్లు రివిజన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్, భారత సామాజిక ఆర్థిక సర్వేలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. సదరు సర్వేల్లో నుంచి నేరుగా ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది.

మెటీరియల్ సేకరణ..
పేపర్-2లో నూతనంగా చేర్చిన భావోద్వేగ ప్రజ్ఞ, సహానుభూతి, నిర్ణయం తీసుకొనే సామర్థ్యం, సామాజిక ప్రజ్ఞ తదితర అంశాల పట్ల అభ్యర్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రస్తుతం ఆయా అంశాల ప్రిపరేషన్‌కు సరైన మెటీరియల్ అందుబాటులో లేదు. కాబట్టి ముందు మెటీరియల్ సేకరించాలి. ఈ విషయంలో సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారిని సంప్రదించడం లాభిస్తుంది. నూతన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త అంశాలకు సంబంధించి సివిల్స్‌కు ప్రిపేరవుతూ.. గ్రూప్1కు హాజరయ్యే వాళ్లకు అదనపు ప్రయోజనం ఉంటుంది.

సిలబస్‌పై పట్టు సాధించేలా...
నూతన సిలబస్ గతంతో పోల్చితే విస్తృతమైంది. కాబట్టి మెయిన్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు సిలబస్‌పై పట్టు సాధించేలా సిద్ధమవ్వాలి. సిలబస్ పరిధి పెరిగినప్పటికీ కొత్తగా చేర్చిన అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయని చెప్పలేం! కాబట్టి అభ్యర్థులు ప్రాధాన్య అంశాలను గుర్తించి.. తదనుగుణంగా ముందుకెళ్లాలి. కాన్సెప్ట్యువల్ ఆధారితంగా ఆయా అంశాల్లో పూర్తి స్థాయి విషయావగాహనను పెంపొందించుకోవాలి. నూతన సిలబస్‌లో గవర్నెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సహానుభూతి, ఒత్తిడిని తట్టుకోగలగడం, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సృజనాత్మక ఆలోచనా ప్రజ్ఞ తదితరాలపై అధిక దృష్టి పెట్టాలి.
-ఎ.నిశాంత్‌రెడ్డి, గ్రూప్ 1 టాపర్

Published date : 22 Oct 2021 12:36PM

Photo Stories