Skip to main content

ఏపీపీఎస్సీ.. గ్రూప్-1 (2011) ఇంటర్వ్యూ టిప్స్

గ్రూప్-1 (2011) మెయిన్స్ రీఎగ్జామినేషన్ ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడింంది. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం.. ఎన్నో అనూహ్య పరిణామాలు.. సుప్రీంకోర్టు స్థాయిలో ఉత్తర్వుల తర్వాత జరిగిన పరీక్ష ఇది. మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉద్యోగ సాధనలో చివరి దశ అయిన ఇంటర్వ్యూలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తేనే విజయం వరిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 (2011) ఇంటర్వ్యూలో విజయానికి నిపుణుల సలహాలు, సూచనలు..
సమకాలీన అంశాలపై పట్టు
గ్రూప్-1 ఇంటర్వ్యూ అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. అభివృద్ధి కారక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక అభివృద్ధితో సంబంధంలేని అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్లోని బిడియాన్ని తొలగించేందుకు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యులు.. ఇటీవల మీరు చూసిన సినిమా ఏంటి? ఆ సినిమాపై మీ అభిప్రాయం? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ఎక్కువగా వీటిపై దృష్టి పెట్టకుండా.. సమకాలీనంగా ముఖ్యమైన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

పని నేపథ్యం..
ఇప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తొలి నోటిఫికేషన్ 2011లోనే వెల్లడైంది. కానీ అనూహ్య కారణాల వల్ల కోర్టు జోక్యం వరకు వెళ్లి ఒక కొలిక్కి రావడానికి ఐదున్నరేళ్లకుపైగానే పట్టింది. తొలి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అధిక శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. వీరు ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అభ్యర్థులు నిర్వహిస్తున్న విధులు, వాటిలో సాధించిన విజయాలు లేదా విధి నిర్వహణలో ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు తదితరాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు వీటికి అనుగుణంగా సన్నద్ధమై ఇంటర్వ్యూకు వెళ్లాలి.

అకడమిక్ నేపథ్యం
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ అకడమిక్ నేపథ్యం, తమ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం, తమ అకడమిక్ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగేలా ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ తరహా ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి.

పునర్విభజనపై సమగ్ర అవగాహన
గ్రూప్-1(2011) ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో రాణించేందుకు ప్రధానంగా ఉపకరించే మరో అంశం.. పునర్విభజన చట్టం. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా? లేదా? మీ అభిప్రాయం? కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తలెత్తిన పరిస్థితులపై మీ అభిప్రాయం? లాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల పునర్విభజన చట్టం, రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి.

న్యూస్ పేపర్ రీడింగ్
అభ్యర్థులు తప్పనిసరిగా న్యూస్‌పేపర్ చదవాలి. దినపత్రికల ఎడిటోరియల్స్, ఒక అంశంపై ప్రముఖుల విశ్లేషణలను కేవలం చదవడమే కాకుండా వాటిపై స్వీయ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఇంటర్వ్యూలో ఒక అంశం గురించి ప్రశ్నించినప్పుడు కేవలం తాము చదివిన అంశాలనే ప్రస్తావిస్తే.. అభ్యర్థికి స్వీయ అభిప్రాయం లేదని బోర్‌‌డ సభ్యులు అనుకోవచ్చు. అందువల్ల ప్రతి అంశంపై స్వీయ అభిప్రాయం, విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజున అభ్యర్థులు కనీసం రెండు దినపత్రికలను చదవాలి. గతంలో చాలా సందర్భాల్లో పలువురు అభ్యర్థులను ‘ఈ రోజు న్యూస్ పేపర్లో మీరు ప్రాధాన్యంగా భావించిన న్యూస్ ఏంటి?’, ‘ఈ రోజు ఫలానా వార్తా కథనంలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటి?’ లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.

బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేక శ్రద్ధ
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లైట్ షేడ్ డ్రెస్‌తోపాటు షూస్ ధరించడం మంచిది. అయితే అలవాటు ఉంటేనే టై ధరించాలి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ హావభావాలను వ్యక్తం చేయడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా చేతులు, కాళ్లు కదిలించకూడదు.

ప్రశ్న.. చర్చగా మారితే?
కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న నేరుగా జవాబు చెప్పడంతోనే ముగియకుండా.. అనుబంధ ప్రశ్నలు, బోర్డ్ సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారొచ్చు. అలాంటప్పుడే కొందరు అభ్యర్థులు ఇబ్బంది పడతారు. సంబంధిత అంశంపై అవగాహన లేకపోతే నిజాయతీగా తమకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాలి.

ఇంటర్వ్యూ రోజు ఆహ్లాదంగా
ఇంటర్వ్యూ రోజున ఆహ్లాదంగా ఉండాలి. ముఖ్యంగా అప్పటికే ఇంటర్వ్యూ పూర్తయిన అభ్యర్థులతో బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నల గురించి చర్చించొద్దు. వ్యవధి ఉంటే మీతోపాటు వేచి చూస్తున్న వారితో ఆ రోజు న్యూస్ పేపర్‌లోని అంశాల గురించి చర్చించొచ్చు.

హుందాగా..
ఇంటర్వ్యూ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు హుందాగా, వినమ్రంగా వ్యవహరించాలి. ముందుగా డోర్ నాక్ చేసి బోర్డ్ సభ్యుల అనుమతి తీసుకున్నాకే గదిలోకి వెళ్లాలి. అందరినీ చూస్తూ విష్ చేయడం మరవొద్దు. తర్వాత బోర్డ్ సభ్యులు చెప్పే వరకు సీటులో కూర్చోవద్దు. సీట్లో కూర్చునే శైలి కూడా హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. ఇందులోనే సగం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఎదురుగా ఉన్న టేబుల్‌పై చేతులు పెట్టడం వంటివి చేయకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కూడా అందరికీ ఆపాదించేలా ‘థ్యాంక్యూ సర్, థ్యాంక్యూ మేడమ్’ అంటూ బయటికి రావాలి.

గ్రూప్-1 (2011) ఇంటర్వ్యూ సన్నాహకాలు
  • సంబంధిత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి.
  • అటెస్టేషన్ అవసరమైన పత్రాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి.
  • రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్ల నమూనాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని నిర్దేశిత అధికారుల నుంచి ధ్రువీకరణ పొందాలి.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీని తెలుసుకొని, దానికి ఒకరోజు ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.
  • హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నందున దూర ప్రాంతాల అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీకి ఒక రోజు ముందుగానే చేరుకోవడం మేలు.

వీటిపై అవగాహన పెంచుకోండి.
  • హెచ్-1బి వీసాల్లో కోత- భారత్‌పై ప్రభావం
  • డీమానిటైజేషన్, నల్లధనాన్ని అరికట్టేందుకు ఉన్న అవకాశాలు
  • రాష్ట్రస్థాయిలో అమలవుతున్న కొత్త పథకాలు
  • ఫిబ్రవరి 13 నాటికి కేంద్ర బడ్జెట్ (2017-18) ప్రకటిస్తారు. కొత్త బడ్జెట్‌లో ముఖ్యాంశాలు, ప్రధానంగా రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు, పథకాల గురించి తెలుసుకోవడం మేలు.
  • వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై అభిప్రాయం.
  • ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తుంటే సంబంధిత శాఖలో అమలవుతున్న కొత్త పథకాలపై పూర్తి అవగాహన ఉండాలి.

‘ఐ’ కాంటాక్ట్.. మోస్ట్ ఇంపార్టెంట్:
సివిల్స్, గ్రూప్-1 ఇలా ఇంటర్వ్యూ ఏదైనా బోర్డ్ సభ్యులందరితో ఐ కాంటాక్ట్ అభ్యర్థులకు ప్రధాన అంశం. ప్రశ్న అడిగిన సభ్యుడి వైపు దృష్టిపెడుతూనే... సమాధానం చెప్పేటప్పుడు బోర్డ్‌లోని ఇతర సభ్యులను చూస్తూ చెప్పాలి. వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు బ్యాలెన్స్‌డ్ అప్రోచ్‌తో వ్యవహరించాలి. ఏకపక్ష ధోరణి సరికాదని గుర్తించాలి.
- వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ


172 - నిర్దిష్ట ఉత్తర్వుల ప్రకారం గ్రూప్-1 (2011) నోటిఫికేషన్ ఖాళీల్లో ఏపీపీఎస్సీకి లభించిన పోస్టులు, వీటి భర్తీకి మెయిన్ ఎగ్జామినేషన్ జరిగింది.
8760 - ప్రిలిమ్స్ కీలో సవరణల తర్వాత గ్రూప్-1 (2011) మెయిన్స్ రీ-ఎగ్జామినేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు.
34.65 % - ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 (2011) రీ-ఎగ్జామినేషన్‌లో హాజరు శాతం.
290 - గ్రూప్-1 (2011) రీ-ఎగ్జామినేషన్‌లో విజయం సాధించి.. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య.
Published date : 24 Jan 2017 01:45PM

Photo Stories