APPSC Group 1 & 2: ప్రణాళికతో చదివితే.. కొలువు సులువే.. గ్రూప్-1, 2లో విజేతలు మీరే..
గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలపై సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో డిసెంబర్ 17న (ఆదివారం) కర్నూలు టీజీవీ లలిత కళాక్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో యువతీ, యువకులు హాజరయ్యారు. సదస్సులో ముఖ్యవక్తగా బాలలత మాట్లాడుతూ.. నేడు చిన్న చిన్న ఉద్యోగాలకు చాలా కష్టపడి చదువుతున్నారన్నారు. గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ఇంకా ఎంత కష్టం ఉంటుందోనని చాలా మందికి భయం ఉంటుందన్నారు.
చక్కని ప్రణాళికతో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే గ్రూప్స్, సివిల్స్‌లో విజయం సాధించవచ్చన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియం అనేవి పోటీ పరీక్షల్లో సమస్యే కాదని, నిత్యం తెలుగు పేపర్లతో పాటు, ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవుతూ అందులోని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలన్నారు. అలాగే 6 నుంచి 12 తరగతుల వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, ఇవీ సాధ్యం కాకపోతే ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను చదవాలన్నారు.
APPSC GROUP 2: గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, స్టయిఫండ్.. ఎక్కడ, ఎన్ని రోజులంటే..?
సిలబస్‌పై అవగాహన ఉండాలి
ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు సహజమని, సమస్య వచ్చిందని, కష్టమని పోరాటం నిలిపేస్తే అక్కడికే జీవితం ముగుస్తుందని బాలలత అన్నారు. గ్రూప్స్ సన్నద్ధం అయ్యే వారు ముందుగా సిలబస్‌పై అవగహన పెంచుకోవాలన్నారు. ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? ఏఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి? కఠినమైన సబ్జెక్టును ఏ సమయంలో చదవాలి? అనే అంశాలపై ఓ ప్రణాళిక వేసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళి తెలుసుకునేందుకు పాత ప్రశ్న పేపర్లను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని సూచించారు.
చాలా మంది పరీక్షలకు ప్రిపరేషన్ అయ్యాక ప్రాక్టీస్ మొదలు పెడతారని, అలా చేస్తే సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి రోజు కనీసం 50 బిట్లు అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నారు. తరుచుగా న్యూస్ పేపర్లు చదువుతూ కరెంట్ ఆఫైర్స్‌తో సబ్జెక్టును కలుపుకుని విశ్లేషణాత్మకంగా సన్నద్ధం కావాలన్నారు. పరీక్షల సమయంలో ఆత్మస్థైర్యం తగ్గకుండా స్ఫూర్తిదాయకమైన అంశాలను గుర్తుకు తెచ్చుకుంటూ చదవాలన్నారు. సదస్సులో సాక్షి బ్రాంచ్ మేనేజర్ సతీష్ రావు, బ్యూరో ఇన్‌చార్జ్ రవికుమార్, యాడ్స్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చాలా చక్కగా చెప్పారు..
గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలపై అభ్యర్థులకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నారని పేపర్‌లో చూశాను. సదస్సులో పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో చక్కగా వివరించారు. ఎలాంటి అంశాలపై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పారు. కరెంట్ అఫైర్స్ ప్రాముఖ్యత తెలియజేశారు. 9 నెలల నుంచి గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ సదస్సు తరువాత నేను గ్రూప్స్ సాధించగలననే నమ్మకం కలిగింది. పరీక్షల్లో వచ్చిన మార్పులు, ప్రశ్నల సరళి గురించి వివరించిన తీరు ఆకట్టుకుంది. – మధుబాల, నిడ్జూరు గ్రామం, కర్నూలు మండలం
Aadhaar Card: ఆధార్ కార్డ్ సమస్యలు.. ఆధార్‌పై ప్రశ్నలకు వచ్చిన సమాదానాలు ఇవే..!
సబ్జెక్టుల విశ్లేషణ చాలా బాగుంది..
గ్రూప్స్ పరీక్షల సిలబస్ గురించి బాలలత మేడం చాలా బాగా వివరించారు. పరీక్ష అంటే మొత్తం సిలబస్ చదవాలని కాకుండా ప్రాధాన్యత అంశాలు, కరెంట్ అంశాలకు జోడించి విశ్లేషణాత్మకంగా చదువుకోవాలని చెప్పారు. తక్కువ సమయంలో కూడా ఈ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావొచ్చునో చక్కగా వివరించారు. సాక్షి పత్రికలో గ్రూప్స్ పరీక్షల గురించి వచ్చే అంశాలను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాం. సబ్జెక్టుల విశ్లేషణ బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ యాప్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు. – పావని, కర్నూలు
స్పష్టత వచ్చింది..
ప్రస్తుతం సచివాలయం ఉద్యోగం చేస్తున్నాను. 2018 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఇటీవలే ఎస్‌ఐ పరీక్షలు రాశాను. స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. గ్రూప్స్ పరీక్షలు అంటేనే చాలా పోటీ ఉంటుంది. ఈ పోటీలో విజయం సాధించాలంటే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాల లత మేడం చెప్పే సలహాలను య్యూటూబ్‌లో చూసే వాళ్లం. ఈ రోజు నేరుగా ఆమె క్లాసు వినే అవకాశం కల్పించిన సాక్షి మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు. పోటీ పరీక్షలకు తొలిసారి సన్నద్ధం అయ్యేవారు సైతం తక్కువ సమయంలో ఎలా విజయం సాధించాలి, ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేదాని స్పష్టత వచ్చింది. – భూపతి, సచివాలయం ఉద్యోగి
స్ఫూర్తి నింపారు..
ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్ సన్నద్ధం అవుతున్నా. డబ్బులు పెట్టే స్థోమత లేకపోవడంతో ఉచిత కోచింగ్ కోసం స్కాలర్‌షిప్ పరీక్ష రాస్తూ కోచింగ్ తీసుకుంటున్నా. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా..ప్రస్తుతం హైదరాబాదులో కోచింగ్‌కు హాజరవుతున్నా. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీకి చెందిన బాలలత మేడం మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. పోటీ పరీక్షల్లో రాణించాలంటే ముందుగా ఆత్మస్థైర్యం అనేది చాలా కీలకం. పరీక్షల సన్నద్ధత, సిలబస్ తదితర అంశాలపై బాలలత మేడం వివరించిన తీరు ఆకట్టుకుంది. గ్రూప్స్–1, గ్రూప్–2, సివిల్స్ పోటీ పరీక్షలపై అవగహన సదస్సు నిర్వహించిన సాక్షి మీడియా గ్రూప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. – సరస్వతి, హొళగుంద