Skip to main content

TSPSC Group 1 Age Relaxation: గ్రూప్‌–1 వయోపరిమితిపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

Group-1 Recruitment Process  TSPSC Group 1 Age Relaxation   Telangana Public Service Commission   Group-1 Recruitment Notice

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పోస్టుల రిక్రూట్‌మెంట్‌ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకో­వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్‌–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

51 ఏళ్లకు పరిశీలించండి..
ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్‌లో మార్పు చేసేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఫణిభూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు.

దీంతో అనేక మంది గ్రూప్‌–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్‌ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు.  


 

Published date : 29 Feb 2024 11:27AM

Photo Stories