Skip to main content

యూరోపా అనే గ్రహం ఏ గ్రహానికి ఉపగ్రహం?

అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది.
గురు గ్రహనికి ఉపగ్రహమైన ‘‘యూరోపా’’పైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్‌ ప్రాజెక్టుకు తాజాగా గ్రీన్‌లైట్‌ పడింది. ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్‌ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం!

2022లోనే జ్యూస్‌...
క్లిప్పర్‌ కంటే ముందు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ 2022 ఏడాదిలోనే జూపిటర్‌ ఐసీమూన్‌ ఎక్స్‌ప్లోరర్‌ లేదా జ్యూస్‌ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి!

గోల్డీలాక్స్‌ జోన్‌ అంటే?
భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్‌ జోన్‌ అని పిలుస్తుంటారు. గురు గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్‌ జోన్‌లోనే ఉంది.

భూమి–యూరోపా మధ్య ఉన్న సారుప్యతలు–తేడాలు
భూమి...
  • వ్యాసం: 12,742 కిలోమీటర్లు
  • సముద్రపు లోతు (సగటున): 4 కిలోమీటర్లు
  • ఎంత నీరు?: 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు!
  • భూ ఉపరితలంపై 29 శాతం నేల, 71 శాతం నీరు ఉంటుంది.
  • ఉప్పునీటితో కూడిన సముద్రాలు ఉన్నాయి.
  • రాతితో కూడిన అడుగుభాగం ఉంది.

యూరోపా...
  • వ్యాసం: 3,120 కిలోమీటర్లు
  • సముద్రపు లోతు (సగటు): 100 కి.మీ.లు
  • ఎంత నీరు? : 300 కోట్ల ఘనపు కి.మీ.!
  • యూరోపాపై నేల దాదాపు శూన్యం. మూడు నుంచి 30 కిలోమీటర్ల మందమైన మంచు పలకలతో కప్పబడి ఉంటుంది ఈ ఉపగ్రహం.
  • ఉప్పునీటితో కూడిన మహా సముద్రం ఉంది.
  • రాతితో కూడిన అడుగుభాగం ఉంది.
Published date : 29 Jul 2021 05:39PM

Photo Stories