Skip to main content

యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1

శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి 2020, అక్టోబర్ 9న భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి తన లక్ష్యాలను ఛేదించింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి డీఆర్‌డీవో ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.

రుద్రం ప్రత్యేకతలు...

  • దీన్ని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు.
  • శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు.
  • 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు.
  • న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది
  • గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది.
  • ఐఎన్‌ఎస్-జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది.
  • దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు.
  • 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రం-1’ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 9, 2020
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)
ఎక్కడ : బాలాసోర్ తీరం, ఒడిశా
ఎందుకు : శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసేందుకు
Published date : 10 Oct 2020 04:37PM

Photo Stories