Skip to main content

రష్యా నుంచి భారత్‌కు ‘ట్రయంఫ్’ క్షిపణి వ్యవస్థ

రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది.
ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్-8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్-400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా..

రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్‌‌స అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.

ఎప్పటికి వస్తాయి?
మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్-రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ఇవీ ప్రత్యేకతలు..
శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్-400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్‌న్రు ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.

భారత్ వద్ద ఉన్న క్షిపణులు
స్పైడర్
ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయత్నిస్తోంది.

ఆకాశ్
డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది.

బరాక్-8
డీఆర్‌డీవో-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది.
Published date : 23 Jan 2018 01:48PM

Photo Stories