Skip to main content

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్

ఆరుగాలం శ్రమించే రైతన్నకు అండగా నిలిచి వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్-ఐసీఏఆర్) ఏర్పాటైంది. దేశంలో వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే నూతన వంగడాలు ఆవిష్కరించే దిశగా పరిశోధనలు జరపడం, పరిశోధన రంగాన్ని విస్తరించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ముఖ్య బాధ్యతలు. దీనిపై అవగాహన కల్పించేందుకు దేశ, విదేశాల్లో ప్రాంతీయ సదస్సులూ నిర్వహిస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలంటే పరిశోధన రంగాన్ని పటిష్ట పరచడమే మార్గమని ప్రభుత్వం భావించింది. ఈ ఉద్దేశంతో ఏర్పాటైందే భారత వ్యవసాయ పరిశోధన మండలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో వ్యవసాయంవైపు యువతను మళ్లించేందుకు అవసరమైన విధి విధానాలు రూపొందిస్తోంది. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

ఎప్పుడు ఏర్పాటైంది?
1929, జూలై 16న ఐసీఏఆర్‌ను స్థాపించారు. గతంలో ఈ సంస్థను ‘కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్’ అని పిలిచేవారు. 21వ శతాబ్దంలో పెరిగిన ఆహార అవసరాలకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు, ఉత్పాదకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పని చేస్తుంది.

ఏం చేస్తుంది?
దేశంలో ఉద్యాన, మత్స్య, జంతు శాస్త్రాలతోపాటు వ్యవసాయ పరిశోధనల పర్యవేక్షణ ఐసీఏఆర్ చూసుకుంటుంది. పరిశోధన విద్యలో దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమన్వయం చేసేందుకు అత్యున్నత మండలి (అపెక్స్ బాడీ)గా ఉంటోంది. దేశవ్యాప్తంగా 100కి పైగా ఇన్‌స్టిట్యూట్‌లు, 70 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విస్తరించాయి. ప్రపంచంలోని అతి పెద్ద జాతీయ వ్యవసాయ వ్యవస్థల్లో ఇదొకటి. దేశంలో హరితవిప్లవం తీసుకొచ్చేందుకు పాటుపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. వ్యవసాయ ఉన్నత విద్య ప్రావీణ్యతను తెలియజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

రైతు శాస్త్రవేత్తల దినోత్సవం..
నాలుగేళ్లుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థలన్నింటిలోనూ రైతు శాస్త్రవేత్తల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వారి విజయాలను నమోదు చేస్తున్నారు. ప్రాంతీయ సమావేశాల్లో వీరితో ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రపంచ కుటుంబ వ్యవసాయ సంవత్సరం కావడం విశేషం. అలాగే హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ శతజయంతి కూడా ఈ ఏడాదే. ‘మీకు తెలిసిన దాన్ని రైతుల దగ్గరకు తీసుకెళ్లండి’ అనేది బోర్లాగ్ చివరి కోరికగా చెబుతారు. ఆ లక్ష్య సాధన క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు ఐసీఏఆర్‌లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

విశేషాలు..
  • దేశంలో ప్రజల ఆహార భద్రతకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధన, విస్తరణ, బోధన రంగాలను రూపుదిద్దుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ పేర్కొన్నారు.
  • గతేడాది కోల్‌కతాలోని సెంట్రల్ ఇంగ్లండ్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐసీఏఆర్ రెండు రోజుల ప్రాంతీయ సదస్సు జరిగింది.
  • ఆ సదస్సులో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని.. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగుపై పరిశోధనలు విస్తరించేందుకు సహకరించాలని సంస్థను కోరారు.
  • తెలంగాణలో అత్యధిక శాతంగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చేందుకు వీలు కల్పించాలని విన్నవించారు.
Published date : 15 Apr 2015 04:24PM

Photo Stories