Skip to main content

చంద్రయాన్-2 తొలిదశ విజయవంతం

చంద్రగ్రహం రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్-2 తొలిదశ విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్‌‌క-3ని ప్రయోగించారు. రాకెట్ బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత నిర్ణీత కక్ష్యలో(భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్)కి సురక్షితంగా చంద్రయాన్-2ను ప్రవేశపెట్టింది.

భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు
చంద్రయాన్-2 భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ - 2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్-2 కాంపోజిట్ మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్ వేరుపడి చంద్రుడిపై దిగుతుంది.

ఆ 15 నిమిషాలు...
చంద్రయాన్-1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్-2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రుడిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్-అబల్ అనే లిక్విడ్ ఇంజిన్‌లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది.

అక్కడే ఎందుకంటే..
చంద్రయాన్-2కి సంబంధించి మన శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధృవానికి చేరువలో ల్యాండర్, రోవర్‌లను దించుతున్నారు. ఇస్రో ఈ ప్రాంతాన్నే ఎంచుకోడానికి అక్కడ ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండడమే కారణం. మంచు రూపంలో నీరు అక్కడే ఉంటుందని అంచనా, అంతేకాకుండా చంద్రుడు, భూమి, సౌర కుటుంబ పుట్టుక, పరిణామ క్రమానికి సంబంధించిన వివరాలు అనేకం ఆ ప్రదేశంలో నిక్షిప్తమై ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

14 రోజుల్లో 500 మీటర్లు
ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత రోవర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. సెకన్‌కు సెంటిమీటర్ చొప్పున రోవర్ ప్రయాణిస్తూ చంద్రుడి విశేషాలను విశ్లేషిస్తూ భూమిపైకి సమాచారాన్ని పంపిస్తుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది.

చంద్రయాన్-2లో పరికరాలు
ఆర్బిటర్

  • బరువు: 2,379 కిలోలు
  • విద్యుదుత్పత్తి సామర్థ్యం: 1,000 వాట్లు
  • కమ్యూనికేషన్: భూమి మీదున్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌తో, ల్యాండర్‌తో
  • జీవితకాలం: ఏడాది
  • ఏం చేస్తుంది: చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. సంబంధిత ఫొటోలు, డేటాను సేకరించి భూమికి చేరవేస్తుంది.

ల్యాండర్ (విక్రమ్)
  • భారత శాస్త్రవేత్త విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ పేరుమీదుగా విక్రమ్ ల్యాండర్‌కు నామకరణం చేశారు.
  • బరువు: 1,471 కిలోలు
  • విద్యుదుత్పత్తి సామర్థ్యం: 650 వాట్లు
  • కమ్యూనికేషన్: ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌తో, ఆర్బిటర్‌తో, రోవర్‌తో
  • జీవితకాలం: 14 రోజులు (ఒక లూనార్ పగలు)
  • ఏం చేస్తుంది: ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రుడిపై మదువుగా దిగుతుంది. ఉపరితలాన్ని స్కాన్ చేసి, ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని సొంతంగా గుర్తిస్తుంది.

రోవర్ (ప్రజ్ఞాన్)
  • బరువు: 27 కిలోలు
  • విద్యుదుత్పత్తి సామర్థ్యం: 50 వాట్లు
  • కమ్యూనికేషన్: ల్యాండర్‌తో
  • జీవితకాలం: 14 రోజులు (ఒక లూనార్ పగలు)
  • ఏం చేస్తుంది: చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనలు సాగిస్తుంది. గరిష్ఠంగా 500 మీటర్లు ప్రయాణిస్తుంది. జాబిల్లి ఉపరితలాన్ని పరిశీలించి సంబంధిత డేటాను ల్యాండర్‌కు చేరవేస్తుంది.

వాహకనౌక : జీఎస్‌ఎల్‌వీ మార్క్-3
  • ఎత్తు: 43.43 మీటర్లు - బరువు: 640 టన్నులు
  • ప్రాజెక్టు వ్యయం: రూ.978 కోట్లు (చంద్రయాన్-2 రూపకల్పనకు రూ.603 కోట్లు, ప్రయోగానికి రూ.375 కోట్లు)

ప్రాజెక్టు లక్ష్యాలు
  • చందమామ వాతావరణంపై అవగాహన పెంచుకోవడం
  • దాని ఉపరితల నిర్మాణాన్ని విస్తతంగా విశ్లేషించడం
  • అక్కడ నీటి జాడ కోసం అన్వేషించడం
  • ‘చంద్రయాన్-2’ బరువు- 3.8 టన్నులు
  • దానిలోని మొత్తం పరికరాలు- 14 (మనవి 13, నాసాది 1)
  • చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగే రోజు: సెప్టెంబర్ 7

పత్యేకతలు
  • అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రుడిపై వ్యోమనౌకను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.
  • జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను దింపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.
  • చంద్రయాన్-2 ద్వారా మూడింటి(ఆర్బిటర్, ల్యాండర్, రోవర్)ని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే : ఇస్రో చైర్మన్ శివన్
Current Affairs
చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్-2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. చంద్రయాన్-2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్-2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Published date : 02 Aug 2019 12:27PM

Photo Stories