బ్లూ ఆరిజన్ అంతరిక్ష యాత్ర విజయవంతం
Sakshi Education
అమెరికాకు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ జూలై 20న చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఈ యాత్రలో భాగంగా... నలుగురు వ్యోమగాములు కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యానం చేసి భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చారు.
యాత్ర వివరాలు ఇలా...
- అమెరికాకు చెందిన తొలి వ్యోమగామి పేరిట బెజోస్ కంపెనీ బ్లూఆరిజన్స్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక జూలై 20న సాయంత్రం ఆరున్నరకు(భారతీయ కాలమానం) పశ్చిమ టెక్సాస్ నుంచి నింగిలోకి పయనించింది.
- రిచర్డ్ బ్రాన్సన్ సంస్థకు చెందిన అంతరిక్ష నౌక ‘‘వీఎస్‌ఎస్ యూనిటీ–22’’ కన్నా 10 కిలోమీటర్లు అధికంగా న్యూషెపర్డ్ భూమికి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.
- పయనంలో భాగంగా నౌక మాక్3 స్పీడ్(ధ్వనివేగం కన్నా మూడు రెట్లు అధికం)ను సాధించింది.
- నౌక బయలుదేరిన 2 నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యారు. అనంతరం సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారు.
- వ్యోమనౌక ప్రయాణం ప్రారంభమైన 6 నిమిషాలకు క్యాప్సూ్యల్ నుంచి విడిపోయిన బూస్టర్ రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ ప్యాడ్‌కు చేరుకుంది.
- క్యాప్సూ్యల్ మాత్రం సముద్రమట్టానికి 100కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్ రేఖ వరకూ ప్రయాణించింది. గురుత్వాకర్షణ శక్తికి 6రెట్లు శక్తితో వ్యోమగాములు రాకెట్ భూమికి చేరింది. 15 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది.
యాత్రలో పాల్గొన్నవారు వీరు...
1. బ్లూ ఆరిజన్, అమెజాన్ కంపెనీల వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
2. 82 ఏళ్ల వృద్ధురాలు వాలీఫంక్
3. 18 ఏళ్ల యువకుడు ఆలివర్ డామన్
4. బెజోస్ సోదరుడు మార్క్ బెజోస్
రికార్డులు...
- బెజోస్‌తో పాటు పయనించిన యాత్రికుల్లో 82 ఏళ్ల వృద్ధురాలు ఒకరు కాగా 18 ఏళ్ల యువకుడు మరొకరు. దీంతో స్పేస్‌లోకి వెళ్లివచ్చిన అత్యంత పిన్న వయస్కుడు, వృద్ధ మహిళగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు.
- తాజా అంతరిక్ష యానంతో స్పేస్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా వెళ్లివచ్చిన మరో కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ సరసన బెజోస్ నిలిచారు.
విశేషాలు...
- బ్లూఆరిజన్‌ను బెజోస్ 2000లో స్థాపించారు. 2021 ఏడాది చివరకు మరో రెండు యాత్రలకు సంస్థ ప్రణాళికలో రచిస్తోంది.
- యాత్రికుల్లో పెద్దదైన వాలీఫంక్ 1960 నుంచి అంతరిక్షంలోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. చివరకు ఈ లేటు వయసులో సాకారమైంది.
- పోటీ కంపెనీ నౌక వర్జిన్ గలాక్టిక్‌తో పోలిస్తే న్యూషెపర్డ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో ఎలాంటి పైలెట్ ఉండడు. మొత్తం ఆటోమేటెడ్‌గానే నిర్వహణ జరిగింది.
- 2015 నుంచి బ్లూఆరిజన్ మానవ రహితంగా 15సార్లు అంతరిక్ష యాత్రలు నిర్వహించింది.
- ఇటీవలే అమెజాన్ సీఈఓగా వైదొలిగిన బెజోస్ 20 కోట్ల డాలర్లను జాతీయ అంతరిక్ష మ్యూజియంకు విరాళమిచ్చారు. అలాగే యాత్రకోసం చేసిన బిడ్డింగ్ ద్వారా లభించిన మొత్తంలో సింహభాగాన్ని విద్యాసంస్థలకు, అంతరిక్ష సంస్థలకు విరాళంగా ఇచ్చారు.
- తాజా యాత్రికులతో కలిసి ఇప్పటివరకు 600 మంది అంతరిక్ష అంచులకు వెళ్లివచ్చారు.
- త్వరలో భారీ స్థాయిలో యాత్రికులను నింగిలోకి తీసుకుపోయే న్యూగ్లెన్ అనే రాకెట్‌ను బ్లూఆరిజన్ రూపొందిస్తోంది.
- అన్నీ అనుకూలిస్తే చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌తో బ్లూమూన్ అనే నౌకను పంపాలన్నది కంపెనీ ఆకాంక్ష.
Published date : 22 Jul 2021 12:01PM