Skip to main content

అణువిద్యుత్ కోసం అతి పెద్ద రియాక్టర్

ఫాన్స్‌లో రూపుదిద్దుకుంటున్న కేంద్రక సంలీన అణురియాక్టర్
  • రూ.1.22 లక్షల కోట్లతో నిర్మిస్తున్న 35 దేశాలు
  • భారత్ పాత్రే అత్యంత కీలకం
నిరంతరం నిప్పుల కొలిమిలా మండే సూర్యుడిని ఓ స్టీలు డబ్బాలో బంధించి.. ఆ డబ్బా నుంచి విడుదలయ్యే వేడితో కొద్దికొద్దిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. కానీ.. దాదాపుగా అచ్చం అలాంటి పనినే చేసేందుకు ఇప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు! ప్రపంచ శాస్త్రీయ పరిశోధనల రంగంలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌లో రంగం సిద్ధం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి కలగానే మిగిలిపోయిన ఈ తొలి ‘కేంద్రక సంలీన అణు రియాక్టర్’ ఏర్పాటు ప్రాజెక్టుకు అమెరికా, జపాన్, రష్యా, తదితర 35 దేశాలతో సహా భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. దక్షిణ ఫ్రాన్స్‌లోని క్యాడరాచే వద్ద ‘ఐటర్ (ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్)’ పేరుతో తలపెట్టిన ఈ రియాక్టర్‌ను 2021 నాటికి నిర్మాణం పూర్తిచేసేందుకు భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఈయూ, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసామూ మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా కృషిచేస్తున్నారు. ఈ మేరకు 800 మంది శాస్త్రవేత్తలు ఇటీవలే సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు.

కేంద్రక సంలీన రియాక్టర్ అంటే..?
సూర్యుడు నిత్యం నిప్పుల కొలిమిలా మండుతూ ఉండేందుకు కారణం.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్యలు జరగడమే. అంటే.. హైడ్రోజన్ పరమాణువులు పరస్పరం కలిసిపోవడం వల్ల అత్యంత శక్తి విడుదలవుతుందన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తి స్వచ్ఛమైన విద్యుత్‌గా ఉపయోగపడుతుంది. దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు ఏర్పడవు. దీనిని రియాక్టర్లలో నియంత్రించడం సులభం. ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రస్తుత అణు రియాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ప్రపంచానికి స్వచ్ఛమైన అణువిద్యుత్ అందించేందుకు ఐటర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్లు భారత బృందం చీఫ్ డాక్టర్ రవి గ్రోవర్ వెల్లడించారు. ప్రస్తుతం అణు రియాక్టర్లలో రేడియోధార్మిక పదార్థాలతో కేంద్రక విచ్ఛిత్తి చర్యలు జరపడం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రియాక్టర్లలో రేడియోధార్మిక పరమాణువులను విభజన చెందిస్తూ.. ఆ సందర్భంగా గొలుసుకట్టు చర్యల ద్వారా వెలువడే శక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల రేడియోధార్మిక వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. ఈ రియాక్టర్లు పేలి విపత్తులు జరిగే ప్రమాదమూ ఉంది.

భారత్ పాత్ర ఏమిటి?
ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజిరేటర్‌ను ఈ రియాక్టర్ కోసం భారత్ నిర్మిస్తోంది. వాయువులను మైనస్ 269 డిగ్రీ సెల్షియస్‌లకు చల్లబర్చే థర్మాస్‌ఫ్లాస్క్‌లా పనిచేసేలా దీనిని రూపొందిస్తోంది. రియాక్టర్‌లో కేంద్రక సంలీన చర్యలు జరిపేందుకు ఉపయోగించే భారీ అయస్కాంతాల వ్యవస్థ పనిచేసేందుకు ఈ క్రయోస్టాట్(శీతల) వ్యవస్థే కీలకం. అయస్కాంత వ్యవస్థ తగినంత చల్లబడకపోతే కేంద్రక సంలీన చర్యలు స్తంభించిపోతాయి కాబట్టి.. ఇందులో భారత్ తయారు చేసే క్రయోస్టాట్ వ్యవస్థే ప్రధానం కానుంది.

విద్యుత్ ఉత్పత్తి ఇలా...
భారీ డబ్బాలాంటి స్టీలు ఫ్రేములా ఉండే ఐటర్‌లో హైడ్రోజన్ వాయువును 15 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడిచేస్తారు. దానిని తక్కువ స్థలంలోకి ఒత్తిడితో నిర్బంధిస్తారు. తర్వాత భారీ అయస్కాంతాల ప్రభావంతో పరమాణువులు ఒకదానితో ఒకటి బలంగా కలిసిపోయి సంలీనం చెందేలా చేస్తారు. దీనివల్ల పెద్ద ఎత్తున వెలువడే ఉష్ణశక్తిని విద్యుత్‌గా మారుస్తారు.

ఇవీ విశేషాలు...
  • కేంద్రక విచ్ఛిత్తి కన్నా ఈ పద్ధతిలో 10 రెట్లు ఎక్కువగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
  • ఐటర్ నిర్మాణానికి సుమారుగా 1.22 లక్షల కోట్లు (20 బిలియన్ డాలర్లు) వ్యయం కానున్నాయి.
  • అత్యంత కీలకమైన క్రయోజనిక్ వ్యవస్థతో పాటు 9 వేల కోర్(ఇతర భాగాలు)లను భారత్ అందిస్తోంది. అందువల్ల ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం ఖర్చును మాత్రమే భరించనుంది.
  • ఐటర్ రియాక్టర్ బరువు 23 వేల టన్నులు. ఇది మూడు ఈఫిల్ టవర్ల బరువుతో సమానం.
  • ఐటర్లో ఉపయోగించిన తీగల మొత్తం పొడవు 80 వేల కిలోమీటర్లు.
  • ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే గనక.. 2050 నాటికి సొంత కేంద్రక సంలీన రియాక్టర్ తయారీపై భారత్ దృష్టిపెట్టనుంది.
Published date : 30 Oct 2014 11:49AM

Photo Stories