Skip to main content

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాల వారిగా తీర్పు...

ఎవరెన్ని ఆరోపణలు చేసినా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా నరేంద్రమోదీ నాయకత్వానికి యావత్ భారతావని జేజేలు కొట్టింది. ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో తమ అభిమానాన్ని ఓటర్లు చాటారు. మోదీ తప్ప మరెవరినీ నమ్మబోమంటూ ఢంకా బజాయించారు.
రెండు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఊహలకందని స్థాయికి ఎదిగింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 303కిపైగా స్థానాల్లో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలు విస్తుపోయేలా చేసింది. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యధికంగా 3,60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో గెలిచింది. 2014 ఎన్నికల కంటే బీజేపీ ఈసారి పుంజుకుంది. ఆనాటి ఎన్నికల్లో 282 స్థానాలను గెలుచుకోవడం విదితమే.

2019 తీర్పు :
బీజేపీ - 303
ఎన్‌డీఏ - 353
కాంగ్రెస్ - 51
యూపీఏ - 91
ఇతరులు - 98


9 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకత్వం ఆశించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది. సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కై వసం చేసుకుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు.

ఉనికి కాపాడుకున్న తెలంగాణ కాంగ్రెస్ :
అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్‌గిరి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కమల వికాసం!
తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్‌ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్‌నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్‌లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.

తెలంగాణ తీర్పు :

పార్టీ

2014

2019

టీఆర్‌ఎస్

11

09

కాంగ్రెస్

02

03

బీజేపీ

01

04

టీడీపీ

01

00

వైసీపీ

01

00

ఎంఐఎం

01

01


తమిళనాడులో స్టాలిన్ సత్తా ...
తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు గాను 38 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో నోట్ల కట్టలు భారీగా పట్టుబడడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదా వేసింది. ద్రవిడ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు అగ్ర నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన తొలి ఎన్నికలివి. మొదట్నుంచి ఉత్తరాది ప్రభావాన్ని అంగీకరించకుండా జాతీయ పార్టీలను దూరంగా ఉంచే తమిళ తంబీలు ఈసారి కూడా అదే బాటలో నడిచారు. కరుణానిధి వారసుడు స్టాలిన్‌కే పట్టం కట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి ఆందోళనలు చేసినా ఎన్డీయే సర్కార్ కరుణించకపోవడం, నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, కరువు కోరల్లో చిక్కుకున్న పలు ప్రాంతాలు వంటివి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపైనా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకత డీఎంకే-కాంగ్రెస్ కూటమి విజయానికి బాటలు వేసింది. గత ఎన్నికల్లో ఒక్క కన్యాకుమారిలో మాత్రం గెలిచిన బీజేపీ... ఈసారి ఒక్కస్థానంలోనూ నెగ్గలేక చతికిలపడింది. తండ్రి ఉన్నన్నాళ్లూ ఆయన నీడలా ఉన్న స్టాలిన్ ఈ ఎన్నికల్లో కరుణానిధికి అసలు సిసలు వారసుడిగా ఎదిగి తన సత్తా చాటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన డీఎంకేను ఈ సారి ఎన్నికల్లో పరుగులు పెట్టించారు.

తమిళనాడులో డీఎంకే జయకేతనం :
తమిళనాడులో డీఎంకే జయకేతనం ఎగరవేసింది. లోక్‌సభ, ఉప ఎన్నికల్లోనూ డీఎంకే తన ఆధిక్యాన్ని చాటు కుని అన్నాడీఎంకేను కంగుతినిపిం చింది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు 38 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ స్థానంలో ఈసీ ఎన్నికలను రద్దు చేసింది. మొత్తం 38 లోక్‌సభ స్థానాల్లో 37 సీట్లు, 22 ఉప ఎన్నికల్లో 13 స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంది. అన్నాడీఎంకే 2 లోక్‌సభ స్థానాల్లో, 9 ఉప ఎన్నికల స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ముందంజలో ఉంది.

తమిళనాడు తీర్పు :

పార్టీ

2014

2019

ఏఐడీఎంకే

37

01

బీజేపీ

01

00

పీఎంకే

01

00

డీఎంకే

00

23

కాంగ్రెస్

00

08

లెఫ్ట్

00

04

ఇతరులు

00

02


కేరళలో కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్..
వామపక్షాల పట్టున్న ఏకై క రాష్ట్రం కేరళలో శబరిమల ఆలయ వివాదమే ఈ సారి ఎన్నికల్ని నడిపించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో జరిగిన రగడ అధికార లెఫ్ట్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ సారి ఎన్నికల్లో దాని ప్రభావం గట్టిగానే కనిపించింది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ ఆలయ వివాదంతో ఏ మాత్రం లాభపడలేదు. కేరళలో ఖాతా తెరవాలన్న ఆ పార్టీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు పోసింది. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొని, ఆలయ సంప్రదాయాలను కాపాడతామంటూ బీజేపీతో పాటు కాంగ్రెస్ శ్రేణులూ పోరాటానికి దిగాయి. అది కాంగ్రెస్‌కే లాభం చేకూర్చింది. అంతేకాక అమేథీలో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మొదట్నుంచి అనుమానాలు ఉండడంతో కేరళలో వయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగారు. సీపీఐ అభ్యర్థి ఆర్‌పీ సునీర్‌పై 4 లక్షల 30వేల పై చిలుకు మెజార్టీతో రాహుల్ నెగ్గారు. ఇక్కడ రాహుల్ పోటీ చేసిన ప్రభావం యూడీఎఫ్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి దోహదపడింది. యూడీఎఫ్ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడం సీపీఎం నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఓటమి పినరయి విజయన్ సర్కార్‌కు నష్టం కలిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ‘జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌నే కేరళ ప్రజలు ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అదే యూడీఎఫ్‌కి కలిసొచ్చింది‘ అని కేరళ ఎన్నికల పరిశీలకుడు డా. సాజద్ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ విజయం సాధిస్తే, భారతీయ జనతాపార్టీ అభ్యర్థి, కేరళ బీజేపీ మాజీ చీఫ్ కె.రాజశేఖరన్ రెండోస్థానంలో నిలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ మూడో స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్యలింగం, ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి కేశవన్‌ను ఓడించింది. లక్షదీవులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ ఘన విజయం సాధించారు.

కేరళ తీర్పు :

పార్టీ

2014

2019

కాంగ్రెస్

08

15

సీపీఎం

05

01

కేరళ కాంగ్రెస్(ఎం)

01

01

ఇతరులు

02

03


కర్ణాటక కమలానిదే ...
యావత్ భారతం హర హర మోదీ నినాదంతో ఊగిపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కొంతవరకు తెలంగాణలో మినహా ఇంకెక్కడా మోదీ మ్యాజిక్ కనిపించలేదు. దక్షిణ కోటలో పాగా వేయడానికి కోటగుమ్మంగా భావించే కన్నడనాట మాత్రం కాషాయ జెండా రెపరెపలాడింది. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ... సంవత్సరం తిరిగేసరికల్లా పడిలేచిన కడలితరంగంలా ఉవ్వెత్తున ఎగసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఏపీలో అతడే ఒక సైన్యంలా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి దూసుకుపోతే తెలంగాణలో కారు జోరుకి కమలదళం కొంత వరకూ బ్రేకులు వేసింది. ఎవరి అంచనాలకూ అందని విధంగా బీజేపీ నాలుగు సీట్లను కొల్లగొట్టడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో చొచ్చుకుపోవడానికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే , కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తమ సత్తాని చాటి రాష్ట్రాలను క్లీన్‌స్వీప్ చేశాయి. అండమాన్ నికోబర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ శర్మ, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి విశాల్ జాలీపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ(ఎస్) అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఇంతలోనే ఫలితాలు తారుమారయ్యాయి. గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కానీ ఏడాదిలోనే ఆ పార్టీ తిరిగి రాష్ట్రంపై పట్టు బిగించింది. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) దిగ్గజ నేతలు కమలం ధాటికి కుదేలయ్యారు. కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటీ బయటపడి కుమారస్వామి తన పరిస్థితి గరళం మింగిన శివుడిలా మారిందంటూ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమయింది. కూటమి ఎమ్మెల్యేలపై బీజేపీ ఆపరేషన్ కమలను ప్రయోగిస్తుందన్న ప్రచారంతో కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి బలహీనపడసాగింది. వారి బలహీనతే బీజేపీకి బలంగా మారింది. 22 ఎంపీ స్థానాలను గెలిస్తే, కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వమే మారిపోతుందని ఇటీవల బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు బీజేపీ భారీ విజయంతో కాంగ్రెస్-జేడీ(ఎస్) సర్కార్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కమలం ధాటికి కాంగ్రెస్, జేడీ (ఎస్) దిగ్గజ నేతలు ఓటమి పాలయ్యారు. తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ప్రధానమంత్రి, జేడీ(ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి బసవరాజ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పటివరకు దేవెగౌడ ప్రాతినిధ్యం వహించిన హసన్ నుంచి ఆయన మనవడు ప్రజ్వల రేవణ్ణ మాత్రమే విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ అభ్యర్థి వీరప్పమొయిలీ చిక్‌బళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి బచ్చే గౌడ చేతిలో ఓడిపోతే, మరో కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీకి దిగి బీజేపీ అభ్యర్థి ఉమేశ్ యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు.

కర్ణాటక తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

17

5

కాంగ్రెస్

09

01

జేడీఎస్

02

01

ఇతరులు

00

01


పశ్చిమబెంగాల్‌లో పెరిగిన బీజేపీ బలం..
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో అత్యంత చరిత్రాత్మకమైన అడుగు పశ్చిమబెంగాల్ కోటను కొల్లగొట్టడమే. ఇక్కడ కొన్నేళ్ల కిందటిదాకా రాజ్యం చేసిన కమ్యూనిస్టుల చిరునామా గల్లంతు కాగా... అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సగం సీట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ చచ్చీచెడీ రెండు సీట్లు గెలుచుకున్నా... ఊహించని విధంగా బీజేపీ 19 స్థానాల్లో పాగా వేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఇపుడు 19 సీట్లకు ఎగబాకటం మమతా బెనర్జీకి ఆందోళన కలి గించే పరిణామమే. దీదీ - మోదీ మధ్య పోరా టంగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ తృణమూల్‌తో సమానంగా సీట్లు సాధించి మమత కోటను ముక్కలు చేసింది. ఇక్కడ ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా దాదాపు అన్ని దశల్లోనూ హింసాత్మక సంఘటనలు కనిపిస్తూనే వచ్చాయి. అందుకే ఎన్నికల సంఘం ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రచార గడువును సైతం కుదించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటమే కాక, ప్రత్యర్ధులం తా లోపాయికారీగా ఏకం కావడం, తృణమూల్ నేతల్లో కొన్ని చోట్ల విభేదాలు మమత హవాకు అడ్డుకట్ట వేశాయి. ముఖాముఖి పోటీలో కింది స్థాయి సీపీఎం శ్రేణుల మద్దతు బీజేపీకి కలిసొ చ్చింది. ఈ సారి ఎన్నికల్లో సీపీఎం ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయనేది పరిశీలకుల అంచనా. 2014 ఎన్నికల్లో 31 సీట్లు తృణమూల్ గెలిస్తే బీజేపీ రెండు సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2009లో 19 సీట్లు సాధించుకున్న తృణ మూల్ తర్వాత ఎన్నికల నాటికి బాగా బలపడింది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మమత మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో ఈ ఎన్నికల్లో తృణ మూల్‌కు తిరుగులేదన్న అభిప్రాయం వ్యక్తమయింది. దాంతో మమతను ఎదుర్కొనడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేసిన మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. మూన్ మూన్ సేన్ మాత్రం బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ పలువురు సినీ ప్రముఖులకు, ఎక్కువ మంది మహిళలకు టికెట్లిచ్చారు. గత ఎన్నికల్లో తృణమూల్ తరఫున గెలిచి ఈ సారి మళ్లీ అదే టికెట్‌పై పోటీ చేసిన వారిలో చాలా మంది ఓటమి పాలయ్యారు.

పశ్చిమ బెంగాల్ తీర్పు :

పార్టీ

2014

2019

టీఎంసీ

34

22

బీజేపీ

02

18

కాంగ్రెస్

04

02

సీపీఎం

02

00


ఒడిశాలో బీజేడీ హల్‌చల్...
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) హవా సాగుతోంది...
ఓటమి ఎరుగని నేత..
మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ తదనంతరం నవీన్ పట్నాయక్ సారథ్యంలో బిజూ జనతా దళ్ ఏర్పాటైంది. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేడీ 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. బీజేపీతో కలిసి నవీన్ పట్నాయక్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు ఓటమి ఎరుగరు. 2004 ఎన్నికల్లో 61, 2009 ఎన్నికల్లో 103 స్థానాలు, 2014 ఎన్నికల్లో 117 స్థానాలు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కూడా మరోసారి ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

ఒడిశా తీర్పు :

పార్టీ

2014

2019

బీజేడీ

20

13

బీజేపీ

01

8

కాంగ్రెస్

00

0


బిహార్.. జార్ఖండ్‌లో ‘ఎన్డీయే’ పట్టు :
బీహార్‌లో ఎన్‌డీఏ ఘన విజయం పునరావృతమయింది. నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, బీజేపీతో జతకట్టినందుకు ఫలితం కనిపించింది. మొత్తం 40 సీట్లలో ఎన్‌డీఏ 39 సీట్లు గెలిచి గత ఎన్నికల విజయాన్ని పునరావృతం చేసింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకి దక్కింది ఒకే సీటు. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జేడీ పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా కూడా పట్నా సాహెబ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అలాగే, సీపీఐ నుంచి పోటీ చేసిన కన్నయ్య కుమార్ కూడా బెగూసరాయ్‌లో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలోని 40 సీట్లలో బీజేపీ, జేడీయూలు చెరో 17, ఎల్‌జేపీ ఆరు చోట్ల పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 22, ఎల్‌జేపీ 6, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో బీజేపీ హవా ఈ సారీ కొనసాగింది. మొత్తం 14 సీట్లలో 11 చోట్ల కాషాయ పతాకం ఎగిరింది. కాంగ్రెస్‌కు మూడు సీట్లే దక్కాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఒక సీటు కోల్పోగా, కాంగ్రెస్‌కు ఒక సీటు పెరిగింది. జేఎంఎం అధినేత శిబూ సోరెన్ విజయం ఖాయమనుకున్నా ఫలితాలు తారుమారయ్యాయి.

ఈశాన్యాన కమలం జోరు...
ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలుచుకుంది. అసోంలో 14 సీట్లకు గాను 9 చోట్ల కమలనాధులు గెలిచారు. 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా, ఒక స్థానాన్ని ఏఐయూడీఎఫ్ దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 7 చోట్ల గెలిచింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే గెలిచింది. మణిపూర్‌లో రెండు లోక్‌సభ స్థానా లుండగా ఒకటి బీజేపీ గెలిచింది. మేఘాలయలో 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరో సీటు ఎన్‌పీపీ దక్కించుకున్నాయి. మిజోరంలోని ఏకై క లోక్‌సభ స్థానం మిజో నేషనల్ ఫ్రంట్‌కు దక్కింది. ఇది ఎస్సీలకు కేటాయిం చిన సీటు. గత ఆరు సార్లుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తూ వచ్చింది. ఈశాన్య భారతంలోని మరో రాష్ట్రమైన నాగాలాండ్‌లోని ఏకై క లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. గతలోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించింది. సిక్కింలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎస్‌కేఎం దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో ఈ సీటును సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ గెలుచుకుంది. త్రిపురలోని 2 స్థానాలనూ మునుపటి ఎన్నికల్లో మాదిరిగానే బీజేపీ దక్కించుకుంది.

మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన కూటమి హావా..
మహారాష్ట్రలోని 48 స్థానాలకుగాను బీజేపీ - శివసేన కూటమి 41 స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో ఉంది. బీజేపీ సొంతంగా 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్ కూటమి 7 స్థానాల్లోను, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ శివసేనతో జట్టుకట్టి బరిలో దిగగా.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు పోటీగా నిలిచాయి.

గత ఎన్నికల సమయంలో బీజేపీ శివసేనలు కలిసికట్టుగా పోటీ చేసి ఘన విజయం సాధించినప్పటికీ ఆ తరువాతి కాలంలో ఇరు పార్టీలూ చెరోదారి పట్టాయి. నాలుగేళ్లపాటు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా ఎన్నికల సమయానికి మాత్రం రెండు పార్టీలూ మళ్లీ జట్టు కట్టేశాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో కనిపించిన మహారాష్ట్రలో బీజేపీ -శివసేన గెలుపు అంత సులభం కాబోదన్న అంచనాలు ముందుగా వెలువడినప్పటికీ ఫలితాల సమయానికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శివసేనపై నేరుగా విమర్శలు గుప్పించడం, ప్రజల్లో ఆయన సభలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో శివసేన బలహీన పడుతుందని అంచనా వేశారు. అయితే సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, ఎన్సీపీల్లో గందరగోళం నెలకొనడం... శరద్‌పవార్ పోటీ చేయకపోయినా ఆయన మనుమల వరసైన వారు ఇద్దరు బరిలో ఉండటం తదితర కారణాల వల్ల ఎన్సీపీని ప్రజలు పెద్దగా ఆదరించలేదన్న అంచనాలున్నాయి. ముంబైలోని గుజరాతీ, మరాఠీ మధ్య తరగతి వర్గం గట్టి మద్దతునివ్వడంతో బీజేపీ- శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించగలిగింది. కాంగ్రెస్- ఎన్సీపీలకు ముస్లిం మైనార్టీల మద్దతు కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో స్వల్ప స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్మిళ మటోండ్కర్ వంటి సినీనటిని ముంబై నార్త్ ఓటర్లు ఆదరించలేదు. మహారాష్ట్ర ఎన్నికల మొత్తానికి అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఔరంగాబాద్‌లో నమోదైంది. చతుర్ముఖ పోటీ కారణంగా ఓట్లు చీలిపోవడంతో ఆలిండియా ఇత్తేహదుల్ ముస్లమీన్ అభ్యర్థి ముందజలో నిలిచారు.

మహారాష్ట్ర తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

23

23

శివసేన

18

18

కాంగ్రెస్

02

01

ఎన్సీపీ

04

04

ఇతరులు

01

00


గుజరాత్‌లో కమలం క్లీన్‌స్వీప్..
{పధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో భాజపా క్లీన్ స్వీప్ చేసి గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ స్థానంలో రెండు లక్షలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క అమ్రేలీ స్థానంలోనే ప్రతిపక్ష నేత పరేశ్ ధనాని బీజేపీ అభ్యర్థి నరన్ కచ్చాడియాకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అంతరం అతిస్వల్పంగా ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ జరిగింది. రికార్డు స్థాయిలో 64.11 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 81 స్థానాలు సాధించడం.. బీజేపీ 99 స్థానాలతో అతికష్టమ్మీద అధికారం చేపట్టడం లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని అంతా అంచనా వేశారు. అయితే పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను స్వయంగా గాంధీనగర్‌లో పోటీకి దింపడం ద్వారా బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. లోక్‌సభకు పోటీ చేయడం అమిత్ షాకు ఇదే తొలిసారి. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్‌లో వ్యవసాయ సంక్షోభం సమస్య బీజేపీని కొంత కలవర పెట్టినా దాన్ని కూడా అధిగమించగలిగింది. జీఎస్టీ అమల్లోని లోపాలు గుజరాత్ వ్యాపారులను దెబ్బతీశాయని.. ఫలితంగా వారూ బీజేపీకి దూరం కావచ్చునని భావించారు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ.. బీజేపీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఘన విజయం సాధించింది. పాటీదార్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరి పోటీకి సిద్ధమైనప్పటికీ కోర్టు జోక్యంతో పోటీ చేయలేకపోయారు. మరోవైపు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను వీడిపోవడం ఆ పార్టీని బలహీన పరిచిందని చెప్పవచ్చు.

గుజరాత్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

26

26

కాంగ్రెస్

00

00


గోవాలో సగం.. సగం..
పశ్చిమ కనుమల్లోని అతిచిన్న రాష్ట్రం గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నార్త్ గోవా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ యశోనాయక్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన గిరీశ్ రాయ ఛోడాంకర్‌పై భారీ మెజార్టీతో గెలవగా... దక్షిణ గోవాలో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన కోస్మే ఫ్రాన్సిస్కో కై టానో సర్డిన్హా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సావల్కర్‌పై స్వల్ప ఆధిక్యంలో విజయం సాధించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ బరిలో ఉంది. మొత్తం 71 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నార్త్, సౌత్ గోవా రెండింటినీ గెలుచుకోగా.. ఈ సారి ఫలితం కాస్త తారుమారయింది. కేంద్రపాలిత ప్రాంతమైన దామన్ అండ్ డయ్యూ,లో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్ బాబూభాయ్ ఘన విజయం సాధించగా.. దాద్రా అండ్ నగర్ హవేలీలో స్వతంత్ర అభ్యర్థి దేల్కర్ మోహన్ భాయ్ సాంజీ భాయ్ గెలుపొందారు.

గోవా తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

02

01

కాంగ్రెస్

00

01


రాజస్థాన్‌లో కమలం పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యం..
ఎన్నికల జరిగిన ప్రతిసారి అధికార పార్టీని ఓడించడం రాజస్థాన్ ప్రత్యేకత. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్రంలో ఈ సారి కూడా కమలం పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాలను గెలుచుకుంది. ఒక్క స్థానంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ విజయం సాధించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన రాజస్థాన్ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేతీరును కనబరుస్తారని చాలామంది అంచనా వేశారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ఉన్న అసంతృప్తిని అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వ్యక్తం చేసిన ఓటరు లోక్‌సభకు వచ్చేసరి మరోసారి మోదీకి జై కొట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ జోధ్‌పూర్ నుంచి బరిలోకి దిగగా.. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెఖావత్ చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రాజస్థాన్‌లో ఏప్రిల్ 29, మే 6న రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోటీలో బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖాముఖి తలపడ్డాయి. రెండు దశల ఓటింగ్ శాతం 66.07గా నమోదైంది. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

రాజస్తాన్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

25

04

ఆర్‌ఎల్పీ

00

01


యూపీలో 64 సీట్లు నిలబెట్టుకున్న ఎన్‌డీఏ :
పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనం కాషాయ పక్షానికి ఊహించని విజయాలను అందించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంతలోనే దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలు కై వసం చేసుకుంది. దేశంలోనే అత్యధిక సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ- ఎస్పీ మహా కూటమిగా ఏర్పడి విసిరిన సవాలును తేలిగ్గా తిప్పికొట్టేసింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో 60 సీట్ల వరకూ నిలబెట్టుకుంది. ఈ మహాకూటమి నుంచి ఎదురయ్యే పోటీ వల్ల బీజేపీ 40 సీట్లు గెలిస్తే గొప్పేనన్న అంచనాలు తప్పని కమలదళం రుజువు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా జమ్మూకశ్మీర్‌లో కిందటిసారి గెలిచిన 3 సీట్లను బీజేపీ నిలబెట్టుకుంది. చిన్న రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం సీట్లను మోదీ ప్రభంజనంతో బీజేపీ కై వసం చేసుకుంది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90% సీట్లు సొంతం చేసుకుంది. మొత్తంమీద బీజేపీ బలం లోక్‌సభలో 300 సీట్లు దాటడానికి ఉత్తరాది రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటునిచ్చాయి.

యూపీలో 11 సీట్లు కోల్పోయిన ఎన్డీఏ :
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్‌డీఏ స్కోరు ఇక్కడ 64 సీట్లకు చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 73 సీట్లు కైవసం చేసుకోవటం గమనార్హం. 2007- 2017 మధ్య పదేళ్లు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఈసారి ఆరెల్డీతో కలిసి మహాకూటమి పేరుతో పోటీచేసి 15 సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ బీజేపీ బలం ఈసారి కాస్త తగ్గింది. వేర్వేరు సామాజికవర్గాల మద్దతు ఉన్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడడంతో తమ ఉనికిని కాపాడుకోగలిగాయి. మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 10, మరో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో గతంలో మూడుసార్లు గెలిచి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనం. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ విజయంతో యూపీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఓటేసింది యోగిని చూసి కాదు: 2017 యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత అనూహ్యంగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాథ్ పాలన బాగోకున్నా ప్రధాని సాధించిన విజయాలకు మెచ్చి బీజేపీకి ఓటేస్తున్నామని ఎన్నికల ముందు సర్వేల్లో ప్రజలు చెప్పారు. అలాగే దాదాపు 10 శాతం జనాభా ఉన్న బీజేపీ పునాది వర్గం బ్రాహ్మణులు యోగి పాలనపై అసంతృప్తి ఉన్నా ఈసారికి మోదీ కోసమే బీజేపీని సమర్థిస్తున్నామన్నారు.

ఉత్తరప్రదేశ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

71

62

అప్నాదళ్

02

02

బీఎస్పీ

00

10

ఎస్పీ

05

05

కాంగ్రెస్

02

01


మధ్యప్రదేశ్‌లో కాషాయం స్వీప్...
29 సీట్లున్న బీజేపీ కంచుకోట మధ్యప్రదేశ్‌లో... కాషాయపక్షం ఈసారి 29 స్థానాలకుగాను 28 స్థానాలు కై వసం చేసుకుంది. కిందటిసారి ఎన్నికలతో పోల్చితే ఒక సీటు పెరిగింది. 1993- 2018 మధ్య రాష్ట్రాన్ని పదిహేడు సంవత్సరాలు పాలించాక బీజేపీ 2018 డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని సర్కారు ఐదు నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇంతటి భారీ విజయం సొంతం చేసుకుంటుందని రాజకీయ పండితులెవరూ ఊహించలేకపోయారు. రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ సర్కారు సక్రమంగా అమలు చేయకపోవడం, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి బీజేపీ విజయానికి కారణమైంది. 2014లో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒకటైన గుణాలో గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబసభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ భోపాల్ నుంచి పోటీచేసి ‘హిందుత్వ’ ప్రతినిధి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. ప్రగ్యకు టికెట్ ఇవ్వడం, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోగా మేలే జరిగిందని ఫలితాలు నిరూపించాయి. హిందుత్వ కాషాయ రాజకీయాలకు పునాది అయిన మధ్యప్రదేశ్ మోదీ మళ్లీ ప్రధాని కావడానికి తన వంతు సాయమందించింది.

మధ్యప్రదేశ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

27

28

కాంగ్రెస్

02

1


పంజాబ్‌లో కాంగ్రెస్ నిలదొక్కుకుంది..
పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో పాలకపక్షమైన కాంగ్రెస్ 8 సీట్లు కై వసం చేసుకొని ఆధిక్యం నిలబెట్టుకుంది. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పనితీరుతోపాటు అకాలీదళ్-బీజేపీ కూటమిని చాకచక్యంగా ఎదుర్కొంది. 2017 ఎన్నికలకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఈ కూటమికి ఉన్న చెడ్డపేరు కూడా కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది. కిందటిసారి 4 సీట్లు గెలుచుకున్న ‘ఆప్’.. ఈసారి ఒక సీటే గెలుచుకోగా అకాలీదళ్, బీజేపీలు చెరో రెండు సీట్లు సాధించాయి. పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో బీజేపీ జాతీయవాదం పనిచేయలేదు.
పంజాబ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

02

02

అకాలీదళ్

04

02

కాంగ్రెస్

03

08

ఆప్

04

01


హరియాణాలోనూ క్లీన్‌స్వీప్..
కిందటి సారి బీజేపీకి ఏడు సీట్లు అందించిన హరియాణాలోని మొత్తం పది లోక్‌సభ సీట్లనూ కాషాయపక్షం కై వసం చేసుకుంది. బీజేపీ తొలి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం ఎక్కువ. పంజాబీ ఖత్రీ అయిన ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన బీజేపీ ఈసారి లోక్‌సభ టికెట్ల కేటాయింపులో కులాలవారీ పద్ధతికి స్వస్తి చెప్పింది. కొత్త ప్రయోగాలతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలపాటు బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ కుటుంబాల ఆధిపత్యంలో మగ్గిన హరియాణాలో బీజేపీ పది లోక్‌సభ సీట్లు దక్కించుకోవడం అసాధారణ విజయంగా భావించవచ్చు. మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హూడా, ఆయన కొడుకు దీపేందర్ ఓడిపోయారు.

హరియాణా తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

07

10


ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ ‘షాక్’..
కిందటి డిసెంబర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల పాలన తర్వాత ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆరు నెలలు తిరగకుండానే మొత్తం 11 సీట్లలో 9 కై వసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. మిగిలిన రెండు సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పరువు కాపాడుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ అత్యధిక సీట్లు కై వసం చేసుకోబోతోందని తేలింది. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం, హిందుత్వ ప్రభావం లేని కారణంగా బీజేపీకి మూడు నాలుగు సీట్లొస్తే గొప్పేనన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి.

ఛత్తీస్‌గఢ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

10

9

కాంగ్రెస్

01

2


కశ్మీర్.. నిలబడిన బీజేపీ బలం
జమ్మూ కశ్మీర్‌లో 2014 ఎన్నికల్లో జమ్మూ,, లద్దాఖ్‌లోని మూడు సీట్లు మొదటిసారి గెలిచిన బీజేపీ ఈసారి ఈ స్థానాలు నిలబెట్టుకుంది. కిందటిసారి మిగిలిన మూడు సీట్లు సాధించిన జేకే పీడీపీ ఈసారి కశ్మీర్ లోయలోని ఆ సీట్లను కోల్పోయింది. ఈ స్థానాలను ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం ఆధిపత్యంలోని నేషనల్ కాన్ఫరెన్‌‌స కై వసం చేసుకుంది. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు కొన్నాళ్లు నడిపింది. చివరికి బీజేపీ వైదొలగడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పీడీపీకి జనాదరణ తగ్గి నేషనల్ కాన్ఫరెన్‌‌స మళ్లీ పుంజుకోగలిగింది.

జమ్మూకశ్మీర్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

03

03

ఎన్సీ

03

03


ఉత్తరాఖండ్‌లో మళ్లీ ఐదూ బీజేపీకే :
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ మొత్తం ఐదు లోక్‌సభ సీట్లను కై వసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక త్రివేంద్రసింగ్ రావత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో ఈసారి హిందుత్వ, జాతీయవాదం ప్రభావం పనిచేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

05

05


చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ రెండో విజయం :
కిందటి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన సినీ నటి కిరణ్ ఖేర్ రెండోసారి గెలిచారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించినా ఆమె టికెట్ సాధించి మరీ విజయం సాధించారు.

ఢిల్లీలో బీజేపీకి మళ్లీ ఏడు :
{పాంతమైన ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ వరుసగా రెండోసారి కై వసం చేసుకుంది. 2014 మోదీ ప్రభంజనంలో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఆప్, కాంగ్రెస్ మొదట పొత్తుకు ప్రయత్నించి విఫలంకావడం బీజేపీ విజయానికి ఒక కారణం.

ఢిల్లీ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

07

07


హిమాచల్..పాత ఫలితాలే పునరావృతం...
బీజేపీకి బలమైన పునాదులున్న మరో హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కాషాయపక్షం వరుసగా రెండోసారి మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ కై వసం చేసుకుంది. 2017 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జైరాం ఠాకూర్ సీఎం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రాం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వస్తాయన్న అంచనా తప్పయింది.

హిమాచల్‌ప్రదేశ్ తీర్పు :

పార్టీ

2014

2019

బీజేపీ

04

04

Published date : 24 May 2019 09:19PM

Photo Stories