Skip to main content

ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం ఏది?

హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ను ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోహ్‌తాంగ్‌లో 2020, అక్టోబర్ 3న ప్రారంభించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుంది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని నిర్మించింది. సొరంగం ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ‘కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’ అని పేర్కొన్నారు.

అటల్ టన్నెల్‌గా పేరు మార్పు
2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్‌తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది.

అటల్ టన్నెల్ విశేషాలు...

  • సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు.
  • ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ.
  • సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది.
  • భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ ప్రారంభం
ఎప్పుడు : 2020, అక్టోబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రోహ్‌తాంగ్, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ను కలిపేందుకు
Published date : 08 Oct 2020 12:06PM

Photo Stories