Skip to main content

భారతదేశం- జాతీయ చిహ్నాలు

ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన జెండా, జాతీయ గేయం, జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ పుష్పం వంటి ఇతర అనేక చిహ్నాలుంటాయి. అవి ఆ దేశ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు మరియు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు ఆ దేశ సంస్కృతిని, చరిత్రను తెలియజేస్తాయి. భారతదేశం కూడా చాలా జాతీయ చిహ్నాలు కలిగి ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

జాతీయ పతాకం:

భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. దీనిని 1947 జులై 22న రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ జెండా మీద కాషాయ తెలుపు, ఆకుపచ్చ రంగులు వరుసగా సమానంగా ఉంటాయి. మధ్యలో ఉన్నతెలుపు రంగు మీద ముదురు నీలం రంగులో 24 ఆకులు గల అశోకచక్రం ఉంటుంది. సారనాథ్‌లో గల అశోక ధర్మస్తంభం మీద ఉండే ధర్మచక్రాన్ని అనుసరించి ఈ చక్రాన్ని రూపొందించారు.

జాతీయ పతాకాన్ని సూర్యోదయం తరువాతనే ఎగురవేయాలి. సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి. జాతీయ పతాకం లేదా దాని ఫొటోని చించడం, మురికిచేయడం చేయకూడదు. వ్యాపార ప్రకటనలకు వాడకూడదు. జెండాను వస్త్రాలుగా ధరించకూడదు.

జాతీయ జెండాను ఎలా పడితే అలా వాడకుండా ప్రభుత్వం 1950లో ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్ యాక్ట్, 1971లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లను చేసింది. ఇందులో జెండా ను ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా వాడాలి అనే నిబంధనలు పొందుపరిచారు. అయితే 2002లో వచ్చిన న్యూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం పౌరులందరూ అన్ని రోజులూ ఇళ్లు, కార్యాలయాలలో జెండా ఎగురవేయవచ్చు. ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జాతీయ పతాకాన్ని ఎగురవేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది.

జాతీయ చిహ్నం:
Bavitha భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ (సింహ తలాటం). దీనిని 1950 జనవరి 26న సారనాథ్‌లోని అశోకుని ధర్మస్థూపం నుంచి స్వీకరించారు. ఈ చిహ్నంపై నాలుగు సింహాలు ఉంటాయి. అయితే మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే పీఠంపై ముండకోపనిషత్నుంచి స్వీకరించినవాక్యం ‘సత్యమేవ జయతే’ దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ఈ చక్రానికి ఎడమ వైపు గుర్రం, కుడి వైపు ఎద్దు ఉంటాయి. అలాగే పీఠం మరోవైపు ఏనుగు, సింహం కూడా ఉంటాయి.

జాతీయగీతం:
Bavitha మన జాతీయ గీతం జనగణమణ. దీనినివిశ్వకవి, భారత తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. రవీంద్ర నాథ్ రచించిన పూర్తి గీతంలో 5 చరణాలున్నాయి. ఇందులోని తొలి చరణంలోని 5 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి 52 సెకన్ల సమయం పడుతుంది. 1885 కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ గీతాన్ని ఆమోదించారు. తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కోల్‌కతా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912లో ప్రచురితం అయింది. ఠాగూర్ జనగణమణను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ గీతం 1950 జనవరి 24 నుంచి అధికారికంగా వాడుకలోకి వచ్చింది.

జాతీయ గేయం:
Bavitha జాతీయ గేయం వందేమాతరంను బంకించంద్ర చటర్జీ బెంగాలీలో రాసిన ‘ఆనంద్‌మఠ్’ అనే నవల నుంచి గ్రహించారు. ఆనంద్‌మఠ్ నవల 1982లో ప్రచురింపబడింది. ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు. అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. వందేమాతరం గేయాన్ని జనవరి 24, 1950లో మన రాజ్యంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.

జాతీయ ప్రతిజ్ఞ:
Bavitha 'భారత దేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు...'అనేమన ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించారు. సుబ్బారావు విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. దీనిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందచేశారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ ఖరీం చాగ్లా అధ్యక్షతన జరిగిన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞ స్వీకరించి ఇతర భాషల్లోకి అనువాదం చేయించారు. 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో తొలిసారిగా ప్రతిజ్ఞ చేయించగా 1965 జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చింది.

జాతీయ జంతువు:
Bavitha జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి). ఇది కేవలం భారత ఉపఖండంలో మాత్రమే కనిపిస్తుంది. శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ (లిన్నెయస్). దీనిని 1972లో జాతీయ జంతువుగా గుర్తించారు. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1973 నుంచి ప్రాజెక్టు టైగర్ అనే పులుల సంరక్షణ పథకాన్ని చేపట్టారు. పులి అనేది శక్తికి , దైర్యానికి ప్రతీక.

జాతీయ పక్షి:
Bavitha భారత జాతీయ పక్షి నెమలి. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటన్. 1964లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది. 1972నుంచి నెమలిని వేటాడటం నిషేధించారు.



జాతీయ పుష్పం:
Bavitha జాతీయ పుష్పం తామర పువ్వు లేదా కమలం. దీని శాస్త్రీయ నామం నిలుంబో నూసిఫెరా గెర్టాన్. కమలం దైవత్వం, స్వచ్ఛత, జ్ఞానం, సంపదకూ ప్రతీక. ఇది జలాశయాలలో బురద, నాచుల మధ్య పెరుగుతుంది.



జాతీయ వృక్షం:
Bavitha జాతీయ వృక్షం మర్రి చెట్టు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. దీనికి భారత సాహిత్యం, వైద్య శాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. దీని ప్రస్తావన పురాణాలు, ఇతిహాసాలలో కూడా ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి చెట్టు 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి 450 సంవత్సరాలనాటిది. అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి 1989లో గిన్నీస్ బుక్ రికార్డుల్లో చేరింది. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు.

జాతీయ క్రీడ:
Bavitha జాతీయ క్రీడ హాకీ. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరు సార్లు ఒలింపిక్స్‌లో మన దేశమే హాకీ చాంపియన్‌గా నిలిచింది. దీంతో అప్పటినుంచి హకీ జాతీయ క్రీడగా ఉంది. అయితే హాకీ నిజంగా మన జాతీయ క్రీడ కాదు. 2012లో ఐశ్వర్య అనే పదేళ్ల బాలిక సమాచార హక్కు చట్టం కింద కోరగా హాకీకి జాతీయ క్రీడ హోదా లేదని కేంద్రం తెలిపింది. భారత హాకీ క్రీడాకారుడు ద్యాన్‌చంద్ పుట్టిన రోజు ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు.

జాతీయ ఫలం:
Bavitha జాతీయ ఫలం మామిడి పండు. దీని శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. ఈ ఫలానికి భారతీయ సంస్కృతితో ఎనలేని సంబంధం ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు దొరుకుతాయి. మామిడిని ప్రపంచంలో అత్యధికంగా మన దేశమే సాగు చేస్తుంది. ఎ, సి, డి విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి. బీహార్‌లోని దర్భాంగాలో మొఘల్ చక్రవర్తి అక్బర్ లక్ష మామిడి చెట్లను నాటించాడు. ప్రస్తుతం ఆ తోటను లఖీబాగ్‌గా పిలుస్తున్నారు.

జాతీయ నది:
Bavitha జాతీయ నది గంగానది. దేశంలో అత్యంత పొడవైన గంగానదిని 2008 నవంబర్ 5న జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో 2,525 కిలోమీటర్ల మేర ప్రవహించి, పద్మ పేరుతో బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. ఈ నది హిందూవులకు ఎంతో పవిత్రమైనది. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు ఇందులో కలుస్తాయి. గంగానదిని శుభ్ర పరచడానికి నమామి గంగే మిషన్‌ను 2016 జూలై 7న ప్రారంభించారు.

జాతీయ జలచరం(అక్వాటిక్ యానిమల్):
Bavitha కేంద్ర ప్రభుత్వం డాల్ఫిన్ ను 2009 అక్టోబరులో జాతీయ జలచరంగా గుర్తించింది. దీని శాస్త్రీయ నామం ప్లాటినెష్టా గాంజెటికా. డాల్ఫిన్‌ను భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972లోని షెడ్యూల్-1లో చేర్చారు. జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం నేరం.

జాతీయ కరెన్సీ- రూపాయి
Bavitha కరెన్సీ మీద దేవనాగరి లిపిలో ముద్రించిన 'ర' అనే అక్షరమే భారత జాతీయ కరెన్సీ చిహ్నం. దీనిని 2010, జులై 15న భారత ప్రభుత్వం గుర్తించింది.


జాతీయ పంచాంగం:
Bavitha చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణతో ముగిసే శక యుగం పంచాంగాన్ని మన ప్రభుత్వం 1957, మార్చి 22న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365/366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్‌తో పాటు దేశీయ కేలండర్‌ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.

జాతీయ భాష:
Bavitha భారత ప్రభుత్వం1950లోఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా ప్రకటించింది.



జాతీయ వారసత్వ జంతువు
Bavitha మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. దీనిని 2010లో ప్రకటించారు.
 




జాతీయ కాలమానం
Bavitha 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుంది.
Published date : 02 Jun 2018 01:23PM

Photo Stories