Best Moments in India 2022 : భారత్‌లో 2022లో జరిగిన చరిత్మ్రాక మెరుపులు ఇవే..
సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్‌భంజ్ జిల్లాకు చెందినవారు.
☛ భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది.
☛ భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది.
☛ దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్‌బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది.
☛ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి.