13వ ప్రవాసీ భారతీయ దివస్
Sakshi Education
మహాత్మాగాంధీ వందేళ్ల కిందట 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2003 నుంచి ఏటా ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జనవరి 9వ తేదీని ‘ప్రవాసీ భారతీయ దివస్’గా ప్రకటించారు.
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశాల్లోని భారత సంతతి ప్రజలు మనదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడాన్ని ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో గుర్తు చేసుకుంటారు. దీంట్లో భాగంగా భారత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులనిచ్చి సత్కరిస్తారు. ఇప్పటివరకు 13 ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులు నిర్వహించారు.
పదమూడో ప్రవాసీ భారతీయ దివస్
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశాల్లోని భారత సంతతి ప్రజలు మనదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడాన్ని ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో గుర్తు చేసుకుంటారు. దీంట్లో భాగంగా భారత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులనిచ్చి సత్కరిస్తారు. ఇప్పటివరకు 13 ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులు నిర్వహించారు.
పదమూడో ప్రవాసీ భారతీయ దివస్
- గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో 13వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు వేల మంది ఎన్‌ఆర్‌ఐలు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజలు హాజరయ్యారు. భారత సంతతికి చెందిన గయానా అధ్యక్షుడు డోనాల్డ్ రవీంద్రనాథ్ రామోతర్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గయానా దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం.
- విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తొలి రోజు (జనవరి 7న) యువ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను ప్రారంభించారు. ‘భారత్ కో జానో, భారత్ కో మానో’ అనే నినాదంతో యువ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. యువ ప్రవాసీ భారతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్; యువజన, క్రీడామంత్రి సర్బానంద సొనొవాల్; విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్; బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ ప్రసంగించారు.
- భారత ప్రధాని నరేంద్ర మోదీ 13వ ప్రవాసీ భారతీయ దివస్‌ను గాంధీనగర్‌లోని ‘మహాత్మా మందిర్’లో జనవరి 8న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ స్మారక నాణేలను ఆవిష్కరించారు. రూ. 10, రూ. 100 స్మారక నాణేలను, రూ. 5, రూ. 25 విలువైన స్టాంపులను ప్రధాని ఆవిష్కరించారు. ప్రవాస భారతీయులు మన దేశానికి విలువైన పెట్టుబడి అని, భారతదేశాభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడాన్ని మోదీ ప్రస్తావించారు. తన ప్రతిపాదనకు ఐరాసలోని 193 దేశాల్లో 177 దేశాలు మద్దతివ్వగా.. అందులో 40 ఇస్లామిక్ దేశాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన ఆమోదంతో ప్రపంచానికి భారత్‌పై ఉన్న ప్రేమ తెలుస్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గంగా ప్రక్షాళన అత్యంత ముఖ్యమైన అంశమని, దీంట్లో ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్‌కలోని మేడిసన్ స్క్వేర్‌లో చెప్పిన ప్రకారం.. భారత సంతతి ప్రజలు (పీఐఓ), విదేశాల్లోని భారత పౌరులు (ఓసీఐ) ఈ రెండు వర్గాలను విలీనం చేస్తూ ఆర్డినెన్‌స జారీ చేశామని చెప్పారు. దీనివల్ల వీరికి జీవితకాల వీసా లభిస్తుంది.
- మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో రూపొందించిన ప్రదర్శనశాల ‘దండి కుటీర్’ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ చేపట్టిన దండి సత్యాగ్రహానికి గుర్తుగా 41 మీటర్ల ఎత్తయిన ఉప్పు గుట్టను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో గాంధీ జీవిత ఘట్టాలను శిల్పరూపంలో ప్రదర్శించారు. ప్రవాస భారతీయులు భారత దేశం గురించి మరింతగా తెలుసుకునేందుకు ఏటా ‘భారత్ కో జానో’ పేరుతో క్విజ్ పోటీని నిర్వహించుకోవాలని సూచించారు.
- కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ‘భారత్‌లో అవకాశాలు’ అనే సదస్సులో ప్రసంగించారు.
- ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలు జనవరి 9న ముగిశాయి. చివరి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రుల సదస్సులో ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రవాస భారతీయులను విజ్ఞప్తి చేశారు.
- 13వ ప్రవాసీ భారతీయ దివస్ ముగింపు సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 15 మందికి ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేశారు. దీనికి సత్యనాదెళ్ల హాజరు కాలేదు.
- డోనాల్డ్ రవీంద్రనాథ్ రామోతర్ - గయానా దేశాధ్యక్షుడు.
- మాలా మెహతా - ఆస్ట్రేలియాలో హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
- సంజయ్ రాజారాం - భారత్‌లో జన్మించిన మెక్సికన్ వ్యవసాయ శాస్త్రవేత్త. 2014 ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత.
- కన్వల్‌జిత్‌సింగ్ భక్షి - న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడు.
- ఎస్సోప్ గులామ్ పహాద్ - దక్షిణాఫ్రికా రాజకీయ నాయకుడు.
- మహేంద్ర నాంజీ మెహతా - ఉగాండాలో వ్యాపారవేత్త.
- నాథ్ రాం పూరీ - యూకే.
- లార్‌డ రాజ్ లుంబా - యూకేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు.
- కమలేష్ లుల్లా - అమెరికాలో విఖ్యాత రోదసీ శాస్త్రవేత్త.
- నందినీ టండన్ - అమెరికా.
- రాజ్‌మల్ పరఖ్ - ఒమన్.
- దురైకన్ను కరుణాకరన్ - సెషెల్స్.
- షా భరత్ కుమార్ జయంతీలాల్-యూఏఈ.
- అష్రాఫ్ పాలార్ కున్నుమల్ - యూఏఈ
- సత్యనాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈవో, యూఎస్‌ఏ.
- ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రెండున్నర కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 25 లక్షల మంది నివసిస్తున్నారు.
- ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న దేశాలు.. అమెరికా, మలేషియా, కెనడా, ట్రినిడార్ అండ్ టొబాగో, గయానా, యునెటైడ్ కింగ్‌డమ్, ఫ్రాన్‌స, సురినామ్, నెదర్లాండ్‌స, కువైట్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రేన్, ఖతర్, ఒమన్, యెమెన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఫిజీ, దక్షిణాఫ్రికా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.
ఇప్పటి వరకు ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలు జరిపిన సంవత్సరం, ప్రదేశాల వివరాలు..
క్ర.సం. | సంవత్సరం | ప్రదేశం |
1. | 2003 | న్యూఢిల్లీ |
2. | 2004 | న్యూఢిల్లీ |
3. | 2005 | ముంబై |
4. | 2006 | హైదరాబాద్ |
5. | 2007 | న్యూఢిల్లీ |
6. | 2008 | న్యూఢిల్లీ |
7. | 2009 | చెన్నై |
8. | 2010 | న్యూఢిల్లీ |
9. | 2011 | న్యూఢిల్లీ |
10. | 2012 | జైపూర్(రాజస్థాన్) |
11. | 2013 | కొచ్చి (కేరళ) |
12. | 2014 | న్యూఢిల్లీ |
13. | 2015 | గాంధీనగర్(గుజరాత్) |
Published date : 19 Jan 2015 01:20PM