Skip to main content

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం (పీఎమ్‌ ఫసల్‌ భీమా యోజనా)

పీఎమ్‌ ఫసల్‌ భీమా యోజనను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13, 2016న ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన–PMFBY పథకాన్ని ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం.
ఎందుకు?
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా, విత్తమద్దతు అందించడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచి తద్వారా వ్యవసాయంలో కొనసాగేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించే విధంగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినదే వైఎస్సార్‌– పీఎమ్‌ ఫసల్‌ భీమా యోజనా పథకం. రైతు విత్తు నాటడం దగ్గరి నుంచి పంట చేతికొచ్చేవరకూ ఎప్పుడు నష్టంవాటిల్లినా ఈ పథకం ద్వారా బీమా లభిస్తుంది.

ఏవిధంగా అమలు చేస్తారు?
బహుళ ఏజెన్సీ ఫ్రేంవర్క్‌ ద్వారా అంటే.. భారతప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీల సమన్వయంతో ఎంపిక చేసిన బీమా కంపెనీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు.

అర్హులెవరు?
ఈ పథకానికి రైతులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు తీసుకుని పంటలు పండిస్తున్నవారికి కూడా ఈ పథకం వర్తిసుంది.అన్ని రకాల ఆహారపంటలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

రైతుల్లో ఈ పథకంపట్ల ఆనాసక్తి ఎందుకు?
బీమా ప్రీమియం చెల్లించడమే కానీ నష్టపోయినప్పుడు డబ్బులు వచ్చిన దాఖలాలు తక్కువేనని రైతులు ఈ పథకం పట్ల సానుకూలంగా లేకపోవడంవల్ల ఏటా పంటలను నష్టపోయిన రైతుల్లో కొంతమంది ఆత్మ హత్యలకు సైతం తెగబడుతున్నారు. దీనితో కొన్ని సంవత్సరాలుగా బీమా సదుపాయం కల్పిస్తున్నా రైతులు మాత్రం అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి సైతం ముందుకు రావడం లేదు. అంతేకాకుండా గతంలో పంటలు నష్టపోయినప్పుడు బీమా సొమ్మును అందించేందుకు బీమా సంస్థలు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో బీమా చేయించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శించేవారు.

ఏమిటీ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం?
ఆరుగాలం కష్టపడి తీరా పంటచేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరిత్యాలతో కలిగే పంటదిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతుకు అండగా ఉండేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి, రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశ్యంతో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని (YSR Free Crop Insurance Scheme) డిసెంబర్‌ 5, 2020న ప్రవేశపెట్టింది. ప్రతీ గ్రామంలో సాగుచేసిన పంటవివరాలను వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సదుసాయం కల్పించడంతోపాటు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయినప్పుడు ఆ పరిహారం అంచనా వేసి, లబ్ధిదారులైన రైతుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. అంతేకాకుండా, రైతులకు బీమా ప్రీమియం గుదిబండ కాకూడదని, పంటనష్టం జరిగితే బీమా వస్తుందనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించడానికి, ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టి, నష్టపోయిన రైతుకు ఆర్థికచేయూతనిచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటలతోపాటు, మత్స్య పెంపకం రైతులకు కూడా బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా, దిగుబడి ఆధారంగా 21 రకాల పంటలు, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలను ఆక్టోబర్‌ 8, 2020న పంటల బీమా పరిధిలోకి తెచ్చింది. సీజన్‌ ముగియగానే బీమా సొమ్ము రైతు చేతికి అందేలా రూ. 101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఐసీఎల్‌)ను కూడా ఏర్పాటు చేశారు.

గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతుకూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో నెల రోజుల్లోపే బీమా ప్రీమియం చెలింపులు జరుగుతాయి. అలా జరిగినప్పుడే బీమా పరిహారం సమయానికి అందుతుంది. ప్రీమియం సొమ్ము కట్టలేక, కట్టినా భీమా సొమ్ము సకాలంలో వస్తుందో రాదో అనే అపనమ్మకంతో ఎంతోమంది రైతులు ఈ పథకానికి దూరంగా ఉండేవారు. దీంతో రైతుపై పైసా కూడా ఆర్థిక భారం పడకూడదని, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి, మొత్తం ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకుని ఉచిత పంట భీమా అమలు చేస్తుంది.

సాధారణంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
ఖరీఫ్‌ (ఆహార ధాన్యాలు, నూనె గింజల) పంటలకు 2% ప్రీమియం, రబీ (ఆహార ధాన్యాలు, నూనె గింజల) పంటలకు 1.5% ప్రీమియం చెల్లించాలి. పిఎమ్‌ఎఫ్‌బివై పథకం వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో రైతులు 5% ప్రీమియం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ రైతులు కట్టిన ప్రీమియం ఎంత?
  • 2017–18లో ఎకరాకు రూ. 560
  • 2018–19లో ఎకరాకు రూ.480
  • 2019–20లో ఎకరాకు రూ.1
  • 2020–21 నుంచి ఉచితం

ఉచిత బీమా పథకం ఈ విధంగా అమలు అవుతుంది...
  • 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి రైతులు, కేంద్రం తమవంతు ప్రీమియం చెల్లించినా, అప్పటి ప్రభుత్వం చెల్లించకుండా బకాయిపడిన రూ.122.61కోట్లు చెల్లించి, నాటి పంటల నష్టానికి సంబంధించిన 5.94 లక్షల రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు జూన్‌ 26, 2020న ప్రభుత్వం జమ చేసింది.
  • 2019–20 ఖరీఫ్‌ పంటల నష్టానికి సంబంధించి 49.81 లక్షల మంది రైతులు 45.96 లక్షల హెక్టార్లకు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంతో పాటు, ప్రభుత్వం తనవాటాగా చెల్లించాల్సిన రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971.23 కోట్లు భీమా కంపెనీలకు చెల్లించింది.
  • 2019–20 పంట నష్టాన్ని తొలిసారిగా ఏడాది తిరక్కుండానే పరిహారాన్ని 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల బీమాను డిసెంబర్‌ 15, 2020న జమ చేసింది.
  • 2020–21 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1820.23 కోట్ల భీమా పరిహారాన్ని మే 25, 2021న నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసింది.

పరిహారాన్ని ఎలా అంచనా వేస్తారంటే..
  • దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి పంట కోత ఫలితాల ఆధారంగా బీమా యూనిట్‌ పరిధిలో వాస్తవ దిగుబడిని అంచనా వేస్తారు.
  • ఏడు సీజన్లతో ఉత్తమమైన ఐదు సీజన్ల సరాసరి దిగుబడినీ హామీ దిగుబడిగా భావించి దానికంటే వాస్తవ దిగుబడి తక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన సంగర్భంలో నష్ట పరిహార స్థాయిని లెక్కిస్తారు. ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తారు.
  • వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి ఏపీఎస్‌డీపీఎస్, ఐఎండీ వాతావరణ కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్‌ గేజ్‌ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తారు. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి ఉధృతి, తేమ వంటి అంశాల ఆధారంగా పరిహారాన్ని లెక్కిస్తారు.

విత్తన దశ నుంచి కోత వరకూ నిలిచిన పంటలు ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, తెగుళ్ళ వడగళ్ళు, కొండచరియలు, మేఘాల విస్ఫోటనం, పిడుగుల వల్ల పంట నష్టపోయిన రైతు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్‌ ఆఫీసర్‌కు లేదా క్రాప్‌ ఇన్య్సూరెన్స్‌ యాప్‌లో రిపోర్ట్‌ చేయడం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు అకౌంటుకు బీమా డబ్బు వస్తుంది.

పంటల సేకరణలో రైతుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 155251 నంబర్‌తో ప్రత్యేకకాల్‌ సెంటర్‌ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Published date : 12 Jun 2021 03:40PM

Photo Stories