Skip to main content

తెలంగాణకు భారీ మిగులు ఆదాయం

కేంద్ర పన్నుల వాటా లేకున్నా ఢోకా లేదు<br/> కేంద్రం వాటా చేరితే 4 రెట్ల మిగులు
2020 నాటికి రూ.34,252 కోట్ల మిగులు ఆదాయం
14వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడి

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మిగులు ఆదాయానికి ఢోకా లేదు. రెవెన్యూ ఆదాయం... వ్యయాల ఆధారంగా అయిదేళ్ల తర్వాత తెలంగాణలో రూ. 34,252 కోట్ల మిగులు ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం లెక్కగట్టింది. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.15,003 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఏటేటా మిగులు ఆదాయం దాదాపు 20 శాతం చొప్పున పెరుగుతుందని లెక్కలేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా రాకున్నా తెలంగాణలో మిగులు ఆదాయమే ఉంటుందని.. రెవెన్యూ ఆదాయం సమృద్ధిగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదికలో రాష్ట్రాల వారీగా రాబోయే అయిదేళ్లకు సంబంధించిన రెవెన్యూ ఆదాయ, వ్యయాల వివరాలను పొందుపరిచింది. దీని ప్రకారం కేంద్రం ఇచ్చే పన్నుల వాటా లేకుండానే... తెలంగాణ రాష్ట్రానికి 2015-16 సంవత్సరంలో రూ. 818 కోట్ల మిగులు ఆదాయం ఉంటుంది. అయిదేళ్ల తర్వాత రూ. 8,902 కోట్లకు చేరుతుంది.

రూ. 3.9 లక్షల కోట్లకు పైగా ఆదాయం..
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పన్నులు... పన్నేతర రాబడుల ద్వారా రాబోయే అయిదేళ్లలో తెలంగాణకు రూ. 3,91,256 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.3,69,284 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం పన్నుల వాటాతో సంబంధం లేకుండా సొంతంగా రాష్ట్రంలో సమకూరే రాబడి.. ఖర్చుల వివరాలను అందులో పొందుపరిచింది.

అధిక మొత్తం వడ్డీలకే..
ఇదిలా ఉండగా, ఏళ్లకేళ్లుగా ఉన్న అప్పుల భారం తెలంగాణను వెంటాడుతోంది. గతంలో ఉన్న అప్పులకు చెల్లించే వడ్డీలకే ప్రభుత్వం ఏటా వేలాది కోట్లు కుమ్మరించక తప్పని పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7,057 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019-20 నాటికి ఈ వడ్డీల భారం రూ.12,869 కోట్లకు చేరనుంది. దీంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు భారీగానే ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.8,686 కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. 2019-20 నాటికి పెన్షన్ల భారం రూ.12,969 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

తెలంగాణ మిగులు ఆదాయం (రూ. కోట్లలో)

ఆర్థిక సంవత్సరం

సొంత పన్నులతో

కేంద్ర పన్నుల వాటా కలిపితే

2015-16

818

15,003

2016-17

2,184

18,554

2017-18

3,930

22,846

2018-19

6,138

28,023

2019-20

8,902

34,252



తెలంగాణ రెవెన్యూ ఆదాయ, వ్యయాలు(రూ.కోట్లలో)

ఆర్థిక సంవత్సరం

ఆదాయం

వ్యయం

2015-16

57,426

56,607

2016-17

66,340

64,156

2017-18

76,641

72,711

2018-19

88,546

82,408

2019-20

1,02,304

93,402

Published date : 26 Feb 2015 01:11PM

Photo Stories