Skip to main content

ద్రవ్య బాధ్యత, బడ్జెట్ యాజమాన్య చట్టం

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ యాజమాన్య చట్టం’ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్-ఎఫ్‌ఆర్‌బీఎం)ను రూపొందించారు.
అధిక ద్రవ్యలోటు ద్రవ్యోల్బణానికి దారితీసి తద్వారా వినియోగం తగ్గుతుందని ఆర్థిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోటును తగ్గించుకునే చర్యలో భాగంగా 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం 2004లో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది.

చట్టం ఆవశ్యకత ఏమిటి?
ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ సూచనల్లో భాగంగా కేంద్ర నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే వనరుల ప్రక్రియలో రాష్ర్ట ప్రభుత్వాలు విధిగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఆమోదించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం మాదిరిగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ‘లోటు నియంత్రణ యంత్రాంగాన్ని’ ఏర్పాటు చేసుకున్నాయి. సాధారణంగా మన దేశంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం.. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల నుంచి వైదొలగడానికి ఒక సాధనంగా ఉపకరిస్తోంది. చట్టం దీర్ఘకాల లక్ష్యాలతో పాటు వాటి సాధనకు వార్షిక లక్ష్యాలను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రాలు తమ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతం మేరకు అప్పులు తెచ్చుకొనే వీలుంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో ఎన్‌సీఎంపీ..
సమగ్రమైన లోటు తగ్గింపు వ్యూహం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య అసమతౌల్యాన్ని పూర్తిగా తొలగించగలమని ఎన్‌సీఎంపీ (నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్) భావించింది. వాస్తవంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రూపొందించిన తర్వాత ప్రభుత్వం తన లక్ష్యాల సాధనకు చేసిన ప్రయత్నం సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుత కాలంలో జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)వృద్ధిరేటు, పన్ను-జీడీపీ నిష్పత్తిలో మంచి వృద్ధి సాధించడమే కాకుండా.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం లక్ష్యాల సాధనలో భాగంగా అన్ని విధాలైన లోటులను తగ్గించుకోగలిగింది.

ప్రయోజనాలేమిటి?
ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో జీడీపీలో భాగంగా ముఖ్య రంగాలపై చేసే ప్రభుత్వ వ్యయం తగ్గడం కూడా గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వ మొత్తం అభివృద్ధి వ్యయం జీడీపీలో 11 శాతం నుంచి 7 శాతం కన్నా తగ్గింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం లాంటి రంగాలకు వనరుల కేటాయింపు పెంపుదలకు ప్రయత్నించినప్పటికీ.. ఎన్‌సీఎంపీ అవసరాల కన్నా ఆ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల విత్త సమస్యలు పెరిగాయి. ఈ చట్టం కాలంలో సాంఘిక, ఆర్థిక సేవలకు సంబంధించిన అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాల వనరుల పంపిణీ గణనీయంగా తగ్గింది. జీడీపీలో రెవెన్యూ వ్యయం మొత్తం సాంఘిక, ఆర్థిక రంగాలైన విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల లాంటి రంగాల్లో తగ్గింది. ఈ చట్టం అమలులో ఉన్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీలో తగ్గుదల కన్పించింది.

ప్రభుత్వాల బాధ్యత ఏమిటి?
  • అభిలషణీయ ద్రవ్య విధానంతో పాటు కోశపరమైన ప్రోత్సాహకాలు అందించి, ఆయా రంగాలు తిరోగమనం వైపు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నించాలి.
  • ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను పెంచాలి.
  • ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం.. రెవెన్యూలోటు నిర్మూలించి, ద్రవ్యలోటు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రుణ సేకరణ ద్వారా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి.
  • రుణ నిర్వహణ సక్రమంగా జరిగేలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
  • తీసుకున్న రుణాన్ని ఉత్పాదక రంగాలపై వ్యయం చేస్తే.. భవిష్యత్తులో వృద్ధి రేటు పెరుగుతుంది.
  • తద్వారా వ్యవస్థలో తిరోగమనాన్ని అధిగమించవచ్చు. ఎగుమతుల విషయంలో.. డ్రాబ్యాక్ స్కీంకు సంబంధించి కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.
Published date : 15 Apr 2015 04:26PM

Photo Stories