Skip to main content

2017-18 ఆర్థిక సర్వే

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7- 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017-18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
జనవరి 29న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చే సింది. ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్‌టీ పూర్తి స్థాయిలో స్థిర పడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో భారీ కరెక్షన్ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది.

అంచనాలను మించే వృద్ధి...
ఈ ఆర్థిక సంవత్సరంలో (2017-18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016-17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014-15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది. 2017-18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్‌టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్‌‌స షీటు చర్యలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది.

సవాళ్లు పొంచి ఉన్నాయి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ 10-15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది. సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్‌ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది.

ఇవీ... ముఖ్యాంశాలు
  • 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు.
  • 2018-19లో ఇది 7-7.5%కి చేరుతుంది
  • చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం.
  • వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి.
  • పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్‌టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
  • రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
  • పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది.
  • 2017-18లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి.
  • 2017-18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి.
  • కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి.
  • స్వచ్ఛభారత్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి.
  • సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి.

ముఖ్యమైన గణాంకాలు..

జీడీపీ

6.5 (2017-18 ముందస్తు అంచనా)

టోకు ద్రవ్యోల్బణం

2.9 (2017-18 ఏప్రిల్ - డిసెంబర్)

స్థూల ద్రవ్యోల్బణం

3.2 (2017-18 బడ్జెట్ అంచనా)

విదేశీ వాణిజ్యం

విదేశీ ఎగుమతులు 12.1 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)

విదేశీ దిగుమతులు 21.8 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)

విదేశీ మారకపు నిల్వలు

409.4 బిలియన్ డాలర్లు(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)

ఆహార ధాన్యాల ఉత్పత్తి

134.7 మిలియన్ టన్నులు(2017-18 తొలి ముందస్తు అంచనా)


ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం
2017-18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.

డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు
పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.

ఎన్‌పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర
బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్‌‌స షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్‌‌స షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్‌‌స కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి.

మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే
ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది.

నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు
కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సిబ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు.

ఫండ్స్ పై పెరుగుతున్న మక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్‌‌సలో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్‌‌సపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్‌‌స పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్‌‌స పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్‌‌సలోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది.

వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి
పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) 2016-17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014-15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు.

ఇన్‌ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు
దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌ఐఐబీ), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి.

విదేశీయుల పర్యటనలు పెరిగాయి
పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ-వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి.

జీఎస్‌టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్
జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నుతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్‌టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్‌టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు.

ఎగుమతులూ పుంజుకుంటాయి..
అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది.

విదేశీ ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం
వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. జనవరి 29న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017-18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు.

విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది.

అంతర్రాష్ట్ర వాటాలు ఇలా..
అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది.

రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది.

ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది.
Published date : 30 Jan 2018 02:50PM

Photo Stories