Skip to main content

2021 Roundup: 2021లో అస్తమించిన టెక్ మేధావులు వీళ్లే..

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో వాడుకలోకి వచ్చినవి కొన్నైతే.. మెటావర్స్‌ లాంటి సంచలనానికి బీజం పడింది కూడా 2021లోనే!.
Tech pioneers we lost in 2021
Tech pioneers we lost in 2021

ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో టెక్‌ రంగానికి విశిష్ట సేవలు అందించిన దిగ్గజాలు కొందరు తనువు చాలించారు. ఏడాది ముగింపు సందర్భంగా వాళ్లను, వాళ్ల సేవలను ఓసారి గుర్తు చేసుకుంటూ.. 

పర్సనల్‌ కంప్యూటర్‌ సృష్టికర్త..

సిన్‌క్లెయిర్‌


బ్రిటిష్‌ ఇన్వెంటర్‌ సర్‌ క్లయివ్‌ సిన్‌క్లెయిర్‌. జీఎక్స్‌(ZX) స్పెక్ట్రమ్‌ కంప్యూటర్‌ సృష్టికర్త. ఫస్ట్‌ పర్సనల్‌ కంప్యూటర్‌గా దీనికంటూ ఓ పేరుంది. అంతేకాదు కంప్యూటర్‌ వీడియో గేమ్‌లు, కోడింగ్‌ లాంటి విషయాల్ని జనాలకు దగ్గర చేసింది కూడా ఇదే. ఒకరకంగా ఇళ్లలో కంప్యూటర్‌ల వాడకానికి మూలకారకుడు ఈయనే. 1983లో సిన్‌క్లెయిర్‌కు నైట్‌హుడ్‌ గౌరవం దక్కింది. 1985లోనే బ్యాటరీతో నడిచే సింగిల్‌ సీటర్‌ వెహికిల్‌ C5ను ఈయన రూపొందించినప్పటికీ.. సేఫ్టీ కోణంలో ఆ వెహికిల్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌ దృష్టిని ఆకర్షించలేకపోయింది. 2021 సెప్టెంబర్‌లో 81 ఏళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యంతో సర్‌ క్లైవ్‌ సింక్లెయిర్‌ కన్నుమూశారు. 

వీడియో గేమ్‌ రారాజు..

మసయుకి యుయిమురా


మసయుకి యుయిమురా.. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్‌లకు ఊపు తెచ్చిన మేధావి. జపాన్‌కు చెందిన ఈ గేమింగ్‌ ఇంజినీర్‌.. ప్రఖ్యాత గేమింగ్‌ కంపెనీలైన నిన్‌టెండో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌, సూపర్‌ నిన్‌టెండో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌లో పాపులర్‌ గేమ్స్‌ రూపకర్తగా పేరుగాంచాడు. విశేషం ఏంటంటే.. 1981లో అప్పటి నిన్‌టెండో అధ్యక్షుడు యమౌచీ కోరిక మేరకు క్యాట్రిడ్జ్‌లలో సైతం గేమ్‌లు ఆడేలా వీడియో గేమింగ్‌ వ్యవస్థను డిజైన్‌ చేశాడు మసయుకి. అంతేకాదు 80వ దశకంలో నిన్‌టెండ్‌ను అమెరికాలో టాప్‌ గేమింగ్‌ కంపెనీల్లో ఒకటిగా నిలిపాడు. మూడు దశాబ్దాలపాటు నిన్‌టెండ్‌తో సాగిన ఆయన అనుబంధం.. 2004తో ముగిసింది. అప్పటి నుంచి ఆయన రిట్సుమెయికన్‌ యూనివర్సిటీలో గేమ్‌ స్టడీస్‌ పాఠాలు చెప్తూ వచ్చారు. చివరికి.. ఈ డిసెంబర్‌లోనే 78 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. 

అడోబ్‌, పీడీఎఎఫ్‌ రూపకర్త..

ఛార్లెస్‌ మాథ్యూ గెస్చ్‌క్లె


ప్రపంచంలో అతిపెద్ద సాప్ట్‌వేర్‌ కంపెనీల లిస్ట్‌లో(300 బిలియన్‌ డాలర్ల) ఉంది అడోబ్‌.  టెక్‌ దిగ్గజం జాన్‌ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ను స్థాపించాడు ఛార్లెస్‌ మాథ్యూ గెస్చ్‌క్లె. అంతేకాదు ఈయన పోర్టబుల్‌ డాక్యుమెంట్‌ ఫైండర్‌ (PDF) సహ రూపకర్త కూడా. 

చక్‌ అని ముద్దుగా పిల్చుకునే ఈ అమెరికన్‌ టెక్‌ దిగ్గజం.. వార్నోక్‌తో కలిసి 1982లో అడోబ్‌ PostScript(ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌) ఉత్పత్తి ద్వారా డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌ పరిశ్రమలో సంచలనానికి తెరలేపారు. ఆ తర్వాత అడోబ్‌ ప్రొడక్టులు సృష్టించిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు.  1992లో ఇద్దరు దుండగులు ఆయన్ని కిడ్నాప్‌ చేయగా.. ఆయన సురక్షితంగా బయటపడి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో  81 ఏళ్ల వయసులో చక్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. 

టేప్‌ రికార్డ్‌.. ఆడియో క్యాసెట్‌..

లొయు ఒటెన్స్‌


లొయు ఒటెన్స్‌.. డచ్‌ ఇంజినీర్‌. కానీ, పుట్టింది బెర్లిన్‌లో.  క్యాసెట్‌ టేప్‌ తయారు చేసిన మహా మేధావి. అంతేకాదు సుదీర్ఘ కాలం పిలిప్స్‌ కంపెనీలో పని చేసిన ప్రొడక్ట్‌ ఇంజినీర్‌గా కూడా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఈ కాలంలోనే ఆయన ఎన్నో సంచలన ఆవిష్కరణలకు మూలం అయ్యాడు.

పిలిప్స్‌ కంపెనీ నుంచి పోర్టబుల్‌ టేప్‌ రికార్డ్‌ మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది ఈయన హయాంలోనే. అయితే ఒట్టెన్‌ కెరీర్‌లో సంచలనం మాత్రం.. 1963(ఆగష్టు) బెర్లిన్‌ ఎలక్ట్రానిక్ ఫెయిర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆడియో క్యాసెట్‌ రిలీజ్‌ కావడం. ఆ తర్వాతే ఈ ఐడియాను జపాన్‌ కంపెనీలు కాపీ కొట్టాయి. అయితే ఒట్టెన్‌ చొరవతో ప్రపంచ మార్కెట్‌లో సోనీ, పిలిప్స్‌ క్యాసెట్లు స్టాండర్డ్‌ మోడల్స్‌గా నిలవగలిగాయి. డెబ్భై దశకంలో కాంపాక్ట్‌ డిస్క్‌(CD) టెక్నాలజీ డెవలప్‌ చేయించింది ఈయనే. ఈ ఏడాది మార్చ్‌లో ఆయన నెదర్లాండ్స్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.
 

ప్రపంచంలోనే మొట్టమొదటి..

జాన్‌ మెక్‌అఫీ


మెక్‌అఫీ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్తగా జాన్‌ మెక్‌అఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన మెక్‌అఫీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్‌ యాంటీ వైరస్‌ను(1987)లో రూపొందించాడు. తద్వారా సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలోనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ లెగసీని ఆయన ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు. 

2011లో ఇంటెల్‌ కంపెనీ ఏకంగా 7.68 బిలియన్‌ డాలర్లు చెల్లించి.. మెక్‌అఫీ యాంటీ వైరస్‌ హక్కుల్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆయన పతనం మొదలైంది. 

రాసలీలలు, డ్రగ్స్‌, తుపాకులు.. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌గా పేరున్న మెక్‌అఫీ..  టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు(అదనంగా ఓ హత్య కేసు విచారణ తప్పించుకునే క్రమంలో అరెస్టయ్యి).. బార్సిలోనా(స్పెయిన్‌) జైల్లో శిక్ష అనుభవించాడు. అయితే పన్నుల ఎగవేత నేరంపై ఆయన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైల్లో మగ్గిపోవడం ఇష్టం లేక అదేరోజు మెక్‌అఫీ (75) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published date : 20 Dec 2021 06:00PM

Photo Stories