Skip to main content

Apheresis: ‘బ్లడ్‌వాషింగ్‌’ అంటే?

All about Blood Washing
All about Blood Washing

కోవిడ్‌ తాలూకు కొన్ని దుష్ప్రభావాలు కొందరిలో సుదీర్ఘకాలం పాటు బాధిస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి బాధితులు తమ వెతలను తీర్చుకోడానికి యూరప్‌లోని చాలా దేశాల వాళ్లు జర్మనీకి వెళ్తున్నారు. కారణం... అక్కడ ‘బ్లడ్‌వాషింగ్‌’ అనే ప్రక్రియ అందుబాటులో ఉండటమే. అసలు బ్లడ్‌వాషింగ్‌ అంటే ఏమిటో తెలుసుకుందాం. 

Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్‌ ఉంటాయి?

బ్లడ్‌వాషింగ్‌ అంటే...?
నిజానికి ఇది ఇంకా పరిశోధనల దశలోనే ఉన్న చికిత్స ప్రక్రియ. ఇంకా ఎలాంటి ఆమోదమూ దొరకలేదు. ఈ ప్రక్రియలో బాధితుల తాలూకు సొంత రక్తాన్ని బయటకు తీస్తారు. ఇందులో ఉన్న కొవ్వులనూ, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగించే ప్రోటీన్లను వేరు చేసి, తొలగిస్తారు. అలా ‘శుద్ధి’చేశామని చెప్పే ఆ రక్తాన్ని మళ్లీ తిరిగి బాధితులకు ఎక్కిస్తారు. ఈ ప్రక్రియనే 
‘బ్లడ్‌వాషింగ్‌’ అని, వైద్యపరిభాషలో ‘ఎఫెరిసిస్‌’ అని అంటారు. ప్రస్తుతం ఈ చికిత్సను జర్మనీ, స్విట్జర్లాండ్, టర్కీలలో కొన్ని సంస్థలు  అందిస్తున్నాయి. దాంతో యూరప్‌లోని చాలా దేశాల నుంచి బాధితులు అక్కడికి క్యూ కడుతున్నారు. 
నిజానికి కొవ్వుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్య (లిపిడ్‌ డిజార్డర్‌)లకు ఈ ‘ఎఫెరిసిస్‌’ ప్రక్రియ చివరి ప్రత్యామ్నాయమని జర్మన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ చెబుతోంది. అయితే ‘లాంగ్‌ కోవిడ్‌’ బాధితులకు ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై ఎలాంటి పరిశోధనలూ (క్లినికల్‌ ట్రయల్స్‌) లేవు. అందుకే దీన్ని ఓ నమ్మకమైన చికిత్సగా నిపుణులు భావించడం లేదు. 

Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!

పొంచి ఉన్న ముప్పులు... 
పైగా ఎఫెరిసిస్‌ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. ఉదాహరణకు... రక్తస్రావం, రక్తం గడ్డకట్టే అవకాశం, ఇన్ఫెక్షన్ల ముప్పు, ఈ ప్రక్రియ కోసం ఉపయోగించే కొన్ని రసాయనాల (ఏజెంట్స్‌)తో రియాక్షన్‌ వంటి అనేక అనర్థాలు పొంచి ఉన్నాయి. ఏదో ఆశకొద్దీ ఈ చికిత్స చేయించుకున్న తర్వాత కూడా అనేక మంది బాధితులకు ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ పేర్కొంటోంది. పైగా ఇందుకోసం కొంతమంది బాధితులు తమ జీవితకాలపు సంపాదన అంతా ఖర్చు పెడుతున్నారు. 

also read: WHO: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

అంతేకాదు... కొంతమంది రోగులు ‘హైపర్‌ బారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ’ అనే చికిత్స కూడా తీసుకుంటున్నారు. కొన్ని ఛాంబర్లలో ఆక్సిజన్‌ను చాలా ఎక్కువ ఒత్తిడితో పంపి, దాన్ని పీల్చుకునేలా చేసే ప్రక్రియే ఈ ‘హైపర్‌బారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ’. మరికొందరైతే విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ అధికంగా, విచక్షణరహితంగా తీసుకుంటున్నారు. 

అయితే ఎఫిరిసెస్‌ ప్రక్రియలో రక్తంలోని కొవ్వులను తొలగించడం వల్ల అది జిగురు స్వభావాన్ని కోల్పోవడంతో, సాఫీగా
ప్రవహిస్తుందని, దాంతో లాంగ్‌కోవిడ్‌ బాధితుల్లో కనిపించే చిన్న చిన్న రక్తపుగడ్డలు (మైక్రోక్లాట్స్‌) తగ్గుతాయనీ, ఫలితంగా అనేక సమస్యలు తగ్గుతాయన్నది చికిత్స అందిస్తున్నవారి వాదన. ఎవరికీ నష్టం లేకుండా ఇప్పటికే ఎంతో మంది బాధలు నివారిస్తున్నందున... క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

Also read: టీకాతో సమూలంగా నిర్మూలింపబడిన వ్యాధి ఏది?

‘‘ఈ ప్రక్రియ మైక్రోక్లాట్స్‌ను నివారిస్తుందని చికిత్సకులు వాదిస్తున్నారు. అయితే ఇదెలా జరుగుతుందో ఎవరూ వివరించడం లేదు. దీనికి ఏ ఆధారమూ లేదు. లాంగ్‌ కోవిడ్‌ బాధితుల్లో మైక్రోక్లాట్స్‌ రావడం అన్నది అనర్థం లాంటి ఓ లక్షణం కావచ్చు. కానీ అసలు అవెలా ఏర్పడుతున్నాయో తెలుసుకోకుండా... ఇలా వాటిని తొలగించడాన్నే  ఓ చికిత్స అనుకోవడం అసంబద్ధమైన అంశం’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన రాబర్ట్‌ ఏరియన్స్‌ అనే వాస్క్యులార్‌ బయాలజీ ప్రొఫెసర్‌ పేర్కొంటున్నారు. దీనివల్ల కొన్ని గాయాలు, పుండ్ల నుంచి రక్తస్రావం కావడం, ముక్కు నుంచి రక్తస్రావం, మెదడులో రక్తస్రావం (బ్రెయిన్‌ హ్యామరేజ్‌) వంటి అనర్థాలు కలగవచ్చన్నది మరికొందరు నిపుణుల వాదన. అసలు లాంగ్‌కోవిడ్‌కు గల కారణాలే ఇంకా తెలియని నేపథ్యంలో ట్రయల్స్‌ జరగని ప్రక్రియలవైపు మొగ్గుచూపడం సరికాదన్నది చాలామంది వైద్యనిపుణుల అభిప్రాయం.

also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

Published date : 18 Jul 2022 05:19PM

Photo Stories