విశ్వ రహస్యాల చేధనాస్త్రం ‘ఆస్ట్రోశాట్’
పీఎస్‌ఎల్‌వీ సీ-30
పీఎస్‌ఎల్‌వీ సీ-30.. ఇస్రో ప్రయోగాల్లో 31వ పీఎస్‌ఎల్‌వీ. పీఎస్‌ఎల్‌వీ సీ-30ను ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో అధిక సామర్థ్యం ఉన్న స్ట్రాపాన్ బూస్టర్ మోటార్లు ఉంటాయి. పీఎస్‌ఎల్‌వీ సీ-30 మొత్తం బరువు 320 టన్నులు.
- సాధారణంగా పీఎస్‌ఎల్‌వీ 3 రూపాల్లో ఉంటుంది.
- పీఎస్‌ఎల్‌వీ జనరిక్: దీనిలో తక్కువ సామర్థ్యం ఉన్న ఆరు స్ట్రాపాన్ మోటార్లు ఉంటాయి. దీని బరువు 294 టన్నులు.
- పీఎస్‌ఎల్‌వీ-కోర్ అలోన్(పీఎస్‌ఎల్‌వీ-సీఏ): దీనికి స్ట్రాపాన్ మోటర్లు ఉండవు. దీని బరువు 230 టన్నులు. సాధారణంగా దీన్ని తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను ప్రయోగించటానికి ఉపయోగిస్తారు.
- పీఎస్‌ఎల్‌వీ- ఎక్స్‌ల్: అధిక బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించటానికి దీన్ని ఉపయోగిస్తారు.
ఆస్ట్రోశాట్
ఇది అత్యంత ఆధునిక ఖగోళశాస్త్ర ఉపగ్రహం. కేరళలోని ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రాల సహకారంతో ఇస్రో దీన్ని నిర్మించింది. పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్, ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కొన్ని విశ్వవిద్యాలయాలు, కెనడా, యూకేలోని కొన్ని సంస్థలు ఆస్ట్రోశాట్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సీ-30 నుంచి వేరుపడిన వెంటనే ఆస్ట్రోశాట్‌లోని రెండు సౌర ఫలకాలు తెరుచుకొని బెంగళూరులోని ఐఎస్‌టీఆర్‌ఏసీ(ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్) ఆస్ట్రోశాట్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది.
- ఆస్ట్రోశాట్‌లో 5 కీలకమైన సాంకేతిక పరికరాలు ఉన్నాయి.
- లార్జ్ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్ కౌంటర్: ఇది ఒక నాన్ ఇమేజింగ్ పరికరం. భిన్నంగా, స్వతంత్రంగా పని చేసే మూడు ప్రమాణాలు దీనిలో ఉంటాయి.
- అల్ట్రా వెలైట్ ఇమేజింగ్ టెలీస్కోప్: ఇందులో రెండు టెలీస్కోప్‌లు ఉంటాయి. వీటిలో మూడు స్వతంత్ర డిటెక్టరు వ్యవస్థలు ఉంటాయి.
- సాఫ్ట్ ఎక్స్ రే టెలీస్కోప్: సీసీడీ కెమెరా ఉన్న ఎక్స్‌రే టెలీస్కోప్ ఇది. ఫోటో కౌంటింగ్ మోడ్‌లో పనిచేస్తుంది. 0.3 నుంచి 8 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి పరిధిలో ఉన్న ఫోటాన్‌ల స్థితి, సమయం శక్తిని పరిశీలిస్తుంది.
- కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్: ఇది 10 నుంచి 100 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్‌ల పరిధిలో పనిచేసే ఒక ఎక్స్‌రే కోడెడ్ మాస్క్ కెమెరా.
- స్కానింగ్ స్కై మానిటర్: ఆకాశంలో ఎక్స్-రే కిరణాల మూలాలను అధ్యయనం చేస్తుంది.
- ఆస్ట్రోశాట్ జీవితకాలం 5 ఏళ్లు.
- గ్రహ వ్యవస్థలు, గెలాక్సీ, కృష్ణ బిలాల, ఇతర రోదసి నిర్మాణాల అధ్యయనాన్ని ఇది నిర్వహిస్తుంది.
- దీన్ని మినీ హబుల్ అంటున్నప్పటికీ హబుల్ జీవితకాలం ఎక్కువ.
- ఇప్పటి వరకు దీనికి 9 సార్లు సర్వీసింగ్ జరిగింది. హబుల్ టెలీస్కోప్ అధ్యయన అంశాలను అధిక సామర్థ్యంతో ఆస్ట్రోశాట్ నిర్వహించగలుగుతుంది.
- దీనిలో మల్టీ వేవ్ లెంత్ సామర్థ్యం ఉండటంతో ఎన్నో అంతరిక్ష రహస్యాలను చేధించేందుకు వీలవుతుంది.
పీఎస్‌ఎల్‌వీ విజయ ప్రస్థానం
పీఎస్‌ఎల్‌వీ నాలుగు దశల నౌక. దీని మొదటి, మూడో దశలలో ఘన ప్రొపల్లెంట్‌లను ఉపయోగిస్తారు. రెండు, నాలుగో దశల్లో ద్రవ ప్రొపల్లెంట్‌లను వినియోగిస్తారు. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమాన్ని ఇస్రో 1982లో ప్రారంభించింది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసి పరీక్షించింది. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించటానికి దీన్ని రూపొందించారు. పీఎస్‌ఎల్‌వీ సీ-30తోపాటు ఇప్పటివరకు 31 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను ఇస్రో నిర్వహించింది. 1993 సెప్టెంబరు 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 30 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన అతి తక్కువ రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించటానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.
విదేశీ ఉపగ్రహాలే ఎక్కువ
పీఎస్‌ఎల్‌వీ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించటంలో ఇస్రో సఫలమైంది. అంతరిక్ష సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించటానికి 1992లో ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-30 ప్రయోగంతోపాటు ఇప్పటివరకు ఇస్రో 84 ఉపగ్రహాలను ప్రయోగిస్తే ఇందులో 51 విదేశీ ఉపగ్రహాలు ఉండటం విశేషం. 1999లో పీఎస్‌ఎల్‌వీ-సీ2 ద్వారా ఇస్రో దేశీయ ఐఆర్‌ఎస్-పీ4 ఉపగ్రహంతోపాటు తొలిసారిగా కొరియా, జర్మనీలకు చెందిన విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. 2007లో పీఎస్‌ఎల్‌వీ సీ-8 ద్వారా ఇటలీకి చెందిన ఎజైల్ ఉపగ్రహాన్ని ప్రధాన పేలోడ్‌గా ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-10 ద్వారా తొలిసారిగా పూర్తి విదేశీ ఉపగ్రహం (ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సర్)ను ప్రయోగించారు. ఆ తర్వాత ఇలా అనేక వాణిజ్య విజయాలను ఇస్రో సొంతం చేసుకుంది. అత్యధికంగా జర్మనీకి చెందిన 10 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటివరకు ప్రయోగించిన 51 విదేశీ ఉపగ్రహాల ద్వారా సుమారు రూ.1500 కోట్లను ఇస్రో ఆర్జించింది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అవకాశాలు ఉన్నాయి.
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు
పీఎస్‌ఎల్‌వీ | ప్రయోగతేదీ | ప్రయోగించిన ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-డీ1 | సెప్టెంబర్ 20, 1993 | ప్రయోగం విఫలం (ఐఆర్‌ఎస్-1) |
పీఎస్‌ఎల్‌వీ-డీ2 | అక్టోబర్ 15, 1994 | ఐఆర్‌ఎస్-పీ2 |
పీఎస్‌ఎల్‌వీ-డీ3 | మార్చి 21, 1996 | ఐఆర్‌ఎస్-పీ3 |
పీఎస్‌ఎల్‌వీ-సీ1 | సెప్టెంబర్ 29, 1997 | ఐఆర్‌ఎస్ - 1డీ |
పీఎస్‌ఎల్‌వీ-సీ2 | మే 26, 1999 | ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ) |
పీఎస్‌ఎల్‌వీ-సీ3 | అక్టోబర్ 22, 2001 | టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌డ(జర్మనీ), ప్రోబా(బెల్జియం) |
పీఎస్‌ఎల్‌వీ-సీ4 | సెప్టెంబర్ 12, 2002 | కల్పన-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ5 | అక్టోబర్ 17, 2003 | ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌సశాట్-1) |
పీఎస్‌ఎల్‌వీ-సీ6 | మే 5, 2005 | కార్టోశాట్-1, హామ్‌శాట్ (Hamsat) |
పీఎస్‌ఎల్‌వీ-సీ7 | జనవరి 10, 2007 | కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండో నేసియా), పేహున్‌శాట్ (అర్జెంటీనా) |
పీఎస్‌ఎల్‌వీ-సీ8 | ఏప్రిల్ 23, 2007 | ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం) |
పీఎస్‌ఎల్‌వీ-సీ10 | జనవరి 21, 2008 | టెక్సార్ (ఇజ్రాయెల్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ9 | ఏప్రిల్ 28, 2008 | కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ- సీ11 | అక్టోబర్ 22, 2008 | చంద్రయాన్-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ12 | ఏప్రిల్ 20, 2009 | రీశాట్-2+అనుశాట్ |
పీఎస్‌ఎల్‌వీ-సీ14 | సెప్టెంబర్ 23, 2009 | ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-సీ15 | జూలై 12, 2010 | కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్ |
పీఎస్‌ఎల్‌వీ-సీ16 | ఏప్రిల్ 20, 2011 | రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ17 | జూలై 15, 2011 | జీశాట్12 |
పీఎస్‌ఎల్‌వీ-సీ18 | అక్టోబర్ 12, 2011 | మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ19 | ఏప్రిల్ 26, 2012 | రీశాట్-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ20 | ఫిబ్రవరి 25, 2013 | సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-సీ21 | సెప్టెంబర్ 9, 2012 | స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ22 | జూలై 1, 2013 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ |
పీఎస్‌ఎల్‌వీ-సీ25 | నవంబర్ 5, 2013 | మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ24 | ఏప్రిల్ 4, 2014 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి |
పీఎస్‌ఎల్‌వీ-సీ23 | జూన్ 30, 2014 | స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2(కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ26 | అక్టోబరు 16,2014 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి |
పీఎస్‌ఎల్‌వీ-సీ27 | మార్చి 28, 2015 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి |
పీఎస్‌ఎల్‌వీ-సీ28 | జూలై 10, 2015 | 5 బ్రిటన్ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-సీ30 | సెప్టెంబరు 28, 2015 | ఆస్ట్రోశాట్ + 6 విదేశీ ఉపగ్రహాలు |