Skip to main content

ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం..?

 • ప్లాస్టిక్ అంటే ఏమిటి?
 • ప్లాస్టిక్ ఉపయోగాలు
 • ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయవచ్చా?
 • ప్లాస్టిక్‌తో నష్టాలెన్నో..
 • సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమిలా...
అగ్గిపుల్ల...దీనితో ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు, ఇంటి ని తగులబెట్టుకోవచ్చు. ఎలా వినియోగిస్తే అలా ఉపయోగపడుతుంది. అలాగే ప్లాస్టిక్ కూడా. నేలలో కరిగిపోయేందుకు కనీసం 500 ఏళ్లు పట్టేప్లాస్టిక్‌ను ఎడాపెడా ఎలాపడితే అలా వినియోగించి భవిష్యత్తరాలను అంధకారంలోకి పడేస్తున్నాడు మహామేధావైన మనిషి.ఇంతకీ.. ప్లాస్లిక్‌ను రీసైక్లింగ్ చేయవచ్చా? ఒక వేళ చేయలేకపోతే ఏమౌతుంది? నిజంగా ప్లాస్టిక్ అంత ప్రమాదకరమా? గ్రెటా థెన్‌బర్గ్ ప్రపంచాధినేతలను ఏమని ప్రశ్నించింది? ... ఓసారి పరిశీలిద్దాం.

ప్లాస్టిక్ అంటే ఏమిటి?
పెట్రోలియం లేదా సహజ వాయువుల నుంచి వచ్చే హైడ్రోకార్బన్ ద్వారా ప్లాస్టిక్ తయారవుతుంది. ఈ హైడ్రోకార్బన్‌లు పాలిమర్స్ లేదా ప్లాస్టిక్ రెసిన్స్ అనబడే గొలుసులుగా తయారవుతాయి. హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ వివిధ ప్రక్రియల్లో కలిసి వివిధ రకాల ప్లాస్టిక్ తయారవుతుంది. విస్తృత శ్రేణి సింథటిక్ లేదా సెమిసింథటిక్ వస్తువులుగా భారీ వాడకానికి అనువైనదిగా తయారైంది మనం వాడే ప్లాస్టిక్. మొట్టమొదటి ప్లాస్టిక్‌ను అలెగ్జాండర్ పార్క్స్ అనే రసాయన శాస్త్రవేత్త 1855లో కనుగొన్నాడు. ఇప్పుడు వినియోగిస్తున్న రకరకాలప్లాస్టిక్‌లకు ఇది మూలాధారమని చెప్పవచ్చు.

ప్లాస్టిక్ మూడు రకాలు
మొదటి రకం...
పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్. వీటిలో పొలిథిలిన్, పోలిప్రాపిలిన్, పోలిస్టర్, పొలిస్టరిన్, నైలాన్, ఆక్రిలిక్ రకాలు ఉన్నాయి. ఇవేవీ ‘బయో డీగ్రేడబుల్’ కావు.

రెండో రకం...మొక్కలతో తయారయ్యేవి రెండోరకపు ప్లాస్టిక్. చెరకు గడలు, మొక్కజొన్న గింజలు, బంగాళ దుంపలు, మరొకొన్ని రకాల మొక్కలతో తయారు చేస్తారు.

ఇక మూడో రకం...బయోప్లాస్టిక్. ప్రధానంగా బ్యాక్టీరీయా, కొన్ని రకాల క్రిములతో తయారు చేస్తారు. ఈ రెండు రకాల ప్లాస్టిక్ ‘బయో డీగ్రేడబుల్’. ఈ రోజుల్లో ఏ వస్తువైన కుళ్లి పోవడం, జీవ శైథిల్యం చెందడం అంత తొందరగా జరిగే ప్రక్రియ కాదు. అందుకు కొన్నేళ్లు పడుతుంది. అటవి సంపద తగ్గిపోవడం, జీవ వైవిధ్యం అంతరించి పోతుండడం కారణం. బయో డీగ్రేడబుల్‌కు కూడా పరిశ్రమలను స్థాపించడమే ప్రత్యామ్నాయ మార్గం.

ప్లాస్టిక్ ఉపయోగాలు:
నిజానికి ప్లాస్టిక్ మన నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వైద్యరంగంలో దీనికి ప్రత్యామ్నాయంగా మరొక లోహం వినియోగించలేము అంటే అతిశయోక్తి కాదు. విద్యుత్తు వైర్లకు పూతగా, హాస్పిటల్‌లో వినియోగించే డిస్పోజబుల్ వస్తువులుగా, తెలికబరువు కలిగి, బారీ స్థాయిలో రవాణాకు... ఉపయోగపడుతుంది. తక్కువ శ్రమ శక్తితో ఎక్కువ లాభం వనకూరుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడం, వినియోగించడం ఎంత ముఖ్యమో పర్యావరణానికి హానికలిగించకుండా దానిని నిర్వీర్యం చేయడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే కర్భన ఉద్గారాలు వికృత రూపం దాల్చి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి.

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ అంటే ఏమిటీ ?
వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల ప్యాకేజీకి ఉపయోగించే దళసరి ప్లాస్టిక్‌తోపాటు ప్లాస్టిక్ బ్యాగ్‌లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, కాఫీ కలుపుకునే పుల్లలు, వాటర్ బాటిళ్లు, పెప్ సోడా బాటిళ్లు అన్ని కూడా ఒకసారి ఉపయోగించి రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్ట్రిక్ వస్తువులే (కొన్ని రకాల ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు రీసైక్లింగ్‌కు పనికొస్తాయి). శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్‌ను కరిగిస్తే.. ద్రవరూపానికి మారదు. ఇవన్నీ కూడా పెట్రోలియం ద్వారా తయారవుతాయి కనుక ‘జీవ శైథిల్యం’ చెందవు. అంటే బ్యాక్టీరియా, క్రిమికీట కాదులు తినేయడం వల్ల అంతరించిపోవడం జరుగుతుంది. పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్‌ను ఉపయోగించి క్రూడాయిల్‌ను తయారు చేయవచ్చు. చేస్తున్నారు కూడా. ప్లాస్టిక్ గుట్టలను కరిగించినా వచ్చే ఇంధనం తక్కువే. పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను అన్ని విధాల రీసైక్లింగ్ చేయడంతోపాటు ఒకేసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌నే కాకుండా పెట్రోలియంతో తయారయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను క్రమంగా నిషేధించాల్సిందే. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం.

మన దేశంలో ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. మన దేశంలో ఏటా దాదాపు 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 50 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు పనికొచ్చేది. అంటే 50 శాతం ప్లాస్టిక్‌ను ఒక్కసారి ఉపయోగించి పడేయాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా రీసైక్లింగ్‌కు పనికొచ్చే 50 శాతం ప్లాస్టిక్‌లో కేవలం 10-13 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 2022 నాటికి 20 కిలోలకు, 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు. అందుకనే ప్రతి దేశంలో వృధా ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. భూమిపైన, భూపొరల్లో, వివిధ జల వనరుల్లో, సముద్ర గర్భంలో గుట్టలుగా పేరుకుపోతూ మనిషి మను గడకు సవాల్‌గా మారింది. ఆహారంతో పాటు తక్కువ పరిమాణం, సూక్ష్మ రూపంలో ఇది జంతువుల, మనుషుల కడుపుల్లోకి వెళుతోంది. ప్లాస్టిక్ ఎప్పుడూ ‘జీవ శైథిల్యం’ చెందదు. అందుకనే అవి తిన్న జీవ జాతులు చనిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్ మెక్‌థన్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఇలా.. చేపల కడుపుల్లోనే కాకుండా మానవుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరాయని ఇటీవల లండన్ వైద్యులు ధ్రువీకరించారు. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అంతర్గత అవయవాలకు చేరుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కణాల వల్ల మనుషుల్లో ‘ఎండో్రకైన్’ వ్యవస్థ దెబ్బతిని క్యాన్సర్లు, సంతాన వైఫల్యాలు కలగడమే కాకుండా పుట్టుకతో వచ్చే అవలక్షణాలు, చెముడు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి?
పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించడం, వినియోగించడంపై 1986లో చట్టం చేశారు. 20 మైక్రానులు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను విక్రయించకూడదని నిబంధన విధించారు. ఈ తర్వాత దాన్ని సవరిస్తూ 50 మైక్రానులకు పెంచారు. నిషేధిత వస్తువులు తయారు చేసినా, అమ్మినా, వాడినా రూ.2,500 నుంచి రూ.అయిదు వేల వరకు జరిమానా విధించవచ్చు. 2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలులేని మల్టీలేయర్ ప్లాస్టిక్ (చిప్స్ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. అసలు ఉత్పత్తే లేకుంటే వినియోగం ఉండదు కదా! ఉత్పత్తినెందుకు నిషేధించరు? అనే ప్రశ్న జనసామా న్యంలో ఉదయించేది. ప్లాస్టిక్‌ను నిషేధించడం, లేదా అందుకోసం ఒక చట్టం తీసుకురమ్మని ఆదేశించడం తాము చేయజాలమని సుప్రీంకోర్టు 2016 (కరుణ సొసైటీ కేసు)లో స్పష్టం చేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత అనేది న్యాయస్థానం ఉద్దేశం. కఠిన నిబంధనలు, విధి విధానాలు రూపొందించుకొని అమలు చేయొచ్చంది. బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఇందుకు సరిపోయే చట్టాలు- నిబంధనలు తెచ్చి, పకడ్బందీగా అమలుపరచడానికి ఉన్నత న్యాయ స్థానం తీర్పేమీ అడ్డంకి కాదు. కాబట్టి ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విసృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి.

ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయవచ్చా?
ప్లాస్టిక్ కుల్లదు, నానిపోదు, మట్టిలో కలిసిపోదు. అదో జడపదార్ధం. అయితే వాడిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయవచ్చు. కానీ, అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం కుదరదు. ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్ మూతలు, ్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్‌లెట్లు, చిప్స్ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. క్రెడిట్ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్‌‌స, వైర్, కేబుల్, సింథటిక్ లెదర్, నైలాన్ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్ డిస్కులు, మెడికల్ స్టోరేజి కంటైనర్స్, కార్ పార్‌‌ట్స, వాటర్ కూలర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఫోమ్ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్ పీనట్స్, కోట్ హ్యాంగర్స్, యోగర్ట్ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. ...ఒక్క మాటలో చెప్పాలంటే సింగిల్ యూజ్ (ఒక్కసారి వాడి పారేసే) ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయడం అతికష్టం. ప్లాస్టిక్ బ్యాగ్‌‌స డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని వెల్లడెంది.

రీసైక్లింగ్ చేయదగిన వస్తువులు...
బేవరేజ్ బాటిల్స్, ఫుడ్ జార్స్, క్లాతింగ్ అండ్ కార్పెట్ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్ బాటిల్స్.డిటర్జంట్, బ్లీచ్ బాటిల్స్, స్నాక్ బాక్సులు, మిల్క్జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్ ఫర్నిచర్, చెత్త కుండీలు, ప్యాకేజింగ్ ఫిలిం, షాపింగ్ బ్యాగ్‌‌స, బబుల్ ర్యాప్, ఫ్లెక్సిబుల్ బాటిల్స్, వైర్ అండ్ కేబుల్ ఇన్సులేషన్, బాటిల్ టాప్స్, డ్రింకింగ్ ్ట్రాస్, లంచ్ బాక్సులు, ఇన్సులేటెడ్ కూలర్లు, ఫ్యా్రబ్రిక్ అండ్ కార్పెట్ టారప్స్, డైపర్స్.

ప్లాస్టిక్‌తో నష్టాలెన్నో..
మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దానికి ఏకంగా ఐదు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి దాదాపు 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. ఇవి సాదారణమే అని కొట్టిపారేసే విషయాలు కావు. తస్మత్ జాగ్రత్తతో, జాగరూతతో మెదలమని మనిషికి ప్రకృతి పంపే సంకేతాలు.
 • నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి. విధంగా విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే.
 • వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి.
 • ప్లాస్టిక్‌ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
 • ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి.
 • ప్లాస్టిక్ వ్యర్థాల్లో పాలిథిన్ కవర్లు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయి.
 • మట్టిలో కలిసి పోయేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. నీరు భూమిలో ఇంకకుండా అడ్డు పడతాయి.
 • పాలిథిన్ కణాలు భూసారాన్ని పీల్చేస్తాయి. కొన్నేళ్ల తర్వాత ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. ఆ ధూళి ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్, మూత్రపిండ, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది.
 • నగరంలో కర్రీ పాయింట్లు అధికంగా విస్తరిస్తుండగా వారంతా నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదకరం. కవర్ తయారీలో ఉపయోగించే పోలి ఇథలీన్ లేయర్ వేడికి కరిగిపోతుంది. అలా కలుషితమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కారకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో సిల్వర్ కాయిల్‌తో తయారు చేసిన ఉత్పత్తుల్లో ప్యాకింగ్‌పై మొగ్గు చూపాలి.
 • మహిళల్లో అధికంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇదే కారణం.
 • చికెన్, మటన్ దుకాణాల్లో వినియోగించే నలుపు, ఎరుపు, పింక్ రంగుల్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వాటిలో తెచ్చే ఆహారం వేగంగా కలుషితమయ్యే అవకాశాలు ఉండటంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చిన్న పిల్లల్లో వేగంగా మందబుద్ధి వ్యాపిస్తుంది.
 • విచ్చలవిడిగా వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, పశువులు, పందులు తిని మృత్యువాత పడుతున్నాయి.
 • కర్బన ఉద్గారాలవల్ల, ఇతర కాలుష్యాల కారణంగా భూతాపం పెరుగుతోంది. సముద్ర తీర ప్రాంతాల జనావాసాలు భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. కారణం, వేగంగా సముద్ర జలమట్టం పెరగటమే! కర్బన కాలుష్యాల క్రమం ఇలాగే ఉంటే, భూతాపోన్నతి ఇదే రీతిన పెరిగితే... సమీప భవిష్యత్తులోనే ధృవ ప్రాంతపు మంచు శిఖలు కరిగి సముద్ర మట్టాలు అసాధారణంగా పెరుగనున్నాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ముసాయిదా పత్రమొకటి ఇటీవల వెల్లడించింది. ఈ ప్రమాద ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇది అత్యంత వేగంగా నష్టం కలిగిస్తుందన్నది నివేదిక సారం. ఉత్తర దక్షిణ ధృవాల్లోని గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలు వేగంగా కరిగిపోతున్నాయి. మానవ కారక కాలుష్యాన్ని తగు చర్యలతో నియంత్రించకుంటే, ఉత్తర ధృవపు మంచుకొండలు ఈ శతాబ్దాంతానికి కనీసం 30 శాతం కరిగి పోతా యనేది అధ్యయనం. అదే జరిగితే, 2050 నాటికి చిన్ని చిన్న దీవులు, కడలి తీరాల్లోని మహానగరాలు తీవ్ర ‘సముద్ర జల మట్టాల’ సమ స్యను ఎదుర్కోనున్నాయి. భూతాపోన్నతి 2 డిగ్రీలు మించి పెర క్కుండా కట్టడి చేసినా, 2100 నాటికి సముద్రమట్టాలు 43 సెంటీ మీటర్లు పెరుగుతాయనేది పరిశీలన. అప్పుడు సాగరతీరాల నుంచి 25 కోట్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వైపు అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంతర్జాతీయ రాజకీయ పరిణా మాల్నే శాసిస్తోంది. ముప్పిరిగొనే ఈ ప్రకృతి విపత్తులు ఇంకే విపరిణామాలకు దారితీస్తాయో తెలియదు! పాలకులు, ప్రభుత్వాలు, పౌరసమాజం సమన్వయంతో చొరవ చూపితేనే సమస్య తీవ్రతను కట్టడి చేయగలవు.
 • ఇ-వ్యర్థాల నిర్వ హణ అత్యంత కీలకమైన సమస్య...స్మార్ట్ ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీ న్‌లు, ఫ్రిజ్‌లు, కంప్యూ టర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్ వంటి సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇ-వ్యర్థాల నిర్వహణ భౌగోళిక, రాజకీయ సవాలుగా మారి, ప్రపంచస్థాయిలో ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో ‘వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ (డబ్ల్యూఈఈఈ) అంతర్జాతీయ వేదిక ఏర్పడింది. అంతర్జాతీయ సమాజంలో ఇ-వ్యర్థాల అనర్థాలు, నియంత్రణ అవసరంపై అవగాహన పెంపొందిం చేందుకు ‘ఇంటర్నేషనల్ ఇ-వేస్ట్ డే’ను ప్రతి ఏటా అక్టోబర్ 14 తేదీన జరుపుకోవాలని డబ్ల్యూఈ ఈఈ వేదిక 2018లో పిలుపునిచ్చింది. గ్లోబల్ ఇ-వ్యర్థాల్లో 20 శాతం మించి రిసైక్లింగ్‌కు నోచుకోవడం లేదు. మిగిలిన వ్యర్ధాలు సముద్రాల్లో, డంప్‌యర్డుల్లో దర్శనమిస్తున్నాయి.

సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమిలా...
జన జీవితంలో నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించడం అంత తేలికేమీ కాదు. అయితే దశలవారీగా ప్రయత్నిస్తే కష్టమేమీ కాదు.
 • ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఎవరికివారే స్వచ్ఛందంగా అడుగు ముందుకేయాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమలను సీజ్ చేయాలి.
 • చెత్తను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి చెత్త కుండీల్లో వేయకూడదు. ఆహార పదార్థాలను వాటిలో పారేయకూడదు.
 • ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, నార సంచులు, పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించాలి.
 • 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లతో ప్రమాదం అంతా ఇంతా కాదు. పునర్వినియోగానికి పనికి రావు. ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. వీటి వినియోగాన్ని కార్పొరేషన్ నిషేధించినా.. అడ్డుకట్ట పడలేదు. తక్కువ ధరకు వస్తుండటంతో పండ్లు, కూరగాయలు, కిరాణా స్టోర్ సామాన్లను ప్యాక్ చేసేందుకు వినియోగిస్తున్నారు. మంటల్లో కాలిపోయి ప్రమాదకర రసాయనాలు గాల్లోకి వెలువడుతున్నాయి. అందుకు 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తిచేసే పరిశ్రమలను పూర్తిగా నిషేధించడం ఒక్కటే మార్గం.
 • అన్ని స్థాయిల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించాలి.
 • బస్తీల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం, వారు ఉపాధి పొందేలా క్లాత్, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణనిచ్చి వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పించాలి. వాటిని వినియోగంలోకి తెస్తూ క్రమేపీ ప్లాస్టిక్ వాడడం మానేలా చేయాలి.
 • విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా విషయం కుటుంబానికి చేరుతుంది.
 • ప్లాస్టిక్ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్‌కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. అంటే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానంలో అరటి ఆకులు, స్టీల్, పింగాణీ, గాజు రకం వాడేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ పద్ధతుల వాడకం అలవాటు చేసుకోవాలి.
 • సరుకులు, కూరగాయల కోసం జూట్, క్లాత్ బ్యాగులు వాడేలా, మాంసం కోసం టిఫిన్ బాక్సులు వినియోగించేలా చర్యలు చేపట్టాలి.
 • ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, అమ్మకం, పంపిణీ వంటివి పూర్తిగా ఆగిపోవాలి.
 • హోల్‌సేలర్, రిటైలర్, ట్రేడర్, హాకర్, సేల్స్‌మెన్‌తో సహా ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం గానీ చేస్తే జరిమానాలు విధించాలి. వరుసగా మూడుసార్లు చేస్తే దుకాణాన్ని సీజ్ చేయాలి.
 • ఇళ్లల్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి.
 • పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్ సాధ్యమవుతుంది.
 • మార్కెట్‌కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి.
 • ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించడంతో పాటు శ్రద్ధతో ప్రజలకు అవగాహన కల్పించాలి.
 • కూరగాయలు, ఇతరత్రా కొనేటప్పుడే భూమిలో కలిసి పోయే గుణమున్న చేతి సంచినే వినియోగించాలి.
 • ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్- బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.
 • పర్యావరణానికి పెద్ద శత్రువుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా చైతన్యవంతులై వీటిని వినియోగించడం మానేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి.

ప్రపంచదేశాలు ఎలాగంటే...
ప్లాస్టిక్ సమస్య ప్రపంచంలోని అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. అయితే నివారణ చర్యలు తీసుకోవడంలో దేనిపంథా దానిదే. జర్మనీ, ఆస్ట్రియా, కొరియాతో పాటు బ్రిటన్‌లోని వేల్స్‌లో ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ అత్యంత సమర్థంగా జరుగుతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్‌లో కనీసం సగం మొత్తాన్ని మళ్లీ వాడుకునేలా చేస్తున్నారు. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు.. నిధులు, మౌలిక సదు పాయాలు కల్పించడం ఇందుకు కారణం. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు సంబంధించి మున్సిపాలిటీలు, పంచాయతీలు సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు అమలు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

కొలంబియా ఇలా..
వాడేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్టాన్రిక్ పరికరాల చెత్తను వదిలించుకునే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ విధానం నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్టాన్రిక్ ఉత్పత్తులను బాధ్యతాయుతంగా వాడటంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం.. దిగుమతి చేసుకున్న లేదా దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎలక్టాన్రిక్ పరికరాలను సక్రమంగా రీసైకిల్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం.. జాతీయ స్థాయిలో రీసైక్లింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం.. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేస్తోంది. కొలంబియాలో ఏటా దాదాపు 2.5 లక్షల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతోంది.

ఇండోనేషియా ఇలా..
ఇండోనేషియాలో ప్లాస్టిక్ చెత్తను సేకరించే వారికి ‘గార్బేజ్ క్లినికల్ ఇన్సూరెన్స్’కింద ఆరోగ్య సేవలు అందుతాయి. గమాన్ అల్బిసెయిద్ నేతృత్వంలోని ‘ఇండోనేషియా మెడికా’అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 600 మంది ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రీసైకిల్ చేసేందుకు అనువైన పదార్థాలను సేకరించి తీసుకురావడం.. ప్రతిఫలంగా మలాంగ్, జకార్తాల్లోని మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందడం ఈ పథకం ప్రత్యేకత.

సింగపూర్ ఇలా..
మొత్తం 40 లక్షల మంది జనాభా మాత్రమే ఉండే సింగపూర్.. చెత్త నిర్వహణ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న విషయం తెలిసిందే. మండించేందుకు అవకాశమున్న చెత్తను ఇంధన ఉత్పత్తికి వాడు కోవడం.. తడిచెత్తను క్రమపద్ధతిలో ల్యాండ్‌ఫిల్స్‌లో నింపి అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేయడం సింగపూర్ మోడల్‌లో చెప్పుకోదగ్గ విశేషాలు. భవన నిర్మాణ వ్యర్థాలను అత్యంత సమర్థంగా తగ్గించుకునే విషయంలో సింగపూర్ మిగిలిన దేశాల కంటే ఎంతో ముందుంది. 2005 నాటికే ఈ చిన్న దేశం 94 శాతం భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేసేసింది.

మనదేశంలో ఇలా..
 • పాల ప్యాకెట్లలో వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఒడిశాలో ఇటీవలే పాల ఏటీఎంలు మొదలయ్యాయి. క్యాన్లు, పాత్రలు తీసుకెళ్లి ఈ ఏటీఎంల నుంచి పాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
 • చెత్త సేకరించే వారు తెచ్చే ప్లాస్టిక్‌కు బదులు భోజనం పెట్టే పథకం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పట్టణంలో అమలవుతోంది. కిలో ప్లాస్టిక్ చెత్తకు ఒక పూట భోజనం అందిస్తున్నారు. అరకిలో చెత్తతో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు.
 • అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి.. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వెదురుబొంగులు వాడటం మొదలుపెట్టారు.
 • బెంగళూరులోని 6 హోటళ్లలో ఆహారం పార్సిల్ చేసేందుకు ప్లాస్టిక్ వాడట్లేదు. వినియోగదారులే పాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
 • కేరళలోని కొంతమంది జాలర్లు వేట నుంచి తిరిగొచ్చేటప్పుడు చేపలతో పాటు సముద్రంలోని ప్లాస్టిక్ చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నారు.
 • తమిళనాడులో కొంతమంది ఔత్సాహికులు ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు బొప్పాయి ఆకు కాడలను స్ట్రాలుగా వాడటం మొదలుపెట్టారు.
 • జొన్న చొప్పతో ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం కొత్త పద్ధతిని అభివృద్ధి చేస్తోంది.
 • గొంగళి పురుగులు ప్లాస్టిక్ చెత్తను ఇష్టంగా తిని జీర్ణం చేసుకోగలవని పుణేలోని డాక్టర్ రాహుల్ మూడేళ్ల కిందటే గుర్తించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను కొన్ని రకాల గొంగడి పురుగులు తినేయడంతో పాటు వాటి విసర్జితాలు ఎరువుగానూ ఉపయోగపడతాయని గుర్తించారు.

కర్బన పరమాణువులతో మ్యాజిక్..
భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్‌లా వాడుకునే అద్భుత టెక్నాలజీని స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్‌ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్‌మన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు. ప్లాస్టిక్‌ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే ప్లాస్టిక్ పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు మరింతగా పరిశోధనలు చేస్తున్నారు.

పాలీ ఓలిఫిన్‌తో పెట్రోల్, డీజిల్..
2015 నాటి లెక్కల ప్రకారం భూమి మీద ఏటా కనీసం 50 లక్షల నుంచి కోటీ 27 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇందులో రీసైక్లింగ్ అయ్యేది చాలా తక్కువని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పర్‌డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పదార్థాల్లోని పాలీ ఓలిఫిన్ అనే పదార్థంపై కొన్ని పరిశోధనలు చేశారు. వ్యర్థాలను వేడి చేయడం.. అత్యధిక పీడనం ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్‌లోని 91 శాతం పాలిఓలిఫిన్‌లను ఇంధనంగా మార్చవచ్చునని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త లిండా వాంగ్ తెలిపారు. ఇలా తయారైన ద్రవ ఇంధనంలో పారఫిన్‌లతో పాటు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, ఒలిఫిన్‌లు, వాసన ఇచ్చే రసాయనాలు కూడా వెలికి తీయవచ్చునని లిండా అంటున్నారు. ముడిచమురు నుంచి వేరు చేసినట్లే ఈ ఇంధనం నుంచి కూడా కొన్ని విలువైన రసాయనాలను రాబట్టుకోవచ్చునని, పెట్రోలు, డీజిల్ వంటివి కూడా తయారు చేయవచ్చునని, ఈ పద్ధతిని వాణిజ్యస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. దీని సాయంతో దాదాపు అన్నిరకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థమైన ఇంధనంగా మార్చేయవచ్చు అంటున్నారు.

ప్లాస్టిక్ రీసైక్లింగ్ టైల్స్‌తో పుట్‌పాత్‌లు..
ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు తయారుచేస్తున్నారు. 600 పాలీబ్యాగ్‌‌సను రీసైక్లింగ్ చేస్తే 300 గ్రాముల బరువైన ఒక టైల్‌ను తయారు చేయవచ్చు. దృఢంగా ఉండే ఈ టైల్స్ డ్యామేజ్ కావు. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేందుకు వీలుంటుంది. భూగర్భ జలాలు పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను బెస్ట్ ప్రాక్టీస్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ గుర్తించి దేశ వ్యాప్తంగా ఇలాంటి టైల్స్‌ను వాడాలని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ టైల్స్ వాడకంతో ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ యార్డ్‌కు చేరకుండా చేయవచ్చు. జీహెచ్‌ఎంసీ, బ్యాంబూ హౌస్ ఇండియా సంయుక్తంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేస్తున్నాయి. రిసైక్లింగ్ షీట్స్‌తో టాయిలెట్లు ఏర్పాటు, ప్లాస్టిక్ రిసైక్లింగ్ వాల్, రూఫ్ టాప్ షీట్లతో ఫైర్ ప్రూఫ్, సేఫ్టీ గదిని మియాపూర్ మెట్రో వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించామని వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి పేర్కొన్నారు.

గ్రెటా థెన్‌బర్గ్ సందించిన ప్రశ్నలు?
ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రెటా థెన్‌బర్గ్ పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో మనం ఉన్నామని, రాజకీయ నాయకులు పర్యావరణం తప్ప అన్నీ మాట్లాడతారని, ఆర్థిక అభివృద్ధంటూ, డబ్బంటూ కట్టుకథలు అల్లుతున్నారని, కనీసం శాస్త్రవేత్తల హెచ్చరికలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించింది. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. వాతావరణ మార్పుల పరిణామాలను నిర్లక్ష్యం చేయడానికి ఇది సమయం కాదు. మీ ఇల్లు కాలిపోతోంటే..ఎంత ఆందోళన చెందుతారో అలాంటి ఆందోళన, భయం ఇపుడు పర్యావరణం పట్ల ప్రపంచ నేతలకు ఉండాలి. చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఇక ప్రపంచ దేశాల్లో ఉద్దేశపూర్వకంగా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలనుకున్న ఏకైక దేశమైన అమెరికా... కర్భన ఉద్గారాలను వెదజల్లడంలో మాత్రం అగ్ర స్థానంలో కొనసాగుతోంది.అటవీ నిర్మూలన, జంతువుల నాశనం, మహాసముద్రాల ఆమ్లీకరణ లాంటి వాటితో మనషి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. మీ పిల్లలు, మనవలు భవిష్యత్తుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ టైమ్‌కి నేనిక్కడ ఉండకూడదు. స్కూల్లో ఉండాలి. కానీ స్కూలు వదిలిపెట్టి వచ్చాను. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి మా వంటి పిల్లల్ని మీ దగ్గరికి రప్పించుకుంటారా?...అని వాతావరణ మార్పును అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రెటా థెన్‌బర్గ్ చేసిన ప్రసంగం... భవిష్యత్ చిత్రానికి అద్దం పడుతోంది. లాభార్జనే పరమావధిగా సాగే సరుకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు.

చివరిగా...
1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అదే ఏడాది ఏర్పాటైన యూఎన్‌ఈపీ పర్యావరణానికి సంబంధించి ప్రజలకు అవగాహన, చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇలా కొత్త చట్టాలు, కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా.. అమలుకు నోచుకోకపోతే ఎక్కడి గొంగళి అక్కడే ఉంటుంది. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దును క్షణాల్లో అమలు చేసింది. కానీ ఎప్పటి నుంచో ప్లాస్టిక్‌ను మాత్రం రద్దు చేయలేకపోతుంది. రేపొద్దున భూమి మీద మైక్రో ప్లాస్టిక్స్ వికృత రూపం దాల్చి జీవకోటి అస్తవ్యస్తమైపోయాక, నీరు, గాలి, భూమి కాలుష్యమైపోయాక, సముద్రమట్టం పెరిగి, వర్షం నీరు ఇంకే చోటే కనిపించక.. ఆ నీరు మన ఇంట్లోకి వచ్చేంతవరకూ... శ్రద్ధ ఎవ్వరికీ పుట్టదు.
Published date : 21 Nov 2019 03:17PM

Photo Stories