Skip to main content

కృత్రిమ మేధస్సు - పరిణామం

బాలలత మల్లవరపు, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
శాస్త్ర, సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మానవ మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సుకు ప్రాణం పోస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని రంగాల్లో స్వయం నియంత్రిత -రోబోలు, యంత్రాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌‌స (ఏఐ)తో దూసుకెళ్తున్న ఇరవై ఒకటో శతాబ్దం.. సైన్‌‌స చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో.. కృత్రిమ మేధస్సు, దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం...

ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవి మనిషి. మేధాశక్తి అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతోపాటు యావత్ ప్రపంచంపై పట్టు సాధించేలా చేసింది. సృష్టి అనేక అద్భుతాల సమాహారం.. అయితే ఆ సృష్టికే ప్రతిసృష్టి చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ‘అసాధ్యం’ అనే మాటకు తావులేకుండా ఊహలకు వాస్తవరూపం ఇస్తున్నారు. మరమనుషులకు మేధాశక్తి ప్రసాదించి సైన్‌‌స చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీస్తున్నారు.

కృత్రిమ మేధస్సు
జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం, నెమరువేయగలగడం, సమస్యలను పరిష్కరించడం, తార్కిక-గణన శక్తి, సాంకేతిక పదాలతోపాటు సాధారణ భాషలను అర్థంచేసుకోవడం, నూతన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించడం వంటి సామర్థ్యాల సమాహారమే మేధస్సు. దీనికి ప్రతిసృష్టే.. కృత్రిమ మేధస్సు.

కృత్రిమ మేధస్సుపై పరిశోధనల్లో భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశం చేసిన జాన్ మెక్‌కార్తీ.. కృత్రిమ మేధస్సు పితామహుడిగా గుర్తింపు పొందారు. ఇతడి నిర్వచనం ప్రకారం- సైన్స్, ఇంజనీరింగ్‌ల కలయికతో రూపుదిద్దుకున్న తెలివైన యంత్రాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లనే ‘కృత్రిమ మేధస్సు’ అంటారు. ఇంతకాలం కంప్యూటర్లు వాటికిచ్చిన ప్రోగ్రామ్ల ఆధారంగా పనిచేస్తున్నాయి. స్వతహాగా ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపించగలిగే సామర్థ్యం వాటికి లేదు. ఇకపై కృత్రిమ మేధస్సుతో చాలా సమస్యలకు స్వతహాగా స్పందించి సమాధానాలు ఇవ్వగల, పనులను చక్కదిద్దగల రోబోలు, కంప్యూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా.. ఆలోచన, తార్కిక విశ్లేషణ వంటి విషయాల్లో మనిషి మెదడు పనితీరును అధ్యయనం చేసి అచ్చం అలాగే పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, న్యూరాన్ సైన్‌‌స, బయాలజీ, మ్యాథ్‌‌స, సోషియాలజీ, ఫిలాసఫీల కలయికతో కృత్రిమ మేధస్సు రూపుదిద్దుకుంటోంది. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే పలు రంగాల్లో వినియోగిస్తున్నారు.

లక్ష్యాలు:
‘ఆలోచించడం, అర్థం చేసుకోవడం, సమస్యలను విశ్లేషించడం, సందర్భానుసారం ప్రవర్తించడం’ వంటి మానవ సామర్థ్యాలను యంత్రాలకు కల్పించడమే శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధిస్తే మనిషి చేయలేని అనేక పనులను యంత్రాలు చక్కదిద్దగలవు. అదే జరిగితే మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

ప్రత్యేకతలు:
కంప్యూటర్లు కేవలం కోడ్ భాషలను మాత్రమే అర్థంచేసుకుంటాయి. ప్రస్తుతం వాటిని కృత్రిమ మేధస్సు సహాయంతో వివిధ భాషలను అర్థంచేసుకుని.. సంభాషించేలా తీర్చి దిద్దుతున్నారు. ఆధునిక యంత్రాలకు దృష్టి జ్ఞానం అందిస్తున్నారు. ఇందులో భాగంగా రికార్డుల్లోని నేరస్తుల ఛాయాచిత్రాలను పోల్చి..వారు సీసీ కెమెరాలకు చిక్కిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేసే వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే వైద్యరంగంలో కొన్ని రకాల వ్యాధులను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నారు.

ఇప్పటివరకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ మెషీన్లు వాటికి అందించిన సమాచారం ఆధారంగా కొన్ని స్వరాలను మాత్రమే గుర్తించగలవు. వీటిని కృత్రిమ మేధస్సు సహాయంతో భాష, యాస, మాండలికాలు, స్వరంలో మార్పు వచ్చినా పూర్తి కచ్చితత్వంతో స్వరాలను గుర్తించేలా రూపొందిస్తున్నారు.

కృత్రిమ మేధస్సుతో చేతిరాతను గుర్తించొచ్చు. అక్షరాల ఆకృతిని అర్థంచేసుకొని.. ఎలా రాసినా చదవగలగే, స్క్రిప్టును ఎడిటింగ్ చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సును మేధోపరమైన క్రీడల్లో విజయవంతంగా వినియోగించారు. చెస్, పోకర్, టిక్-టాక్ వంటి క్రీడల్లో ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని ఓడించగలిగే సామర్థ్యం దీనికి ఉందని ఇప్పటికే నిరూపితమైంది. రోబోలు కాంతి, చీకటి, వేడి, చల్లదనం, కదలికలు, శబ్దాలు, ఎత్తుపల్లాలను గుర్తిస్తాయి. ఒకసారి ఏదైనా తప్పిదం జరిగితే మళ్లీ వాటంతటవే సరిదిద్దుకుంటాయి. పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తన, పని విధానాలను మార్చుకుంటాయి.

దిగ్గజ సంస్థల సేవల్లో
సాంకేతిక రంగంలోని దిగ్గజ సంస్థలు కృత్రిమ మేధస్సును ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు చేసే అన్ని పనులకు ఏఐని వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా సంస్థలు అవి ఉపయోగిస్తున్న ఏఐ ఆధారిత సాంకేతికతలకు పలు పేర్లు పెట్టాయి. వాటిలో కొన్ని....

సిరి: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ‘సిరి’ పేరుతో వ్యక్తిగత సహాయ సేవలు అంది స్తోంది. ఇది రోజువారీ సలహాలు, సూచనలు ఇవ్వడం, నిర్ధారించిన కార్యక్రమ వివరాలను గుర్తుచేయడంతోపాటు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇది పూర్తిగా మనిషిలానే మాట్లాడుతూ యాపిల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

టెస్లా: కార్లను స్వయంచోదితంగా నడపడానికి కృత్రిమ మేధస్సును వినియోగిస్తోంది. అమెజాన్: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వినియోగదారుల అభిరుచులను గుర్తించి వారికి తగిన సేవలందించేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోంది.

నెస్ట్: ఇళ్లు, కార్యాలయాల్లో మనకు అనుకూలమైన ఉష్ణోగ్రతను మన ప్రమేయం లేకుండా సరిచేసే టెక్నాలజీని గూగుల్ అభివృద్ధి చేసింది. ఇది వ్యక్తిగత అలవాట్లను అధ్యయనం చేసి, ఏ సమయంలో ఎలా ఉండాలని కోరుకుంటామో అలాంటి ఉష్ణోగ్రతలను కొనసాగిస్తుంది.

ప్రయోజనాలు
ప్రస్తుతం ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఉద్యోగార్థులు అప్లికేషన్‌లో పేర్కొన్న సమాచారం సరైందో కాదో చిటికెలో చెప్పేస్తోంది. ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను వడపోసి అభ్యర్థుల సామర్థ్యంపై నివేదిక ఇస్తుంది. మొదటిదశ ఇంటర్వ్యూలను కృత్రిమ మేధస్సుతో అనుసంధానించిన కంప్యూటర్లే చేస్తున్నాయి.

వినియోగదారుల సేవలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నాయి. కస్టమర్ కేర్ సెంటర్‌లో మనుషులకు బదులు కంప్యూటర్లే సమాధానాలు ఇస్తున్నాయి. స్వర రూపంలోనే కాకుండాచాటింగ్ ద్వారా కూడా సేవలందిస్తు న్నాయి. వోక్స్‌వేగన్, బీఎండబ్ల్యూ వంటి కార్ల తయారీ సంస్థలు స్వయం నియంత్రిత రోబోలను వినియోగిస్తున్నాయి.

మానవ వనరులను ఉపయోగించడం వల్ల కార్పొరేట్ సంస్థలు అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. కృత్రిమ మేధస్సు వినియోగంతో మానవ వనరులపై చేసే ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది.

యుద్ధ క్షేత్రం: ప్రపంచవ్యాప్తంగా దేశాలు భద్రతపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రోబోలకు కృత్రిమ మేధస్సును జోడించి రణక్షేత్రంలో ప్రవేశపెట్టెందుకు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, యునెటైడ్ కింగ్‌డమ్, చైనా, దక్షిణ కొరియాలు విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే రక్షణ రంగానికి సంబంధించి నిఘా విమానాలు తమకు తాముగా ఛాయాచిత్రాలు తీస్తున్నాయి.

బ్యాంకింగ్ లక్ష్మీ: భారత బ్యాంకింగ్‌కు సంబంధించి సిటీ యూనియన్ బ్యాంక్ తొలిసారి రోబో సేవలను వినియోగంలోకి తెచ్చింది. ‘లక్ష్మీ’గా పేర్కొనే ఈ రోబో ఖాతాదారులకు బ్యాలెన్‌‌స, రుణాలపై వడ్డీరేట్లు, ఇతరత్రా వివరాలను అందిస్తుంది. ఇది ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఇది 125 రకాల సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. గోప్యత పాటించాల్సిన అంశాలను తెరపై మాత్రమే చూపిస్తుంది. రోబోలను భవిష్యత్ లో మరింత అభివృద్ధి చేసి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించాలని భావిస్తున్నారు.

రోబోకి పౌరసత్వం: సౌదీ అరేబియా తొలిసారి ఒక మహిళా రోబోకు పౌరసత్వం కల్పించింది. కృత్రిమ మేధస్సుతో ప్రాణం పోసుకున్న ‘సోఫియా’ అనే రోబో.. రియాద్‌లో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్’ సదస్సులో తనకు తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. శాంతియుత ప్రపంచమే తన ధ్యేయమని చెప్తోన్న ‘సోఫియా’.. మనుషుల్లానే రకరకాల హావభావాలను పలికించగలదు.

ప్రతికూలతలు-విమర్శలు
 • కృత్రిమ మేధస్సుతో ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే మార్పు సామాజికంగా పెను ప్రభావం చూపనుంది. అల్పస్థాయి నైపుణ్యం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానాలు కలిగిన అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
 • కృత్రిమ మేధస్సు కలిగిన యంత్రాలు పక్కదోవపడితే కంప్యూటర్లను హ్యాక్ చేస్తాయి. నెట్‌వర్‌‌కలను దెబ్బతీస్తాయి.
 • మానవ రహిత కార్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, అలాంటి వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరిని బాధ్యుల్ని చేయాలనే ప్రశ్నకు సమాధానం లేదు.
 • వైద్య, ఆర్థిక, వాణిజ్యాలకు సంబంధించిన పౌర కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సును అనుమతించొచ్చు. కానీ, భద్రతకు సంబంధించిన రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
 • కృత్రిమ మేధస్సు అభివృద్ధిని నియంత్రించలేకపోతే చరిత్రలో దాన్ని అత్యంత చెత్త విషయంగా చెప్పుకునే రోజులొస్తాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి కృత్రిమ మేధస్సే కారణం అవుతుందంటున్నారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.
 • కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఆయుధాలను అనుమతించడమంటే సమస్యలను కొనితెచ్చుకోవడమేనని బిలియనీర్ ఎలాన్ మస్క్‌తోపాటు మరో వందమంది ఐరాసకు లేఖ రాశారు.
 • ఈ టెక్నాలజీతో ధనిక, పేద మధ్య అంతరాలు మరింత పెరుగుతాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడుతుంటే.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్‌‌గ మాత్రం కృత్రిమ మేధస్సుతో మనిషి జీవితం మరింత సుఖవంతంగా మారుతుందంటున్నారు.

కీలక మైలురాళ్లు
 • లండన్‌కు చెందిన కారెల్ కాపెక్ 1923లో తొలిసారిగా ‘రోబో’ అనే పదాన్ని ఉపయోగించాడు.
 • 1945లో కొలంబో యూనివర్సిటీకి చెందిన ఇసాక్ అసిమోవ్ ‘రోబోటిక్స్’ అనే పదాన్ని వాడాడు.
 • 1950లో ఆలెన్ ట్యూరింగ్, క్లాడ్ షానన్‌లు రోబోలు చెస్ ఆడగలవని వివరించారు. ట్యూరింగ్‌ను పలువురు కృత్రిమ మేధస్సుకు పితామహుడిగా పేర్కొంటారు.
 • 1956లో జాన్ మెక్‌కార్తీ తొలిసారిగా ‘కృత్రిమ మేధస్సు’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చాడు.
 • 1979లో కంప్యూటర్ సహాయంతో స్వయం చోదితంగా నడిచే వాహనాన్ని రూపొందించారు.
 • 1997లో అప్పటి ప్రపంచ చెస్ చాంపియన్ గారీ కాస్పరోవ్‌ను కృత్రిమ మేధస్సుతో కంప్యూటర్ ఓడించింది.
 • 2000లో భావోద్వేగాలను పలికిస్తూ ప్రతిస్పందించగలిగే పెంపుడు జంతువుల్లాంటి రోబోలను వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
Published date : 04 Dec 2017 03:39PM

Photo Stories