Skip to main content

కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాధి- లక్షణాలు,ప్రభావం, చికిత్స

వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఈ మధ్య గడగడలాడిపోతున్నాయి. సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా... ఇవన్నీ దశాబ్దకాలంగా కనీవినీ ఎరుగని కొత్త వైరస్‌లు. వీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వివిధ దేశాలలో కంటి మీద కునుకు లేకుండా చేసి, తమ తమ మార్గాల్లో మరణమృదంగాన్ని మోగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వ్యాధులపై గట్టి పోరాటమే చేస్తోంది. ఈ వ్యాధులతో ప్రాణనష్టంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయాణాలపై ఆంక్షలు, ఎగుమతి దిగుమతులపై నియంత్రణల కారణంగా చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోతున్నాయి. ఇప్పుడు చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలడంతో ప్రాణాంతక వైరస్‌లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కొన్ని వైరస్‌లకు చికిత్సలు ఉండటం లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపధ్యంలో అసలు వైరస్ అంటే ఏమిటి? ఇటీవల కాలంలో వివిధ దేశాల్ని ఇవి ఎలా వణికించాయి? కరోనా వైరస్‌పై పోరాటం చేయడానికి చైనా చేస్తున్నదేంటి? వంటి పూర్తి సమాచారం మీకోసం.
వైరస్ అంటే....
వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులే కానీ అత్యంత శక్తిమంతమైనవి. బ్యాక్టీరియా, ఫంగస్ కంటే ఇవి చాలా శక్తిమంతంగా దాడి చేస్తాయి. ఇవి కంటికి కనిపించవు. కొన్ని రకాల వాటిని మైక్రోస్కోప్‌ల ద్వారా చూడగలం. ఈ వైరస్‌లు సంతానాన్ని వాటంతట అవి సృష్టించలేవు. కణజాలం ఉంటేనే ఇవి అభివృద్ధి చెందుతాయి. అడవి జంతువులు, మొక్కల నుంచి ఈ వైరస్‌లు మానవ శరీరాలపై దాడి చేస్తాయి. దీంతో మానవాళిని వివిధ రకాల వ్యాధులు భయపెడుతున్నాయి. ఫ్లూ, ఎబోలా, జికా, డెంగీ, సార్స్, మెర్స్ ఇప్పుడు కరోనా వీటన్నింటికీ వైరస్‌లే కారణం. మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన శరీరంలో కూడా ఎన్నో వైరస్‌లు ఉన్నప్పటికీ చాలా వైరస్‌లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్‌లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్‌ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్‌లు ఉంటాయి. అమెరికన్ జర్నల్ సొసైటీ ఆఫ్ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్‌లు ఉన్నాయి.

ఇటీవల ప్రపంచదేశాలను వణి కించిన వివిద వైరస్‌లు, వాటి పుట్టుపూర్వోత్తరాలు
ఎబోలా వైరస్ అంటే...
ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ) జర్వం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలతో మొదలవుతుంది. ఒక్కోసారి శరీరం వెలుపల, లోపల కూడా రక్తస్రావం అవుతుంది. చివరికి బ్రెయిన్ హెమరేజ్‌తో మనిషి ప్రాణాలే పోతాయి. మొట్టమొదటిసారి 1976లో ఆఫ్రికాలో ఈ వైరస్ బట్టబయలైంది. సూడాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల్లో ఒకేసారి వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్‌కు పెట్టారు. ఫ్రూట్ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది. గాయాలు, రక్తం, లాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అప్పట్లో ఈ వైరస్ సోకిన వారిలో 90% మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-16 మధ్య మళ్లీ ఈ వ్యాధి విజృంభించింది. అయితే మొత్తం కేసుల్లో మరణాల రేటు 50 శాతంగా ఉంది. ఆ రెండేళ్లలోనే దాదాపుగా 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌కు చికిత్స కోసం మందుని కనుక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ రాకుండా వ్యాక్సినేషన్ కూడా ప్రయోగాల దశలో ఉంది.

డెంగీ వైరస్ అంటే...
కొన్ని వందల ఏళ్ల క్రితమే డెంగీ వైరస్ ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు 20వ శతాబ్దంలో ఈ వైరస్ 1950లో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో తొలిసారిగా బయటకి వచ్చింది. అక్కడ్నుంచి ఆసియా పసిఫిక్, కరేబియన్ దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడెస్ దోమ కాటుతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏడెస్ వేగంగా వృద్ధి చెందుతుంది. దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది డెంగీ వ్యాధి ప్రబలే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాది డెంగీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మందికి సంక్రమిస్తుంది. వారం రోజులకు పైగా జ్వరంతో మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది. ఒక్కోసారి డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువై బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ప్రాణాలు కోల్పోతారు. ఇలా మృతి చెందేవారు ప్రపంచ దేశాల్లో ఏడాదికి 25 వేల మంది (20%) వరకు ఉంటారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా దోమల్ని అరికట్టే కార్యక్రమాలు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు చేపడుతూ ఉండటంతో డెంగీ కేసులు కాస్తయినా నివారించగలుగుతున్నారు.

స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్ అంటే...
స్వైన్‌ఫ్లూ వ్యాధి మొట్టమొదట ఆఫ్రికా దేశంలోని పందుల్లో బయటపడింది. ఇది మనుషులకి సోకడం తక్కువే. 1918-19 సంవత్సరాల్లో తొలిసారిగా ఇది మనుషులకి సోకింది. అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి ఈ వైరస్ సోకిందని అంచనాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ 2009లో ఒక్కసారిగా ఈ వ్యాధి మనుషులకి సోకి తన విశ్వరూపం చూపించింది. మొత్తం 200 దేశాలకు విస్తరించింది. దాదాపుగా 3 లక్షల మంది (10%) ఈ వ్యాధితో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పితో ఈ వైరస్ లక్షణాలు బయటకొస్తాయి. జ్వరం, డయేరియా వస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతోంది.

సార్స్ వైరస్ అంటే...
చైనాలో గూంగ్‌డాంగ్ ప్రావిన్స్ లో 2002లో తొలిసారిగా సివియర్ అక్యూట్ రెస్పరేటరీ డిసీజ్ (సార్స్) వైరస్ బయటపడింది. ఇది గబ్బిలాలు, పిల్లులు సంక్రమిస్తుంది. కొద్ది వారాల్లోనే ఆ వైరస్ 37 దేశాలకు పాకింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. సార్స్ వ్యాధితో చైనా, హాంకాంగ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ వైరస్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశాల్లో ఉన్న తమ పౌరుల్ని వివిధ దేశాలు వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు మొదలయ్యాయి. సార్స్ వ్యాధిని నియంత్రించడానికి చైనా, హాంకాంగ్, కెనడా, తైవాన్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడంతో ఆర్థికపరమైన నష్టాలు కూడా మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం సార్స్ వ్యాధితో 2002-03లో 774 మంది మరణించారు. కొన్ని వేల మందిపై ఈ వైరస్ దాడి చేసింది. చాలా ఏళ్లుగా సార్స్‌ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేయడానికి వైద్య నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా అవి సఫలం కాలేదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధికారక వైరస్‌లకు చికిత్సలు ఉండవు. నియంత్రణే మార్గం. ఈ వైరస్ మళ్లీ విజృంభించినప్పుడల్లా డబ్ల్యూహెచ్‌ఓ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలపైనే విసృ్తతంగా ప్రచారం చేస్తోంది.

కోవిడ్-19 (కరోనా వైరస్) అంటే...
కోవిడ్-19(కరోనా వైరస్)...ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. దీని దాటికి 28 దేశాల్లో, 2592 (ఫిబ్రవరి 23, 2020 నాటికి)మందికి పైగా మరణించారు. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? దాని నుంచి రక్షించుకోవడం ఎలా? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దా....

ఎక్కడ పుట్టింది?
కొన్ని దశాబ్దాల క్రితమే కరోనా వైరస్ జాడ బయటపడింది. కరోనా వైరస్ ఒక వైరస్ కాదు. వైరస్ కుటుంబం పేరు. గతంలో వచ్చిన ఐదారు రకాల వైరస్‌లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. అవన్నీ జంతువులు, పక్షులు ద్వారా వ్యాపించినవి. కోవిడ్-19 వైరస్ మనుషుల నుంచి శరవేగంగా మనుషులకు సంక్రమించే వైరస్. ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. మధ్య చైనాలోని వూహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది. అయితే ఇది సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం.

కరోనా వైరస్ పేరెలా వచ్చింది ?
ఈ వైరస్‌ను మైక్రోస్కోప్ కింది నుంచి పరిశీలిస్తే గుండ్రటి ఆకారం చుట్టూ మేకుల్లా పొడుచుకొచ్చిన పోషకపదార్థం ఉంటుంది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్ చుట్టూ కిరీటం వంటి ఆకృతి కనిపిస్తుంది కనుక దానిని కరోనా అని శాస్త్ర వేత్తలు వ్యవహరిస్తున్నారు.

కరోనా వైరస్ పేరు కోవిడ్-19గా మార్పు
కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్ పేరును కోవిడ్-19గా మారుస్తున్నట్లు ప్రకటించింది.

స్వైన్‌ఫ్లూకు, కోవిడ్- 19కు పోలిక
కోవిడ్-19 కు హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ వైరస్ మాదిరే కోవిడ్-19 కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది. కోవిడ్-19 మనిషికి సోకిన పది రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. స్వైన్‌ఫ్లూలో కన్పించే లక్షణాలే (దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు) కరోనాలోనూ కన్పిస్తాయి. ఈ రెండు లక్షణాలు ఒకేలా ఉండటం వ్యాధి గుర్తింపు వైద్యులకు కూడా కష్టమే. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తే తప్పా..కరోనా నిర్ధారణ చేయడం కుదరదు.

వ్యాప్తి ఇలా..
  • ఈ వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు.
  • గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.
  • వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని శాస్త్రవేత్తల అభిప్రాయం.

వ్యాధి లక్షణాలు
కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందేందుకు ముఖ్యకారణం మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటమే. కోవిడ్-19 సోకినట్లయితే మొదటి దశలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆయాసం వస్తుంది. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. రెండో దశలో దగ్గు, జ్వరం వస్తుంది. మూడో దశలో అది పూర్తి నిమోనియాగా మారుతుంది. అప్పటికీ నివారించలేకపోతే శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రాణం పోతుంది. వ్యాధి సోకిన రోగులు ఆస్పత్రిలో చేరి 14 రోజులపాటు ఇంకుబేటర్‌లో ఉంటే చాలు... వ్యాధి నుంచి బయట పడవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
  • చైనా, దాని సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటివి చేయరాదు.
  • ఎప్పటికప్పుడు సబ్బు, ఆల్కహాల్‌తో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • దగ్గు, తుమ్ములతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలి.
  • ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి.
  • మాంసాహారం మానేయడం లేదా ఉడికీ ఉడకని మాంసం తినకుండా ఉండడం, మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం
  • వన్యప్రాణులకు దూరంగా ఉండటం లేదా సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లకుండా ఉండడాలి
  • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం
  • అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం
  • గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం
  • ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం
  • ఉతికిన దుస్తులు ధరించడం
  • వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం

కోవిడ్- 19 తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవస్థలు
గాలి ద్వారా పెను వేగంతో వ్యాపించే ఈ వైరస్ జంతువులు, పక్షుల్లో చేరి, వాటినుంచి మనుషులకు సంక్రమిస్తోంది. మనుషుల మధ్య కూడా వేగంగా వ్యాపిస్తోంది. చల్లనిరక్తం, వేడి రక్తం ప్రవహించే ఏ జీవుల్లోనైనా ఈ వైరస్ జీవించగలదు. దీనితో చైనాతో సంబంధం ఉన్న వాటితో బయటి ప్రాంతాలకు అన్ని రకాల రవాణా సంబంధాలనూ నిలిపేశారు. ఈ వైరస్ కారణంగా చైనా అర్థిక వ్యవస్థపై తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇప్పటికే పలు దేశాలకు చైనా ఎగుమతులు నిలిచిపోయాయి. చైనా నుంచి భారీ స్థాయిలో బల్క్ డ్రగ్‌ను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి బల్క్ డ్రగ్ దిగుమతులు నిలిచిపోతే.. ఫార్మా రంగంపై అది దీర్ఘకాల ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరోవైపు, కరోనాను అంతమొందించే విషయంలో సహకారం అందించేందుకు భారత్ సహా పలు దేశాలు ముందుకు వచ్చాయి.

చికిత్స
ప్రస్తుతానికి ఏ రకమైన యాంటీ రెట్రోవైరల్ మందులు, టీకాలు అందుబాటులో లేవు.
వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స కల్పించవచ్చు. అయితే ఈ వ్యాధి సోకిన రోగులు ఆస్పత్రిలో చేరి 14 రోజులపాటు ఇంకుబేటర్‌లో ఉంటే చాలు. వ్యాధి నుంచి బయట పడవచ్చు. చైనాలో ఈ వ్యాధిసోకినవారి సంఖ్య 77,150. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 79,000 మందికి సోకింది. వీరిలో 1846 మంది కోలుకోగా, 2,592 మంది మరణించారు. అయితే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి శాస్త్రవేత్తలు అన్ని దారుల్లో ప్రయోగాలు చేస్తున్నారు.

లవణాలతో నివారించేలా...
తాజాగా ఇళ్లల్లో వాడే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్‌లతో తయారైన ద్రావణాన్ని వాడటం ద్వారా వైరస్‌లను నిలువరించవచ్చునని చైనా శాస్త్రవేత్త ఛోయ్ తెలిపారు. లవణాలతో కూడిన ద్రావణం మాస్క్‌ల్లోపల స్ఫటికాల మాదిరిగా మారుతుందని, వీటికున్న పదునైన కొసలు వైరస్‌లను చంపేస్తాయని వివరించారు. ఇన్ఫ్లుఝెంజా వైరస్‌లు మూడింటితో తాము ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించామని చెప్పారు. కేవలం ఐదు నిమిషాల్లో వైరస్ నిస్తేజమైపోగా.. అరగంటలో మరణించిందని వివరించారు. ఇదే సాంకేతికత కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ఉపయోగపడవచ్చునని, ఈ ద్రావణాన్ని వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపుగా మాస్కులు ఉపయోగిస్తున్న వారు చేతివేళ్లతో మాస్కుల్లోని ఫిల్టేషన్ర్ పదార్థాన్ని ముట్టకపోవడం మేలని సూచిస్తున్నారు.

ఆరు నెలల్లో టీకా కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు...!
సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఏళ్లకి ఏళ్లు పడుతుంది. మొదట జంతువుల మీద పరీక్షలు చేయాలి, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేయాలి, తర్వాతే ఆ వ్యాక్సిన్‌కి అనుమతి లభిస్తుంది. అయితే సార్స్‌ని మించిపోయిన ఈ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆరు నెలల్లో వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని శాస్త్రవేత్తల బృందం చె బుతోంది.

చివరిగా...
రకరకాల వైరస్‌ల పుట్టుక, వాటి కారణంగా చికిత్సకు అంతుచిక్కని వ్యాధులు ప్రబలడం, వాటి కారణంగా ఊహించని తీరులో ప్రాణనష్టం..ఇవన్నీ స్వయంకృతాపరాధాలే (అపరిశుభ్రత) అనవచ్చు. ఎలాగంటే... పర్యావరణానికి హానితలపెట్టే ఫ్యాక్టరీలు, వాటి వ్యర్ధాల నిర్వహణ, చెట్ల నరికివేత, తత్ఫలితంగా సకాలంలో కురవని వానలు, ఇళ్లలో, వ్యాపార సంస్థల్లోని చెత్త నిర్వహణ, ఇష్టానుసారంగా నీటిని కలుషితం చేయడం.. ఇవన్నీ గౌరవనీయులైన మనిషిగారి నిత్యకృత్యాలు. పరిసరాల పరిశుభ్రతను పాటించని ఏకైక socila animal మనిషి మాత్రమే. prevention is better than cure... చికిత్సకంటే నివారణ మేలు. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ప్రాణాంతకమైన కొత్త వైరస్‌లు, బ్యాక్టీరియాలు.. వీటి పుట్టుకకు కారణం కాకుండా ఉండాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న పరిసరాలను వీలైనంత శుభ్రంగా ఉంచాలి. ఇది మనందరి చేతుల్లోనే ఉంది..!
Published date : 26 Feb 2020 11:31AM

Photo Stories