జలసిరిని కాపాడుకుందాం ఇలా..
Sakshi Education
బాలలత మల్లవరపు, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
నీటిని పొదుపుగా, పద్ధతిగా ఉపయోగించుకున్నప్పుడే జీవకోటి నీటి అవసరాలు తీరుతాయి. అలా కాకుండా విచక్షణా రహితంగా నీటిని వృథా చేస్తూ వెళితే.. ప్రకృతి సైతం భవిష్యత్ నీటి అవసరాలు తీర్చలేదు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం నీటి పునర్‌లభ్యత సామర్థ్యం కంటే వేగంగా మనం నీటిని తోడే స్తున్నాం. దీంతో కరవు కోరలు చాస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ‘జల అత్యవసర’ పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరచి అందరూ సరైన నీటి యాజమాన్య పద్ధతులు అనుసరించాలి. లేకుంటే భవిష్యత్ పరిణామాలు ఊహాతీతమే!
‘‘భూమికి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే సామర్థ్యం ఉంది. కానీ, వారి కోరికలను తీర్చే శక్తి లేదు’’ - మహాత్మా గాంధీ
దాదాపు 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నీటి వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా దేశాలు ప్రజలకు కనీసం తాగునీటిని అందించలేని స్థాయికి చేరకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇప్పటికే 80 దేశాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
వర్చువల్ నీటి ఎగుమతి
భారత్‌లో పంటలు పండించేందుకు భారీగా నీటిని వినియోగిస్తున్నారు. వరి, చెరకు తదితర పంటలకు అధిక నీరు అవసరం. ప్రతి కిలో పంట ఉత్పత్తికి ఉపయోగిస్తున్న నీటిని లెక్కించి.. ఎంత మొత్తంలో వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తున్నామో.. అంతే మొత్తంలో నీటిని ఎగుమతి చేస్తున్నట్లు గణిస్తున్నారు. దీన్ని ‘వర్చువల్ వాటర్ ఎక్స్‌పోర్ట్’ అని పేర్కొంటున్నారు. నీటి వినియోగం ఇలాగే కొనసాగితే మరో వెయ్యేళ్ల లోపే భారత్ నీటి నిల్వలను పూర్తిగా కోల్పోతుందని అంచనా.
కిలో బియ్యం ఉత్పత్తికి సుమారు 2,700 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నాం. ఏటా భారత్ నుంచి 38 లక్షల టన్నులకు పైగా బాస్మతి బియ్యం ఎగుమతి అవుతోంది. ఈ లెక్కన 10 ట్రిలియన్ లీటర్లకు పైగా నీటిని ఎగుమతి చేస్తున్నట్టే!
వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ (డబ్ల్యూఎఫ్‌ఎన్) అంచనాల ప్రకారం భారత్‌లో బ్రహ్మపుత్ర, మహానది బేసిన్లు మినహా మిగిలిన అన్ని నదీ బేసిన్లు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి.
అధిక జనాభా
గత వందేళ్ల కాలంలో ప్రపంచ జనాభా 1.7 బిలియన్ల నుంచి దాదాపు 7.6 బిలియన్లకు చేరింది. వచ్చే 30 ఏళ్లలో జనాభా మరో 45 శాతం పెరుగుతుందని అంచనా. ఇప్పటికే అనేక ప్రాంతాలు, దేశాల మధ్య నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో నీటి కోసం యుద్ధాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వాస్తవానికి ఇప్పుడు ప్రజల్లో ఎంతమందికి నీటి విలువ తెలుసు. అయితే వారిలో ఎందరు నీటిని పొదుపు చేస్తూ ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. చాలామంది ‘మా నీరు మా ఇష్టం.. ఎంతైనా వాడుకుంటాం’అనే ధోరణిలో ఉంటున్నారు. కానీ, ప్రస్తుత నీటి వృథా భవిష్యత్ తరాల బతుకును ఛిద్రం చేస్తుందని గుర్తించడం లేదు. ఒక రోజు.. కనీసం ఒక పూట నీటిని ఉపయోగించకుండా ఉండగలిగితే.. ప్రతి ఒక్కరికీ నీటి విలువ తెలుస్తుంది. తద్వారా సమర్థ నీటి వినియోగంలో ఎందుకు భాగస్వామ్యం అవ్వాలనే విషయం అర్థమవుతుంది. మనుషులు ఉపయోగిస్తున్న నీటిలో 70 శాతం వ్యవసాయానికి, 20 శాతం పరిశ్రమలకు, పది శాతం గృహ అవసరాలకు వాడుతున్నారు.
నీటి సంరక్షణ చర్యలు
ప్రతి బొట్టూ విలువైందే..

- పట్టణాలు, నగరాలు కాంక్రీటు జంగిళ్లుగా మారిపోయాయి. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. దీన్ని గుర్తించి ప్రతి ఇల్లు, కార్యాలయం ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వాలి. గులకరాళ్లు, ఇసుక వేసి ఇంకుడు గుంతను ఏర్పాటు చేస్తే వర్షపు నీరు చాలా వరకు భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది.
- కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీరు దిగువకు పారుతుంది. ఆ ప్రవాహాలకు అడ్డుగా చిన్న చిన్న కాలువల మాదిరిగా కందకాలు (కాలువలు లేదా గుంతలు) తవ్వడాన్ని కాంటూర్ ట్రెంచ్ అంటారు. ఇలా చేయడం వల్ల నేల క్రమక్షయాన్ని అరికట్టడంతోపాటు భూగర్భ జలాలను పెంచొచ్చు.
- చిన్న కాలువలు, వాగులు, సెలయేళ్లలో వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం ఉంటుంది. ఇలాంటి జలవనరులపై చెక్‌డ్యామ్‌లు, మట్టితో అడ్డుకట్టలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి.
- గొట్టపు బావుల మాదిరిగా భూ ఉపరితలం నుంచి లోతుగా ఇంజక్షన్ వెల్స్ తవ్వి.. వర్షపు నీరు అందులోకి వెళ్లెలా చేస్తే భూగర్భ జలాలను కాపాడుకోవచ్చుని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీన్నే ‘ట్యూబ్ రీఛార్జ్’ అంటున్నారు.
- పట్టణాలు, నగరాల్లో ‘రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ను ప్రోత్సహించాలి. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి. నీటి సంరక్షణా చర్యలను ప్రోత్సహించేలా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మనిసిపల్ కార్యాలయాల్లో అనుభవజ్ఞులను నియమించాలి.
- ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్ ) ప్రాంగణంలో నీటిని ఒడిసిపడుతున్నారు. రెండు పెద్ద ట్యాంకులు (చెరువులు) నిర్మించి వర్షపు నీటిని సమర్థంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు అవసరమైనపుప్పుడు సాగుకు నీటిని అందిస్తున్నారు. ఇక్రిశాట్ సహకారంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నీటి సంరక్షణా చర్యలు చేపట్టి మంచి ఫలితాలు రాబడుతున్నారు.
ప్రతి బొట్టూ విలువైందే..
- ఏటా వేలాది టీఎంసీల నీరు వాగులు, వంకలు, నదుల ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఇదే సమయంలో ప్రతి వేసవిలో నీటి కోసం తిప్పలు తప్పడం లేదు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాక చివరకు రైతులు అప్పులు పాలవుతున్నారు.
- రైతులు నేరుగా ఎక్కడైతే పంటకు నీరందించాలో అక్కడికే నీటిని పైపులు ద్వారా చేరవేయాలి. లేదంటే చాలా వరకు నీరు కాలువల్లో వృథా అవుతుంది. సంప్రదాయ పద్ధతితో పోల్చితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 80 శాతం నీటిని పొదుపు చేయొచ్చు.
- ప్రతి నీటి బొట్టూ విలువైందే. కాబట్టి సాగునీటి కాలువులకు సోలార్ పలకలను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. తద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టడంతోపాటు కొంత వరకు నీటి నష్టాన్ని నివారించొచ్చు.
- కాలువల్లో సిమెంట్ లైనింగ్ లేని ప్రదేశాల్లో వెంటనే లైనింగ్ పనులను పూర్తిచేసి నీటిపారుదల వృథాను పూర్తిగా అరికట్టాలి.
- తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం ఉద్దేశం బాగుంది. అందరూ ఈ స్ఫూర్తిని కొసాగించాలి. వాటర్‌షెడ్ కార్యక్రమానికి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. కానీ, వాటి అమలుపై మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నాయి.
- హరితహారం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తూనే అడవుల నరికివేత, అక్రమ కలప రవాణాను అడ్డుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలి. లేదంటే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వర్షమే లేనప్పుడు ‘నీటి వినియోగం, నీటి పొదువు’ వంటి పదాలకు ఆస్కారమే ఉండదు.
- నీటి సంరక్షణ గురించి పాఠ్యాంశాల రూపకల్పనతో సరిపెట్టకుండా ఒకప్పుడు జల వనరులు ఎలా ఉండేవి? ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి కారణాలు ఏమిటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు వివరిస్తూ విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్క్ చేయించాలి. నీటి సంరక్షణ గురించి తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించేలా, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. తద్వారా భవిష్యత్ తరాలకు నీరు, పర్యావరణం పట్ల సరైన అవగాహన కల్పించిన వారమవుతాం.
- సమర్థ నీటి యాజమాన్య పద్ధతులను అమలుచేస్తున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించాలి. నీటి వినియోగంపై అవగాహన కలిగిన వారిని లోకల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి వారితో ప్రతి గ్రామంలో ప్రచార సదస్సులు నిర్వహించాలి. పట్టణాలు, నగరాల్లో కుళాయిలకు నీటి మీటర్లు బిగించాలి. పరిమితికి మించి నీటిని వినియోగించే వారి నుంచి భారీగా రసుములు వసూలు చేయాలి. పరిమితికి లోబడి నీటిని వినియోగించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.
- నదులు, కాలువలను కాలుష్యం బారిన పడకుండా కాపాడటం కూడా నీటి సంరక్షణలో భాగమే. దీన్ని గుర్తించి పట్టణాలు, నగరాల్లో వందశాతం మురుగునీటిని సీవేజ్ ట్రీట్‌మెంట్ తర్వాతే కాలువల్లోకి వదలాలి. నదులు, చెరువులు కాలుష్యం బారిన పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. నీటి వృథాకు కారకులయ్యే వారికి భారీ శిక్షలు విధించాలి. లేదంటే ఈ చర్చలు, ఉపన్యాసాలు అన్నీ గాల్లో కలిసిపోయి.. నీటి వనరులు ఇంకిపోయే రోజులు త్వరలోనే వస్తాయి.
Published date : 02 May 2018 03:23PM