Skip to main content

జీవ వైవిధ్యం

పకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వాన్ని / ఓ భౌగోళిక ప్రాంతంలోని భిన్నజాతుల సముదాయాన్ని జీవవైవిధ్యం (Biodiversity) అంటారు. దీంతోపాటు ఒక జాతి జీవుల మధ్య కూడా అనేక రకాల జన్యుపరమైన వ్యత్యాసాలుంటాయి.
వీటిని దృష్టిలో పెట్టుకొని పర్యావరణవేత్తలు జీవవైవిధ్య భావనను మరింత విస్తరించారు.

స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్ నగరంలో ఉన్న (International Union for Conservation of Natural Resources) (IUCN) ప్రకారం ఒక జాతి జీవుల మధ్య, విభిన్న జాతుల జీవుల మధ్య, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్నే జీవ వైవిధ్యం అంటారు.

జీవ వైవిధ్య భావన అభివృద్ధి
ప్రారంభంలో సహజ ఆవరణ వ్యవస్థల పరిరక్షణ అనేది కేవలం కలపతోపాటు కొన్ని ముఖ్యమైన వన్యజీవుల సంరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేది. తర్వాత కాలంలో ఆవరణ వ్యవస్థలోని ప్రతి సూక్ష్మజీవి కూడా జీవావరణ సమతుల్యతకు కారణమవుతుందని పర్యావరణవేత్తలు గుర్తించారు. ఆధునిక బయోటెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ జీవవైవిధ్యం కంటే జీవుల్లోని జన్యుపరమైన వైవిధ్యం మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్య భావన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

1968లో అమెరికాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త రేమండ్ ఎఫ్. డాస్‌మన్ 'A Different Kind of Country' అనే గ్రంథంలో తొలిసారిగా Biological Diversity అనే పదాన్ని (జీవ సంబంధ వైవిధ్యం) ఉపయోగించారు. 1985లో డబ్ల్యు.ఎస్.రోజెన్ అనే మరో పర్యావరణవేత్త, జీవ వైవిధ్యం (Biodiversity) అనే సంక్షిప్త పదాన్ని ప్రతిపాదించారు. 1988లో ఈ.వో. విల్సన్ రచించిన గ్రంథంలో జీవవైవిధ్యం అనే పదాన్ని ఉపయోగించారు. తర్వాత కాలంలో జీవ సంబంధ వైవిధ్యం అనే పదమే అధికంగా వాడుకలోకి వచ్చింది.

జీవ వైవిధ్య స్థాయిలు: జీవ వైవిధ్యం ప్రధానంగా మూడు స్థాయిల్లో ఉంటుంది.
1. జన్యు వైవిధ్యం
ఇది ఒక జాతి జీవుల్లో ఉన్న వైవిధ్యం. సాధారణంగా తమలో తాము అంతర ప్రజననం చెందుతూ సమాన లక్షణాలున్న జీవుల సమూహాన్ని జాతి అంటారు.
ఉదా: మనుషులు అందరూ ఒకే జాతికి చెందినప్పటికీ, వారి మధ్య జన్యుపరమైన భేదాలుంటాయి. దీన్నే జన్యు వైవిధ్యం అని పిలుస్తారు.
ఉదా: మనిషి జాతిలో భిన్న తెగలు (ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, కాకసాయిడ్, నీగ్రాయిడ్), భిన్న రక్త గ్రూపులు ఉన్నాయి.

2. జాతి వైవిధ్యం
ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న భిన్న జీవ జాతుల సముదాయాన్ని జాతి వైవిధ్యం అంటారు. ఈ వైవిధ్యాన్ని ఒక చదరపు కిలోమీటరు/రాష్ర్టం/దేశం పరిధులతో పాటు ప్రపంచం మొత్తానికి లెక్కించొచ్చు. ఈ రకమైన జాతి వైవిధ్యాన్ని జీవుల వర్గీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య, భిన్న దేశాల మధ్య జీవ వైవిధ్య భేదాలను గుర్తించేందుకు, తులనాత్మక అంచనాకు జాతి వైవిధ్య అధ్యయనం ఉపయోగపడుతుంది. దీని ఆధారంగానే Conservation International అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ అత్యధిక జీవవైవిధ్యం కలిగిన 17 మెగా బయోడైవర్సిటీ కేంద్రాలను గుర్తించింది.

3. ఆవరణ వ్యవస్థల వైవిధ్యం
- భూమిపై ఉన్న విభిన్న, భూ, జలచర జీవ మండలాల వైవిధ్యం.. ఆవరణ వ్యవస్థ వైవిధ్యం. ఉష్ణోగ్రత, వర్షపాతం, సౌరపుటం వంటి అంశాల్లో ఆవరణ వ్యవస్థలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఆవరణ వ్యవస్థలోని జాతి, జన్యు జీవ వైవిధ్యాన్ని భౌతిక, రసాయన నిర్జీవ కారకాలు నిర్దేశిస్తాయి.

ఉదా: టండ్రా, ఆల్పైన్, కొనిఫెరస్ అడవులు, బొరియల్ అడవులు, సమశీతోష్ణ సతత హరిత అడవులు, వర్షాధార అడవులు, గడ్డినేలలు, ఎడారుల వంటి భూచర మండలాలు.
- సముద్ర, నదీ ముఖద్వారాలు వంటి జలచర మండలాలు.
మనిషి కూడా కొన్ని కృత్రిమ ఆవరణ వ్యవస్థలను సృష్టించాడు.
ఉదా: వ్యవసాయ భూములు, జంతు ప్రదర్శనశాలలు, బొటానికల్ గార్డెన్స్, ఆర్బోరెటం, సామాజిక అడవులు మొదలైనవి.

జీవ వైవిధ్య హాట్‌స్పాట్
అధిక జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉంటూ తీవ్రస్థాయి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవ భౌగోళిక ప్రాంతాన్నే జీవ వైవిధ్య హాట్‌స్పాట్/ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్/జీవ వైవిధ్య సునిశిత ప్రాంతంగా పిలుస్తారు. ఆయా ప్రాంతాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త నార్మన్ మెయర్స్ తొలిసారిగా హాట్‌స్పాట్ భావనను ప్రతిపాదించారు. 1988, 1990ల్లో తన 'The Environment' అనే గ్రంథంలో వీటి గురించి వివరించారు. 1989లో 'Conservation International' (CI) సంస్థ హాట్‌స్పాట్‌ల భావనను ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణవేత్తలు 1996లో హాట్‌స్పాట్‌లపై విస్తృత అధ్యయనాన్ని ప్రారంభించి 1999లో వాటిని గుర్తించడానికి కావాల్సిన ప్రమాణాలను రూపొందించారు.
1.ఒక భౌగోళిక ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించేందుకు కనీసం 1500 నాళిక కణజాలాయుత మొక్కలు ఆ ప్రాంతానికి మాత్రమే స్థానీయ జాతులుగా ఉండాలి.
2. ఆయా భౌగోళిక ప్రాంతం అప్పటికే 70 శాతానికి పైగా తన సహజ ఆవాసాన్ని, వృక్షజాలాన్ని కోల్పోయి ఉండాలి.

1999లో మెయర్స్ 'Hotspots Earth's Biologically Richest & Most Endangered Terrestrial Ecoregions' అనే గ్రంథాన్ని ప్రచురించారు. 2000లో అంతర్జాతీయ జర్నల్ 'Nature'లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. మెయర్స్ అధ్యయనాలను సవరిస్తూ రసల్స్ మిట్టర్‌మియర్ అనే శాస్త్రవేత్త 2004లో Hotspots Revisited అనే పుస్తకం రాశారు. ప్రారంభంలో 25 హాట్‌స్పాట్‌లను గుర్తించినప్పటికీ ప్రస్తుతం వీటి సంఖ్య 35కు చేరింది.

ప్రపంచ జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లు
1.ఉత్తర, మధ్య అమెరికా-4
1) కాలిఫోర్నియా ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్
2) మాడ్రియన్ పైన్ ఓక్ వుడ్ ల్యాండ్స్
3) మీసో అమెరికా
4) క రేబియన్ దీవులు
2. దక్షిణ అమెరికా-5
1) టంబెస్ చోకో మగ్దలేనా
2) ట్రాపికల్ ఆండెస్
3) చిలియన్ వింటర్ రెయిన్ ఫాల్ వాల్దీవియన్ దీవులు
4) బ్రెజిల్ సెర్రాడో
5) బ్రెజిల్ అట్లాంటిక్ అడవి
3. యూరోప్ మధ్య ఆసియా-4
1) కాకాసస్
2) మధ్యదరా ప్రాంతం
3) ఇరానో అనతోలియన్
4) మధ్య ఆసియా పర్వతాలు
4. ఆఫ్రికా-8
1) పశ్చిమ ఆఫ్రికా గినియా అడవులు
2) సక్కులెంట్ కేర్
3) కేప్ ఫ్లోరిస్టిక్ ప్రాంతం
4) మపుటో ల్యాండ్, పోండోల్యాండ్ ఆల్బనీ
5) తూర్పు ఆఫ్రికా తీర అడవులు
6) ఈస్ట్రన్ ఆఫ్రోమోంటేన్
7) హార్‌‌న ఆఫ్ ఆఫ్రికా
8) మడగాస్కర్ అండ్ హిందూ మహాసముద్ర దీవులు
5. ఆసియా పసిఫిక్-14
1) పశ్చిమ కనుమలు-శ్రీలంక
2) ఇండో బర్మా
3) హిమాలయాలు
4) నైరుతి చైనా
5) సుందాల్యాండ్
6) వాలేసియా
7) ఫిలిప్పీన్స్
8) జపాన్
9) న్యూ కాలిడోనియ
10) తూర్పు మెలనేసియా దీవులు
11) పాలీనేసియా - మైక్రోనేసియా
12) న్యూజిలాండ్
13) నైరుతి ఆస్ట్రేలియా
14) తూర్పు ఆస్ట్రేలియా
పశ్చిమ కనుమలు - శ్రీలంక, ఇండో బర్మా, హిమాలయాలు, సుందాల్యాండ్ అనే నాలుగు హాట్‌స్పాట్‌ల్లో భారత్ భూభాగం విస్తరించింది.

మెగా బయోడైవర్సిటీ దేశాలు
ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలను అత్యధిక జీవ వైవిధ్యం గల మెగా బయోడైవర్సిటీ దేశాలుగా గుర్తించారు. 1998లో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ వీటిని గుర్తించింది.

2002లో మెక్సికో Like Minded Mega diverse Countries అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. అధిక జీవ వైవిధ్యంతో పాటు అపార సంప్రదాయ విజ్ఞానం కలిగిన దేశాలు ఇందులో భాగంగా ఉంటాయి. బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, ఇండియా, ఇండోనేషియా, కెన్యా, మెక్సికో, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, వెనిజులా దేశాలకు చెందిన ప్రతినిధులు 2002, ఫిబ్రవరి 18న మెక్సికోలోని కాంకన్ నగరంలో ఈ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం Like Minded Mega diverse Countries సంఘంలో 20 దేశాలున్నాయి. అయితే Conservational International గుర్తించిన మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో 17 దేశాలు ఉన్నాయి. అవి..
- ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కొలంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెడార్, ఇండియా, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మెక్సికో, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనిజులా.
- సి. హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ.
Published date : 23 Aug 2019 12:30PM

Photo Stories