Skip to main content

ఇన్‌శాట్-3డీఆర్

సి. హరికృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్.
ఇస్రో సెప్టెంబర్ 8న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్ణీత కౌంట్‌డౌన్‌కు 40 నిమిషాలు ఆలస్యంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆ రోజు సాయంత్రం 4.10 గంటలకు రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉండగా, చివర్లో క్రయోజెనిక్ ఇంజన్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, సరిచేసి సాయంత్రం గం.4.50కి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ కలిగిన జీఎస్‌ఎల్‌వీ మార్‌‌క-2 నౌకను ఉపయోగించారు.

అత్యాధునిక వాతావరణ (Meteorological) ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఓజోన్ పొర స్థితి, మేఘాల కదలికల గురించి తెలుసుకునేందుకు, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి, రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీఎస్‌ఎల్‌వీ
భూ స్థిర, భూ అనువర్తిత కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో ఇస్రో 1990లో జీఎస్‌ఎల్‌వీ (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 3 దశల అంతరిక్ష నౌక. ఇందులో మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. మూడో దశ క్రయోజెనిక్ దశ. ఈ దశలో -253°C వద్ద ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్‌ను -196° C వద్ద ఆక్సిడైజర్‌గా ఉపయోగిస్తారు. అమెరికా ఒత్తిడితో 1990ల్లో భారత్‌కు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ బదిలీని రష్యా నిలిపేసింది. దీంతో ఇస్రో 1996లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇస్రో 2010, ఏప్రిల్ 15న జీఎస్‌ఎల్‌వీ-డీ3లో తొలిసారి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్‌లో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 ద్వారా చేపట్టిన విదేశీ క్రయోజెనిక్ ఇంజన్ ప్రయోగం కూడా విజయవంతం కాలేదు. ఈ వరుస వైఫల్యాలకు కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం, ఇస్రో 2013 ఆగస్టులో స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ ఉన్న జీఎస్‌ఎల్‌వీ-డీ5ను ప్రయోగించదలచింది. ఈ ప్రయోగానికి 75 నిమిషాల ముందు రెండో దశలో ఆక్సిడైజర్ ట్యాంకులో లీకేజీని గుర్తించారు. దాంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు. చివరకు ఇస్రో 2014, జనవరి 5న జీఎస్‌ఎల్‌వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించింది. తర్వాత 2015, ఆగస్టు 27న కూడా దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ ఉన్న జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తాజా ప్రయోగంతో క్రయోజెనిక్ ఇంజన్, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల పరంగా భారత్ హ్యాట్రిక్ సాధించింది.

1990లో జీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఇస్రో.. 2001, ఏప్రిల్ 18న మొదటి జీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగాన్ని (జీఎస్‌ఎల్‌వీ-డీ1) విజయవంతంగా నిర్వహించింది. జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్05తో కలిపి ఇప్పటివరకు పది జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు నిర్వహించగా, వాటిలో ఏడు విజయవంతమయ్యాయి.

ఇన్‌శాట్ - 3డీఆర్
ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. ఇస్రో దీన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ద్వారా 170 కి.మీ పెరీజీ, 35,975 కి.మీ. అపోజీ ఉన్న భూస్థిర కక్ష్యలోకి ప్రయోగించింది. దీని బరువు 2211 కిలోలు. దీనిలో మొత్తం నాలుగు పేలోడ్లు ఉన్నాయి. అవి..
  1. మల్టీ స్పెక్ట్రల్ ఇమేజర్
    ఇది భూ స్థిర కక్ష్య నుంచి ప్రతి 26 నిమిషాలకు ఒకసారి కీలక చిత్రాలను భూమికి పంపిస్తుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, పర్వతాలపై మంచు, హిమ నిర్మాణం, మేఘాల కదలికలు, గాలుల వేగం మొదలైన వాటి గురించి కీలక సమాచారం అందిస్తుంది.

  2. సౌండర్
    ఇది 19 చానెల్ సౌండర్, 19 రకాల తరంగ దైర్ఘ్యాల్లో చిత్రీకరణ ద్వారా ఉష్ణోగ్రత, ఆర్ర ్దత సమాచారాన్ని అందిస్తుంది. ఓజోన్ పొరను నిరంతరం అధ్యయనం చేస్తుంది.

  3. డేటా రిలే ట్రాన్స్‌పాండర్
    మానవ రహిత ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఉద్దేశించింది.

  4. సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్‌పాండర్
    ఓడలు, విమానాలు వంటివి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటి నుంచి వెలువడే ప్రమాద సంకేతాలను గ్రహించి తక్షణ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ఇండియన్ మిషన్ కంట్రోల్ సెంటర్ వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉపగ్రహంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్స్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణ దళాలు, జాలర్లు ఎక్కువగా లబ్ధిపొందుతారు. ఇది అందించే వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ విభాగం వద్ద ఏర్పాటుచేసిన ఇన్‌శాట్ మెటీరియోలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ (ఐఎండీపీఎస్) సహాయంతో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంతోపాటు భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, షీషెల్స్, శ్రీలంక, టాంజానియా దేశాలకు ఇన్‌శాట్-3డీఆర్ ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05

 

తొలి దశ

రెండో దశ

మూడో దశ

 

స్ట్రాపాన్స్

కోర్ స్టేజ్

 

 

పొడవు (మీ.)

19.68

20.18

11.57

8.72

వ్యాసం (మీ.)

2.1

2.8

2.8

2.8

ప్రొపెల్లంట్స్

UH25, N2O4

HTPB

UH25, N2O4

LH2, LOX


HTPB: హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్
LH: లిక్విడ్ హైడ్రోజన్
LOX: లిక్విడ్ ఆక్సిజన్
N2O4: నైట్రోజన్ టెట్రాక్సైడ్
UH25: అన్ సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్+25% హైడ్రజైన్ హైడ్రేట్

ఇన్‌శాట్-3డీఆర్ ప్రత్యేకతలు
మధ్య తరంగ దైర్ఘ్య పరారుణ కాంతిలో రాత్రి సమయంలో మేఘాలు, మంచులో స్పష్టంగా చిత్రీకరణ
థర్మల్ పరారుణ బ్యాండ్‌లలో అధిక కచ్చితత్వంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనా.
దృగ్గోచర, థర్మల్ పరారుణ బ్యాండ్‌లలో అధిక రిజల్యూషన్‌తో చిత్రీకరణ.

జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

జీఎస్‌ఎల్‌వీ

తేదీ

ప్రయోగించిన ఉపగ్రహం

1. జీఎస్‌ఎల్‌వీ-డీ1

2001, ఏప్రిల్ 18

జీశాట్-1

2. జీఎస్‌ఎల్‌వీ-డీ2

2003, మే 8

జీశాట్-2

3. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్01

2004, సెప్టెంబర్ 20

ఎడ్యుశాట్ (జీశాట్-3)

4. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్02

2006, జూలై 10

ఇన్‌శాట్-4సీ (విఫలం)

5. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్04

2007, సెప్టెంబర్ 2

ఇన్‌శాట్-4సీఆర్

6. జీఎస్‌ఎల్‌వీ-డీ3

2010, ఏప్రిల్ 15

జీశాట్-4 (విఫలం)

7. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06

2010, డిసెంబర్ 25

జీశాట్-5పీ (విఫలం)

8. జీఎస్‌ఎల్‌వీ-డీ5

2014, జనవరి 5

జీశాట్-14

9. జీఎస్‌ఎల్‌వీ-డీ6

2015, ఆగస్టు 27

జీశాట్-6

10. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05

2016, సెప్టెంబర్ 8

ఇన్‌శాట్-3డీఆర్

Published date : 29 Sep 2016 02:05PM

Photo Stories