Skip to main content

దిక్సూచిలో ఐదో అడుగు.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ

ఇస్రో తమ అంతరిక్ష విజయాల్లో మరో మైలురాయిని దాటింది. పూర్తిస్థాయి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యసాధనలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. జనవరి 20న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ31 నౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ - 1ఇ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా ఏడు ఉపగ్రహాల దేశీయ నావిగేషన్ వ్యవస్థలో.. ఇస్రో 5 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరవేసింది.
2016లో మొదటి ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి జవనరి 20న పీఎస్‌ఎల్‌వీ-సీ31 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. 48 గంటల కౌంట్‌డౌన్ తర్వాత ఈ ప్రయోగాన్ని చేపట్టింది. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 19 నిమిషాలకు భూఅనువర్తిత కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఇ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ31 విజయవంతంగా చేరవేసింది. 280 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గర బిందువు).. 20,657 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూర బిందువు) ఉన్న కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో ప్రయోగించిన 33వ పీఎస్‌ఎల్‌వీ రాకెట్. పీఎస్‌ఎల్‌వీ-సీ31తోసహా.. ఇస్రో 32 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లను (మొదటి ప్రయోగం విఫలం) విజయవంతంగా ప్రయోగించటం విశేషం.

పీఎస్‌ఎల్‌వీ గమనం..
పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమాన్ని ఇస్రో 1982లో ప్రారంభించింది. 1993లో నిర్వహించిన మొదటి అభివృద్ధి ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-డీ1) విఫలమైంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు పీఎస్‌ఎల్‌వీ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది నాలుగు దశల నౌక. దీని మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని.. రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ఇస్రో పీఎస్‌ఎల్‌వీను మూడు రూపాల్లో అభివృద్ధి చేసింది.
  • పీఎస్‌ఎల్‌వీ-జనరిక్: మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టరు మోటర్లు ఉంటాయి.
  • పీఎస్‌ఎల్‌వీ-సీఏ (కోర్ అలోన్): దీని ద్వారా బరువు తక్కువగా ఉన్న ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.
  • పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ల్: ఇందులో అధిక సామర్థ్యం ఉన్న స్ట్రాప్ ఆన్ మోటర్లను ఉపయోగిస్తారు. దీని ద్వారా భారీ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ31
పీఎస్‌ఎల్‌వీ-సీ31ను పీఎస్‌ఎల్‌వీ - ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. దీంట్లో అధిక సామర్థ్యం ఉన్న స్ట్రాప్ ఆన్ మోటార్లను వినియోగించారు. దీని పొడవు 44.4 మీటర్లు, బరువు 320 టన్నులు. పీఎస్‌ఎల్‌వీ-సీ31 కోసం రూ.175 కోట్లు ఖర్చుచేశారు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ
పీఎస్‌ఎల్‌వీ-సీ31 ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ.. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) లో 5వ ఉపగ్రహం. ఈ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో నాలుగింటిని భూఅనువర్తిత (geo synchronous) కక్ష్యలోకి.. మిగతా మూడింటిని భూస్థిర (geo stationary) కక్ష్యలోకి ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహం కంటే ముందు.. నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

వాహక నౌక - ఉపగ్రహం
పీఎస్‌ఎల్‌వీ-సీ22 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ
పీఎస్‌ఎల్‌వీ-సీ24 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి
పీఎస్‌ఎల్‌వీ-సీ26 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి
పీఎస్‌ఎల్‌వీ-సీ27 - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇతోపాటు వీటిలో ఒక్కోదాని బరువు సుమారు 1425 కిలోలు. ఈ ఉపగ్రహంలో ప్రధానంగా రెండు పేలోడ్లు ఉంటాయి.
  • నావిగేషన్ పేలోడ్: ఇది దిశానిర్దేశం చేసే దిక్సూచిగా పనిచేస్తుంది. దీంట్లో అత్యంత ప్రామాణిక రుబీడియం అణు గడియారాలు ఉంటాయి.
  • రేంజింగ్ పేలోడ్: భూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది.

తొలిసారిగా అమెరికాలో..
ఉపగ్రహం ఆధారంగా ఒక వ్యక్తి లేదా వాహన స్థానాన్ని నిర్ధారించి, ఆ వ్యక్తి లేదా వాహన గమనానికి దిక్సూచిగా వ్యవహరించే దిశానిర్దేశ వ్యవస్థ.. జీపీఎస్. సాధారణంగా జీపీఎస్ వ్యవస్థల్లో మూడు విభాగాలు ఉంటాయి. అంతరిక్ష విభాగంలో ఉపగ్రహాలు ఉంటాయి. భూవిభాగంలో యాంటెన్నాలు, డేటా సెంటర్లు ఉంటాయి. మూడోది వినియోగదారుల విభాగం. ఉపగ్రహం ఆధారంగా లభించే నావిగేషన్ ద్వారా అనేక లాభాలు ఉంటాయి. అమెరికాకు చెందిన ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ.. జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం). దీన్ని 1973లో అమెరికా రక్షణ విభాగం అభివృద్ధి చేసింది. ప్రారంభంలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల విషయంలో.. సైనికులకు దిశానిర్దేశం చేసేందుకు ఉపకరించేది. ఆ తర్వాత దీన్ని అనేక పౌర ప్రయోజనాల కోసం విస్తరించారు. అమెరికా జీపీఎస్ వ్యవస్థలో మొత్తం 24 ఉపగ్రహాలు ఉంటాయి. ఆరు కక్ష్యల్లో.. ఒక్కో కక్ష్యలో 4 ఉపగ్రహాలను ప్రయోగించటం ద్వారా భూమిపై ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నావిగేషన్ సేవలు లభిస్తాయి. ఆ తర్వాత ఏ దేశం అభివృద్ధి చేసిన ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను అయినా.. సామర్థ్యంతో సంబంధం లేకుండా జీపీఎస్ అని పిలవటం సర్వసాధారణమైపోయింది.

భారత్ చర్యలు
ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్ సేవలు విస్తరించేంత సామర్థ్యం భారత్ పెంపొందించుకోలేదు. దీని కోసం కనీసం 24 ఉపగ్రహాలను భారత్ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం.. భారత భూభాగం అంతటా, అదే విధంగా ప్రధాన భూభాగం సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు మాత్రమే అన్ని వైపులా నావిగేషన్ సేవలను అందిస్తుంది. అందుకే భారత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం అని పిలిచారు. రీజనల్ అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. అమెరికాతోపాటు భారత్ మాదిరిగా.. అనేక ఇతర దేశాలు ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. యూరప్‌లోని గెలీలియో నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో 27 ఉపగ్రహాలు ఉంటాయి. 2019 నాటికి దీన్ని పూర్తిచేయాలని యూరప్ భావిస్తోంది. 2014, డిసెంబరులో బిడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సేవలను చైనా ప్రారంభించింది. ఇందులో మొత్తం 35 ఉపగ్రహాలు ఉన్నాయి. జపాన్ కూడా తన క్వాసీజెనిథ్ శాటిలైట్ సిస్టం (క్యూజడ్‌ఎస్‌ఎస్) ద్వారా ఇప్పటికే కొన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది. రష్యా తన GLONASSలో భాగంగా 24 ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపయోగాలు
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
  • ఇప్పటివరకు జీపీఎస్ సేవల కోసం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా సున్నితమైన సైనిక సమాచారానికి రక్షణ ఉండదు. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ద్వారా భద్రతతో కూడిన నావిగేషన్ సాధ్యమవుతుంది.
  • పౌర, సైనిక అవసరాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత రవాణాలో గమ్యాన్ని చేరేందుకు దిశానిర్దేశంతోపాటు ఎంత సమయంలో చేరటానికి వీలుంటుందో తెలుస్తుంది.
  • వైద్య రంగంలో మెడికల్ ఎమర్జెన్సీకి ఎంతగానో ఉపకరిస్తుంది. ట్రాఫిక్‌లేని మార్గాలపై సమాచారం అందుతుంది.
  • పర్వతారోహణ, బోటింగ్ వంటి వాటికి ఉపగ్రహ నావిగేసన్ ఉపకరిస్తుంది.
  • సుదూర ప్రాంతాల్లో ఉన్న మానవరహిత వాతావరణ కేంద్రాలు, సీస్‌మిక్ కేంద్రాలపై సమాచారాన్ని సేకరించటానికి ఇది ఉపకరిస్తుంది.
  • విమానయానంలో దీన్ని ఉపయోగించటం ద్వారా కచ్చిత ల్యాండింగ్, టేక్ ఆఫ్‌తోపాటు, విమాన ప్రమాదాల్లో వేగంగా సాయం అందించటానికి, అదే విధంగా ఇంధన నష్టాన్ని నివారించటానికి వీలవుతుంది.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగతేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ప్రయోగం విఫలం (ఐఆర్‌ఎస్-1)

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్ - 1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ), ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హామ్‌శాట్ (Hamsat)

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా), పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సార్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏప్రిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ

పీఎస్‌ఎల్‌వీ-సీ25

నవంబర్ 5, 2013

మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ24

ఏప్రిల్ 4, 2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి

పీఎస్‌ఎల్‌వీ-సీ23

జూన్ 30, 2014

స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2(కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ26

అక్టోబరు 16,2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి

పీఎస్‌ఎల్‌వీ-సీ27

మార్చి 28, 2015

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి

పీఎస్‌ఎల్‌వీ-సీ28

జూలై 10, 2015

5 బ్రిటన్ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ30

సెప్టెంబరు 28, 2015

ఆస్ట్రోశాట్ + 6 విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ29

డిసెంబరు 16, 2015

టీలియోస్-1 + 5 ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ31

జనవరి 20, 2016

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ

Published date : 29 Jan 2016 12:04PM

Photo Stories