Skip to main content

దేశీయ గ‘ఘన’ విజయం

భారత అంతరిక్ష కార్యక్రమంలో అమూల్యమైన విజయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సొంతం చేసుకుంది. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ జీఎస్‌ఎల్‌వీ -డి6 అంతరిక్ష నౌకను ఆగస్టు 27న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాల తర్వాత క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా భారత్ అభివృద్ధి చేసుకుంది.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసింక్రొనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-డీ6 (జీఎస్‌ఎల్‌వీ-డీ6) ద్వారా జీశాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ-డీ6 లిఫ్ట్ ఆఫ్ జరిగిన 17.4 నిమిషాల తర్వాత జీశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భూమికి 170 కిలోమీటర్ల పెరిజి (కక్ష్యలో భూమికి దగ్గరి బిందువు), 35,975 కిలోమీటర్ల అపొజీ (భూమికి దూర బిందువు) జియో ట్రాన్స్‌ఫర్ (భూబదిలీ) కక్ష్యలోకి జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగించింది.

జీఎస్‌ఎల్‌వీ-డీ6
జీఎస్‌ఎల్‌వీ-డీ6 బరువు లిఫ్ట్ ఆఫ్ సమయంలో 416 టన్నులు. దీని ఎత్తు 49.13 మీటర్లు, వ్యాసం 3.4 మీటర్లు. జీఎస్‌ఎల్‌వీ మూడు దశల అంతరిక్ష నౌక. దీని మొదటి దశలో హైడ్రాక్సి టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్‌ను ఘన ఇంధనంగా ఉపయోగించారు. మొదటి దశ చుట్టూ అదనపు బలం కోసం 4 స్ట్రాప్-ఆన్ బూస్టర్ మోటార్లను అమర్చారు. రెండోదశలో అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్‌ను ఘన ఇంధనంగా, డైనైట్రోజన్ టెట్రాక్సైడ్‌ను ఆక్సిడైజర్‌గా వాడారు. మూడో దశ క్రయోజెనిక్ దశ. ఇందులో -253°C ఉష్ణోగ్రత వద్ద ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా, -183°C ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గా ఉపయోగించి ప్రయోగించారు.

జీశాట్-6
ఇది ఒక అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు 2117 కిలోలు. దీనిలో 5 ఎస్-బ్యాండ్, 5 సి-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇలాంటి బ్యాండ్ విడ్త్‌లోని ట్రాన్స్‌పాండర్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం అద్భుతమైన కమ్యూనికేషన్ సేవలను విస్తరించేందుకు వీలు కలుగుతుంది. జీశాట్-6లోని ఆరు మీటర్ల యాంటెన్నా సంకేతాలను పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సంకేతాలను అందుకోగలదు. మొబైల్, ట్యాబ్ వంటి వాటిని ఉపయోగించే వారు మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ వంటి సేవలను మరింత విస్తరించడంలో జీశాట్-6 ఉపయోగపడుతుంది. జీశాట్-6 జీవిత కాలం 9 ఏళ్లు.

ట్రాన్స్‌పాండర్లు-ఉపయోగాలు
కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ట్రాన్స్‌పాండర్లు ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇవి ఒక రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్స్‌మిటర్ కలయికగా పనిచేస్తాయి. దేశంలోని ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాల్లో ప్రస్తుతం 225 ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉన్నాయి. అయితే దేశంలో వీటికి డిమాండు బాగా పెరిగింది. కనీసం 500 ట్రాన్స్‌పాండర్లు భారత్‌లో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దేశీయ ట్రాన్స్‌పాండర్లు సరిపోకపోవడంతో.. ఇస్రో ఇతర దేశాల ఉపగ్రహాల ట్రాన్స్‌పాండర్లను తీసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం భవిష్యత్తులో వీలైనంత వేగంగా ఇలాంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగాలను ఇస్రో మరెన్నిటినో తీసుకురావాల్సి ఉంది. వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష మార్కెట్‌లోకి దూసుకెళ్లేందుకు ఇలాంటి ట్రాన్స్‌పాండర్లు ఉన్న ఉపగ్రహాలు అవసరమవుతాయి.

క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి
అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా వంటి దేశాలు తొలుత ఈ రాకెట్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. భూస్థిర, భూఅనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో ఇస్రో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ కార్యక్రమాన్ని 1990లో ప్రారంభించింది. క్రయోజెనిక్స్ ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్ 1990లో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థతో క్రయోజెనిక్ పరిజ్ఞాన బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ 1993లో స్వదేశీ క్రయోజెనిక్ ప్రాజెక్టు, క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్టు (సీయూఎస్‌పీ)ను ప్రారంభించింది. ఈ రకమైన టెక్నాలజీ అభివృద్ధి అంత సులభం కాదు. ఇన్సులేషన్ క్రయోఫ్లూయిడ్స్, అత్యాధునిక ఇంధనం, ఆక్సిడైజర్ ట్యాంకులు, నిమిషానికి 40 వేలకుపైగా తిరిగే రోటర్లు ఉన్న అత్యాధునిక ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ (ఎఫ్‌బీటీపీ) మొదలైనవి అందుబాటులోకి తీసుకొస్తే తప్ప క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి సాధ్యం కాదు. తమిళనాడు, మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్‌కు చెందిన టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం చివరకు దేశీయ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేసింది.

ప్రయోగ వివరాలు
తొలి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను జీఎస్‌ఎల్‌వీ-డీ3లో అమర్చి 2010, ఏప్రిల్ 15న ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగంలో క్రయోజెనిక్ ఇంజన్‌లోకి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని పంపు చేసే ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంపు (ఎఫ్‌బీటీపీ) విఫలమైంది. పంపు రోటరు విడిపోవడం లేదా పంపు కేసింగ్ బద్దలవడం ద్వారా ప్రయోగం వైఫల్యం చెంది ఉంటుందని ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ తేల్చింది. జీఎస్‌ఎల్‌వీ-డీ5లో 2014, జనవరి 5న దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. జీఎస్‌ఎల్‌వీ-డీ5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం ద్వారా క్రయోజెనిక్ ఇంజన్‌ను వరుసగా రెండోసారి విజయవంతంగా పరీక్షించినట్లయింది.

క్రయోజెనిక్స్ అనువర్తనాలు
క్రయోజెనిక్ దశ అభివృద్ధి సమయంలో ఇస్రో అనేక ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాలను ఏరియెన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించింది. అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రయోజెనిక్స్ అంటారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు వివిధ కొత్త లక్షణాలను సంతరించుకుంటాయి. జీవ నమూనాలను భద్రపరచడంలో ఆహార పదార్థాల సంరక్షణలో, రాకెట్ ఇంజన్ల తయారీలో, వైద్య రంగంలో క్రయోజెనిక్ అనువర్తనాలు అనేకం. క్రయోజెనిక్ ఇంజన్ రాకెట్ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ప్రతి కిలో ఇంధనానికి ఉత్పత్తి అయ్యే బలం కూడా ఎక్కువే. అంతరిక్ష రాకెట్‌లలో మత్రమే కాకుండా క్షిపణుల్లో కూడా క్రయోజెనిక్ ఇంజన్ ఉపయోగం ఉంటుంది.

జీశాట్-6

భౌతిక ప్రమాణాలు

లిఫ్ట్ ఆఫ్ మాస్: 2,117 కిలోలు

మొత్తం పరిమాణం: 2.1 ణ 2.5 ణ 4.1

పవర్

ఉత్పత్తి అయిన పవర్: 3,100 వాట్

యాంటెన్నాలు

0.8 మీ; 6 మీ - సమాచార ప్రసారానికి, గ్రహింపునకు ఉపయో గపడుతుంది.

సమాచార పేలోడ్‌లు

ఎస్-బ్యాండ్ పేలోడ్: ఇందులో 5 స్పాట్ బీమ్ (ఒక శాటిలైట్

సిగ్నల్. ఇది కొంత భూభాగానికి కమ్యూనికేషన్ సేవలు అంది

స్తుంది)లు ఉంటాయి. ఇవి భారత్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఇవి

యూజర్ లింక్‌కు ఉపయోగపడతాయి. ఇది 6 మీటర్లు ఉన్న

యాంటెన్నాను ఉపయోగిస్తుంది.

సి-బ్యాండ్ పేలోడ్: ఇందులో ఒక స్పాట్ బీమ్ ఉంటుంది. ఇది

హబ్ లింక్‌కు ఉపయోగపడుతుంది. ఇది 0.8 మీటర్ల యాంటె

న్నాను ఉపయోగిస్తుంది.

జీవిత కాలం

9 సంవత్సరాలు


జీఎస్‌ఎల్‌వీ-డీ6

ప్రమాణాలు

దశలు

 

మొదటి దశ

రెండో దశ

మూడో దశ

 

స్ట్రాపాన్స్

కోర్ దశ

పొడవు(మీ)

19.7

20.1

11.6

8.7

వ్యాసం(మీ)

2.1

2.8

2.8

2.8

ప్రొపల్లెంట్స్

యూహెచ్25; N2O4

హెచ్‌టీపీబీ

యూహెచ్25; N2O4

H2(L); O2(L)

ప్రొపల్లెంట్ మాస్ (టన్నులలో)

4×42.6

138.1

39.5

12.8

గరిష్ట తోపు (థ్రస్ట్-కిలో న్యూటన్‌లలో)

759.3

4815

799

73.55

సమయం(సెకన్లు)

148.9

106

150

720

యూహెచ్25 - అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్; N2O4 - నైట్రోజన్ టైట్రాక్సైడ్; హెచ్‌టీపీబీ - హైడ్రాక్సి టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్; H2(L) - లిక్విడ్ హైడ్రోజన్; O2(L) - లిక్విడ్ ఆక్సిజన్


జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

వాహక నౌక

ప్రయోగ తేదీ

ఉపగ్రహం

ఫలితం

జీఎస్‌ఎల్‌వీ-డీ1

18-04-2001

జీశాట్-1

విజయం

జీఎస్‌ఎల్‌వీ-డీ2

08-05-2003

జీశాట్-2

విజయం

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్01

20-09-2004

ఎడ్యూశాట్

విజయం

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్02

10-07-2006

ఇన్‌శాట్-4సీ

విఫలం

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్04

02-09-2007

ఇన్‌శాట్-4సీఆర్

విజయం

జీఎస్‌ఎల్‌వీ-డీ3

15-04-2010

జీశాట్-4

విఫలం

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06

25-12-2010

జీశాట్-5పీ

విఫలం

జీఎస్‌ఎల్‌వీ-డీ5

05-01-2014

జీశాట్-14

విజయం

జీఎస్‌ఎల్‌వీ-డీ6

27-08-2015

జీశాట్-6

విజయం

Published date : 11 Sep 2015 02:19PM

Photo Stories