Skip to main content

దేశాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర

ప్రవీణ్ దత్తు, అధ్యాపకులు, ఎల్.హెచ్.ఆర్. <br/> ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం.
భారత ప్రభుత్వం 2017, మే 11న 19వ జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. భారత్ 1998, మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద రెండోసారి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి.. సంపూర్ణ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశంగా ఆవిర్భవించింది. దీంతోపాటు అదే రోజున పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన త్రిశూల్ క్షిపణిని సైతం విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయాలకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 11ను జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా ప్రకటించింది. ఏటా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రగతికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కొనియాడుతూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని పరిశీలిద్దాం..

వ్యవసాయ రంగం
స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశ ఆదాయంలో 55 శాతం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. దీంతోపాటు 75 శాతం ప్రజలకు వ్యవసాయ రంగమే జీవనాధారం. ఆహార ధాన్యాల ఉత్పత్తి సామర్థ్యం కేవలం 50 మిలియన్ టన్నులు. దీంతో దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనేది. దీన్ని నివారించేందుకు ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో సైన్‌‌స అండ్ టెక్నాలజీని ఉపయోగించడంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

1960ల్లో ప్రముఖ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్.స్వామినాథన్ ఆధ్వర్యంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అధునాతన వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనిక పురుగు మందులు వాడకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారింది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంతో నీటిపారుదల సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ), సీఎస్‌ఐఆర్, ఇక్రిశాట్ వంటి శాస్త్రీయ పరిశోధనా సంస్థల ఏర్పాటు.. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇలాంటి చర్యల ఫలితంగా 2016 నాటికి దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి సామర్థ్యం 250 మిలియన్ టన్నులకు చేరింది. పాలు, జీడిపప్పు, పండ్లు, అరటి, మామిడి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా; తేయాకు, గోధుమలు, వరి, చెరకు, చేపలు, పత్తి, పొగాకు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరింది. హరిత విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం వంటి వాటి ద్వారా శాస్త్రీయ మార్గాల్లో దిగుబడిని పెంచారు. సామాన్య రైతుకు కూడా శాస్త్రీయ పద్ధతులపై అవగాహన ఏర్పడింది.

అంతరిక్ష పరిజ్ఞానం
భారత అంతరిక్ష విజ్ఞాన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో దేశ అంతరిక్ష విజ్ఞానం వివిధ దశల్లో అభివృద్ధి చెందింది. 1969లో ఇస్రోను ఏర్పాటు చేశారు. 1975లో మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వంటి లాంచింగ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఉపగ్రహ పరిశోధనలో భారత్ గణనీయ అభివృద్ధిని సాధించింది. దేశ అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ప్రారంభంలో వైఫల్యాలు ఎదురైనా.. భారత శాస్త్రజ్ఞులు మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందడుగేశారు.

ఇస్రో.. ఇన్‌శాట్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వీటితోపాటు టెలివిజన్, టెలీకమ్యూనికేషన్‌‌స, రేడియో నెట్‌వర్‌‌క, వాతావరణ పరిశోధనల కోసం అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. సముద్ర అధ్యయనానికి 1999లో ఓషన్ శాట్, వాతావరణ పరిశోధనకు 2002లో మెట్‌శాట్ (కల్పన-1), 2003లో రిసోర్‌‌సశాట్, విద్యా సర్వీసుల కోసం 2004లో ఎడ్యుశాట్, కార్టోగ్రాఫిక్ అవసరాల నిమిత్తం 2005లో కార్టోశాట్, 2008లో చంద్రయాన్, 2013లో చేపట్టిన మంగళయాన్ (అరుణ గ్రహ యాత్ర) ప్రయోగాలు వీటిలో కీలకమైనవి. 2017లో పీఎస్‌ఎల్‌వీ-సీ37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడాన్ని ఇస్రో చరిత్రలో కీలక ఘట్టంగా పేర్కొనవచ్చు. ఈ ప్రయోగం ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా చేసింది.

భారత్ 1998లో అమెరికా శాటిలైట్లకు సైతం చిక్కకుండా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించింది. దీన్ని రిమోట్‌సెన్సింగ్ రంగంలో మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటీవల అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్.. దేశ ప్రగతికి మరో గీటురాయి.

శాటిలైట్ సేవల ఫలితంగా భారత్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ సర్వీసులు, దూరప్రాంత టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సామాన్య మానవుడు సైతం సెల్‌ఫోన్ వాడుతున్నాడు. టెలీకాస్టింగ్, కేబుల్ నెట్‌వర్‌‌క, డీటీహెచ్ సేవలు విస్తరించాయి. టెలీమెడిసిన్ ద్వారా సుదూర ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయి. వీటితోపాటు ఆన్‌లైన్ టీచింగ్ ద్వారా దూరవిద్యా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ముందస్తు వాతావరణ సూచనలను అందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపగ్రహం ప్రయోగించడానికి ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి భారత్ చేరుకుంది.

దేశ రక్షణ
భారత రక్షణ రంగంలో సైన్‌‌స అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారత ప్రభుత్వం 1958లో డీఆర్‌డీఓను ఏర్పాటు చేసింది. ఇది దేశ రక్షణ రంగానికి అవసరమైన ఎన్నో ఉత్పత్తులను అందిస్తోంది.

మిస్సైల్స్, యుద్ధ ట్యాంకులు, రాడార్లు, యుద్ధవిమానాలను అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా 52 పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేశారు. భారత యుద్ధ ట్యాంకు-అర్జున్; మానవ రహిత విమానాలు.. నిషాంత్, లక్ష్య, నేత్ర, రుస్తుం; స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ధృవ హెలికాప్టర్లు, తేలికపాటి యుద్ధవిమానాలు.. తేజస్, సారస్‌లు, రాజేంద్ర రాడార్, ఐఎన్‌ఎస్ అరిహంత్ (అణు జలాంతర్గామి) తదితరాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
  • 1983లో డాక్టర్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అగ్ని, నాగ్, పృథ్వి, ఆకాశ్, త్రిశూల్, శౌర్య, నిర్భయ్, సాగరిక వంటి క్షిపణులను అభివృద్ధి చేశారు.
  • 1974, 1998ల్లో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించి.. దేశ సత్తాను ప్రపంచానికి చాటారు.
  • 1945లో డాక్టర్ హెచ్.జె.బాబా ఆధ్వర్యంలో భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌లో యురేనియం నిల్వల తక్కువగా ఉన్నాయి. దాంతో భారత్ థోరియం ఆధారంగా మూడు దశల అణు కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేక విధానంగా గుర్తింపు పొందింది. ప్రపంచ దేశాలన్నీ యురేనియంతో అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, భారత్ మాత్రం థోరియంను ఉపయోగించి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా హెవీ వాటర్ రియాక్టర్లు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు, అడ్వాన్‌‌సడ్ హెవీ వాటర్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 21 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇవి మొత్తం 5,780 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటితోపాటు దేశవ్యాప్తంగా తొమ్మిది భారజల ప్లాంట్లను, అప్సర, పూర్ణిమ, సైరస్, ధృవ, జెర్లినా వంటి పరిశోధక రియాక్టర్లను నెలకొల్పారు. బయోటెక్నాలజీ రంగం
  • 1978లో బయోకాన్ ఏర్పాటుతో భారత్‌లో బయోటెక్నాలజీ రంగం ప్రారంభమైందని చెప్పవచ్చు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్ల ఉత్పత్తి, బయోపెస్టిసైడ్‌‌స, బయోఫెర్టిలైజర్ల అభివృద్ధిలో భారత్ విశేష ప్రగతిని సాధించింది. కొత్త కొత్త వ్యాక్సిన్ల ఉత్పత్తితో దేశ ప్రజల జీవన ప్రమాణ కాలం 70 ఏళ్లకు పెరిగింది. రీకాంబినెంట్ హెపటైటిస్-బి వాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. మొత్తంగా బయోటెక్నాలజీ రంగం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది.

సాధించాల్సింది ఎంతో!
స్వాతంత్య్రానంతరం భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించింది. అయితే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. వారందరికీ ఆహారం, ఆరోగ్యం వంటి విషయాల్లో శాస్త్ర సాంకేతిక ఫలాలు దక్కాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే చైనాలో ఒక హెక్టార్‌కు 6,500 కిలోల వరి దిగుబడి సాధిస్తుంటే భారత్‌లో మాత్రం హెక్టార్‌కు 3,100 కిలోల దిగుబడే వస్తోంది. ఫ్రాన్‌‌సలో గోధుమ దిగుబడి హెక్టార్‌కు 7,400 కిలోలు కాగా, భారత్‌లో 2,900 కిలోలు మాత్రమే.

భారత ప్రభుత్వం జీడీపీలో 0.9 శాతాన్ని పరిశోధనలపై వెచ్చిస్తోంది. అదే సమయంలో అమెరికా 2.79 శాతం, దక్షిణ కొరియా 3.36 శాతం నిధులను (జీడీపీ నుంచి)పరిశోధనలకు వెచ్చిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనదేశం కూడా పరిశోధనలపై అధిక నిధులను వెచ్చించాలి. దీనివల్ల సైన్‌‌స అండ్ టెక్నాలజీ రంగంలో మరిన్ని ఫలితాలను సాధించవచ్చు. ఈ దిశగా దేశ పరిశోధన, విద్యారంగాల్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

పరిశోధనలు చేస్తున్న వారికి మనదేశంలో అనుకూల వాతావరణం లేదు. దాంతో ఔత్సాహికులు విదేశాలకు తరలివెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల్లో బోధన, పరిశోధనా ప్రమాణాలను మెరుగుపరచాలి. ప్రస్తుతం స్కూల్, కాలేజీ స్థాయిల్లో ప్రయోగాలను నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. దాంతో విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి తగ్గుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు, ప్రజలు.. అంతా కలిసి వ్యవస్థలోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉంది.
Published date : 17 May 2017 05:36PM

Photo Stories