Skip to main content

వరకట్న వ్యవస్థ – సామాజిక రుగ్మత

పెళ్ళి చేసుకోవడానికి బహుమతిని డిమాండ్ చేయడం, పెళ్ళికి తప్పకుండా ఏదైనా ఇవ్వాలి అని చేసుకునే ముందస్తు షరతునే వరకట్నంగా నిర్వచించవచ్చు. స్త్రీలకి ఆర్థిక బలం ఇవ్వాలన్న మన భారతీయ సాంప్రదాయ భావాలు వరకట్నానికి మూల కారణంగా చెప్పవచ్చు. స్త్రీలకు తల్లి నుంచి కుమార్తెకు వారసత్వంగా ధనం సంక్రమిస్తుంది. ఈ ధనం ఆస్తి, నగలు, వస్త్రాలు, కుటుంబ వ్యాపారంలో వాటాలు రూపంలో ఉంటుంది. అత్త మామలు ఇచ్చే బహుమతులు కూడా ఇందులో భాగమే. స్త్రీ అనుమతితోనే ఆ సంపదను ఇతరులు అనుభవించడానికి వీలుంది. దీని వల్ల కుటుంబంలో స్త్రీకి ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం స్త్రీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

కాలక్రమేణా ఈ సంప్రదాయం వరకట్న పిశాచిగా మారింది. చాలా సందర్భాలలో వివాహ సమయంలో వరుడి తరపువారు లాంఛనాలను తీర్చడానికి వధువు తరపువారు తాహతుకు మించి చేసే ప్రయత్నంలో కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. పెళ్ళప్పుడు అంగీకరించిన వరుడి కోర్కెలు వధువు తరపువారు తీర్చలేకపోతే వధువు ఆమె తల్లిదండ్రులు అన్ని రకాల అవమానాలకు గురికావడం, కొన్ని సందర్భాల్లో హింసకు గురికావడం జరుగుతోంది. స్త్రీధనం కేవలం సంబంధిత స్తీలకే చెందినదే. అయినప్పటికీ ప్రస్తుత వరకట్న విధానంలో భర్తకు, అత్తమామలకు పెండ్లి కుమార్తె చెల్లించే శుల్కంగా రూపాంతరం చెందింది. పెళ్ళిపేరుతో వరుణ్ని, వధువు తరపువారు బహిరంగవేలంలో కొనుక్కున్నట్లవుతోంది. ఇది వధువు తనను పెళ్ళిచేసుకోవడానికి వరుడికి చెల్లించే ధరగా కనిపిస్తుంది.

వరకట్న మరణాలు (Dowry deaths)
దేశంలో వరకట్నం, వరకట్న సంబంధిత నేరాల కట్టడికి కఠిన చట్టాలను తీసుకొచ్చినా, ఆ దురాచారాల వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరుగుతున్నా దేశవ్యాప్తంగా అబలల ఆక్రందనలు మాత్రం ఆగడం లేదు. ఆ తరహా హత్యలు నిరంతరం పెరగుతుండటమే దానికి నిదర్శనం. జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్ సీ ఆర్ బీ ఇటీవల నివేదిక చెబుతున్న చేదు నిజమిది. గంటకో ప్రాణం చొప్పున దేశవ్యాప్తంగా ఏటా కనీసం ఎనిమిది వేలకు తక్కువ కాకుండా వరకట్న పిశాచానికి బలైపోతున్నవారిని కాపాడాలని హెచ్చరిస్తున్నాయి.

మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస, ఇతర ఘోరాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఇంకెన్నో ఆందోళనకర అంశాలున్నాయి. 2011 – 2012 సంవత్సరాల మధ్య ఈ తరహా నేరాల్లో 6.4 శాతం పెరుగుదల నమోదైంది. ఆ నివేదిక ప్రకారం చూస్తే అత్యాచారం తర్వాత అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం వరకట్న హత్యలే. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం వరకట్న సంబంధ సమస్యలతో 2001 జనవరి నుంచి 2012 డిసెంబర్ వరకు 91,202 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. 2012 లోనే మొత్తం 8,233 వరకట్న చావులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2007 నుంచి 2011 వరకు ఏటా అవి పెరుగుతూనే వస్తున్నాయి. 2007లో 8,093 మంది స్త్రీలు మరణించగా 2011 వచ్చే సరికి అది 8,618 మందికి కి పెరిగింది. అయినా ఈ కేసుల్లో దోష నిర్ధారణ శాతం 2011 తో పోల్చితే 2012 లో 3.8 శాతం తగ్గడం గమనించాల్సిన విషయం. 2008లో 4 గంటలకోసారి వినిపించిన మహిళల ఆర్తనాదం ఇప్పుడు గంటకొకటి సారిగా మారింది.

వరకట్నం – విశ్వరూపం (Dowry problem at its peak)
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసల్లో ప్రధాన పాత్రధారి వరకట్న సమస్య. ఈ సామాజిక రుగ్మతపై అవగాహన, సమస్య నియంత్రణ కోసం దశాబ్దాలుగా అనేక వేదికలపై అంతర్జాతీయ సమాజం అనేక ప్రయత్నాలు చేసింది. యత్ర నార్యన్తు పూజ్యంతే తత్ర దేవత: అని ఆడవారిని గౌరవించాలనే పుణ్యభూమిగా చెప్పుకుంటున్న భరతగడ్డపై వరకట్న బాధితురాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయనివారు లేరు. ఆగర్భ శ్రీమంతుల నుంచి పేద మధ్య తరగతి వరకు ఏ ఒక్కరినీ వదలని సమస్యే వరకట్నం. మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి నుంచి మధ్యప్రదేశ్ మురేనాలో ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ను వదలని వరకట్న వేధింపులు ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. ఈ ఉదంతాలు భారతవనిలో ఆడపిల్లగా పుట్టడం ఎంత ఆపదో చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల శాతానికి దాదాపు సమాన స్థాయిలో వరకట్న వేధింపు కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద మధ్య దిగువ తరగతులకే ఇది పరిమితం కావటం లేదని ఇప్పుడు ఎన్ సీ ఆర్ బీ వంటి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆర్థికంగా మంచి స్థితిలోని కుటుంబంలోనూ కట్నం సమస్యలను సృష్టిస్తోంది. డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇలా ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. విద్యాధికులు సైతం కట్నానికి ఆశపడుతూ ఈ సామాజిక దురాచారాన్ని పెంచి పోషిస్తున్నారు. వరకట్న చట్టాల్లోని లొసుగులు వల్ల కేసు విచారణలు కూడా చాలా ఆలస్యమవుతున్నాయి. ఇవి కూడా ముద్దాయిలకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి ఆ మధ్య ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే కోటి నుంచి ఐదు కోట్లు, డాక్టరు అయితే యాభై లక్షల నుంచి కోటి, ఓ మోస్తరు ఉద్యోగి అయితే ఐదు నుంచి యాభై లక్షలు చెల్లించుకోవాల్సిందే. అంతకు ఒక్క పైసా అటూ ఇటూ అయినా లాంఛనాల్లో ఏమాత్రం లోటు జరిగినా కాపురానికి వెళ్లిన పిల్ల క్షేమంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఇక రాజకీయ నాయకుల ఇళ్లల్లో నీకిది నాకిది రూపంలో పేరున జరిగిపోయే లోపాయికారీ ఒప్పందాలు వరకట్న పిశాచం కొత్త రూపాలు. ఇక చట్టాలను అమలు చేయాల్సిన, వాటిని సమీక్షించాల్సిన వ్యవస్థలే ఇలా కునారిల్లుపోతుంటే న్యాయం కోసం గొంతెత్తే ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది. ఇటీవల విపరీతంగా పెరుగుతున్న ఎన్ ఆర్ ఐ అల్లుళ్ళ విశ్వరూపాలు ఈ దేశీయ వరకట్న సమస్య ప్రభావ తీవ్రతకు మరోరూపం.

అక్కరకు రాని చట్టాలు (Laws and Acts are of no use)
2002-2012 మధ్య కాలంలో ఈ మొత్తం నేర గణాంకాలను పరిశీలిస్తే నాగాలాండ్, లక్ష్యద్వీప్ మాత్రమే వివాహితులకు కాస్త సురక్షిత ప్రాంతాలుగా తేలుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఒక్క వరకట్న కేసు కూడా నమోదుకాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్ మాత్రం అత్యంత ప్రమాదకర జాబితాలో ముందు వరుసలో నిలుస్తాయిన్నాయి. ఇవన్నీ కాదు కొన్ని దశాబ్దాలుగా ఏ నివేదికను చూసినా దేశవ్యాప్తంగా మహిళలు పడుతున్న కష్టనష్టాలను కళ్లకు కడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గృహ హింసకు సంబంధించి గతంలో కేంద్ర మహిళా శిశు కుటుంబ శాఖా సహాయ మంత్రిగా రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రకారం అయితే దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఎన్సీఆర్ బీ గణాంకాల ప్రకారం ప్రతీ మూడు నిముషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతీ తొమ్మిది నిముషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులకు, హింసకు గురి అవుతున్నారు. గృహ హింస నిరోధంపేరు చెప్పి అనేక కఠిన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలోనూ ఈ దారుణాలు ఏ మాత్రం ఆగకపోవడానికి వైఫల్యం ఎవరిదనేది అనేది ఇప్పుడు మన ప్రభుత్వం, పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయం.

వికటించిన ప్రయత్నాలు (Futile efforts)
1980 లలో మహిళా సంఘాలు వరకట్నం సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమించి కీలక విజయాలను సాధించారు. పెళ్లి జరిగిన ఏడేళ్లలోపు అగ్నిప్రమాదాల్లో ఆ గృహిణి మరణిస్తే అసహజ మరణంగా నమోదు చేయాలని, భర్తపై తక్షణం హత్య కేసు పెట్టాలనే నిబంధనలు వచ్చాయి. వధువు మరణ వాంగ్మూలం వీలులేని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని చట్టంలో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొంత కాలం పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. తర్వాత తెలిసిన విషయమేమంటే చట్ట సవరణలు తర్వాత కనీసం మృతుల జాబితాలోకి ఎక్కే అవకాశం కూడా ఆ మహిళలు కోల్పోయారు. మూడు ఏళ్ల క్రితం వరకట్న భర్తలపై ఎలాంటి కనికరం చూపనక్కర్లేదనన్న తీర్పు సైతం అలానే అధో జగత్తిలో కలిసిపోయింది.

పరిష్కార మార్గాలు (Solutions)
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ మహిళా సంక్షేమానికి, సాధికారతకు ఎన్నో చర్యలు ప్రభుత్వ పరంగా పౌర సమాజం పరంగా చేపట్టడం జరిగింది. రాజ్యాంగంలోని 14,15 ప్రకరణలు స్త్రీ,పురుషులకు సమానావకాశాలు కల్పించాయి. లింగపరమైన వివక్షను నిషేధించాయి. 39వ ప్రకరణ సమానమైన పనికి సమాన వేతన అవకాశాన్ని కల్పించి మహిళల ఆర్థిక సాధికరతకు దోహదం చేసింది. వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లోనే పార్లమెంటు చట్టం చేసింది. దాన్ని 1986లో సవరించారు. 2001లో మహిళా సాధికారతకు జాతీయ విధానం రూపొందించారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం తీసుకున్నవారికి ఇచ్చినవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించవచ్చు. వరకట్న చావుకు బాధ్యులైనవారికి 7 ఏళ్ల నుంచి ఆజన్మాంత ఖైదు శిక్ష విధించవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ 304బి నిబంధన ప్రకారం వరకట్న నిందితులకు బెయిల్ లభించదు. ఇలాంటి కేసుల్లో వరకట్నం కోసం పీడించలేదని నిందితులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ రూపొందించిన చట్టం(2005) వరకట్న పీడితుకుల మరింత ఊరట కలిగించేందుకు ఉద్దేశించింది. మహిళా సంఘాలు, పౌర సమాజం మరింత కఠినమైన చట్టాలు రూపొందించి ఈ సామాజిక దురాచాన్ని నిర్మూలించాలని కోరుతున్నాయి.

దుర్వినియోగమవుతున్న చట్టం: (Act misusing)
అనేక సందర్భాల్లో వరకట్న నిషేధం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతోంది. కుటుంబంలో ఇతర కారణాల వల్ల ఏర్పడిన మనస్పర్థలను కూడా వరకట్న సంబంధ కేసులుగా చిత్రీకరించి భర్తను అత్తమామలను ఇరికించిన సంఘటనలు లేకపోలేదు. ఈ సందర్భంలో పోలీసులు ఇరుపక్షాల నుంచి సొమ్ము చేసుకోవడం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అమాయకులు బలవుతున్నారు.

చేపట్టాల్సిన చర్యలు: (Action to be taken)
చట్టాల ద్వారా ,ఉద్యమాల ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న దురాచారాన్ని అరికట్టడం కష్టం. అలాగని ఈ దురాచారాన్ని కొనసాగనివ్వాలని కాదు. సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ మేరకు చట్టాలు చేశాయి. హిందూ వారసత్వ చట్టాన్ని సవరించి కుమార్తెల ఆస్తిని అన్యాక్రాంతం చేయడాన్ని నిషేధించాలి. యువతీ,యువకుల వైఖరిలో మార్పు రావాలి. వీటన్నిటి కంటే తల్లిదండ్రులు తమ వివాహిత కుమార్తెలకు ఆదాయాన్నిచ్చే ఆస్తులను (పొలం, ఇల్లు,వ్యాపారంలో వాటా) కానుకగా ఇస్తే వారికి సాధికారత చేకూరుతుంది. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగి వారికి స్వాధీనత లభించినప్పుడే వరకట్న దురాచారం సమసిపోతుంది.

మరికొన్ని సూచనలు: (Some other suggestions)
చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే అత్యధిక మరణాలు నమోదుకు కారణమని జాతీయ మహిళా సంఘం అభిప్రాయం. పోలీసులు మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముంది. ప్రజలు తమ హక్కులు గురించి, చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముంది. అప్పుడే వరకట్న నిషేధ చట్టం వంటి చట్టాలను ప్రభావ వంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. వరకట్న వేధింపులు మొదలవ్వగానే మహిళలు సమస్యను చట్టం దృష్టికి తీసుకురాకపోవటం, పోలీసులు కూడా కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ కేసులు నిలబడట్లేదని న్యాయనిపుణుల అభిప్రాయం. ఇలాంటి కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ ప్రారంభించి మొదట్లోనే చర్యలకు దిగితే ఫలితం ఉంటుంది. దురదృష్టవశాత్తు మన న్యాయవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తోంది.వరకట్న నిషేధ చట్టం, 1961 కి 1986లో సవరణలు జరిపినా ఇంకా కొన్ని లోపాలున్నాయి. భర్త లేదా అతని తరపు బంధువులు క్రూరంగా ప్రవర్తించిన సందర్భంలో ఉపయోగించే ఐపిసి సెక్షన్‌ 498(ఏ) కింద కేసు నమోదయినప్పటికీ కొన్ని సందర్భాల్లో బెయిల్‌ పొందడం సులువే. ఈ లోపాలను సవరించాలి. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కమిషన్లు స్పష్టమైన కార్యాచరణ దిశగా కదలాలి.

Published date : 07 Dec 2013 05:36PM

Photo Stories