Skip to main content

ప్రత్యేక హోదాతో ఫలితమేంటి?

బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగిన సమయంలో సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘ప్రత్యేక హోదా’ అంశం సమకాలీన ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికన ప్రత్యేక హోదా కల్పిస్తారు? దానివల్ల ప్రయోజనాలేంటి? తదితరాలపై విశ్లేషణ..

రాష్ట్ర విభజన జరిగిన అనంతరం మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనకు కేంద్ర కేబినెట్ మార్చి 2న ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు ప్రత్యేక హోదా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికి నిర్దేశించింది. ప్రణాళికా సంఘం పాలనా విభాగమని, కేంద్ర సాయం ప్రణాళికా సంఘం ద్వారానే అందుతుందని రాష్ట్ర విభజనపై జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. సీమాంధ్రకు పన్ను ప్రోత్సాహకాల వంటి ఆరుసూత్రాల అభివృద్ధి ప్యాకేజీ ఉంటుందని చెప్పారు.

భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఉండదు. రెండు ప్రభుత్వాల మధ్య అధికారాలు, విధులు, నిధులను నిర్దిష్టంగా విభజించారు. భారత సమాఖ్య వ్యవస్థ కేంద్రీకృత తరహాలో పనిచేస్తుంది. చాలా అంశాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఏర్పాట్లు చేశారు. దేశంలోని ప్రత్యేక పరిస్థితులు, వైవిధ్యం, ఐక్యత, సమగ్రత దృష్ట్యా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. వనరుల విభజన, కేంద్రం రాష్ట్రాలకు అందించే నిధులకు సంబంధించి రాజ్యాంగ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) వంటి సంస్థలను ఏర్పాటు చేసి, రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రయత్నించారు.

ప్రత్యేక హోదా- చరిత్ర:
1969లో ఐదో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ హోదా అస్సాం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ఉండేది. తర్వాత మరో ఎనిమిది రాష్ట్రాలకు వర్తింపజేశారు. అవి.. అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్. తాజాగా 13 జిల్లాలతో కూడిన సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా పొందే రాష్ట్రాల సంఖ్య 12కు చేరనుంది. తమకూ ప్రత్యేక హోదా కల్పించాలంటూ బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్‌లు ఐదేళ్ల నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది.

ప్రాతిపదిక ఏమిటి?
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి..
 1. పర్వత ప్రాంతాలు, రవాణాకు కష్టతరమైనవి.
 2. తక్కువ జనసాంద్రత, అధిక గిరిజనులు ఉన్న ప్రాంతాలు.
 3. సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు.
 4. ఆర్థికంగా పటిష్టంగా లేని రాష్ట్రాలు.
 5. విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలు.
ఎవరు నిర్ణయిస్తారు?
ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ), కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రత్యేక హోదా నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

ప్రత్యేక హోదా - ప్రయోజనాలు:
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం అవసరమైన ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను తొలుత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పంచుతారు. తర్వాత మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు ఇస్తారు.
 • కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు ఉంటుంది.
 • పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం చేస్తారు.
 • కేంద్రం నుంచి భారీగా నిధులు రావడం వల్ల రాష్ర్ట బడ్జెట్‌కు సంబంధించి పరిమితులు ఉండవు.
 • రాష్ట్రంలో ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్రానికి ఏటా రూ.18 వేల కోట్లు వెళ్తోంది. ఇప్పుడు ఈ పన్నులో భారీ రాయితీలు సీమాంధ్రకు లభిస్తాయి.
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ప్రోత్సాహకాలు:
 • 100 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్ను, 100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు.
 • పెట్టుబడులపై 15 శాతం రాయితీ, స్టాంపు డ్యూటీ, భూమి వినియోగ మార్పిడి, అభివృద్ధి చార్జీల మినహాయింపు.
 • 50 శాతం వ్యాట్ రాయితీ ఇస్తున్నారు.
ప్రణాళికా సంఘం పాత్ర:
కేంద్ర ప్రభుత్వ సహాయ నిధులను ప్రణాళికా సంఘం వివిధ పద్ధతుల్లో రాష్ట్రాలకు కేటాయిస్తుంది. వాటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
 1. సాధారణ కేంద్ర ప్రభుత్వ సహాయం.
 2. అదనపు కేంద్ర ప్రభుత్వ సహాయం.
 3. ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ సహాయం.
వీటిలో మొదటి పద్ధతి ద్వారానే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తుంటాయి.

గాడ్గిల్- ముఖర్జీ ఫార్ములా:
ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు గాడ్గిల్- ముఖర్జీ ఫార్ములా ప్రకారం నిధులు కేటాయిస్తారు. 1969లో ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా డి.ఆర్.గాడ్గిల్ పనిచేశారు. నాలుగో పంచవర్ష ప్రణాళికా సమయంలో కేంద్ర నిధుల కేటాయింపుపై గాడ్గిల్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే 1990లో జాతీయ అభివృద్ధి మండలి ఈ గాడ్గిల్ ఫార్ములాను సమీక్షించి కొన్ని సవరణలు చేసింది. అప్పట్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. అందుకే దీన్ని ‘గాడ్గిల్- ముఖర్జీ’ ఫార్ములా అంటారు. జాతీయ అభివృద్ధి మండలి కొత్తగా నిర్ణయించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు కింది అంశాల ఆధారంగా నిధులు కేటాయిస్తారు.
ప్రాతిపదిక శాతం
జనాభా 60
తలసరి ఆదాయం 25
ఆర్థిక నిర్వహణ 7.5
ప్రత్యేక సమస్యలు 7.5
మొత్తం 100

ఇతర ప్రత్యేక ఏర్పాట్లు:
సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు అనేక ఏర్పాట్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల భౌగోళిక ఇబ్బందులు, వెనుకబాటుతనం, చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లను పొందుపరిచారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 21వ భాగం ఉంది. రాజ్యాంగ ప్రకరణ 370లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు.

ప్రకరణ 371: మహరాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లో వెనుకబడిన విదర్బా, మరట్వాడా, సౌరాష్ర్ట, కచ్ ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. ప్రకరణ 371ఏ నుంచి 371ఐ వరకు వరుసగా నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్ర ప్రదేశ్ (ప్రకరణ 371డి, 371ఈ. వీటిని కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేయవచ్చు), సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వర్తిస్తుంది. 2012లో 98వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 371జే ద్వారా ఈశాన్య కర్ణాటకకు కూడా ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చారు. ప్రకరణ 244(1) ప్రకారం ఐదవ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలు, ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక హక్కులు కల్పించారు. ప్రకరణ 244(2), ప్రకరణ 275(1) ప్రకారం ఆరో షెడ్యూల్లో మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని గిరిజన ప్రాంతాలకు కూడా ప్రత్యేక హక్కులు ఇచ్చారు.

సీమాంధ్రకు ప్రత్యేక హోదా- ప్రయోజనకరమే!
పొడవైన తీరరేఖ, సారవంతమైన డెల్టా, ఎర్ర నేలలు, సహజ వాయువు, ఖనిజ సంపద వంటి ప్రకృతి వరాలు ఉన్న సీమాంధ్రకు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో బహుళ జాతి కంపెనీలు పెట్టుబడులు పెడితే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. రాజధాని, మౌలిక సదుపాయాల విషయంలో ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం కలుగుతుంది.

ఆ ఆటుపోట్లతో ఇబ్బందే!
ప్రత్యేక హోదా సాధించిన రాష్ట్రానికి కేంద్రంతో విభేదాలు ఉంటే వాటి మధ్య ఆటుపోట్లు తప్పవు. కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఘర్షణ, ఆధిపత్య వాతావరణం ఉంటే సమస్యలు తలెత్తుతాయి. కేంద్ర ఇష్టాయిష్టాలపై కాకుండా చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ రక్షణ ఉన్నప్పుడే నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. లేకుంటే వివిక్షతకు గురికావాల్సి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు అభివృద్ధికి ఆటంకం కారాదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నప్పుడే సమాఖ్య వ్యవస్థ విజయవంతమవుతుంది. అవి దేశ ఐక్యతకు, సమగ్రతకు దోహదపడుతుంది.

‘బుందేల్’ ప్యాకేజీ
సీమాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని రాజ్యసభలో ప్రకటించారు. బుందేల్‌ఖండ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి రూ.7,266 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం 2009, నవంబర్ 19న ఆమోదించింది. మూడేళ్ల కాలం లో ఆ మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా బుందేల్‌ఖండ్‌ను కరువు నుంచి బయటపడేయటం, ముఖ్యంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడం లక్ష్యం.

లక్ష్యాలు:
 • వాటర్‌షెడ్ పథకాల ద్వారా యూపీలో 7 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 4 లక్షల హెక్టార్ల అభివృద్ధి.
 • ఉత్తరప్రదేశ్‌లో 60 వేలు, మధ్యప్రదేశ్‌లో రెండు లక్షల హెక్టార్ల అటవీ భూముల్లో భూ పరిరక్షణ చర్యలు.
 • కీలక దశలో పంటలకు నీరందించేందుకు ఒక్కో రాష్ట్రంలో 20 వేల చొప్పున కొత్త బావులు, వాన నీటి నిల్వకు 30 వేల వ్యవసాయ చెరువుల తవ్వకం.
 • రైతు ఆదాయాన్ని పెంపొందించేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, సాగునీటి, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన.
 • 1969లో తొలిసారిగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలనే అంశం తెరపైకి వచ్చింది. ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారు.
 • ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతాయి.
 • పెద్ద మొత్తంలో పెట్టు బడులను ఆకర్షించి, వస్తు ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఎక్సైజ్ డ్యూటీలో భారీ స్థాయిలో రాయితీలు లభిస్తాయి.
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు రుణాలపై వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ రాయితీ పథకాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
Published date : 06 Mar 2014 04:23PM

Photo Stories