Skip to main content

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు- నిరోధక చట్టాలు

Ignorance of the Law Is Not an Excuse...అని అంటారు. ఇది నేరం అని తెలియదు అన్నంత మాత్రాన అది నేరంకాకుండా పోదు. చట్టాల గురించి కనీస అవగాహన ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ, హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనలతో దేశమంతా అట్టుడికింది. మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సహా చాలా చట్టాలు ఉన్నాయి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్‌ ఎగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్-పోక్సో యాక్ట్), గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సతీసహగమన నిషేధ చట్టం, ‘నిర్భయ’ చట్టం, ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ చట్టం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అమలులో ఉన్నా.. చాలామంది మహిళలకు చట్టపరంగా తమకున్న హక్కులపై అవగాహన లేదు. దీని కారణంగా ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, వివిద చట్టాలు, శిక్షలు, మహిళా హక్కులు, శిశు సంక్షేమ చట్టాలు... వంటి వాటికి సంబంధించిన సమగ్రసమాచారం మీకోసం.


మహిళల హక్కులు ఏమేమంటే..
  • పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా వేతనం పొందే హక్కు మహిళలకు చట్టబద్ధంగా ఉంది. చాలాచోట్ల పని ప్రదేశాలలో మహిళలకు ఇప్పటికీ తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. సమాన వేతన చట్టం ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది.
  • గౌరవ మర్యాదలు పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కేసులో మహిళ నిందితురాలైనప్పటికీ, కోర్టుకు అప్పగించడానికి ముందు ఆమెకు నిర్వహించే వైద్యపరీక్షలను మరో మహిళ సమక్షంలోనే నిర్వహించాలి.
  • ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కార్యాలయాలు, కర్మాగారాలు వంటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంది. తోటి ఉద్యోగుల నుంచి లేదా పై అధికారుల నుంచి వేధింపులు ఎదురైతే, వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పని చేస్తున్న సంస్థకు చెందిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి మూడు నెలల్లోగా ఫిర్యాదు చేయవచ్చు.
  • గృహహింస నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. భార్య, సహజీవన భాగస్వామి, తల్లి, సోదరి.. ఇలా కుటుంబంలో ఉండే ఏ మహిళ అయినా గృహహింసకు గురైతే, తమ పట్ల హింసకు పాల్పడే వారిపై గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస ఫిర్యాదులు రుజువైతే నిందితునికి మూడేళ్ల వరకు కారాగార శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి.
  • అత్యాచార బాధితులైన మహిళలకు, బాలికలకు తమ పేరును గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది. తన పట్ల జరిగిన నేరానికి సంబంధించి బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్ ఎదుట గాని లేదా ఒక మహిళా పోలీసు అధికారి ఎదుట గాని తన వాంగ్మూలాన్ని ఇవ్వవచ్చు.
  • న్యాయ సేవల ప్రాధికార చట్టం ప్రకారం మహిళలకు ఉచితంగా న్యాయ సేవలను పొందే హక్కు ఉంది. ఉచిత న్యాయ సేవలను కోరే మహిళల తరఫున కోర్టులో వాదనలను వినిపించడానికి న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది.
  • మహిళలకు రాత్రివేళ అరెస్టు కాకుండా ఉండే హక్కు ఉంది. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా మహిళలను సూర్యాస్తమయం తర్వాతి నుంచి సూర్యోదయం లోపు అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేకమైన కేసుల్లో అరెస్టు చేయాల్సి వస్తే, పోలీసులు తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలను పొందాల్సి ఉంటుంది.
  • పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లలేని పరిస్థితుల్లో ఈ-మెయిల్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా మహిళలు తమ ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చు. అలాంటి ఫిర్యాదులు అందిన తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారి ఒక కానిస్టేబుల్‌ను ఫిర్యాదు చేసిన మహిళ వద్దకు పంపి, నేరుగా ఫిర్యాదు నమోదు చేసుకుంటారు.
  • మహిళలకు అశ్లీల ప్రదర్శనలకు వ్యతిరేకంగా న్యాయం పొందే హక్కు ఉంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా చిత్రించడం, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రదర్శించడం శిక్షార్హమైన నేరాలు. తమ పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసి రక్షణ, న్యాయం పొందే హక్కు మహిళలందరికీ ఉంది.
  • వెంటాడి వేధించడం, ఈ-మెయిల్స్, స్మార్ట్‌ఫోన్‌లపై నిఘా వేయడం వంటి చర్యలకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందే హక్కు మహిళలకు ఉంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి.
  • మహిళలకు జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసుకునే హక్కు ఉంది. బాధితురాలైన మహిళ పట్ల నేరం ఎక్కడ జరిగినా, ఆమె తన ఫిర్యాదును తనకు అందుబాటులో ఉన్న చోట దాఖలు చేసుకోవచ్చు. ఆమె ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, నేరస్థలం ఆ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాకున్నా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందే.

మహిళలపై జరుగుతున్న నేరాలలో కొన్ని...
కొనసాగుతున్న దురాచారం
నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి ఆయువుపట్టు పేదరికం, సాంఘిక నిమ్నతలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లైసెన్స్డ్‌ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరంబారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా యథేచ్చగా రాజ్యమేలుతూనే ఉంది.

ట్రాఫికింగ్.. ప్రాస్టిట్యూషన్
‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు ప‌దిహేను వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణె రెడ్‌లైట్ ఏరియాలోనో, ముంబై కామటిపురాలోనో.. కోల్‌కత్తా సోనాగంచ్‌లోనో తేలుతుంది. ఇవే ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కాని అమలు చేసే చిత్తశుద్ధికి కొరత. అందుకే యేటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కొరలకు చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు.

ఇంట్లోనే కనిపించే చాలా నేరాలలో కొన్ని...
  • చిన్నపిల్లలను సెక్సువల్ అబ్యూజ్‌కి గురిచేయడం దగ్గర్నుంచి డొమెస్టిక్ లేబర్‌ను వేధించడం వరకు. అయితే ఇవి ఇప్పుడు చట్టం పరిధిలోకి వచ్చాయి.
  • భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, బీడీ కంపెనీలు,పొలాలు వంటి చోట్ల దగ్గర మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం పేరుతో, శారీరక రంగు, రూపు గురించి తులనాడడం, తిట్టడం, చేయి చేసుకోవడం, కోరిక తీర్చమని అడగడం) నేరమే.
  • పబ్లిక్‌ టాయ్‌లెట్స్ లేకపోవడం, ఉన్నా వాటిలో సరైన వసతులు అంటే వాటికి తలుపులు లేకపోవడం, ఉన్నా బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్‌లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకెట్లు లేకపోవడం, నిర్వహణ (పరిశుభ్రత వగైరా) సరిగా లేకపోవడం వంటివన్నీ నేరాలే.
  • అంతేకాదు పబ్లిక్ టాయ్‌లెట్లలో గోడల మీద స్త్రీల ప్రై వేట్ పార్ట్ బొమ్మలు వేయడం, పిచ్చి రాతలు రాయడం, అసభ్యకరమైన గీతలు గీయడం వంటివి అన్నీ నేరాలే.
  • అలాగే ఇలాంటి పబ్లిక్ టాయ్‌లెట్స్ దగ్గర కాపలాదారు లేకపోవడం వంటివి.

చట్టం దృష్టిలో ఇవి కూడా నేరాలే...
  • ఇంట్లో అమ్మాయికి, అబ్బాయికి మధ్య తిండి నుంచి చదువు వరకు, పని నుంచి పెంపకం వరకు వివక్ష చూపించడం, అబ్బాయిని అందలం ఎక్కిస్తూ అమ్మాయిని తక్కువ చేయడం నేరం. అలాగే నెలసరి పేరుతో అమ్మాయిలను ఇంట్లోకి రానివ్వకుండా, వారిని దూరంగా ఉంచడం వంటివి కూడా నేరాలే.
  • తాత, తండ్రి, అతని తోబుట్టువులు, సోదరులు, మేనమామ, మామగారు వంటి పురుష కుటుంబ సభ్యులు కుటుంబంలోని అమ్మాయిలను పరుషంగా తిట్టడం, వారి వ్యక్తగత స్వేచ్ఛను హరించేలా తీవ్ర నిఘా పెట్టడం, శీలరక్షణ పేరిట వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం, మాట్లాడటం, తాకరాని చోట తాకడం, అసహజంగా ప్రవర్తించడం వంటివన్నీ గృహహింస చట్టం ప్రకారం నేరాల కిందకే వస్తాయి.
  • భర్త చనిపోయిన స్త్రీని నేటికీ అశుభసూచకంగా చూస్తున్న దురాచారం ఉంది. ఆమెను అలంకారానికి దూరం చేయడం దగ్గర్నుంచి శుభకార్యాలకు హాజారు కానివ్వకపోవడం, ఎదురుపడితే అరిష్టంగా భావించడం, ఒంటిపూట మాత్రమే తినాలంటే నియమం పెట్టడం, చివరగా ఆమెను ఇంట్లో జీతంలేని పనిమనిషిగా ఖాయం చేయడం వంటివీ నేరాలే.
  • నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచకపోవడం కూడా నేరమే.
  • పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆడవాళ్లకు టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయకపోవడం,, ఏర్పాటు చేసినా, వాటిలో సరైన వసతులను అంటే తలుపులు లేకపోవడం, బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్‌లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకెట్లు లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం చివరకు పబ్లిక్ టాయ్‌లెట్స్‌కి కాపలాదారు లేకపోవడం కూడా నేరమే.
  • అంతేకాదు పబ్లిక్ టాయ్‌లెట్స్‌తో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లోని గోడల మీద స్త్రీలకు సంబంధించి అసభ్యకరమైన రాతలు రాయడం, అశ్లీలమైన బొమ్మలు వేయడం వంటివి కూడా నేరాలే.
  • షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో , సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని లేడీస్ టాయ్‌లెట్స్‌ల్లో రహస్య కెమెరాలు ఉంచడం నేరం. దీన్ని సైబర్ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు.
  • బస్సులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మహిళలను తాకడం, అసభ్యకరంగా మాట్లాడ్డం, పిచ్చి సైగలు చేయడం, పురుషులు తమ ప్రై వేట్‌పార్ట్స్‌ చూపించడం వంటి చర్యలు కూడా నేరాలే.

లైంగిక వేధింపులంటే..
మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడినా, లైంగిక దాడికి ప్రయత్నించినా, శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంత పెట్టినా లేదా అందుకోసం అదేపనిగా బతిమాలుతూ విసిగిస్తూ ఉన్నా, వారి పట్ల అశ్లీల పదజాలం ప్రయోగించినా, అసభ్యకరమైన సైగలు చేసినా, అదేపనిగా కన్నార్పకుండా చూస్తూ ఇబ్బంది కలిగించినా, అనవసరంగా తాకుతూ ఇబ్బంది పెట్టినా, లైంగిక పరమైన చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బంది కలిగించినా.. అలాంటి చర్యలన్నింటినీ చట్టం లైంగిక వేధింపులుగానే పరిగణిస్తుంది. రాజ్యాంగంలోని 14, 15 అధికరణాల ప్రకారం పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా రాజ్యాంగం వారికి కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడంగానే చట్టం పరిగణిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి వేధింపులు లేని సురక్షితమైన వాతావరణంలో తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకునే హక్కు కూడా మహిళలకు ఉంది.

అత్యాచారాలపై ప్రభుత్వ గణాంకాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన లెక్కల ప్రకారం 2001 నుంచి 2017 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పదిహేడేళ్ల కాలంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అత్యాచారాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. 2001-17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 4,15,786 అత్యాచార సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 67 అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే దేశంలో సగటున ప్రతి గంటకూ ముగ్గురు మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం 2017లో నమోదైన నేరాల సంఖ్య 3,59,849.

మహిళలపై తరచు జరిగే తీవ్ర నేరాలు... సంబంధిత సెక్షన్లు
  • ఐపీసీ 304 బి: వరకట్న హత్యలను ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. వివాహం జరిగిన ఏడేళ్లలోగా ఒక మహిళ కాలిన గాయాలు లేదా శరీరంపై ఇతర గాయాల కారణంగా మరణించినట్లయితే, చట్టం వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 326 ఎ 326 బి: యాసిడ్ దాడుల సంఘటనల్లో నిందితులకు ఈ సెక్షన్ల కింద ఐదేళ్లకు తగ్గకుండా యావజ్జీవ జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 354: బలప్రయోగం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించిన సంఘటనల్లో ఈ సెక్షన్ కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 354 ఎ: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించే అవకాశాలు ఉంటాయి. మహిళలను అసభ్యంగా తాకడం, అశ్లీల చిత్రాలను, దృశ్యాలను వారికి చూపడం, శృంగారం కోసం వేధించడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు ఈ సెక్షన్ కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు.
  • ఐపీసీ 354 బి: బలవంతంగా మహిళల దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదా దుస్తులను విడిచిపెట్టేలా మహిళలను బలవంతపెట్టడం, దుస్తులను తొలగించే ఉద్దేశంతో మహిళలపై దాడి చేయడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 354 సి: మహిళలు ఏకాంతంగా దుస్తులు మార్చుకుంటుండగా లేదా స్నానం చేస్తుండగా చాటు నుంచి వారిని గమనించడం, రహస్యంగా లేదా అనుమతి లేకుండా, వారి ఏకాంతంలోకి జొరబడి వారి ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 354 డి: ఒక మహిళ తన నిరాసక్తతను, అయిష్టతను స్పష్టంగా తెలియజేసినా, ఆమెను అదేపనిగా వెంటాడటం, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించడం, ఆమె సోషల్ మీడియా, ఇంటర్నెట్ కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ ఉండటం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మరోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 366: బలవంతపు పెళ్లి కోసం లేదా అనైతిక శృంగారం కోసం మహిళలను కిడ్నాప్ చేయడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 366 ఎ: బలవంతపు శృంగారం కోసం లేదా మాయమాటలతో మభ్యపెట్టి శృంగారంలో పాల్గొనేలా చేయడం కోసం పద్దెనిమిదేళ్ల లోపు బాలికలను ఒక చోటి నుంచి మరో చోటుకు తరలించుకుపోవడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 366 బి: బలవంతపు శృంగారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం విదేశాల నుంచి లేదా జమ్ము కశ్మీర్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వయసున్న యువతులను భారతదేశంలోకి తీసుకురావడం నేరం. దీనికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.
  • ఐపీసీ 372: పద్దెనిమిదేళ్ల లోపు వయసున్న బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం ఇతరులకు విక్రయించడం లేదా ఇతరుల వద్ద డబ్బు తీసుకుని మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం వంటి చర్యలు నేరం. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా ఉంటాయి.
  • ఐపీసీ 373: పద్దెనిమిదేళ్ల లోపు వయసు బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం కొనుగోలు చేయడం లేదా డబ్బు చెల్లించి వారిని వ్యభిచారం కోసం వాడుకోవడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 375: ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా, ఆమె అంగీకారం లేకుండా శృంగారం జరపడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. బెదించడం ద్వారా అంగీకారం పొంది శృంగారం జరిపినా, మత్తులో ఉన్నప్పుడు శృంగారం జరిపినా, మైనర్ బాలికను ఆమె అంగీకారంతోనే శృంగారం జరిపినా ఈ సెక్షన్ అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ సెక్షన్ అత్యాచారానికి పూర్తి నిర్వచనమిస్తుంది.
  • ఐపీసీ 376: పోలీసు అధికారులు, జైలు అధికారులు, ఆర్మీ అధికారులు, సైనికులు సహా ఏయే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడే అవకాశం ఉందో ఈ సెక్షన్ విపులీకరిస్తుంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 ఎ: అత్యాచారం జరపడంతో పాటు బాధితురాలిని తీవ్రంగా గాయపరచి, ఆమెను శాశ్వత వికలాంగురాలయ్యేలా చేసినా, నిందితుడు చేసిన గాయాల కారణంగా బాధితురాలు మరణించినా ఈ సెక్షన్ కింద ఇరవయ్యేళ్ల జైలు శిక్ష నుంచి మరణ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 బి: వేరుగా ఉంటున్న మహిళపైన లేదా విడాకులు పొందిన మహిళపైన ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమె భర్త శృంగారం జరిపినట్లయితే, ఈ సెక్షన్ దానిని అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ నేరానికి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 సి: అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా బాధితురాలిపై అధికారం చలాయించే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆమెను లొంగదీసుకుని శృంగారంలో పాల్గొనడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ కింద నిందితులకు ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 డి: ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం జరపడాన్ని ఈ సెక్షన్ సామూహిక అత్యాచారంగా పరిగణిస్తుంది. సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఇరవై ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 ఇ: ఒకసారి అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి తిరిగి మరోసారి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సెక్షన్ కింద యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 498 ఎ: వరకట్న నిషేధ చట్టం-1961లోని సెక్షన్ 324 కింద వరకట్నం అడగడం, ఇవ్వడం కూడా నేరమే. వరకట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచులు లేదా భర్త తరఫు ఇతర బంధువులెవరైనా ఒక మహిళను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ఎ సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదు చేస్తారు.
  • ఐపీసీ 498 ఎ: భర్త లేదా అతని తరఫు బంధువులు ఒక మహిళను శారీరకంగా లేదా మానసికంగా హింసించడాన్ని, ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • వరకట్నం కోసం భర్త ఆమె తరఫు బంధువులు ఒక మహిళను హింసించినట్లు నేరం రుజువైతే, ఐపీసీ 498- సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కట్నం కింద తీసుకున్న డబ్బును, నష్టపరిహారాన్ని బాధితురాలికి చెల్లించాల్సి ఉంటుంది.
  • వివాహిత మహిళను ఆత్మహత్యకు పురిగొల్పేంతగా వేధించడాన్ని, శారీరకంగా, మానసికంగా గాయపరచడాన్ని చట్టం క్రూరత్వంగానే పరిగణిస్తుంది.
  • ఉద్దేశపూర్వకంగా ఆమె ఆరోగ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించడం.. ఉదా: తిండి పెట్టకపోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స జరిపించకపోవడం వంటివి..
  • బాధితురాలి పుట్టింటి నుంచి ఆస్తి కోసం, విలువైన వస్తువులు, కానుకల కోసం మాటలతో, చేతలతో వేధించడం వంటి చర్యలు క్రూరత్వం కిందకే వస్తాయి.
  • భార్య బతికి ఉండగానే, ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే నేరం. దీనిని ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం బైగమీ అంటారు. ఈ నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రెండో పెళ్లి చెల్లకుండాపోతుంది. అయితే మొదటి భార్యకు మగపిల్లాడు పుట్టలేదని, మగ సంతానం కోసం రెండో పెళ్లికి బలవంతంగా ఆమె దగ్గర అనుమతి తీసుకున్నా ఇదీ బైగమీ కింద నేరమే అవుతుంది. పైగా అంగీకారం, అనుమతి రెండూ చెల్లవు.

విశాఖ మార్గదర్శకాలు
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దరిమిలా కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ‘సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్’ను అమలులోకి తెచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన ‘విశాఖ’ మార్గదర్శకాలను యథాతథంగా ఆమోదిస్తూ రూపొందించిన ఈ చట్టంలోని నిబంధనలు ఇవీ...
  • పని ప్రదేశంలో సంస్థ యజమాని గాని లేదా బాధ్యతగల వ్యక్తి గాని సంబంధిత సంస్థలో లైంగిక వేధింపుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో నిర్దేశించిన ప్రకారం లైంగిక వేధింపులంటే ఏమిటనే అంశాన్ని సంస్థలో అందరికీ తెలిసేలా చేయాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాల ప్రతులను ఉద్యోగులందరికీ పంపాలి.
  • లైంగిక వేధింపులను నిషేధిస్తూ క్రమశిక్షణకు సంబంధించిన నియమ నిబంధనలను సంస్థ రూపొందించుకోవాలి.
  • క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
  • మహిళా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలి.
  • వారి పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి యాజమాన్యం పట్టించుకోవాలి.
  • సంస్థలో ప్రతికూల వాతావరణం లేకుండా చూడాలి.
  • పదిమందికి పైగా ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థలోనూ తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థ యాజమాన్యమే ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.

విశాఖ మార్గదర్శకాలు ఎందుకు ఏర్పడ్డాయంటే...
రాజస్థాన్‌లో జరిగిన ఒక అత్యాచార సంఘటన ‘విశాఖ’ మార్గదర్శకాలకు, దాని ఫలితంగా పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల (నిషేధ, నిరోధక, పరిష్కార) చట్టం అమలుకు దారితీసింది. రాజస్థాన్‌లో 1990వ దశాబ్దంలో భన్వరీదేవి అనే ప్రభుత్వ ఉద్యోగి తన పరిధిలో గల ఒక గ్రామంలో తలపెట్టిన బాల్య వివాహాన్ని అడ్డుకుంది. దీనిపై ఆగ్రహించిన గ్రామ పెత్తందార్లు ఆమెకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనే కక్షతో ఆమెపై సామూహికంగా లైంగికదాడికి తెగబడ్డారు.

ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టులో బాధితురాలికి న్యాయం జరగలేదు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ ఏకమై రాజస్థాన్ హైకోర్టు తీర్పును ప్రశ్నించాయి. ‘విశాఖ’ అనే మహిళా హక్కుల సంస్థ మరికొందరిని కలుపుకొని బాధితురాలికి బాసటగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. చివరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాల ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

మహిళా, శిశు సంక్షేమ చట్టాలు... సమగ్ర అవగాహన
1. నిర్భయ చట్టం అంటే ఏమిటి?
ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపినా దరిమిలా కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని (క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్- 2013) అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్‌లో 376 ఎ చేర్చడంతోపాటు పలు మార్పులను తీసుకొచ్చింది. అత్చాచార సంఘటనలతోపాటు మహిళలకు సంబంధించిన ఇతర నేరాల్లో నిందితులకు మరణ శిక్ష సైతం పడేలా ఇండియన్ పీనల్ కోడ్‌ను మరింతగా కఠినతరం చేసింది.

ఇవన్నీ కూడా 354సి నిర్భయ చట్టం కింద వర్తించే నేరాలు
  • పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలకు సరైన మరుగుదొడ్ల వసతి లేకపోవడం నేరమే.
  • అలాగే మహిళలకు నాప్‌కిన్స్‌ (నెలసరి ప్యాడ్స్‌) అందుబాటులో లేకపోవడం కూడా నేరమే.
  • షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో అలాగే సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని టాయ్‌లెట్స్‌లలో రహస్య కెమెరాలు పెట్టడం నేరం. దీన్ని వాయొరిజం కింద పరిగణిస్తారు.
  • బస్సుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను తాకడం, అసభ్యకరంగా మాట్టాడడం, అసభ్యకర సైగలు చేయడం, స్త్రీలకు పురుషులు తమ ప్రైవేట్ పార్ట్స్‌ చూపించడం, అలాగే కార్యాలయాల్లో ఉద్యోగినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వారిని తూలనాడడం, వేధించడం, సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడం, వారిని అవమానించడం వంటివన్నీ నేరాలే. 354, 509 విమెన్ ఇన్‌సల్టింగ్ సెక్షన్ల కింద వీటికి శిక్ష ఉంటుంది.
  • ఇక పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిల మీద కన్నేయడం, వెంబడించడం, ఈవ్‌టీజింగ్, వంటివన్నీ నేరాలన్న సంగతి విదితమే.
  • అంతేకాదు ఇంట్లో కూడా స్త్రీలను, ఈడు వచ్చిన అమ్మాయిలను తాత మొదలుకొని తండ్రి, అన్న, బాబాయ్, పెద్దనాన్న, మేనమామ ఇలాంటి వాళ్లెవరైనా పరుషపదజాలంతో తిట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా తీవ్రమైన నిఘా పెట్టడం, శీలరక్షణ పేరుతో వాళ్లను కట్టడి చేయడం, శీలంపేరుతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం వంటివన్నీ నేరాలే గృహహింస చట్టం కింద. అలాగే ఇంట్లో ఆడపిల్లలను అబ్బాయిలతో పోల్చి తిట్టడం, చులకన చేయడం, వివక్ష చూపించడం వంటివీ నేరాలే.
  • మ్యారిటల్ రేప్ ను జస్టీస్ వర్మ కమిటీ 376(బి) నిర్భయ చట్టం కింద నేరంగా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కాని విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. వివాహబంధంలో ఉన్న భర్త ..భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం క్రూయల్టీ కింద పరిగణించే నేరమే.

2. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే....?
హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామి ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లిలాంటి బంధంలో ఉన్న స్త్రీలకు గృహహింస నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్- 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం). మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసల నుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుందీ చట్టం.
  • సెక్షన్ 18: రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి వేధించరాదని, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్వర్వులే రక్షణ ఉత్తర్వులు లేక ప్రొటెక్షన్ ఆర్డర్స్.
  • సెక్షన్ 19: మహిళను ఇంటి నుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు.
  • సెక్షన్ 20: జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు... అంటే మెయిన్‌టెనెన్స్ ఆర్డర్స్.
  • సెక్షన్ 21: మైనర్ పిల్లల అధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్.
  • సెక్షన్ 22: నష్టపరిహారపు ఉత్తర్వులు... అంటే మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్సేషన్ ఆర్డర్స్.
గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయిచుకోవాలి. ప్రొటెక్షన్ ఆర్డర్స్ కేసు నమోదు చేయడంలో సహాయపడి.. కోర్డుకు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు మాత్రమే క్రిమినల్ చర్యలు తీసుకొనేందుకు వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించేవీలుంటుంది.

3. ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్ అంటే ఏమిటి?
ఎన్‌ఆర్‌ఐని పెళ్లి చేసుకున్న మహిళల భద్రత కోసం అంటే ఎన్‌ఆర్ఐ భర్త పెట్టే హింస, ఇబ్బందుల నుంచి సంబంధిత స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడానికి ఏర్పడిందే ఎన్‌ఆర్‌ఐ సెల్. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమిషన్ , భారతీయ రాయబార కార్యాలయాల సహాయం, సహకారంతో ఎన్‌ఆర్‌ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోందీ ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్.

ఇది ఏం చేస్తుంది?
  • బాధిత మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు నమోదు కాకపోతే.. నమోదు అయ్యేలా, స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేసేలా, ఆ ఎన్‌ఆర్‌ఐ భర్త మీద లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసేలా, నాన్ బెయిలబుల్ వారెంట్ అందేలా చేస్తుంది ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్.
  • దాంతో సదరు నిందితుడు ఎప్పుడూ దేశంలో అడుగుపెట్టినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే అతణ్ణి స్థానిక పోలీసులకు అప్పగిస్తారు.
  • నిందితుడు కోర్టుకు హాజరుకానట్లయితే అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను కోర్టు ఆదేశించవచ్చు.
  • బాధితులకు న్యాయసలహాలు ఇవ్వడానికి, మార్గదర్శకం చేయడానికి ఈ సెల్‌లో నలుగురు న్యాయనిపుణులతో కూడిన ప్యానెల్ ఒకటి ఉంటుంది.
నోట్: ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను సంప్రదించాల్సిన నంబర్లు.. 040- 27852246, వాట్సప్: 9440700906, ఇ- మెయిల్.. tswomensafety@gmail.com FACEBOOK and TWITTER :@ts&womensafety
  • తెలంగాణ మైనారిటీస్ కమిషన్ (తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ సెల్)
విదేశాల్లో గృహహింసను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకోసం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ హైదరబాద్‌లో కేసులు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. బాధితులుగా స్వదేశానికి తిరిగి వచ్చిన మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింసకు సంబంధించి నిందితుల మీద హైదరాబాద్ నుంచే కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడి నుంచే కేసు దర్యాప్తు జరుగుతుంది.

4. దిశ చట్టం అంటే ఏమిటి?
బాలలపై అత్యాచారాలకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడినా, వారిని పోర్నోగ్రఫీ కోసం వినియోగించుకున్నా ఐపీసీ సెక్షన్లతో పాటు ‘పోక్సో’ చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చి కేసులు దాఖలు చేస్తారు. ‘పోక్సో’ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష మొదలుకొని మరణశిక్ష వరకు విధించే అవకాశాలు ఉంటాయి.

ఈ చట్టం ఎలా వచ్చిందంటే...
తెలంగాణరాష్ట్రంలోని శంషాబాద్ శివార్లలో 2019, నవంబరు 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.

ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు :
  • కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు, మరణదండన శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టం.. దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది.
  • నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడాలి.
  • లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.
  • లైంగికదాడి నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు.
  • మెయిల్స్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను చేర్చారు.
  • లైంగిక దాడులకు సంబంధించి 376 సెక్షన్‌లో సవరణ తెచ్చి, కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితులు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష విధించే వెసులుబాటు కల్పించింది.
  • ‘నిర్భయ’ చట్టం ప్రకారం లైంగిక నేరాలపై తీర్పు వెలువడటానికి నాలుగు నెలలుగా ఉన్న వ్యవధిని 21 పని దినాలకు కుదించింది.
  • ఐపీసీ 354 సెక్షన్‌లో కొత్తగా 354-ఎఫ్, 354-జీ సబ్‌సెక్షన్లను చేర్చి, పిల్లలపై అత్యాచారం కాని ఇతర లైంగిక నేరాలకు యావజ్జీవ శిక్ష విధించేందుకు వెసులుబాటు కల్పించింది.
  • మహిళలు, పిల్లలపై జరిగిన నేరాల సత్వర విచారణకు దేశంలో కొన్ని చోట్ల తప్ప ఇంకెక్కడా ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగిన నేర విచారణలో జాప్యం లేకుండా.. రాకుండా వేగంగా విచారణ జరిగి దోషికి శిక్షపడేలా చేస్తాయి ఈ ప్రత్యేక కోర్టులు. రేప్, గ్యాంగ్‌రేప్, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా ద్వారా వేధించడం, అసభ్యంగా చూపించడం వంటి నేరాలతోపాటు , పోక్సో పరిధిలోని అన్ని నేరాలనూ ఈ ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిగేలా చేశారు.
  • ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 45 రోజులకు తగ్గించారు.
  • మహిళలు, పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటి వరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్టిక్ట్ స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
  • మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్ధతిలో డేటా బేస్ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరస్తుడు ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అటువంటి డిజిటల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతోపాటు ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.

తక్షణ చర్యలు ఇవి...
  • ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా... రాష్ట్రంలో 18 మహిళా పోలీస్ స్టేషన్లను సమన్వయం చేసేందుకు, దిశ చట్టం అమలును పర్యవేక్షించేలా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు.
  • మరిన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
  • మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు.
  • విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
  • గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్‌ఏ, సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు
  • డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని ‘దిశ కంట్రోల్’ రూంగా పిలవనున్నారు. అంతేకాదు డయల్ 100, 112లను కలిపి ఒకే టోల్ ఫ్రీ నెంబర్‌గా తెచ్చేందుకు కసరత్తూ జరుగుతోంది.
  • దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు.
  • ప్రతి వన్ స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు.
  • పత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు.
  • ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.
  • 2020 జనవరి నెలాఖరు నాటికి అన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రిల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు, దిశా మహిళా పోలీస్ స్టేషన్‌లు, దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దిశ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం..
  • ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసింది.
  • ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సైబర్ మిత్ర’ పేరుతో వాట్సాప్ నెంబర్ 9121211100కు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దిశ చట్టం తెచ్చిన ప్రభుత్వం మహిళలకు సత్వర న్యాయం, రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్(యాప్)ను తేనుంది.

5. లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వాలు చెల్లవు. ఈ తీర్పుకి కారణమైన కేస్?
మధ్యప్రదేశ్‌లో ఏడేళ్ల బాలికపై 2008లో లైంగికదాడి జరిగింది. నిందితుడు దోషిగా తేలడంతో సెషన్స్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్షరద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్ట్‌కి అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్ట్ నేరస్థుడి శిక్షను తగ్గించి ఏడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే నాటికే ఏడాది కాలం పట్టింది కాబట్టి శిక్ష పూర్తయినట్లేనంటూ కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది.

అదే సమయంలో తమిళనాడులో ఒక లైంగికదాడి కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా బాధితురాలు మైనర్ బాలికే. లైంగిక దాడి కారణంగా ఆమె గర్భవతి కూడా అయింది. మద్రాస్ హైకోర్ట్ జడ్జి.. ఆ అమ్మాయితో ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం నిందితుడిని పెళ్లిచేసుకో’ అంటూ రాజీ కుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆ తీర్పుతో పాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ ‘స్త్రీ శరీరం ఆమె దేవాలయం. ఆ దేవాలయం మీద ఎలాంటి దాడి అయినా నేరమే. ఈ నేరానికి శిక్ష అనుభవించకుండా రాజీ, సెటిల్‌మెంట్ వంటి వాటివి ఆమె ఆత్మగౌరవాన్ని భంగపరిచే ప్రయత్నాలే’ అనే రూలింగ్ ఇచ్చింది.

అసలు ఈ మధ్యవర్తిత్వం అంటే ఏంటి?
ఆల్టర్‌నేటివ్ డిస్‌ప్యూట్స్ రిజల్యూషన్ (ఏడీఆర్)... సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక కేసుకు సంబంధించిన పరిష్కార మార్గాల్లో మధ్యవర్తిత్వం కూడా ఒక పద్ధతి. సులభంగా పరిష్కారమయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్‌కి జడ్జి రిఫర్ చేస్తారు. బాధితులకు మానసిక ఒత్తిడి సత్వర పరిష్కార మార్గాలను అందించేందుకు ఇవి తోడ్పడుతాయి.

మధ్యవర్తిత్వానికి వేటిలో వీలుంటుంది.. వేటిలో కుదరదు?
సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న హత్యలు, డెకాయిటీ.. అంటే ఐపీసీ 354, ఐపీసీ376, ఐపీసీ302, ఐపీసీ 304బి, ఐపీసీ306, ఐపీసీ 307 సెక్షన్ల కిందకు వచ్చే కేసులను మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేయరు. చేయకూడదు కూడా!

మహిళలకు రక్షణా మార్గాలు, జాగ్రత్తలు
మన మీద జరగుతున్న, జరిగే అవకాశమున్న దాడుల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం కూడా మనం తీసుకునే భద్రతాచర్యల్లో భాగమే. మహిళలు తమకు తామే చైతన్యవంతులు కావాలి! మనం ఉన్న పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తుల ఉనికిని గమనిస్తే సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయాలి. చీకటి ప్రదేశాల్లో, జనసంచారం అంతగాలేని చోట ఉండకూడదు.
  • టాక్సీలో, ఆటోలో వెళ్లాల్సి వస్తే వాటిని ఎక్కేముందు ఆ వాహనాల నంబర్‌ను నోట్ చేసుకొని ఇంట్లో వాళ్లకు కానీ, సన్నిహితులకు కానీ మెసేజ్ చేయాలి. అలాగే గమ్యస్థానం చేరుకునే వరకు కావాల్సిన వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండాలి. అంటే వాహనం వెళ్తున్న దారిని ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియచేస్తూ ఉండాలి. ఒకవేళ అంతసేపు మనతో మాట్లాడే తీరికలో ఎవరూలేకపోయినా.. మాట్లాడుతున్నట్లు నటిస్తూ డ్రైవర్‌ను నమ్మించాలి. ప్రయాణిస్తున్న దారినీ పరిశీలిస్తూ ఉండాలి.
  • నడుస్తూ వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు రద్దీ ప్రదేశాల్లో నడిచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ దాడి జరిగితే కేకలు వేస్తే స్పందించే వాళ్లుంటారు.
  • బయటకు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వరకు బంగారు నగలను ధరించకపోవడమే మంచిది. ఒకవేళ ఆకతాయిలు మన మీద దాడి చేసినప్పుడు వాళ్లు మన నుంచి ఏం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారో గమనించాలి. పర్స్‌లాంటివి అయితే వాటిని ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి బయటపడడం ఉత్తమం.
  • హ్యాండ్‌బ్యాగ్‌లో విధిగా పెప్పర్‌స్ప్రే, చెంప పిన్నులు వంటివి పెట్టుకోవాలి.
  • సాధ్యమైనంత వరకు ఆకతాయిలు వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నడిచేటప్పుడు అయిదడుగుల కంటే తక్కువ దూరంలో ఎవరైనా మన వెంట వస్తుంటే అప్రమత్తం కావాలి.
  • మన మీద దాడి జరగగానే గాబరా పడకుండా ముందు దాడిచేసిన వ్యక్తుల కళ్లలో పొడవడానికి ప్రయత్నించాలి. కుదరకపోతే రెండు తొడల మధ్య తన్నడానికి యత్నించాలి. ఈ రెండూ కూడా ది బెస్ట్ సెల్ఫ్ డిఫెయి టెక్నిక్స్ అని మరచిపోవద్దు.
  • అలాగే మొబైల్ ఫోన్స్ లో సేఫ్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రమాదం పొంచి ఉంది అని గ్రహించగానే వాటిని ఉపయోగించాలి. అంతేకాదు మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థల టోల్‌ఫ్రీ నంబర్లనూ ఫీడ్ చేసుకోవాలి. ప్రమాదపు సంకేతాలు కనిపించగానే ఆ నంబర్లకు ఫోన్ చేయాలి.
  • భౌతిక దాడుల సంగతి సరే.. ఇంటర్నెట్ జీవితంలో భాగమైన ఈ కాలంలో సైబర్ నేరాల సంఖ్యా తక్కువేం లేదు. కాబట్టి సోషల్ నెట్‌వర్క్‌లో విరివిగా పాలుపంచుకునేవారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అసలు పంచుకోకుండా ఉంటేనే మంచిది. ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్, ఫోటోలు పెట్టకూడదు. అలాగే ఈ-మెయిల్‌లో కూడా ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్‌ని, వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచకూడదు. బ్యాంక్ సిబ్బంది ఎవరూ ఫోన్‌లో ఆధార్ నంబరు, కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ అడగరు. ఈ విషయాన్ని ఆడ, మగ తేడాలేకుండా అందరూ గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి.
  • మొత్తం కొత్త వాతావరణంలో కొత్తవాళ్లు ఇచ్చే తినుబండారాలు, పానీయాలను స్వీకరించకూడదు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావివ్వకూడదు.
  • చివరిదైనా ముఖ్యమైన సూచన, జాగ్రత్త.. మన సిక్త్‌ సెన్స్ ను నమ్మడం. బయటకు వెళ్లినప్పుడో.. టాక్సీ ఎక్కినప్పుడో.. ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే మెదడు ఇచ్చే ఆ సంకేతాలను కొట్టిపారేయాక శ్రద్ధ పెట్టి అక్కడి నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి.
  • క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడెప్పుడూ డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చోవాలి. డ్రైవర్ దాడికి దిగితే చున్నీతో అతని మెడకు చుట్టేసి అతణ్ణి నిలువరించే వీలుంటుంది. అందుకే హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్‌ స్ప్రే తో పాటు విధిగా చున్నీనీ పెట్టుకోవాలి ఆత్మరక్షణాయుధంలా.
  • అలాగే క్యాబ్ ఎక్కగానే చైల్డ్ లాక్ ఓపెన్ చేసుకోవాలి. దీనివల్ల డ్రైవర్ తన దగ్గర్నుంచి తర్వాత క్లోజ్ చేసే వీలుండదు. ఇలా చైల్డ్ లాక్‌ను ఓపెన్ చేసుకోవడం వల్ల డ్రైవర్ ఏదైనా అఘాయిత్యం తలపెట్టతలిచినా మన వైపు ఉన్న డోర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది.

కుటుంబ హింసను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • ముందు జీవితభాగస్వామి ఇష్టాఇష్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికనుగుణంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. చిన్నచిన్న త్యాగాలకూ సిద్ధపడాలి. వీటి ప్రయోజనం తప్పకుండా ఉంటుందనే విషయం మరిచిపోవద్దు. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
  • జీవితభాగస్వామికి కుటుంబంలో ఇష్టమైన వ్యక్తులెవరో తెలుసుకొని వారిని గౌరవించాలి. వారిపట్ల శ్రద్ధ చూపించాలి.
  • వాదోపవాదాలు, వాగ్వివాదాలు వచ్చినప్పుడు మౌనం వహించడం కన్నా మంచి పద్ధతి లేదు. పరిస్థితి సద్దుమణిగాక మీరు చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పొచ్చు.
  • వివాహం అయిన కొత్తల్లోనే ఆర్థికవనరుల నిర్వహణలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. సమాన భాగస్వామ్యం నిర్వర్తించాలి. ఎవరి ఏటీఎమ్ కార్డులు వాళ్ల దగ్గరే ఉంచుకోవాలి. జాయింట్ ఎకౌంట్స్ జోలికి పోవద్దు. జాయింట్ లాకర్స్‌కీ పోవద్దు. అయితే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం జాయింట్ రిజిస్ట్రేషన్‌కే ప్రాధాన్యమివ్వాలి. అలాగే ఒకరి క్రెడిట్ కార్డ్స్ ఒకరు ఉపయోగించుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మీ పాస్‌పోర్ట్, పర్సనల్ డాక్యుమెంట్స్ వంటివి మీకు సంబంధించిన భద్రమైన చోటులో దాచుకోండి.
  • పుట్టినరోజులు, పెళ్లిరోజులు గుర్తుపెట్టుకుని బాధ్యతగా కాకుండా ఇష్టంగా విష్ చేయాలి. ఓ చిన్న బహుమతి ఇవ్వాలి.
  • మంచి పనుల పట్ల పరస్పర పొగడ్తలు, ప్రోత్సాహం, అభినందనలు అవసరం.
  • ఇతరులతో పోల్చడం చాలా ప్రమాదం. అలాగే జీవితభాగస్వామి బలహీనతలనూ ఒప్పుకునే పెద్దమనసును అలవర్చుకోవాలి.
  • జీవితభాగస్వామికి చాడీలు చెప్పే అలవాటు మానుకోవాలి.
  • సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని చర్చించుకునే వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోడానికి వెనుకాడవద్దు.
  • మీరు ఇంత ఒద్దికగా, ఓపికగా ఉంటున్నా అత్తగారింట్లో అవాంఛనీయ పరిస్థితులు, మనస్తాపం కలిగించే సంఘటనలు ఎదురవుతున్నట్లయితే సన్నిహితులతో, తల్లిదండ్రులతో వాటిని పంచుకోవడం మంచిది.
  • హెల్ప్‌లైన్, ఫ్యామిలీ కౌన్సెలర్స్, సైకాలజిస్ట్‌ల నంబర్లు దగ్గరపెట్టుకోవాలి. పరిస్థితి చేయిదాటుతుందనిపిస్తే వాళ్లను సంప్రదించాలి. అలాగే మహిళల రక్షణకు, భద్రత కోసం ఏర్పడ్డ చట్టాల మీద ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకోవాలి. మీకు ఆ అవగాహన ఉన్నట్టు ఏదో ఒక సందర్భంలో మీ జీవిత భాగస్వామికీ తెలియచేయాలి.
  • ఇవన్నీ చేస్తే జీవిత భాగస్వామి వద్ద మీరు తలవంచినట్టు భావించకండి.. మీ సంసార విజయానికి ఇవి మెట్లు అని గ్రహించండి.
- ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

మహిళల భద్రత కోసం మొబైల్ యాప్స్
మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ‘హాక్ ఐ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఒంటరి ప్రయాణాల్లో మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు.
  • ఎస్‌ఓఎస్...
    ‘హాక్-ఐ’లో ఎస్‌ఓఎస్ (టౌట)విభాగం ఉంటుంది. ప్రాథమిక సమాచారాన్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లను ఫీడ్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్‌ఓఎస్’ను నొక్కితే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారులు పొందుపరచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ‘ఎస్‌ఓఎస్’ను నొక్కిన 9 సెకండ్లకే అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.

  • నెట్ లేకున్నా ఎస్‌ఓఎస్...
    మొబైల్ డేటా అందుబాటులో లేకపోయినా లేదా మొబైల్ డేటా ఆన్‌లో లేకపోయినా ఎస్‌ఓఎస్‌ను డయల్-100కు అనుసంధానిస్తూ కొత్త వెర్షన్‌నూ రూపొందించారు. బాధితులు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా అది ఫోన్ కాల్‌గా మారిపోయి ‘డయల్-100’కు చేరుతుంది. సిబ్బంది అలర్ట్ అవుతారు.

  • ‘వందకూ’ వర్తింపు...
    హాక్-ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్-100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేయకుండా ఈ యాప్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం అందుతోంది.

  • విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్
    మహిళల భద్రమైన ప్రయాణం కోసం ‘హాక్-ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగమే ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’. వాహనం ఎక్కేముందు సదరు ప్రయాణికురాలు ‘హాక్ - ఐ’ యాప్‌లోని ‘ట్రావెల్ మేడ్ సేఫ్’ విభాగంలోని ‘డెస్టినేషన్’ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. కమిషనరేట్‌లోని ఐటీ సెల్ ఆ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది గమ్యం చేరేవరకు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.

ఆత్మరక్షణకు మార్కెట్లో దొరికే ఆయుధాలు..!
అవసరం కోసం మోసపు మాటలతో... క్రూరపు ఆలోచనలతో అరణ్యాలను తలపిస్తున్న ఈ చీకటి కీచక పర్వంలో.. స్త్రీకి ఎప్పుడు? ఏ సమస్య..? ఎలా? వస్తుందో ఊహించడం చాలా కష్టం. ‘అన్ని వేళలా ఎవరో ఒకరు ఆసరాగా, రక్షణగా ఉంటారులే’నన్న అతినమ్మకం ఎంత మాత్రం మంచిది కాదు. వేళ కానీ వేళ, తెలిసిన మనిషైనా.. తెలియని మనిషైనా.. తెలిసిన చోటైనా.. తెలియని చోటైనా.. ఆత్మరక్షణకు ఆయుధాలను వెంట పెట్టుకోవడం తప్పనిసరి. ఆయుధాలంటే కత్తులు, తుపాకీలు కాదు. ఆపద నుంచి తప్పించుకోవడానికి, కుట్రదారుడ్ని బురిడీ కొట్టించడానికి సరిపడే ఆయుధాలుంటే చాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం!

  • స్మార్ట్ లాకెట్
    ఈ లాకెట్ స్టెయిలిష్ లుక్‌తో పాటూ సేఫ్టీని కూడా ఇస్తుంది. అదెలా అంటే.. ఈ లాకెట్‌లో ఓ ప్రత్యేకమైన పరికరం అమర్చి ఉంటుంది. దానికి సంబంధించిన యాప్‌ని మన ఫోన్‌లో వేసుకుంటే.. ఆపద తలెత్తినప్పుడు.. లాకెట్ వెనుక వైపు ఉండే బటన్‌ని గట్టిగా ప్రెస్ చెయ్యాలి. దానిలోని బ్లూటూత్ ఆన్ అయి్య.. ప్రమాదాన్ని మన ఆప్తులకు చేరవేస్తుంది ఈ గాడ్జెట్. దీన్ని మెడలో లాకెట్‌లా అయినా వేసుకోవచ్చు. లేదా వెనుక ఉన్న పరికరాన్ని లాకెట్ నుంచి వేరు చేసుకుని కీచైన్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ధర సుమారుగా 2 వేలు ఉంటుంది. ఈ లాకెట్స్ చాలా కలర్స్‌లో లభిస్తున్నాయి.

  • విజిల్
    విజిల్ కట్టుకున్న చెయిన్‌ను ఎప్పుడూ మెడలో వేసుకోవాలి. ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే విజిల్ ఊదాలి. దాని వల్ల పరిసరాల్లో ఉన్న వ్యక్తుల దృష్టి మీ మీద పడి, మిమ్మల్ని ఆపద నుంచి రక్షించేందుకు వీలుంటుంది.

  • పెప్పర్ స్ప్రే
    మహిళల ఆత్మరక్షణకు ‘పెప్పర్ స్ప్రై' అనేది ఆత్మరక్షణా ఆయుధాల్లో ఒకటి. దీన్ని ప్రయోగించగానే.. దుండగుల కళ్లను, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దాంతో తప్పించుకోవడం సులభం. ఇది మార్కెట్‌లో దొరుకుతుంది.

  • లిప్‌స్టిక్ షేప్డ్ స్టన్ గన్
    ఇది నిజంగా లిప్‌స్టిక్ కాదు. ఆత్మరక్షణ ఆయుధం. దీన్ని ఉపయోగించి.. మిమ్మల్ని మీరు రక్షించుకోచ్చు. దీనిలో స్టన్ గన్ బటన్, ఫ్లాష్ లైట్ బటన్ అనే రెండు ఆప్షయి ఉంటాయి. స్టన్ గన్ బటన్ ఆన్ చేయగానే వైబ్రేషన్ షాక్ వస్తుంది. దాని నుంచి దుండగుడు కోలుకునే లోపు మనం సురక్షితంగా బయటపడొచ్చు. ఇక ఫ్లాష్ లైట్ బటన్ ఆన్ చేసుకుంటే టార్చ్‌లైట్ వెలుగుతుంది. తప్పించుకునే సమయంలో.. చీకటి ప్రదేశాల్లో.. దారి కనిపిస్తుంది. ఇది కీచైన్ కావడంతో సాధ్యమైనంత వరకూ మన వెంటే ఉంటుంది. దీని ధర సుమారు 1300రూపాయలు. దీనిలోని బ్యాటరీ.. చార్జబుల్ బ్యాటరీ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.

  • సేఫ్‌లెట్
    సేఫ్‌లెట్ అనే గాడ్జెట్‌ని అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని ఫోన్‌లో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. గాడ్జెట్ బటన్ ప్రెస్ చేయగానే.. ఆడియో రికార్డింగ్ ఓపెన్ అయ్యి ఫోన్ ద్వారా సమస్యను మన ఆప్తులకు చేరవేస్తుంది. ప్రమాదాన్ని ఊహించిన వెంటనే దీన్ని యాక్టివేట్ చేస్తే.. మనం ఆపదలో ఉన్నామన్న విషయం.. మన స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. మనం ఎక్కడ ఏ లొకేషన్‌లో ఉన్నామనేది కూడా తెలుస్తుంది. దాంతో సమాచారం అందుకున్న వ్యక్తులు ఎమెర్జెన్సీ నంబర్‌ని కాంటాక్ట్ చెయ్యొచ్చు. దీని ధర సుమారు రూ.9,900 కాగా.. దీన్ని ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

  • సేఫ్టీ రాడ్
    ఆపద నుంచి తప్పించుకోవడానికి కొన్ని సార్లు పెనుగులాట తప్పదు. అలాంటి సమయంలో ఇలాంటి రాడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా జానెడు పొడవు ఉంటుంది. ఆపద సమయంలో దీన్ని పెద్దగా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. హైక్వాలిటీతో రూపొందిన ఈ రాడ్‌ని యూజ్ చేసుకోవడం చాలా సులభం. దీని ధర సుమారు 6వందల రూపాయలు. దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెంట తీసుకెళ్లొచ్చు.

మహిళలకు ‘మార్గదర్శకంగా’
సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో ఇంటా, బయట వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు,గృహిహింస, ఒత్తిడికి సంబంధించి కుటుంబసభ్యులు, మిత్రులు, పోలీసులకు చెప్పుకోని విషయాలను మార్గదర్శక్‌ల దృష్టికి తీసుకొస్తే మార్గనిర్దేశం చేస్తారు. అది ఏ రకమైనా సమస్య అయినా ఓపికతో వింటారు. వారికి న్యాయ సహాయమా, పోలీసుల సహాయమా, సైకలాజిల్ సహాయమా...ఇలా వారికి ఏది అవసరమో గుర్తించి ఆయా నిపుణుల వద్దకు పంపిస్తారు. వేధింపులైతే బాధితురాలి పేరును బహిర్గతం చేయకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో 2016 జనవరిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, అదే ఏడాది అక్టోబర్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీన్ని ప్రారంభించారు. రెండు కమిషనరేట్లలో ఇప్పటికి 585 మంది మార్గదర్శక్‌ల ద్వారా 185 కేసులు పరిష్కరించారు.
  • ‘సేఫ్టీ’ జర్నీ....
    ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణం కోసం షీ షటిల్ సేవలను ఎస్‌సీఎస్‌సీ సహాకారంతో సైబరాబాద్ పోలీసులు 2015 జూన్ 30న ప్రారంభించారు. తొలుత రెండు బస్సులతో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడూ ఏడుకు చేరాయి. ఈ బస్సు జీపీఎస్‌కు అనుసంధానం కావడంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధిత ఠాణా పోలీసులను అప్రమత్తం చేస్తారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎస్‌సీఎస్‌సీ సహాకారంతో ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళల భద్రత కోసం 2017 ఆగస్టు 16న షీ షటిల్ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ రెండు కమిషనరేట్లలో కలిపి తొమ్మిది బస్సుల ద్వారా దాదాపు 80,000 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌తో స్మార్ట్‌గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లైంగిక విద్య గురించి లఘు చిత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత... బాల్యానికి భరోసా పేరుతో. ఆరవతగరతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ పాఠాలుంటాయి.

  • ప్రజ్వల
    విమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టడానికి ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. లైంగికదాడికి గురైన మహిళలు, సెక్స్ ట్రేడ్‌లో పట్టుబడ్డ మహిళలకు పునరావాసం కల్పిస్తోంది.. ఆమన్‌గల్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలో. దాదాపు పదేళ్లుగా వందల మందికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారిలో మానసిక స్థయిర్యాన్నీ పెంపొందిస్తోంది . స్వయం ఉపాధిలోనూ శిక్షణనిస్తున్న ఈ ప్రజ్వల సంస్థాపకురాలు, నిర్వాహకురాలు సునీతా కృష్ణన్.

  • గేటర్ హైదరాబాద్‌లో మహిళా భద్రత
    గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. అవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ‘గ్రేటర్’ జనాభా 1.17 కోట్లు. హైదరాబాద్ మహానగరంలో మహిళల రక్షణ కోసం మూడు కమిషనరేట్లూ చొరవ తీసుకుంటూ పలు చర్యలు చేపడుతున్నా, నగరంలో మహిళల పట్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతత్వంలో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోను మొత్తం 300 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్‌లో 1500 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం 2019లో ‘విమెన్ సేఫ్టీ వింగ్’ను కూడా ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలను అరికట్టేందుకు ‘ఎన్‌ఆర్‌ఐ సెల్’ను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనూ కలుపుకొని 2015-19 సంవత్సరాల మధ్య కాలంలో మహిళలకు సంబంధించిన నేరాలపై 19,270 కేసులు నమోదయ్యాయి.
    నోట్: హైదరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490616555, సైబరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490617444, రాచకొండ షీ టీమ్ వాట్సప్ 9490617111

  • షీ ఫర్ హర్‌తో ఈవ్ టీజింగ్‌కు చెక్
    ఈవ్ టీజింగ్‌ను, కళాశాలల్లో విద్యార్థినులపై ర్యాగింగ్ వేధింపులను అరికట్టడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్ 2017లో ‘షీ ఫర్ హెర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ విద్యార్థినులను వాలంటీర్లుగా ఎంపిక చేసి, విద్యార్థుల్లో మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపుల బారిన పడ్డ విద్యార్థినులు ఈ కార్యక్రమం ద్వారా తమ పేర్లు గోప్యంగా ఉండేలా ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ‘షీ ఫర్ హెర్’ ద్వారా గత మూడేళ్లలో 24 కేసులు నమోదయ్యాయి.

  • ఐటీ కారిడార్‌లో ‘సేఫ్ స్టే’
    గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో హాస్టళ్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు 2015లో ‘సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాస్టళ్లన్నీ తప్పనిసరిగా నిబంధనలను పాటించేలా ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, హాస్టళ్లన్నీ తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రతి మూడు నెలలకోసారి హాస్టళ్లన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యల వల్ల హాస్టళ్లలో భద్రత మెరుగుపడింది.

  • టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు
    వివిధ జిల్లాల్లో పోలీసులు, మహిళా భద్రత కేంద్రాల ఫోన్‌నంబర్లతో పాటు ఆపదలో చిక్కుకున్న మహిళలు, బాలల కోసం నిరంతరం పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఇవి. వీటి ద్వారా కూడా బాధితులు తమ సమస్యలను తెలిపి పోలీసుల సహాయం కోరవచ్చు. డయల్ 100, చైల్డ్ లైన్ 1098

6. భరోసా చట్టం అంటే ఏమిటి?
పిల్లలు అంటే బాలురు, బాలికలు (పోక్సో), మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు జరిగితే కేసు నమోదు చేయడంలో సహాయపడ్డం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకే చోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బందులను తప్పించడానికి.. పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్టు హాలు, తికమక పెట్టే డిఫెయి వాదన, నిందితుడి కసి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటివన్నీ లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో సమస్తం సమకూరుస్తోంది భరోసా. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడే జరిగేలా. ఇందుకోసం హెల్త్ డిపార్ట్‌మెంట్ తరపున ఒక డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అంతేకాదు సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి, న్యాయవిచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం.. కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు పిల్లలకు నిందితుడు కనిపించనివిధంగా ఏర్పాటు ఉంటుంది. కోర్టు కూడా పెద్ద హాలులా కాకుండా.. డ్రాయింగ్ రూమ్‌లా కట్టారు. అవసరమైన పిల్లలకు పునరావాసాన్నీ కల్పిస్తారిక్కడ. ఈ భరోసా సెంటర్‌లు ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్ కమిషనరేట్‌లో మరొకటి, సైబరాబాద్ కమిషనరేట్‌లో రెండు, రాచకొండ కమిషనరేట్‌లో, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్‌లోని కోర్టుకు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. ఇంకో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే పిల్లలు ఎక్కడా నిందితుల కంటపడకుండా అన్నమాట.

పోర్న్ వలలో పిల్లలు
  • ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగా పోర్న్ సైట్స్‌కు సరుకుగా మారుతున్నదీ మన పిల్లలే!
  • ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు ముడిసరుకుగా మారుస్తున్నారనేది కఠోర వాస్తవం. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్లల్లో పూరిగుడిసెల్లో సైతం కెమెరాలుంటాయి. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారు పిల్లలు.
  • లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన బాలికలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు.. ఇలా మొత్తం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఉంటుంది. బాలికలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైనా లేదా దారుణమై పరిస్థితిల్లో ఉంటే ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 నుంచి 8 లక్షల రూపాయాల దాకా కూడా ఉండొచ్చు.
  • ఈ చట్టం ప్రకారం.. నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఇదివరకు తమకు అన్యాయం జరిగిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితులపైనే ఉండేది.
  • అలాగే పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా పోలీస్ రికార్డుల్లో, కోర్ట్ రికార్డుల్లో నమోదు చేయకూడదు. కోడ్ నంబర్స్ ఉండాలి. అలాగే మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత ఆ వివరాలను తొలగించాలి.
  • తెలంగాణ పోలీస్ ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా సెంటర్‌లు హైదరాబాద్‌లో ఒకటి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొండాపూర్‌లో ఒకటి, అల్వాల్‌లో ఒకటి ఉన్నాయి. ఈ ఏడాదిలో జీడిమెట్ల, పేట్ బషీరాబాద్, శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లలోనూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి నేర బాధితులకు భరోసా? లైంగికదాడి, లైంగిక వేధింపులు, గహహింస, పోక్సో కేసులకు సంబంధించి న్యాయ, వైద్య సహాయాలు అందిస్తుంది.
  • తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న, ట్రాఫికింగ్‌కు గురైన పిల్లలను ట్రేస్ చేసి, రెస్క్యూ చేయడానికి తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆపరేషన్ స్మైల్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన దర్పణ్ పేరుతో ముఖ గుర్తింపు టూల్‌నూ ఏర్పాటు చేస్తున్నారు.
నోట్: భరోసాను సంప్రదించు నంబర్లు: 040 - 29882977, వాట్సప్ నం: 9490617124

పిల్లల కోసం వివిధ అవగాహన కార్యక్రమాలు ఇలా..
  • ‘కోమల్’ షార్ట్ ఫిల్మ్
    కౌమారదశలో పిల్లల్లో మొదలయ్యే శారీరక మార్పులతోపాటు పాటించాల్సిన శుభ్రత (నెలసరి మొదలయ్యాక అమ్మాయిలు పాటించాల్సిన శుభ్రతతోపాటు), పాటించకపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, పిల్లలకు ఎవరి నుంచి ఎలాంటి హాని ఎదురవుతుందో ఉదాహరణలతో సహా ఈ లఘుచిత్రంలో చూపిస్తున్నారు.. చెబుతున్నారు. తాతయ్య బాలికపై అఘాయిత్యానికి పాల్పడవచ్చు. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తి ఎలాంటి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు? అసలు అప్యాయతతో కూడిన స్పర్శ ఎలా ఉంటుంది? దురుద్దేశంతో కూడిన స్పర్శను ఎలా గుర్తించాలి వంటివన్నీ ఈ లఘుచిత్రాల్లో చూపిస్తున్నారు. ‘కోమల్’ అనే లఘు చిత్ర ప్రదర్శన ద్వారా ఇంటాబయటా స్నేహితులు, అపరిచితుల పట్ల పిల్లలు (ప్రధానంగా బాలికలు) ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నారు. ‘కోమల్’ పది నిమిషాల నిడివి గల హిందీ చిత్రం. ఈ షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శన తర్వాత అందులోని విషయాల గురించి బాలల పరిరక్షణ విభాగం సభ్యులు, వైద్యుడు.. పిల్లలకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికి పదివేల మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

  • పతి మంగళ, శుక్రవారాల్లో..
    జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. జిల్లాలోని బాలల సంరక్షణ విభాగం రెండు బృందాలుగా ఏర్పడి ప్రతి మంగళ, శుక్రవారాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాల్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిబృందంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ముగ్గురు అధికారులతోపాటు ఒక ప్రభుత్వ వైద్యుడు.. మొత్తం సభ్యులుంటారు.

  • రక్షణ కోసం పోరాట శిక్షణ
    పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ‘శక్తి’ పేరుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేరళ రాష్ట్రానికి చెందిన ‘కలరిపయట్టు’, కరాటే మెటీరియల్ ఆర్ట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ‘స్పహ’ పేరుతో జెండర్ ఈక్వాలిటీ మీద బాలురకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు.

    కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్‌పీ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమం ప్రారంభమైంది. దీనిద్వారా జిల్లాలోని విద్యార్థినులకు ఆత్మరక్షణా విద్యలో శిక్షణను ఇప్పించడంతోపాటు, గ్రామస్థాయిలో జెండర్ ఈక్వాలిటీ మీద అవగాహనా సదస్సులనూ నిర్వహిస్తున్నారు.

  • బాలల భద్రత కోసం ‘బాలమిత్ర’
    బాలల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 2019లో ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలా మెలగాలో చెబితే ఆదిలోనే చెడు పోకడలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిల్లలకు, షీ టీమ్స్‌కు మధ్య వారధిగా పనిచేస్తోంది. ‘బాలమిత్ర’ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దీని ద్వారా బాలలపై వేధింపులకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి.
    నోట్: ‘బాలమిత్ర’ హెల్ప్‌లైన్: 9490617444

చివరిగా...
మన సాహితీవేత్తలు ప్రకృతిని కాంత అంటే స్త్రీతో పోలుస్తారు. ఎందుకో తెసుసా! ప్రకృతి పచ్చగా ఉంటే మనిషితో సహా సర్వప్రాణులు ప్రకృతి ఒడిలో సురక్షితంగా ఉంటాయి. అదే ప్రకృతికి హాని జరిగితే సర్వప్రాణికోటి అతలాకుతలం అయిపోతుంది. ఆ ప్రకృతే ప్రకోపిస్తే మనుగడ శూన్యం... స్త్రీలేనిదే సృష్టిలేదు. అటువంటి స్త్రీలో చూడవల్సింది ఆడతనం కాదు అమ్మతనం. స్త్రీని గౌరవిద్దాం! హాయిగా బతకనిద్దాం! భారత జాతి ఖ్యాతి ఇనుమడిద్దాం!
Published date : 25 Jan 2020 05:11PM

Photo Stories