కాలం విలువ తెలియజేసిన మహనీయుడు ఆయన..
గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది.
గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్‌బర్గ్‌లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు.
గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన.
గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి.
∙గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది.
∙అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది.
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్‌లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు.
ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో.
కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు.
గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్‌లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన.