Skip to main content

సాధికారత దిశగా మరో అడుగు.. మహిళా బ్యాంక్

మహిళ సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.. దేశంలో మొట్టమొదటి సారిగా మహిళల అభ్యున్నతి కోసం దేశంలోనే తొలి మహిళా బ్యాంక్ ‘భారతీయ మహిళా బ్యాంక్’ను నెలకొల్పింది.. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న ముంబైలో.. భారతీయ మహిళా బ్యాంకును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.. ఈ నేపథ్యంలో బ్యాంకు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, నిర్దేశించిన లక్ష్యాలు, తదితర అంశాలపై ఫోకస్..

స్వాతంత్య్రానంతరం భారతదేశం పలు రంగాల్లో వృద్ధి సాధించినప్పటికీ.. విద్య, ఆరోగ్యం, ఉపాధి సంబంధిత రంగాల్లో స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఆరోగ్య సౌకర్యాలలోని వ్యత్యాసాల కారణంగా.. పనిలో పాల్పంచుకునే విషయంలో స్త్రీ-పురుషుల మధ్య తారతమ్యాలు పెరిగాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు భారత్‌లో ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా స్త్రీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు (Incidents of Crimes against Women) ఎక్కువగా నమోదవతున్నాయి. ఇటువంటి కేసులు 2012లో 2,44,270 నమోదవగా, 2011లో వీటి సంఖ్య 2,28,650. అంటే 6. 4 శాతం పెరిగాయి. పశ్చిమ బెంగాల్ మహిళల జనాభా దేశ జనాభాలో 7.5 శాతం మాత్రమే అయినప్పటికీ.. 2012లో దేశం మొత్తం మీద నమోదైన స్త్రీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాల సంఖ్యలో 12.7 శాతం ఈ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. వీటన్నిటికీ పరిష్కార మార్గం.. మహిళా సాధికారత.

సాధికారత కోసం:
అభివృద్ధి చెందుతున్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతుల పెంపుదల వంటి అంశాల్లో మహిళల పాత్ర కీలకమైంది. వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకున్న మహిళలు.. ఈ వృత్తితో తమ కుటుంబ అవసరాలను తీర్చలేకపోతున్నారు. దాంతో చిన్న వ్యాపారాలు, సేవలు, వాణిజ్యం వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆహార ప్రాసెసింగ్, టైలరింగ్, టెక్స్‌టైల్స్, నర్సరీ పాఠశాలలు, హ్యాండ్ బ్యాగ్స్ తయారీ వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలతో మహిళలను సాధికారిత దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు మహిళా సాధికారతను వ్యూహాంగా ఎంచుకుంది. ఈ క్రమంలోనే మహిళల అభ్యున్నతికి పలు పథ కాలను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ.. అనేక రంగాల్లో మహిళల వెనుకబాటుతనం ఇప్పటికీ స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మహిళలలో ఆర్థిక సాధికారతను పెంపొందించే క్రమంలో రూ. 1000 కోట్ల మూల ధనంతో దేశంలో మొట్టమొదటి మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పాటు చేస్తామని 2013-14 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.

మహిళలకు మాత్రమే:
దేశంలో తొలి మహిళా బ్యాంకును మహిళలకు మాత్రమే సేవలు అందించే ఉద్దేశంతో ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళలు నిర్వహించే వ్యాపారాలు, స్వయం సహాయక బృందాలు చేపట్టే స్వయం ఉపాధి పథకాలకు, మహిళల ఉన్నతికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే క్రమంలో భారతీయ మహిళా బ్యాంక్ ఏర్పాటు ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 19, 2013 నుంచి బ్యాంక్ తన విధులను ప్రారంభించింది. ఆర్థిక స్వాలంబన సాధించడం కూడా ఈ బ్యాంక్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. భారత్‌లో 35 శాతం వయోజనులు మాత్రమే బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న నేపథ్యంలో ఈ విధమైన ప్రత్యేక బ్యాంకుల ఏర్పాటు ఆహ్వానించదగిన విషయం.

ప్రయోజనాలెన్నో:
నిరక్షరాస్యులైన మహిళలు బ్యాంక్ ఖాతాలను ఆరంభించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి మహిళ ఉద్యోగులనే బ్యాంక్ నియమిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఆయా శాఖలను విస్తరించే క్రమంలో మహిళలలో పొదుపు అలవాట్లు పెరుగుతాయి. స్వయం సహాయక బృందాలలోని మహిళలు బ్యాంకు నుంచి తమ స్వయం ఉపాధి కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన రుణాన్ని తక్కువ వడ్డీకి పొందగలరు. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పెరిగిన నేపథ్యంలో ఖాతాదారులు తమ సంబంధిత బ్యాంకు శాఖలకు నేరుగా వెళ్లే అవకాశం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక డిపాజిట్లను ఆకర్షించడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో గణనీయమైన పాత్రను మహిళా బ్యాంక్ పోషించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లక్ష్యం దిశగా:
మహిళా సాధికారత సాధించే క్రమంలో మహిళా బ్యాంకు ఏర్పాటు ఆశించిన సాంఘిక లక్ష్యాన్ని సాధించగలదు. గ్రామీణ మహిళలు తమ కుటుంబ అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో కూడుకున్న రుణాన్ని తీసుకుంటున్నారు. దాంతో గ్రామీణ రుణ భారం పెరుగుతోంది. మరోవైపు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం కూడా మహిళలు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు నిర్వహించే ఈ బ్యాంక్ మహిళా ఖాతాదార్లను అధికంగా ఆకర్షించగలదని, మహిళలు తమ జీవనోపాధి నిమిత్తం చేపట్టిన పథకాల అమలు కోసం రుణాలు అందించడంతోపాటు ఆర్థిక స్థిరత్వ సాధనకు దోహదపడగలదు. మహిళా బ్యాంకు ఏర్పాటు ద్వారా భవిష్యత్‌లో ఆర్థికాభివృద్ధిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించగలరని బ్యాంకింగ్ రంగ నిపుణురాలు మీరా సన్యల్ అభిప్రాయపడ్డారు. మహిళా శ్రామిక శక్తి పెరుగుదుల ఆర్థిక సాధికారితకు దారి తీస్తుంది.

ఉపాధి అవకాశాలు కూడా:
మహిళ ఉపాధి అవకాశాలను కూడా ఈ బ్యాంకు ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. మహిళా బ్యాంకు తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసే శాఖల కారణంగా ఫైనాన్స్, అకౌంట్స్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మానవ వనరులకు సంబంధించిన రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. ప్రస్తుతం భారత్‌లోని వాణిజ్య బ్యాంకులలోని మహిళా ఉద్యోగుల వాటా 20 శాతం మాత్రమే.

సందేహం:
దేశంలో ఇప్పటికే జాతీయం చేసిన 26 బ్యాంకులు, 21 ప్రైవేట్ బ్యాంకులు, 34 విదేశీ బ్యాంకులు, అనేక సహకార, ప్రాంతీయ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యాలను మహిళా బ్యాంకు సాధించగలదా? అనే విషయంలో సందేహలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లో 14 సంవత్సరాల క్రితం ‘ఉమెన్ బ్యాంక్’ను ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రస్తుతం 38 శాఖలకు మాత్రమే బ్యాంకు కార్యకలాపాలు పరిమితమయ్యాయి. మరోవైపు భారత్‌లో వాణిజ్య బ్యాంకులు అందించే పరపతి కొన్ని వర్గాలకే పరిమితమైంది. ప్రాధాన్యతా రంగ పరపతిలో భాగంగా వ్యవసాయ రుణాల విషయంలో ధనిక రైతులే అధికంగా లబ్ది పొందుతున్నారు. ఉపాధి కల్పనా సామర్థ్యం అధికం ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు పరపతి అందించే విషయంలో కూడా వాణిజ్య బ్యాంకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.

చేయాల్సినవి
Bavithaమహిళా బ్యాంకులు మహిళలలో విద్య, ఆరోగ్య ప్రమాణాల మెరుగుదలకు సంబంధించిన అంశాలకు ఎక్కువగా పరపతి అందించాలి. ఈ చర్య మానవాభివృద్ధి పెరుగుదలకు దారితీసి మహిళా సాధికారత చేకూర్చుతుంది. ఖాతాదార్లకు బీమా పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఖాతాదార్ల సంఖ్యను పెంచుకోవచ్చు.
  • రుణాల మంజూరు విషయంలో పేద వర్గాల మహిళలకు ప్రాధాన్యమివ్వాలి. వీరిని లబ్దిదారులుగా పరిగణించకుండా ఎంట్రీ లెవల్ ఖాతాదార్లుగా గుర్తించాలి.
  • బ్యాంకు వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండకూడదు. బ్యూరోక్రటిక్ కంట్రోల్‌కు అవకాశం ఉండరాదు.
  • మహిళలు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, చిన్న వ్యాపారాలు, చిన్నతరహా సేవలకు సంబంధించి రుణాల మంజూరులో అధిక ప్రాధాన్యతనివ్వాలి.
  • ప్రస్తుతం దేశంలోని వాణిజ్య బ్యాంకులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల బలహీన వర్గాల ప్రజలు బ్యాంకుల నుంచి పరపతి పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సరళమైన నిబంధనలను రూపొందించాలి. తద్వారా బలహీన వర్గాల మహిళలు తగిన పరపతి పొందే అవకాశం ఉంటుంది.
  • ప్రత్యేకంగా మహిళల నుంచి డిపాజిట్లను ఆకర్షించడానికి ఇతర వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేటు కంటే కొంత ఎక్కువ అందించాలి. అప్పుడే మహిళ డిపాజిట్‌దార్ల సంఖ్య పెరిగి వారిలో బ్యాంకింగ్ అలవాట్లు పెరుగుతాయి.
  • ప్రస్తుతం ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న సూక్ష్మ రుణాల విషయంలో రికవరీ 95 శాతంపైగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలోని ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమివ్వాలి.
  • మహిళలలో ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలి.
  • విదేశీ బ్యాంకుల నుంచి పోటీ ఎదుర్కొనే క్రమంలో మహిళా బ్యాంకు వ్యాపారాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలి.
విశేషాలు
  • దేశంలో తొలి మహిళా బ్యాంకు.
  • మహిళా బ్యాంక్‌కు జూన్‌లో ఆర్‌బీఐ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
  • బ్యాంకు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది.
  • బ్యాంక్ చైర్‌పర్సన్, ఎండీగా ఉషా అనంత సుబ్రమణియన్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పని చేశారు)ను ప్రభుత్వం నియమించింది.
  • ముంబైతోపాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ఇండోర్, గౌహతి, బెంగళూరు, జైపూర్, లక్నో నగరాల్లో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తారు.
  • ఉద్యోగుల్లో అధిక శాతం మహిళలే ఉంటారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డిప్యూటేషన్ మీద 125 మంది మహిళలను ఉద్యోగులుగా నియమిస్తారు.
  • 2014, మార్చి 31 నాటికి 25 బ్యాంకు శాఖలను ప్రారంభిస్తారు.
  • 2014 నవంబర్ నాటికి 39 శాఖలను, 127 ఏటీఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
  • బ్యాంక్ ఏడో సంవత్సరం కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి 778 శాఖలు, 2088 ఏటీఎంలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • మొదటి సంవత్సరం కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి 33, 299 ఖాతాదారుల అకౌంట్స్ ఉండాలని, ఏడో సంవత్సరం కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 55, 32, 912కు చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
  • కోర్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, కార్పొరేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఇన్వెస్ట్‌మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి కార్యకలాపాలను ఈ బ్యాంక్ నిర్వహిస్తుంది.
Published date : 22 Nov 2013 10:04AM

Photo Stories