Skip to main content

నగదు బదిలీ అమలు సాధ్యమేనా

పేదరికం, అవినీతి కుడిఎడమలుగా సాగుతున్న వర్ధమాన భారత దేశంలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ముందుకు తెచ్చింది. మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఆయా సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న సబ్సిడీ మొత్తానికి సమానమైన నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. 2013 జనవరి 1 నుంచి ఎంపిక చేసిన జిల్లాల్లో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ విపక్షాలు, ఆర్థిక, రాజకీయ నిపుణులు మాత్రం సంక్షేమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే ఈ పథకాన్ని సాధనంగా చేసుకుందని వ్యాఖ్యానిస్తున్న తరుణంలో నగదు బదిలీ ఉద్దేశం.. సక్రమ అమలు సాధ్యమేనా.. తదితర అంశాలపై విశ్లేషణ..

‘మీ డబ్బు మీ హక్కు’ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకాన్ని యూపీఏ-2 ప్రభుత్వం 2013 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సంక్షేమ పథకాలకు చెందిన సబ్సిడీ నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయడమే నగదు బదిలీ పథకం ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసిన అనుభవంతో దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తొలుత ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 51 జిల్లాల్లో ఈ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 2014 ఏప్రిల్ నాటికల్లా దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తారు.

వీటికి విరుగుడుగానే: ‘రోజుకు కనీసం 1.25 డాలర్లు (సుమారు రూ. అరవై) కూడా సంపాదించలేని నిరుపేదల సంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. పేద, ధనిక వర్గాల మధ్య అగాథం పెరిగింది.’ అని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. ‘పేదలకు ఒక రూపాయి ప్రయోజనం చేకూర్చాలంటే ప్రభుత్వానికి మూడు రూపాయల అరవై పైసలు ఖర్చవుతోంది. సబ్సిడీ ఆహార పద్దులో 58 శాతం పేదలకు అందండంలేదు’ అని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈ రెండింటిని బట్టి దేశంలో అవినీతి, పేదరికం ఎంతగా విస్తరించాయో, వేళ్లూనుకున్నాయో అర్థమవుతుంది. దీనికి విరుగుడుగా నగదు బదిలీ పథకం ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతున్నారు. 2012 అక్టోబరు 20న రాజస్థాన్‌లోని దూదూలో ఆధార్ అనుసంధానిత సేవల పంపిణీని ప్రధాని ప్రారంభించారు. ఆధార్ కార్డు ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ఇకపై దేశ ప్రజలు నేరుగా పొందవచ్చని, గ్యాస్ సబ్సిడీలు, పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులు, ఉపకార వేతనాలు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. సంక్షేమ నిధుల విషయంలో అవినీతి, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.

నగదు బదిలీ అంటే: స్వాతంత్య్రానంతరం కాలంలో దేశంలో పేదరికాన్ని రూపు మాపే క్రమంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ వీటికి కేటాయించే నిధుల్లో అతి తక్కువ మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయి. ముఖ్యంగా పేదలకు చౌకగా ఆహార ఉత్పత్తులు అందించేందుకు 1957 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తోంది. ఇటు పేదలకు ఆహార భద్రతతోపాటు రైతుల వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర అందించడం కూడా దీని ప్రధాన లక్ష్యం. దీంతోపాటు అనేక పథకాలను కూడా అమలుచేస్తోంది. ఈ పథకాల ప్రయోజనం లబ్ధిదారులకు అతి తక్కువగానే చేరుతోందని, అంతా అవినీతి నోటికి చిక్కుతుందనే విమర్శ ఎన్నాళ్లగానో ఉంది. ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తున్న ఖర్చులో 16 శాతం కూడా ప్రజలకు చేరట్లేదని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. దారిద్య్ర నిర్మూలనకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు అవినీతి కారణంగా తగిన సత్ఫలితాలు ఇవ్వలేదు. అమలులో లోపాలు, నిర్వహణ వైఫల్యాల వల్ల అవినీతి పెరిగిపోయి లక్షిత ప్రజానీకానికి వాటి ప్రయోజనాలు చేరడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగానే ప్రత్యక్ష నగదు బదిలీ(డీసీటీ), షరతులతో కూడిన నగదు బదిలీ(సీసీటీ) ముందుకొచ్చాయి. వాస్తవానికి ప్రత్యక్ష నగదు బదిలీకి సంబంధించి వృద్ధాప్య పింఛన్ల వంటి పథకాలు 1960 నుంచే మన దేశంలో అమలవుతున్నాయి. రేషన్, గ్యాస్, ఎరువులపై ఇచ్చే ప్రభుత్వ రాయితీలను నగదు రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడమే నగదు బదిలీ పథకం.
నగదు బదిలీకి ప్రత్యేక కమిటీలు: నగదు బదిలీ పథకం అమలుకు తగిన కార్యాచరణ రూపకల్పన,
పర్యవేక్షణకు ప్రధాన మంత్రి నేతృత్వంలో అక్టోబర్ 26న ‘నేషనల్ కమిటీ ఆన్ డెరైక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్’ని ప్రకటించారు. 11 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర ప్రతి పత్తిగల ఇద్దరు సహాయ మంత్రులు, (ఆర్థిక, కమ్యూనికేషన్లు -ఐటీ, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయశాఖ, మానవ వనరుల అభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, మైనారిటీల వ్యవహారాలు, ఆరోగ్య, కార్మిక, ఇంధన, రసాయనాలు ఎరువుల శాఖల మంత్రులు) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, యూఐడీఏఐ చైర్మన్, కేబినెట్ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులు. ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పులోక్ ఛటర్జీ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కమిటీకి సహకరిస్తుంది. దీంతోపాటు నగదు బదిలీ సజావుగా, సకాలంలో అమలయ్యేలా చూసేందుకు మిషన్ మోడ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో సాంకేతిక కమిటీ, ఆర్థిక సమ్మిళత కమిటీ, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల స్థాయిలో నగదు బదిలీల కమిటీలు ఉంటాయి.నగదు బదిలీకి ప్రధాన ఆధారంగా ఉండే ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కూడా ఈ కమిటీల ముఖ్య బాధ్యతగా ఉంటుంది.

బదిలీ ఇలా: నగదు బదిలీ పథకాన్ని తొలుత మానవ వనరుల అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం తదితర మంత్రిత్వ శాఖల్లో అమలు చేస్తారు. సంక్లిష్టమైన ఆహారం, ఎరువుల సబ్సిడీ, వంట గ్యాస్ తదితరాలకు సంబంధించి తర్వాత దశలో అమలు చేయాలని నిర్ణయం. ఈ నగదు బదిలీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో దేశవ్యాప్తంగా ఇరవై క్లస్టర్లను ఏర్పాటు చేసి, ‘బిజినెస్ కరస్పాండెంట్’ అనే వ్యవస్థను రూపొందించనుంది. వీరు లబ్ధిదారుల చెంతకు మొబైల్ ఏటీఎంలను తీసుకువెళ్లి ఆధార్ కార్డు గుర్తింపుతో నేరుగా నగదు అందజేస్తాయి. బ్యాంకుల శాఖల్లేని మారుమూల పల్లెల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సబ్సిడీలకు బదులుగా ఈ నగదు చెల్లింపులు ఉంటాయి. ఉదాహరణకు ఒక రేషన్‌కార్డు దారుడు ఒక లీటరు కిరోసిన్ తీసుకున్నాడనుకుంటే.. దాని ధర రేషన్ షాపులో రూ.15; బహిరంగ మార్కెట్లో రూ.45 ఉంటుంది. అంటే లభించే సబ్సిడీ రూ. 30. ఈ సబ్సిడీ వ్యత్యాసాన్ని (రూ.30) అతని ఖాతాలో జమచేశాక అతను రూ.45 చెల్లించి కొనుగోలు చేయాలి. ఒక వేళ ఆ నెలలో కిరోసిన్ తీసుకోకపోతే ఈ నగదు జమ కాదు. జిల్లా వ్యాప్తంగా కిరోసిన్ పంపిణీ పూర్తయ్యాక రేషన్ డీలర్లు పంపే యుటిలిటీ సర్టిఫికెట్ ఆధారంగా నగదు బదిలీ జరుగుతుంది. ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రజలకు సాలీనా గరిష్ఠంగా రూ.3,20,000 అందజేయాలని ప్రభుత్వ యోచన. లక్షిత కుటుంబాలకు సగటున ఏడాదికి రూ. 40 వేలు అందుతాయని మరో అంచనా. ఉపకార వేతనాలు, ఎరువుల సబ్సిడీ వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, మహిళా, శిశు సంక్షేమ పథకాల ద్వారా చెల్లించే మొత్తాలు ఇకపై ఈ పథకం నుంచే లబ్ధిదారులకు చేరుతాయి.

విదేశాల్లో ఇలా: ప్రపంచంలోని పలు దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో పదిహేనేళ్ల క్రితం నుంచే ఈ నగదు బదిలీ పథకం అమలవుతోంది. రెండు రకాల నగదు బదిలీ పథకాల్లో ఏదో ఒకదాన్ని దాదాపు 30 దేశాలు ప్రవేశ పెట్టాయి. షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాన్ని 1997లో మెక్సికోలో ‘ప్రొగెసా’ పేరుతో ప్రారంభించారు. తర్వాత ‘ఆపర్చునిడెన్స్’ అని పేరు మార్చారు. బ్రెజిల్‌లో 1995లో ‘బోల్సా ఎస్కోలా’ 2003లో ‘బోల్సా ఫ్యామిలియా’ కార్యక్రమాలను ప్రారంభించారు. హోండురాస్, నికరాగ్వా, ఈక్వెడార్, డొమినికన్ రిపబ్లిక్, పనామా, పెరూ, జమైకా వంటి దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలే అమలవుతున్నాయి. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాలూ ఇటీవల షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టాయి. షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాన్ని మొదట 2007 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో ‘ఆపర్చునిటీ ఎన్‌వైసీ’ పేరుతో ప్రారంభించారు. ఈ దేశాలన్నింటిలోకి బ్రెజిల్‌లో మాత్రమే సమర్థంగా అమలవుతోంది. ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద దారిద్య్ర నిర్మూలన కార్యక్రమంగా దీన్ని పేర్కొంటున్నారు. ఆ దేశ జనాభాలో నాలుగో వంతు అంటే కోటి పది లక్షల మందికిపైగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మెక్సికోలో 25 శాతం మంది ఈ పథకం పరిధిలో ఉన్నారు.

మన దేశంలో సాధ్యాసాధ్యాలు: మన దేశంలో ఈ పథకాన్ని ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభం కోసం ముందుకు తెస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నగదు బదిలీ అనే మాటలను 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావించినా.. ప్రచారంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం కూడా రాహుల్ గాంధీ క్రెడిట్‌గా 2014 ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తాపత్రయమే తప్ప పేదలకు సేవ చేద్దామనే చిత్తశుద్ధి మాత్రం కాదనే విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నగదు బదిలీ రూపంలో లంచాలను ఎర వేస్తోందని బీజేపీ ఆక్షేపించింది. రాజకీయ కోణాలను పక్కన పెడితే.. ఈ పథకం అమలులో ఆచరణాత్మక సమస్యలు అనేకం ఎదురవనున్నాయి. ముఖ్యంగా అసలైన లబ్ధిదారుల గుర్తింపే ప్రధాన సమస్య అవుతుంది. వీరిని ఆధార్ కార్డుల ప్రాతిపదికన గుర్తించాలనేది పథకం ఉద్దేశం. దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే ఈ కార్డుల జారీ బాగా సాగుతుందనే ప్రచారం ఉంది. వాస్తవానికి మన రాష్ట్రంలో ఈ ప్రక్రియ అధ్వానంగా కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి నెలలు గడిచినా కార్డులు అందని దుస్థితి. ఇంత గందరగోళం మధ్య ఈ కార్డుల ఆధారంగా ఈ నగదు బదిలీకి పూనుకోవడం పెద్ద సాహసమే. ఆధార్ కార్డు ద్వారా పేదల గుర్తింపు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదు. పేదల నిర్వచనంపై ప్రభుత్వానికే ఒక స్పష్టత లేదు. సబ్సిడీ పథకాల లబ్ధిదారుల్లో అత్యధికులు గ్రామీణులు, నిరక్షరాస్యులే. ఈ కుటుంబాల్లో పురుషులదే పెత్తనం. నగదు బదిలీ మహిళల పేరిట చేసినా.. ఆ డబ్బు చేరేది పురుషునికే. వినిమయ సంస్కృతి పెరిగిన పరిస్థితుల్లో గ్రామీణులకు కూడా డబ్బు అవసరం ఎక్కువైంది. సబ్సిడీకి ప్రత్యామ్నాయంగా ఇస్తున్న నగదు ఆ అవసరాలకు కాకుండా ఇతరత్రా వినియోగాలకు ఖర్చయ్యే ప్రమాదం కూడా ఉంది. చివరకు సబ్సిడీపై ఆహార పదార్థాలు దొరక్క పస్తులుండే దుర్భవస్థను ఎదుర్కొనాల్సి వస్తోంది. దీంతో పేదరికం తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఏర్పడతుంది. పోషకాహార లేమి సమస్య కూడా తీవ్రమవుతుంది. ఇప్పటికే దేశంలో పౌష్టికాహార లేమితో ఉన్న చిన్నారుల సంఖ్య దాదాపు 40 శాతం అని అంచనా.

ప్రజాపంపిణీ వ్యవస్థ ‘నిర్వీర్యం’ అవడానికి కారణంగా చెబుతున్న అవినీతి అనే జాఢ్యం నగదు బదిలీకి సోకే ప్రమాదం కూడా ఉత్పన్నమవుతుందంటే కాదనలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ విభాగాలకే పరిమితమైన ఈ అవినీతి ఇకపై బ్యాంకుల సిబ్బందికీ సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాల గురించి అందరికీ తెలుసు. ఇదే తరహా అవినీతి నగదు బదిలీలోనూ చోటుచేసుకుంటుందనడంలో సందేహం లేదు. మన పర్యవేక్షణ, నిఘా విభాగాలూ పూర్తి నిర్లిప్తత, అవినీతిలో కూరుకుపోయిన విషయం సుస్పష్టం. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దలేని పాలకులు నగదు బదిలీలో ఎదురయ్యే సమస్యలు, అక్రమాలను ఎలా సరిచేయగలరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది. పీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. రైతు (ఉత్పత్తిదారుడు), వినియోగదారుడు(పేదలు)కి మేలు చేసే పీడీఎస్ గాడి తప్పితే దేశంలో మార్కెట్ ద్రవ్యోల్బణం అదుపు తప్పడానికే దారి తీస్తుందని ఆర్థికవేత్తల అభిప్రాయం.

ఎన్నెన్నో సందేహాలు
ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా 2013 జనవరి 1 నుంచి అమలు కానున్న నగదు బదిలీ పథకంపై తొలగని సందిగ్ధతలు, మరికొన్ని వాస్తవాలు...

  1. ప్రస్తుతం దేశంలో 51.7 శాతం కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 58.7 శాతంగా ఉంది.
  2. దేశంలో ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ప్రజలకు ఆధార్ కార్డులు అందలేదు. ఈ కార్డుల ఆధారంగానే నగదు బదిలీ కార్యక్రమం ఉంటుందంటే ఇది ఏ పరిస్థితులకు దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు.
  3. నగదు బదిలీ పథకాన్ని మొత్తం 35 పథకాలకు వర్తింపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
  4. రాష్ట్రంలో నగదు బదిలీ ప్రాజెక్టుకు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలును ఎంపికచేసి అమలు చేస్తున్నారు.
  5. దేశంలో ఈ పథకంలో 2.8 కోట్లమంది లబ్ధిదారులకు రాష్ట్రీయ స్వాస్థ్యభిమాన్ కల్పించారు. 1.4 కోట్ల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలందించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పెట్టుబడి రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
  6. ఈ పథకం వల్ల రాజస్థాన్‌లోని ఆల్వాల్ జిల్లాలో కిరోసిన్ పంపిణీ నెలకు 80 వేల లీటర్ల నుంచి 14వేల లీటర్లకు తగ్గింది.
  7. మైసూరులో వంటగ్యాస్ కనెక్షన్లు 40 శాతం తగ్గాయి.
Published date : 13 Dec 2012 02:15PM

Photo Stories