Skip to main content

కార్పొరేట్ వ్యవసాయం - సమీక్ష

‘‘ఇండియా గ్రామాల్లో నివసిస్తుంది వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక’’ -మహాత్మాగాంధీ

ఇండియా వ్యవసాయక దేశం. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వ్యవసాయక పురోభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది. మూడింట రెండు వంతుల జనాభా తమ జీవనాధారానికి వ్యవసాయం మీదనే ఆధారపడుతుంది. గత రెండు, మూడు దశాబ్దాలలో వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. 1950-51లో 51 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే, 2011-12లో అది 250 మిలియన్ టన్నులకు చేరుకుంది. నూనె గింజల ఉత్పత్తి 5 మిలియన్ టన్నుల నుంచి 28 మిలియన్ టన్నులకు పెరిగింది. వ్యవసాయ సరుకులైన వరి, గోధుమ, తృణధాన్యాలు, వేరుశనగ, పండ్లు, కూరగాయలు, చెరకు మొదలైన వాటి ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానానికి ఎదిగింది. కాని మార్కెటింగ్ రంగంలో భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ రోజుల్లో వ్యవసాయం లాభదాయకమైన వృత్తి కాదు. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగిపోవడం, దళారుల దోపిడీ, సగటు రైతుకు సకాలంలో రుణ సహాయం లభించకపోవడం, వర్షాభావం, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మొదలైన ప్రతికూలాంశాలు అన్నదాత నడ్డి విరుస్తున్నాయి. ఎన్నో వేలమంది ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షలాది కుటుంబాలు వీధిన పడటం, చివరకు గ్రామీణ వ్యవస్థ చితికిపోతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. 1990 నుంచి మన దేశంలో ఉదారవాద విధానం అమలులోకి వచ్చింది. సామాజిక, ఆర్థిక విషయాలలో రాజ్యం పాత్ర క్రమేణా తగ్గడం, దాని స్థానంలో మార్కెట్ ప్రాధాన్యం పెరగింది. దీని పర్యవసానం వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, బహుళజాతి సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యవసాయానికి పూర్వ వైభవాన్ని కల్పించి, లాభదాయకమైన వృత్తిగా మార్చాలంటే దాన్ని ‘కార్పొరేటైజ్’ చేయడం మినహా గత్యంతరం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. కార్పొరేట్ వ్యవసాయ ప్రతికూల, అనుకూలాంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేశంలోకి బహుళజాతి సంస్థలు:
కార్పొరేటైజేషన్‌ను వ్యతిరేకించే వారి అభిప్రాయంలో ఈ విధానం ఉత్పత్తిదారుల ప్రయోజనాల కంటే వ్యాపారస్థులప్రయోజనాలు పరిరక్షిస్తూ, అవసరాల కంటే లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల, సన్నకారు రైతులను బలిగొంటుంది. భారతదేశంలో ఒకపక్క వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గుతుంటే ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఇది అధికోత్పత్తి వల్లో, ఆహారధాన్యం కొరత వల్లో జరగడం లేదు. ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి వందనాశివ అభిప్రాయంలో ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల ఒత్తిడితో ఆర్థిక సంస్కరణల ముసుగులో ధరల నియంత్రణను తొలగించారు. స్వేచ్ఛా వాణిజ్యమనే నినాదంతో బహుళజాతి సంస్థలకు వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టడం జరుగుతుంది. వ్యవసాయ కార్పొరేటైజేషన్ ఇందులో భాగమే. పేదరైతులకు ఇచ్చే సబ్సిడీలు తొలగించడం/తగ్గించడం, విత్తనాల, ఎరువుల సరఫరాలో నియంత్రణలు తొలగించడం ఉత్పత్తి ధరల పెరుగుదలకు దారితీసి రైతులను నష్టాల ఊబిలోకి నెట్టాయి. ప్రభుత్వ నియంత్రణ లోపించడంతో, వ్యాపారస్థులు రైతులకు గిట్టుబాటు ధరలు లభించకుండా, వారి నిస్సహాయస్థితిని ఆసరాగా చేసుకొని మరింత దోపిడీకి గురిచేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బహుళజాతి సంస్థలైన కార్గిల్ వంటివి దేశీయ మార్కెట్‌లో ప్రవేశించి వ్యవసాయాన్ని వాణిజ్యంగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడికిలోనై ఇతర దేశాల ఆహార ఉత్పత్తులను మన మార్కెట్‌లో నింపి, స్వదేశీ ఆహార ఉత్పత్తులకు గిరాకీలేకుండా చేస్తున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు భారీగా సబ్సిడీలు అందించి చౌకగా ఇండియాలాంటి వర్ధమాన దేశాలకు తమ మిగులు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. కృత్రిమ చౌకధరలకు లభించే విదేశీ ఆహార ఉత్పత్తులతో దేశీయ వ్యవసాయోత్పత్తులు పోటీ పడలేకపోతున్నాయి. భారతీయ రైతు ఈ పోటీని తట్టుకోలేకపోతున్నాడు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మన పేద రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

అంతర్గత ఉదార విధానమే మేలు:
1960, 1970 దశకాలలో వచ్చిన హరిత విప్లవం ఆహార రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేయడం వాస్తవమే కాని, సమాజంలో కృత్రిమ అసమానతలకు దారితీసింది. కార్పొరేటైజేషన్ పేదలకు, ధనికులకు మధ్య మరింత అగాధాన్ని సృష్టిస్తుంది. వ్యవసాయరంగంలో బహిర్గత (External) లేక అంతర్గత (Internal) ఉదార విధానం ప్రవేశపెట్టవచ్చు. ఎరువుల దిగుమతి, స్వదేశీ ఎరువుల ఉత్పత్తి సరళీకరణ, రుణాలు, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి రంగాలలో సబ్సిడీలు ఎత్తివేయడం బహిర్గత ఉదార విధానానికి ఉదాహరణలు. ఈ వాతావరణంలో బహుళజాతి వ్యవసాయ సంస్థలు దేశీయ మార్కెట్‌ను కైవసం చేసుకుంటాయి. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటానికి బదులు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే సేంద్రీయ ఎరువులు, సహజ సిద్ధ క్రిమి సంహారిణుల వాడకం అంతర్గత ఉదార విధానానికి ఉదాహరణలు. ఈ విధానం వల్ల రైతులను అప్పుల ఊబిలో నుంచి తప్పించవచ్చు. కార్పొరైటేజేషన్ విషకోరల నుంచి సగటు రైతును రక్షించి, స్వయం సమృద్ధికి దోహదం చేసే విధానాలు పాటించాలి. ‘‘వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అనే పేరుతో ప్రస్తుతం మన ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు అప్రజాస్వామ్యం. ఇవి వృదాకు దారితీస్తున్నాయని’’ వందనాశివ అభిప్రాయం. లాభాపేక్షతో కూడిన ప్రస్తుత విధానాలు రసాయన ఎరువులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భూసారాన్ని దెబ్బతీయడం, పర్యావరణానికి హాని కలిగించడం ద్వారా జీవ వైవిధ్యానికి (Biodiversity) విఘాతాన్ని కలిగిస్తున్నాయి.

సహకార సేద్యం:
భారతదేశంలో భూకమతాలు (Land Holdings) చాలా చిన్నవి. సగటు పరిమాణం ఒక హెక్టారులోపే. వీటి పరిమాణంలో సాగు అంత లాభదాయకం కాదు అనే వాదన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని బహుళజాతి సంస్థలు కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతిని ముందుకు తీసుకొచ్చాయి. దీని ప్రకారం సన్నకారు రైతులు తమ భూమిని ఈ సంస్థలకు బదిలీ చేస్తే, వారికి ప్రతినెలా వేతన రూపంలో కొంత ధన సహాయాన్నందిస్తూ, రైతును వ్యవసాయ కూలీగా మారుస్తున్నాయి. లాభాపేక్షతో రంగంలోకి దిగిన ఈ సంస్థలు వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపి ఆహార భద్రతకు భంగం కలిగిస్తున్నాయి. చిన్న కమతాల సేద్యం లాభదాయకంగా లేనప్పుడు సహకార సేద్య విధానాన్ని ప్రోత్సహించాలి. యూరప్, ఉత్తర అమెరికా దేశాలు సహకార రంగంలో వ్యవసాయాన్ని లాభవంతంగా కొనసాగిస్తుంటే మనదేశంలో అది ఎందుకు విజయవంతం కాదు? పాడి పరిశ్రమలో సహకార రంగం (ఆనంద్‌డైరీ, గుజరాత్) విజయవంతమైనప్పుడు వ్యవసాయ రంగంలో కూడా విజయవంతమౌతుంది. కాంట్రాక్టు వ్యవసాయమనే సాకుతో పేదల భూమిని బడా పారిశ్రామిక వేత్తలు కబళించడానికి పన్నిన ఎత్తుగడ. మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. 1997లో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200 ఎకరాలతో కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రారంభించడం, అది విఫలం కావడం మనకు తెలిసిందే.

కార్పొరేట్ వ్యవసాయం పేరుతో జన్యుపరంగా మార్పిడి చేసిన పత్తి, వంకాయ వంగడాలను మనదేశంలో ప్రవేశపెట్టడం వాటి వల్ల ఉత్పత్తి పెరగకపోవడంతో పాటు, మిగిలిన పంటలు రోగ నిరోధక శక్తిని కోల్పోవడం, జీవ వైవిధ్యానికి విఘాతం కల్గించడం జరిగింది. మహారాష్ర్టలోని విదర్భ ప్రాంతంలో వేలమంది రైతులు బీటీ కాటన్ సేద్యంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడం వాస్తవం. ఐటీసీ, కార్గిల్, మోనోశాంట్ లాంటి బడా సంస్థలు చిల్లర వ్యాపారస్థుల జీవనోపాధికి కళ్ళెం వేస్తున్నాయి. ప్రస్తుతం మన వ్యవసాయ విధానాన్ని రాజ్యాంగేతరశక్తులు రూపొందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

కార్పొరేటైజేషన్‌కు అనుకూలవాదాలు:
గ్రామీణ భారతావనికి వ్యవసాయం వెన్నెముకలాంటిదనేది నగ్నసత్యం. ఐతే గత నాలుగైదు దశాబ్దాలుగా జాతీయ స్థూల ఉత్పత్తిలో దీని శాతం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఇది 13.7 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగంలో 2012-13 సంవత్సరంలో అభివృద్ధి 1.9 శాతానికి దిగజారింది. గత సంవత్సరం (2011-12) 3.6 శాతం అభివృద్ధిని సాధించడం జరిగింది. దీనిని బట్టి వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో పడిందో అర్థమవుతుంది. వ్యవసాయేతర రంగంలో అభివృద్ధిని సాధించడం ఒక ముఖ్య కారణమైనప్పటికీ, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గిపోవడం, ఉత్పత్తి సగటు ఖర్చు పెరగడం అసలు కారణం. వ్యవసాయాభివృద్ధి ద్వారానే గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన సాధ్యం. ఇందుకు ప్రభుత్వంతోపాటు, ప్రభుత్వేతర సంస్థలు సమష్టిగా నడుం కట్టాలి. జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 4 శాతానికి పెరగాలంటే కార్పొరేటైజేషన్ అవసరమే అనిపిస్తుంది. అంతర్జాతీయంగా వ్యవసాయ వాణిజ్య రంగంలో మన ఉత్పత్తులకు తగిన గిరాకీ లభించాలంటే నాణ్యమైన, సరసమైన ధరలకు లభించే వ్యవసాయోత్పత్తులు అందుబాటులో ఉండాలి. మేలురకమైన వంగడాలు, రసాయన ఎరువులు, అధునాతన వ్యవసాయ పరికరాలు, నీటి, విద్యుచ్ఛక్తి సరఫరా, ఆహార ధాన్యాల నిల్వకు అధునాతన గిడ్డంగులు (Cold Storage Facilities), మార్కెటింగ్ సదుపాయాలు ఈనాటి వ్యవసాయానికి అవసరం. వీటిని వ్యక్తిగతంగా ఏ రైతు సమకూర్చుకోలేడు. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అంతంత మాత్రమే. ఈ పరిస్థితులలో రైతు, వ్యాపార సంస్థలు, బ్యాంకులు భాగస్వామ్యం కావాలి. దీనిని బంగారు ముక్కోణం (Golden Triangle) అంటారు. రైతు తన శ్రమనందిస్తే, బహుళజాతి సంస్థలు పరిశోధన, మార్కెటింగ్ సదుపాయాలు కలిగిస్తే, బ్యాంకులు సకాలంలో అవసరమైన రుణ సహాయాన్నందిస్తాయి. ఈ మూడింటిలో వ్యాపార సంస్థలు కీలక పాత్ర వహిస్తాయి. దీనినే కార్పొరేటైజేషన్ అనొచ్చు.

కార్పొరైటేజేషన్ లక్ష్యాలు:
  1. వ్యవసాయ వాణిజ్యంలో నిపుణతను పెంపొందించడం
  2. ప్రభుత్వేతర సంస్థలు నీటిపారుదల, వంగడాల ఉత్పత్తి, ఎరువుల తయారీ, పరిశోధనా రంగాలలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టడం.
  3. సాగుభూమి విస్తీర్ణం పెంచడం
  4. ఉత్పాదకతను వృద్ధి చేయడం (అధునాతన విధానాలు అవలంభించడం ద్వారా)
  5. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించి, దళారీల ప్రమేయాన్ని తగ్గించడం.
  6. అక్రమ నిల్వలను నిరోధించి, కృత్రిమ ఆహార కొరతను నిర్మూలించడం.
ప్రయోజనాలు:
  1. విమర్శకులు వాదించినట్లు కాకుండా, భూమి మీద హక్కు ఎప్పుడూ రైతుకే ఉంటుంది.
  2. కార్పొరేట్ సంస్థలు భూమిని రైతు నుంచి కాంట్రాక్టు పద్ధతిలో స్వాధీనం చేసుకొని తక్కువ పెట్టుబడితో ఆకర్షణీయమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
  3. తాము విస్తరింపజేసిన వాణిజ్య అనుబంధ సంస్థల ద్వారా వ్యవసాయోత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలనందించడం
  4. రైతుకు ప్రమాణిక (Standard) ఆదాయాన్ని అందించడం
  5. రైతుకు వ్యవసాయ రంగంలో తగిన శిక్షణ ద్వారా నిపుణతను పెంపొందించడం
  6. వ్యవసాయ వాణిజ్యరంగం జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకనుగుణంగా వ్యాపారాన్ని నిర్వహించడం.
ముగింపు:
పైన చర్చించిన అనుకూల, ప్రతికూల వాదనలలో కొంత నిజముంది. ఐతే, ప్రభుత్వం వ్యవసాయ రంగం విషయంలో అనుసరించే విధానం ఆచరణాత్మకంగా ఉండాలి. రైతుశ్రేయస్సుతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పోకడలను పరిగణనలోకి తీసుకొని, వర్తమాన, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్ట వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. అది...
  1. వ్యవసాయరంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి (రోడ్లు, విద్యుత్, నీరు, గోదాములు).
  2. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పాదకతను పెంచాలి. అవసరమైతే ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి.
  3. రైతులు సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ క్రిమి సంహారకాలు వినియోగించేలా ప్రోత్సహించాలి.
  4. ప్రస్తుతం పాటిస్తున్న కనీస ధరల మద్దతు విధానాన్ని పునఃపరిశీలించాలి. ప్రస్తుత విధానం మార్కెట్ ధరలను కృత్రిమంగా అణిచివేస్తుంది.
  5. అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటి వాటి వత్తిడి ఫలితంగా విదేశీ ఉత్పత్తులు భారీగా దేశీయ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నాయి. దీనితో మన రైతులు ఆ పోటీకి తట్టుకోలేక నష్టపోతున్నారు. వాటిని కట్టడి చేయాలి.
  6. భారతదేశం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ విపణిలో మన ఉత్పత్తులకు తగిన గిరాకీ కల్పించాలి.
  7. కార్పొరేట్ సంస్థల ఒంటెత్తు పోకడలను గమనిస్తూ దేశీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటి కార్యకలాపాలను నియంత్రించాలి
  8. పై విధానాలన్నీ మానవాభివృద్ధికి దోహదపడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మిలీనియం లక్ష్యాలను సాధించడానికి దోహదపడాలి.
Published date : 07 Jun 2013 04:22PM

Photo Stories