చిన్న రాష్ట్రాలతో సమస్యలు తీరేనా..?
Sakshi Education
ఇటీవల కాలంలో మన దేశంలో చిన్న రాష్ట్రాల(Small States) వాదన బలపడుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన సాధ్యమవుతుందనేది చిన్నరాష్ట్రాలు కోరేవారి వాదన. పరిమాణానికి, అభివృద్ధికి సంబంధం లేదని వ్యతిరేకించేవారి వాదన. ఏది ఏమైనా చిన్న రాష్ట్రాల ఏర్పాటు, అనుకూల ప్రతికూల వాదనలు, సమస్యలు, పరిష్కారాల గురించి విశ్లేషణ మీ కోసం...
చిన్న రాష్ట్రాల ఏర్పాటు- అనుకూల వాదనలు:
చిన్న రాష్ట్రాల ఏర్పాటు- అనుకూల వాదనలు:
- రెండో రాష్ట్రాల పునర్విభజన సంఘం (States Reorganisation Commission) ఏర్పాటు చేయటానికి సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఆచరణ సాధ్యతను దృష్టిలో ఉంచుకొని అనేక చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో భారత సమాఖ్య ముఖ చిత్రాన్ని పునర్లిఖించటానికి ఇదే పరిష్కారం. పెద్ద రాష్ట్రాల విభజన డిమాండ్లను శ్రద్ధతో, నిబద్ధతతో చారిత్రక, వర్తమాన సందర్భాలకు అనుగుణంగా పరిశీలించాలి.
- ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ఏక భాష పెద్ద రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. సరళీకరణ కాలంలో జాతీయ రాజకీయ నమూనాలను నిర్ణయించడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఒక్కసారిగా బలహీన వర్గాలు అధికారంలోకి రావటం పెరిగి నూతన రాజకీయ ఉన్నత వర్గాలను సృష్టించింది. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రాంతీయ లేదా రాష్ట్రీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలవుతున్నాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ (Market Economy) పాదుకొల్పడంతో ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహానికి గేట్లు తెరిచినట్లయింది. తద్వారా ప్రాంతీయ అసమానతలు పెరిగి చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు దోహదం చేసింది.
- పెద్ద రాష్ట్రాల్లో ఉప ప్రాంతాల ఆర్థిక వెనుక బాటుతనం సైతం చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ కు ప్రధాన కారణమవుతోంది. విదర్భ (మహారాష్ట్ర), సౌరాష్ట్ర (గుజరాత్), బోడోలాండ్ (అస్సాం), పలు రాష్ట్రాల్లో ప్రత్యేక డిమాండ్లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ పరిణామాలు గతంలో పునర్విభజనకు ప్రాతిపదికలైన భాష, సంస్కృతి వంటి అంశాలను పక్కకు నెట్టి సుపరిపాలన (Good Governance), ప్రజల భాగస్వామ్యం, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక స్థోమత, ఉప ప్రాంతాల వృద్ధి అవసరాల సారూప్యతలు ప్రాతిపదికలుగా మారేందుకు కారణమవుతున్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనివార్యం. ఇది మరింత ప్రజాస్వామ్యీకరణకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే 2000లో చత్తీస్ గఢ్ (1 November), ఉత్తరాఖండ్( 9 November) జార్ఖండ్ (15 november) రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
- అధిక సంఖ్యలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కేంద్రం బలహీన పడుతుందన్న సంకేతాలు నేడు కన్పించట్లేదు. 1956 తర్వాత పంజాబ్, హర్యానా, ఈశాన్య భారతంలో కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రం బలహీన పడటానికి బదులు బలపడింది.
- నూతన సామాజిక రాజకీయ క్రమానికి తగిన భారత సమాఖ్యను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. పునర్విభజన అనేది కేవలం ఏక కాలంలో మాత్రమే చేపట్టాల్సిన అంశం కాదు. ఇది నిరంతరం కొనసాగాల్సిన అసంపూర్ణమైన ప్రక్రియ.
- చిన్న రాష్ట్రాల డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆర్థిక సామర్థ్యం, ప్రజల ఆకాంక్షలు ప్రాతిపదికగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని(Second SRC) ఏర్పాటు చేయాలి.
అదే సమయంలో చిన్న రాష్ట్రాలతో కూడిన సమాఖ్యను రూపొందించడం కూడా సంక్షిష్టమైనది. ప్రస్తుతం ఉన్న పెద్ద రాష్ట్రాల నుంచి అనేక చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది సుపరిపాలనకు, వేగవంతమైన, సమగ్రమైన ఆర్థిక వృద్ధికి హామీ ఇవ్వదని పలువురు విమర్శకులు వాదన సరైందే.
వ్యతిరేక వాదనలు:
- పెద్ద రాష్ట్రంలో పరిపాలన అసమర్థతలతో కూడి ఉందని భావిస్తే చిన్న రాష్ట్రాలతో ఉత్తమ పాలన సాధించగలమని చెప్పేందుకు హామీ ఏమీ లేదు.
- సంస్కృతి, భాష, మతం వంటి భావోద్వేగ కారణాలు, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం భావన చిన్న రాష్ట్రాల ఏర్పాటు, విభజన డిమాండ్లకు కారణమైనప్పటికీ, ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు, ప్రతిపక్ష నాయకత్వం, అసెంబ్లీ స్పీకర్లు వంటి అనేక అధికారిక పదవుల కోసం ఆరాటమే ప్రధాన కారణం అని గుర్తించాలి. అదే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డీజీపీలు, చీఫ్ ఇంజినీర్లు, డైరెక్టర్లుగా అందలమెక్కడానికే చిన్న రాష్ట్రాల డిమాండ్లు చేస్తున్నారు.
- పెద్ద రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పటి కంటే చిన్న రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే కేంద్రం నుంచి భారీగా నిధుల అందుతాయన్న సాధారణ అభిప్రాయం వ్యక్తమవుతోంది. నూతన రాజధాని నగరం మరింత మెరుగైన జీవన పరిస్థితులను అందిస్తుందని చాల మందిలో అభిప్రాయముంది. తక్కువ సంఖ్యలో జిల్లాలతో చిన్న రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి నియంత్రణను తొలగిస్తాయి. రాజధానికి మిగతా ప్రాంతాలకు మధ్య దూరం తగ్గి పరిపాలన ప్రమాణాలను పెంపొందిస్తుంది. పరిపాలనా ప్రతిస్పందనను పెంపొందిస్తుంది. జవాబుదారీతనానికి దోహదం చేస్తుంది అనేది బలమైన వాదన. అయితే పెద్ద రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పాలనా యూనిట్లతో ఈ లక్ష్యాలను అత్యంత తేలికగా సాధించవచ్చు.
- పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు కూడా సానుకూలత ఫలితాలనిచ్చాయనడానికి ఆధారాలున్నాయి. పరిమాణంతో పనితీరుకు సంబంధం లేదడానికి అనేక నిదర్శనాలున్నాయి. నేటి సాంకేతిక పరిజ్ఞానం పెద్ద రాష్ట్రాల పాలనను సరళంగా మార్చడంలో తోడ్పడగలదు. సుదూర ప్రాంతాలను దగ్గర చేయగలదు.
- ఒక నిర్దిష్ట రాష్ట్రం మరో రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించటానికి రాష్ట్ర పరిమాణం కంటే పరిపాలన ప్రమాణాలు, వైవిధ్య నైపుణ్యాలున్న రాష్ట్ర జనాభా, నాయకత్వ సామర్థ్యం, దార్శనికత అనేవి ప్రామాణికాలవుతాయని గ్రహించాలి.
- భౌతిక, మానవ వనరుల విషయంలో చిన్న రాష్ట్రానికి పరిమితులున్నాయి. పైగా చిన్న రాష్ట్రం ఆర్థిక, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన వ్యయసాయ – వాతావరణ వైవిద్యత లోటుకు గురవుతుంది. అంతర్గత వనరులను పెంపొందించుకునే సామర్థ్యం కోల్పోతుంది. వీటన్నింటి వల్ల ఆర్థిక నిధుల కోసం, కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేంద్రంపై మరింత ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
- దేశంలో రాష్ట్రాల సంఖ్యను పెంచడం వల్ల ఆయా రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర పార్టీ విభాగాలను నియంత్రించడానికి పార్టీ అధిష్టానాలను విస్తరించాల్సి ఉంటుంది.
- నూతన రాష్ట్రానికి పరిపాలన, పారిశ్రామిక మౌలిక వసతులు సమకూర్చడానికి తగిన సమయం, ధనం, కృషి అవసరం. ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థల స్థిరత్వం, ఆస్తులు, నిధులు, సివిల్ సర్వీసుల పూర్తి విభజన, నూతన రాజధానితో అనుసంధానం ద్వారా స్థిరత్వం సాధించడానికి కనీసం పదేళ్లు సమయం పడుతుందని అనుభవాలు చెబుతున్నాయి. ఈ మార్పు ఫలితం స్వల్పమేమీ కాదు. ఈ సంధికాలంలో రాష్ట్ర పనితీరు కుంటుపడుతుంది.
- భౌతిక అనుసంధానత (Connectivity) కారణాలతో రాష్ట్ర సరిహద్దులు, ప్రాంతాల పునర్విభజన హేతుబద్ధత అవసరమే. పైగా ఒక రాష్ట్ర గరిష్ఠ పరిమాణాన్ని ఒక కొలబద్ధ ఆధారంగా నిర్ధారించలేం. భూమి ప్రమాణం, భౌగోళిక స్వరూపం వంటి భౌగోళిక కారణాలు, వ్యవసాయ- వాతావరణ పరిస్థితులు, సామాజిక- సాంస్కృతిక కారణాలు, సహజ, మానవ వనరుల లభ్యత, జనసాంద్రత, ప్రసార మార్గాలు, అమలులో ఉన్న పరిపాలనా సంస్కృతి, జిల్లా, ప్రాంతీయ పరిపాలనా యూనిట్ల ప్రభావశీలత వంటి అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి రాష్ట్ర పరిమాణాన్ని నిర్ధారించాలి.
- దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల కోసం అనేక డిమాండ్లన్నప్పటికి భారతదేశ బహుముఖ సమస్యలకు చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఒక్కటే శాశ్వత పరిష్కారం కాదు. వాస్తవానికి పెద్ద రాష్ట్రాలే ఆర్థిక పరంగా మెరుగైన సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించగలుగుతున్నాయి. ప్రణాళికబద్ధ వృద్ధిని సాధిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో పరిపాలన అసమర్థలతో కునారిల్లుతుంటే చిన్న రాష్ట్రాలు ఏ విధంగా అందుకు ప్రత్యామ్నాయం కాలేవు.
ఉత్తరాఖండ్, చత్తీస్ ఘఢ్, జార్ఖండ్ చిన్న రాష్ట్రాలుగా 2000వ సంవత్సరంలో అవతరించాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం కొండ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలనే ఉద్దేశ్యంతో ఏర్పడింది. చత్తీస్ ఘడ్ , జార్ఖండ్ రాష్ట్రాలు గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నాయి. అవి ఏర్పడిన 13 ఏళ్ల తర్వాత పనితీరును పరిశీలిస్తే వైవిధ్యత గోచరిస్తుంది.
పరిపాలన, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పాటవం అంశాల్లో ఉత్తరాఖండ్ తన లక్ష్యాన్ని బాగా నెరవేర్చగలగింది. ఈ రాష్ట్రం గిరిజన రాష్ట్రంగా ప్రత్యేక హోదా పొందగలిగింది. దీనివల్ల ప్రణాళికా పరమైన నిధులు ఈ రాష్ట్రానికి అందాయి. ఇది పర్వత ప్రాంత రాష్ట్రం. పర్వత ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేవారికి పన్నుల్లో రాయితీలు ప్రకటించటం వల్ల పరిశ్రమలు బాగానే వచ్చాయి. అయితే పట్టణాల్లో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో మౌలిక సౌకర్యాలు పెరగకపోగా, జనాభా పెరుగుతూండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందు కోసం కేంద్రం కేటాయించిన పట్టణాభివృద్ధి నిధులను వినియోగించులేకపోతోంది. ఉపాధి కల్పన లోపంతో రాష్ట్ర ప్రజలు భుక్తికోసం మైదాన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వ్యవసాయం మీద 60 శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయాభివృద్ధి దిగజారుతోంది. రాష్ట్రావతరణ జరిగినపుడు స్థూల రాష్ట్రాదాయం (State Gross Domestic Product)లో వ్యవసాయాదాయం(Agricultural Income) శాతం 38.8 నుండి 23.4 శాతానికి పడిపోయింది.
మధ్యప్రదేశ్‌ను విభజించి చత్తీస్‌ఘడ్‌ను, దేశంలో 26వ రాష్ట్రంగా రూపొందించారు. ఆ రాష్ట్రం పేరు చెబితే గుర్తుకు వచ్చేది మావోయిస్టు ఉద్యమమే. అలాగే ఆ ప్రాంతం ఖనిజ సంపద కాణాచిగా కూడా మనసులో మెదులుతుంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కొంత మేరకు రాజకీయ స్థిరత్వం పొంది చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధిని సాధించినా మావోయిస్టుల నుండి అంతర్గత భద్రతా సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రం నక్సలైట్ల హింసాత్మక చర్యలను, దోపిడీ వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా అదుపు చేయలేకపోయింది. 2001-13 మధ్య చత్తీస్ ఘఢ్ రాష్ట్ర స్థూలాదాయం (GSDP) నాలుగు రెట్లు, అలాగే తలసరి ఆదాయం (Per capita Income) నాలుగు రెట్లు పెరిగింది. ప్రణాళిక సైజు 1300 కోట్ల నుంచి 13వేల కోట్లకు పెరిగింది. తలసరి వి ద్యుత్ వాడకం సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. కాని అదే కాలంలో పేదరికపు రేఖ కింద వున్న జనం రెట్టింపయ్యారు. ఆ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 10 లక్షల 87 వేల పేద కుటుంబాలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షల 62 వేలయింది.
దక్షిణ బీహార్‌ను విడదీసి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రం మొదట్లో కొంత ఆర్థిక పురోగతిని కనబరిచినా పరిపాలనా రంగంలో చాలా చోట్ల నిరాశ పరిచిందనే చెప్పాలి. 13 సంవత్సరాల్లో తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మారారు. మూడు సార్లు రాష్ట్రపతి పాలనను చవిచూసింది. ఈ రాష్ట్ర ఆర్థిక పటుత్వం అంతకంతకూ తగ్గుతూ వస్తుంది. మావోయిస్టుల దాడులు పెరిగిపోయాయి. నిరుద్యోగ సమస్య దేశంలోనే అత్యధికంగా జార్ఖండ్ లోనే ఉంది. భారతదేశం మొత్తం ఖనిజ సంపదలో 40 శాతం ఈ చిన్నరాష్ట్రంలోనే వుంది. ఇంత సహజ సంపద ఉండడం వల్లనే అవినీతి కూడా అదే మోతాదులో పెచ్చరిల్లింది. రాష్ట్ర ఖనిజ, భూగర్భ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం ఏడాదికి రు.106 కోట్ల విలువ గల ఖనిజ సంపద అక్రమంగా తరలించబడుతోంది. ప్రతి సంవత్సరం 10 లక్షల 37 వేల టన్నుల బొగ్గు అక్రమంగా తరలిపోతోంది. పరిశ్రమల స్థాపనకు రు.2,95,858 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు జరిగాయి. కాని గత పదమూడేళ్ల కాలంలో కేవలం 12. చిన్న, చితక పరిశ్రమలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రభుత్వం అందుకవసరమైన భూమిని కేటాయించ లేకపోవటమే కారణం. గత పదమూడేళ్ళలో జార్ఖండ్ ఒక్క మెగావాట్ విద్యుచ్ఛక్తి ఉత్పాదకశక్తిని కూడా సమకూర్చలేకపోయింది. అభివృద్ధి ఖర్చు సామాజిక సేవల ఖర్చు పెంచ లేనపుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగేది శూన్యం.
చిన్న రాష్ట్రాలతో సర్వతోముఖాభివృద్ధి- అనుభవాలు:
చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల పనితీరును పరిశీలించిన అనంతరం చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సర్వతోముఖాభివృద్ధి (Inclusive Growth) జరగదన్న వాదన బలపడింది. రాష్ట్ర వైశాల్యంతో సంబంధం లేకుండా మంచి పరిపాలనను అందివ్వగలగడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం చిన్నదైనంత మాత్రాన సామాన్యులకు ఒరిగేదేమీ లేదని ఇటీవల ఏర్పాటైన రాష్ట్రాల సమాచారం తెలియజేస్తుంది. “ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి ఆ దేశం వైశాల్యం, జనసంఖ్య కాదు, ఆదేశ ప్రజల ఆదాయాలు, విద్య, వైద్యం, పౌర సౌకర్యాలు, ఆహార లభ్యత లాంటివి కొల మనాలుగా(Measures) ఉండాలని నోబెల్ బహుమతి గ్రహీత అమర్థ్యసేన్ పదే పదే పునరుద్ఘాటిస్తూ వచ్చారు”. ప్రజల నిత్యజీవితంలో సాధించిన అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఆ ప్రదేశంలో సహజవనరులు అపారంగా ఉండవచ్చు. నదీజలాలు ప్రవహిస్తూండవచ్చు. ఖనిజ సంపద పుష్కలంగా ఉండవచ్చు. అలాంటి వనరులుండడం వల్ల ఆ ప్రాంత GDP పెరుగుదల చూపించవచ్చు. ఉదాహరణకు జూర్ఖండ్ రాష్ట్రం ఖనిజవనరుల ఖజానా. కాని ప్రజలు నిత్య దరిద్రులు. ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థల ఆధీనంలో వుండటం, వెనుకబడిన గిరిజనులను దోచుకొని తినడం దానికి కారణం. కడప జిల్లా పెద్దజిల్లాల్లో ఒకటి. ఖనిజ సంపద అపారం. సుమారుగా అదే జనాభా విస్తీర్ణం వున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లా బాగా వెనుకబడిన జిల్లాలు. అలాగే ప్రకాశం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలు వైశాల్యం దృష్ట్యా పెద్దజిల్లాలే. జనాభా కూడా ఎక్కువే. కాని, అవేమీ ధనధాన్యాలతో తులతూగటంలేదు. హైదరాబాద్ వైశాల్యం కేవలం 0.2 వందల చ.కి.మీ. ఎంత ధనవంతమైన ప్రాంతమో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ప్రాంతం ధనవంతమైనదా, పేదరికంలో కొట్టుమిట్టాడు తుందా అనేది ఆ ప్రాంతం చిన్నదా, పెద్దదా, అనే దానిపై ఆధారపడిలేదని పై ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.
దేశ ముఖచిత్రం:
రాజస్థాన్, మధ్యప్రదేశ్ దేశంలో కెల్లా అతిపెద్ద రాష్ట్రాలు, పోల్చిచూస్తే అవేమీ ధనవంతమైన రాష్ట్రాలు కాదు కదా. కేరళ అతి చిన్న రాష్ట్రం కాని కొబ్బరి, మిరియాలు లాంటి సుగంధ ద్రవ్యాలకు కాణాచి. చాలా ఖరీదైన పంటలు పండుతాయి. పంజాబ్ వైశాల్యం 50 వేల చ.కి. మీటర్లు. కాని దేశ ధాన్యాగారం. 1,96,000 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్న గుజరాత్, 2,75,000 చ.కి.మీ వైశాల్యం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కంటే అత్యంత ధనవంతమైన రాష్ట్రం. చండీఘడ్, ఢిల్లీ అతి చిన్నవి. కానీ లక్షల టన్నుల ధనం మూలుగుతోంది. దేశంలో వైశాల్యంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కానీ అత్యంత పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అక్కడ చాలా ఎక్కువ. పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఉంటే నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ అభివృద్ధి లోటుతో బాధపడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. తమిళనాడును అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. అయితే యూపీ అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోయింది. దీనిని బట్టి పరిమాణంతో రాష్ట్రాభివృద్ధికి సంబంధం లేదని స్పష్టమవుంది.
మానవాభివృద్ధి –వైవిధ్యత
మానవాభివృద్ధి నివేదిక (HDI) 2011 ప్రకారం కేరళ, గోవా, తమిళనాడు అత్యుత్తమ మానవాభివృద్ధిని నమోదు చేస్తే... హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అసోం మినహా ఈశాన్య భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలు మధ్యస్థ మానవాభివృద్ధిని నమోదు చేశాయి. పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జార్ఖంఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, చత్తీస్ గఢ్ అతి తక్కువ మానవాభివృద్ధిని నమోదు చేశాయి. అంటే మానవాభివృద్ధికి చిన్న రాష్ట్రాలా (కేరళ, గోవా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ గఢ్) పెద్ద రాష్ట్రాలా (తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్) అనేది కారణం కాదని స్పష్టమవుతోంది.
యధాతథ స్థితి - పరిణామాలు:
చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ప్రయోజనం శూన్యమని కొట్టి పారేస్తే అనేక విపత్కర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చు. ఉద్యమాల వల్ల ఆర్థిక పెరుగుదల ప్రశ్నార్థకంగా మారగలదు. సాధారణ జన జీవనం ప్రశాంతతను కోల్పోతుంది. మావోయిస్టు ఉద్యమం మరింత వేళ్లూనుకునే అవకాశముంది. సంక్లిష్ట వాతావరణంలో తీవ్రమైన భావోద్వేగంతో కూడిన పరిస్థితుల్లో యధాతథ స్థితిని కొనసాగించడం సమంజసం కాదు. యధాతథ స్థితి అనేది ఒక మార్గం మాత్రమే దీనిని చివర ఉంచవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంత ప్రయత్నం చేయడం అవసరం.
పరిష్కార మార్గం :
ఒక రాష్ట్ర అభివృద్ధి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర పరిమాణం కంటే సుపరిపాలన ముఖ్యం. రాజకీయ నాయకత్వం బలహీనంగా వుంటే, అభివృద్ధి కుంటుపడే ప్రమాదం వుంది. సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈరోజుల్లో రాష్ట్ర పరిమాణం సమస్య కాదు. అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఏం జరుగుతున్నదీ తక్షణమే తెలుస్తోంది. ఒక రాష్ట్ర పరిమాణం నిర్ణయించేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు కూడా ముఖ్యమే. చిన్న రాష్ట్రమైనా వనరులు బాగా ఉంటే, మంచి ప్రగతి సాధించవచ్చు. చిన్నా పెద్దా రాష్ట్రాలనే తేడా లేకుండా బలమైన నాయకత్వం, చక్కని పరిపాలన ఉన్న రాష్ట్రాలు ( వాటి పరిమాణంలో సంబంధం లేకుండా) ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిని సాధించాయి. దీనికి భిన్నంగా సరైన నాయకత్వం, పరిపాలన లేని రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్నాయి.
రాష్ట్రాల పునర్నిర్మాణ కమీషన్ అధ్యయనం చేసిన అంశాలను ఇక్కడ ఉటంకించడం ఆవశ్యం. మార్పు కోసం జరిగే వ్యయం, భారతదేశంలో ఐక్యత, భద్రత, భాష, సంస్కృతి, ఆర్థిక వనరులు, జాతీయ అభివృద్ధి పథకాల అమలుకు చేయవలసిన అంశాలు, ప్రాంతీయ ప్రణాళికలు, ఆర్థిక సమతుల్యత, చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇతర ముఖ్యమైన అంశాలు అంటే ప్రజల అభిప్రాయాలు, సెంటిమెంట్లతో పాటు చారిత్రక, భౌగోళిక, పరిపాలనాంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వీటి తర్వాత భాషను కూడా ప్రధాన ప్రాతిపదికగా పేర్కొనడం జరిగింది. ఐక్యమత్యంగా ఉండాలనే అంశానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని జవహర్ లాల్ చెప్పిన మాటలను కూడా ఎస్సార్సీ ఇక్కడ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో గణనీయమైన అభివృద్ధి ఉంటే తప్ప ఆ మార్పు వల్ల సంబంధిత ప్రజలకు, మొత్తంగా జాతికి లబ్ది చేకూరుతుంటే తప్ప ఎలాంటి మార్పు చేపట్టరాదు. రాష్ట్రాల పునర్నిర్మాణమంటే కేవలం ఒక ముగింపు కాదు. ఏ మార్పు వల్లనైనా ఫలితాలు సమతుల్యంగా ఉంటే భారతదేశ ఐక్యత, భద్రత అత్యంత ప్రధానమైనదని ఎస్సార్సీలో వివరంగా చెప్పారు.
రాష్ట్ర పునర్విభజన సంఘం తన ముగింపు అధ్యాయంలో ఇలా చెప్పింది: ఈ సమస్యను అన్ని కోణాల నుండి నిశితంగా పరిశీలించిన అనంతరం మేము (SRC) రాష్ట్రాల పునర్విభజన భాషాపరంగానో లేదా సాంస్కృతిక పరంగానో జరగడం సాధ్యం కాదని, వాంఛనీయం కాదని అభిప్రాయానికి వచ్చాం. దీనికి ప్రత్యామ్నాయంగా మన దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని మొత్తం సమస్యను సమతుల్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం మీద SRC.. భారతదేశ గణతంత్రంలో ఒక రాజ్యాంగ విభాగంగా అన్ని హంగులతో ఉండడానికి ప్రతి రాష్ట్రం సరైన వనరులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. అయితే దీని అర్థం ఆయా రాష్ట్రాలు తమ జీవన శైలి ప్రత్యేకతను కోల్పోమని కాదు. పెద్ద రాష్ట్రాల విషయంలో పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడంలోనూ ఆర్థికాభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద సహకారాన్ని అందివ్వటంలోనూ వీలుంటుంది. ఈ విధంగా SRC రాష్ట్ర పునర్విభన మీద అన్ని అంశాలనూ దృష్టిలో ఉంచుకుని సమతుల్య భావనతో సమస్యలను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడింది.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా దేశంలోని అన్ని భాగాలను సమానంగా అభివృద్ధి పరచాలనీ, మంచి పరిపాలన మీద దృష్టిసారించాలన్నది ఒక వాదన. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరం వాస్తవికతను ప్రతిబింబిస్తుందనీ దేశంలో నిరాదరణకు నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల ప్రజల మనోభావాలను పక్కన పెట్టడం మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఈ రెండు భిన్నాభిప్రాయాలకు అతీతంగా దేశ సమగ్రతే (Integrity) అతి ముఖ్యమైన అంశం. రాజ్యాంగం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్నిచ్చింది. ఈ అంశంలో రెండో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైందా లేదా అన్న అంశం మీద నిర్ణయం తీసుకునే హక్కు పార్లమెంటుకే ఉంది.
ముగింపు:
భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించాలని ప్రజలందరికీ భద్రత కల్పించడం; సామాజిక, ఆర్థిక న్యాయం; ఆలోచనలు, వ్యక్తీకరణలు, విశ్వాసాలు, ప్రార్థనల విషయంలో స్వేచ్ఛ; స్థాయి, అవకాశాల్లో సమానత్వం; ప్రజల్లో సౌభ్రాతృత్వం పెంపొందించి దేశ సమగ్రతను ఐక్యతను కాపాడుతామని రాజ్యాంగంలో ప్రస్తావించారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన దేశ సమగ్రత, ఐక్యతకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందిరపైనా ఉందని గుర్తెరగాలి. 1960 అక్టోబర్ 3న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో వివాదాలు వైషమ్యాలు అనే అంశం మీద మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ అన్న మాటలు శిరోధార్యం కావాలి. అందరూ గర్వించదగ్గ భరత మాత పుత్రుడు గౌతమ బుద్ధుడు చాలా కాలం కింద ఇలా అన్నారు. ఎవరూ ఓడిపోకుండా అందరు సమాన విజేతలైనప్పుడే అది నిజమైన విజయ ఘటన అనిపించుకుంటుంది. నేటి ప్రపంచంలో ఇలాంటి విజయం కొరకు మాత్రమే అందరూ శ్రమించాలి. లేకుంటే అది సర్వవినాశనానికి దారితీస్తుంది - పండిట్ జవహర్ లాల్ నెహ్ర
- ప్రేమ విఘ్నేశ్వర రావు కె.
Published date : 26 Sep 2013 01:11PM