Skip to main content

బాలకార్మిక వ్యవస్థ – జాతి భవితకు గొడ్డలి పెట్టు

బాలకార్మిక వ్యవస్థ(Child Labour) తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాల కార్మికుడు అన్న దానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం “బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం”. బాలల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాలకార్మిక వ్యవస్థ అంటారు. అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. నాగరికతకే తలవంపుగా పరిణమించాయి. బాలకార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాలకార్మికులు ఉన్నారు.

బాలకార్మిక వ్యవస్థపై అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదిక:
  1. ప్రపంచ వ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాలకార్మికులు ఉంటే 2012 ముగిసేనాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాలబాలికల జనాభాలో 11 శాతం మంది బాలకార్మికులే.
  2. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాలకార్మికులున్నారు. సబ్ సహారన్ ఆఫ్రికాలో 59 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 12.5 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 9.2 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారు.
  3. పేద దేశాల్లో బాలకార్మికులుగా మారుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే జనాభా పరంగా చూస్తే అత్యధిక శాతం మధ్య ప్రాచ్యంలో ఉన్నారు.
  4. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బాలకార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహారన్ ప్రాంతంలో బాలకార్మిక జాబితాలో చేరుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికాలో ప్రతీ ఐదుగురు బాలబాలికల్లో ఒకరి కంటే ఎక్కువ మంది బాలకార్మికులుగా ఉంటున్నారు.
  5. గత 12 ఏళ్లలో 78 మిలియన్ల మంది బాలకార్మికులు తగ్గారు. ముఖ్యంగా బాలికల్లో తగ్గుదల భారీగా నమోదైంది. 40 శాతం వరకు బాలికలు, 25 శాతం మంది బాలురు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు.
  6. మొత్తం బాలకార్మికుల్లో 85 మిలియన్లు అంటే 5.4 శాతం మంతి ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు. ప్రమాదకర పనులు చేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారు.
  7. పన్నెండేళ్ల వ్యవధిలో ప్రమాదకర పనుల్లో పనిచేసే బాలబాలికల సంఖ్య 171 మిలియన్ల నుంచి 85 మిలియన్లకు తగ్గింది.
  8. 2008-12 మధ్య నాలుగేళ్లలో బాలకార్మికుల సంఖ్యలో భారీ పతనం నమోదైంది. 2008-12 మధ్య బాలకార్మికుల సంఖ్య 215 మిలియన్ల నుంచి 168 మిలియన్లకు తగ్గింది. అంటే 47 మిలియన్లు మంది బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డారు.
  9. 2008-12 మధ్య ప్రమాదకర పనుల్లో పనిచేసే వారి సంఖ్య 115 నుంచి 85కు పతనమైంది. అంటే 30 మిలియన్లు మంది బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు.
  10. ఇప్పటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక శాతం మంది బాలకార్మికులున్నారు. ఈ రంగంలో అత్యధికంగా 98 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారు. అంటే మొత్తం బాలకార్మికుల్లో 59 శాతం వాటా వ్యవసాయరంగానిదే. అయితే సేవల రంగం, పారిశ్రామిక రంగాలను విస్మరించరాదు. అసంఘటిత రంగంలోనే బాలకార్మికులు అధికంగా ఉన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి తక్షణావసరం. సేవల రంగంలో 54 మిలియన్లు, పారిశ్రామిక రంగంలో 12 మిలియన్లు మంది బాలకార్మికులున్నారు.
  11. 2008-12 మధ్య బాలకార్మికుల సంఖ్యలో అత్యధిక పతనంతో ఆసియా పసిఫిక్ ప్రాంతం ముందుంది. అత్యంత పేద దేశాల కంటే మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లోనే బాలకార్మికులు ఎక్కువగా ఉన్నారు.
  12. ఆర్థిక మాంద్యం, సంక్షోభం వల్ల బాలకార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా బాలకార్మికుల సంఖ్య పతనమైంది. దీనికి కారణం బాలకార్మికులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక మాంద్యం. సంక్షోభం ప్రభావాలు స్వల్పంగా ఉండటం ఒక కారణమైతే , మాంద్యం సమయంలో బాలకార్మికులకు ఉపాధి లభించకపోవడం మరో కారణం.
  13. ప్రస్తుత గణాంకాలను బట్టి 2016 లోపు బాలకార్మిక వ్యవస్థను అంతం చేయాలన్న నిర్దేశిత లక్ష్యం సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.
సత్ఫలితాలనిస్తున్న నిర్మూలన కార్యక్రమాలు:
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని గణాంక సహితంగా తెలిపింది. ప్రభుత్వాలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం చేపట్టిన చర్యలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation) స్పష్టం చేసింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉపయోగించిన పెట్టుబడి, అనుభవం, శ్రద్ధ, అనుసరించిన ఉత్తమ విధానాలు, బలమైన శాసన చట్రాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొంది.

భారతదేశం – బాలకార్మిక వ్యవస్థ
2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 ఏళ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాలబాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో (బాలకార్మికులుగా) ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. 2004-05లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాలకార్మికులున్నారు. 2009-10 లో 5-14 ఏళ్ల వయసున్న బాలకార్మికుల సంఖ్య 49.84 లక్షలు.

UNICEF ప్రకారం దాదాపు సగం మంది, ప్రణాళిక సంఘం(Planning Commission) అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడిమానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55 శాతం, షెడ్యూల్డ్ తెగల్లో 63 శాతం దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

స్వచ్ఛంద సంస్థల (International Conference of Free Trade Unions) అంచనా ప్రకారం భారతదేశంలో 6 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు. అనధికారిక గణాంకాల ప్రకారం భారత్ లో 10 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు. భారతదేశంలో మొత్తం బాలల జనాభాలో 14 శాత మంది వివిధ పనుల్లో చెమటోడ్చుతున్నారని అంచనా. మొత్తం కార్మికుల్లో 4 శాతం మంది బాలలేనని అంచనా.

ప్రతీ పదిమంది బాలకార్మికుల్లో తొమ్మిది మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు శారీరక హింసకు గురవుతున్నారు. దాదాపు యాభై శాతం మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు. 50 శాతం మంది వారమంతా ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. 53 శాతం మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వారిలో 21 శాతం మంది అత్యంత తీవ్రమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతి క్షణం మానసిక వేధింపులకు గురవుతున్నారు.

బాలకార్మికుల దీనావస్థ:
బాలకార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు. కాబట్టి వారికి హక్కులు, కనీస వసతులు మృగ్యమవుతాయి. తేలిగ్గా మోసానికి గురవుతారు. వారి కష్టానికి తగిన వేతనం లభించదు. శ్రమ దోపిడీకి గురవుతారు. నిర్దిష్ట పనిగంటలు లేవు. సెలవులు, బోనస్, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఏ సామాజిక భద్రతా చర్యలు వర్తించవు. వేతనాలు అతితక్కువ. పని పరిస్థితులు భయంకరంగా ఉంటాయి

సూరత్ లోని వజ్రాలు చెక్కుడు పరిశ్రమల్లో, శివకాశీలోని మందుగుండు(Crackers) తయారీ పరిశ్రమల్లోనూ, జైపూర్ లోని రాళ్ల చెక్కుడు పనిలోనూ, ఫిరోజాబాద్ అద్దాల పరిశ్రమల్లోనూ, మురాదాబాద్ లోని లోహ పరిశ్రమల్లోనూ, అలీఘర్ లోని తాళాల పరిశ్రమల్లోనూ, మీర్జాపూర్ తివాచీల తయారీలోనూ, మార్కాపూర్ లోని పలకల తయారీ పరిశ్రమలోనూ హీన మైన, హేయమైన వాతావరణంలో బాలకార్మికులు పనిచేస్తున్నారు. పరిశీలించి చూస్తే ఈ పరిశ్రమలన్నీ ప్రమాద భరిత పనులకు సంబంధించినవే. ఎంతో మంది పిల్లలు హోటళ్లలోనూ, దుకాణాలలోనూ, గృహాలలోనూ సేవకులుగా పనిచేస్తున్నారు. వారి శక్తికి మించి అధిక గంటలు పని చేస్తూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలు పెద్ద పెద్ద బరువులు మోస్తుంటారు. తరచుగా గాయపడుతుంటారు. కొంత కాలానికి పూర్తిగా శక్తిని కోల్పోతారు. తివాచీ పరిశ్రమలో పనిచేసే బాలలు కంటి చూపును కోల్పోతున్నారు. శ్వాస కోస వ్యాధులతో బాధపడుతున్నారు. కాశ్మీరులోని తివాచీల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది క్షయ, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఫిరోజాబాద్ లోని గ్లాస్, గాజుల పరిశ్రమలో పనిచేసే పిల్లలు అస్తమా, బ్రాంకైటిస్, కంటి సంబంధించిన రోగాలకు గురవుతున్నారు. శివకాశీలో టపాకాయల పరిశ్రమలో పనిచేసే బాలలు రోగాలతో పాటు పేలుడు లాంటి ప్రమాదాలకు బలైపోతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే బాలలు ప్రమాదాలకు గురవుతున్నారు. భారీ యంత్రాలతో పనిచేసే వారు సరైన శిక్షణ, సరైన భద్రత లోపించడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.

కారణాలు:
అనేక చట్టాలున్నా బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి అనేక కారణాలున్నాయి.
  1. తల్లిదండ్రుల నిరపేక్ష పేదరికం: తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. పేదరికం వల్ల పిల్లలు తమ మనుగడ కోసమే కాకుండా తమ కుటుంబ అవసరాల కోసం పనిచేయాల్సిన దుస్థితి. పిల్లలను అదనపు ఆదాయం తెచ్చేవారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి.
  2. తల్లిదండ్రుల నిరక్షరాస్యత: ఎక్కువ మంది తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు కావడంతో పిల్లల భవిషత్తు ప్రశార్థకంగా మారుతోంది. అర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు.
  3. సాంఘిక ఆర్థిక స్థితిగతులు (కుటుంబ పరిమాణం, నిరుద్యోగిత మొదలైనవి.)
  4. బాలకార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహనా లోపం
  5. పిల్లల ప్రాథమిక విద్య, నైపుణ్యాల పెంపునకు కావలసిన కనీస అవకాశాల కొరత
  6. భారీ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ
  7. పల్లెల నుంచి పట్టణాలకు వలస: గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు లేక పనికోసం వలసకు వెళ్లిన చోట పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. వారు కూడా బాలకార్మికులుగా మారుతున్నారు.
  8. పెరుగుతున్న ప్రైవేటీకరణ ఫలితంగా ఏర్పడుతున్న అసంఘటిత శ్రామిక మార్కెట్లు
  9. బాల కార్మిక చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించటం
  10. సాంఘిక భద్రతా పథకాల లేమి (ఉన్నప్పటికీ వాటి అమలులో లోటుపాట్లు)
  11. ప్రస్తుత విద్యావిధానంపై తల్లిదండ్రులకు విశ్వాసలోపం
  12. బాల కార్మిక వ్యవస్థపై సమాజంలో తీవ్రమైన సాంస్కృతిక వ్యతిరేకత లేదు. పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని సమాజం వ్యతిరేకించిన నాడే ఈ పరిస్థితి నుంచి బయటపడగలం.
  13. సమాన పనికి సమాన వేతనం కాగితంపైనే ఉండటం వల్ల యజమానులు పెద్దలు చేయాల్సిన పనుల్లో పిల్లలకు తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకోవచ్చని బాలలను నియమించుకుంటున్నారు.
  14. తల్లిదండ్రులు యజమానుల దగ్గర తీసుకున్న అప్పు, దానిపై వడ్డీ తేలే దాకా పిల్లలను తాకట్టు పెడతారు. ఇది వెట్టిచాకిరీయే. గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం పెరుగుతుండటంతో బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోసినట్లవుతోంది.
బాలకార్మిక వ్యవస్థ – ప్రభావం
  1. ఒక దేశ అభివృద్ధిపై బాలకార్మిక వ్యవస్థ దీర్ఘకాలిక దుష్పరిమాణాలకు, రుణాత్మక (ప్రతికూల) ఫలితాలకు దారితీస్తుంది.
  2. బాలల శారీరక, మానసిక పెరుగుదల సక్రమంగా ఉండదు.
  3. పిల్లల్లో సహజంగా ఉన్న నైపుణ్యాలు,సామర్థ్యాలు నశిస్తాయి.
  4. కుటుంబ పరిమాణంలో పెరుగుదల, తద్వారా జనాభా పెరుగుదలకు దారితీస్తుంది.
  5. శ్రామిక దోపిడీ జరుగుతుంది. మానవీయ విలువలు నశిస్తాయి.
  6. భావి భారత మానవ వనరులు దుర్వినియోగమవుతాయి. తత్ఫలితంగా దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కుంటుపడుతుంది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలు:
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి భారత ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అవి:
  1. బాలకార్మిక చట్టాల అమలు
  2. బాలల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అమలు
  3. బాలకార్మిక వ్యవస్థ అధికంగా ఉన్న ప్రదేశాలు, రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలను అమలు చేయడం
బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం:
1986లో చేసిన బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు ఉండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు వంటి రంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. 2010లో సర్కస్ లలో, ఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలు శిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి.

జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు:
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో అతి ముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు. దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాల కార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించింది. పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 259 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరావాసాన్ని అందించడం. అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో చేరుస్తారు. వారికి బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యను అందిస్తారు. వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. వీరికి ఉపకరా వేతనం, ఆరోగ్య రక్ష సదుపాయాలు కూడా అభిస్తాయి. ఇప్పటి వరకు పదివేలకు పైగా ఇటువంటి ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. వీటిలో ఐదు లక్షల మంది పిల్లలు చేరారు. ప్రస్తుతం దేశంలో 8020 జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు ప్రత్యేక పాఠశాలలున్నాయి. వీటిలో 4 లక్షల మంది పిల్లలు చేరారు. ఈ ప్రాజెక్టు కింద 6.47 లక్షల మంది పిల్లలను ప్రత్యేక శిక్షణ అనంతరం సాధారణ పాఠశాలల్లో చేర్చారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలేవైనా పునరావాస ప్రాజెక్టులను నిర్వహిస్తే వాటికి అయ్యే ఖర్చులో 75 శాతం మేరకు కేంద్రం సమకూరుస్తుంది. తల్లిదండ్రుల సంరక్షణ లేని బాలకార్మికులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సమీకృత బాలల రక్షణ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు.

రాజ్యాంగ రక్షణలు:
భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తుల్లో పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. రాజ్యాంగంలోని 24 వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేపట్టడం నిషిద్ధం. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదు. బాల్యాన్ని, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించాలని రాజ్యాంగ ప్రకరణలు 39(ఈ), (ఎఫ్) చెబుతున్నాయి. బాలల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2007లో కమిషన్ ఏర్పాటైంది.

విద్యా హక్కు చట్టం, 2009 (Right to Education Act, 2009):
బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలి. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. విద్యాహక్కు చట్టం హామీ ఇచ్చిన విధంగా వీరందరిని వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్చించి విద్యనందించడం ఒక సవాలే. మధ్యలో బడిమానేయకుండా చూడటానికి ఎనిమిదో తరగతి వరకూ పిల్లలకు డిటెన్షన్ పద్దతి ఉండకూడదని వీరిని సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతి ద్వారా పరీక్షించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యమైన విద్యనందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరం మేరకు చదువు నేర్చుకొని, తర్వాత తరగతిలోకి ప్రవేశించగలిగేలా చేయాల్సిన బాధ్యత పాఠశాలపై ఉంటుందని చట్టం పేర్కొంటుంది. ఒక పూట బడి, ఏటా తప్పనిసరిగా బడి నడవాల్సిన రోజులు, రోజూ బడి నడవాల్సిన సమయాన్ని చట్టం నిర్దేశిస్తోంది. విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైన అదనపు శిక్షణ ఇవ్వాలి. దండన లేని బోధన అందించాలి.

పరిష్కారం:
  1. బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన, దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. ఈ చట్టాలు అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం ఉండాలి.
  2. విద్యాహక్కు చట్టం అమలుకు సంబంధించి ప్రధాన అవరోధం 1986 బాలకార్మిక చట్టం. ఈ చట్టంలోని ఏడో సెక్షన్ ప్రకారం ప్రమాదకరం కాని పనుల్లో పగటి వేళల్లో పిల్లలతో మధ్యలో ఒక గంట విశ్రాంతితో ఆరుగంటల పని చేయించవచ్చు. మొత్తంగా ఏడు గంటల సమయాన్ని పనిలో గడిపే పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం అసాధ్యం. అందుకే 1986 బాలకార్మిక చట్టాన్ని సవరించాలి. అన్ని రకాల బాల కార్మిక వ్యవస్థల్ని రద్దు చేయాలి.
  3. చట్టాలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. ఎక్కువ మంది బాలకార్మికులు మధ్య తరగతి, సంపన్న కుటుంబాల్లో పని చేస్తున్నారు. ముందుగా సంపన్న వర్గాల్లో చైతన్యం రావాలి. ఉపాధి హామీ పథకాన్నిమరింత పకడ్బందీగా అమలు చేయాలి.
  4. తల్లిదండ్రులు, కుటుంబంలో వయోజనులు జీవనోపాధి పొందితే పిల్లలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. అప్పడు పిల్లలు బడికి వెళ్తారు.
  5. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టడంతో చదువుకునే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మరింత పకడ్బందీగా అమలు చేయాలి.
  6. విద్యా విధానంలో సమగ్ర మార్పులు రావాలి. పిల్లలకు ఆసక్తి కలిగించే, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్యా విధానం అవసరం. ఉపాధ్యాయుల్లో అంకిత భావం కావాలి.
  7. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాలలకు పునరావాసం కల్పించే ప్రక్రియలు, ప్రభుత్వ –ప్రభుత్వేతర సంస్థల మధ్య సరైన సమన్వయం ఉండాలి. న్యాయవ్యవస్థ, పోలీసు యంత్రాంగం, కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు కలిసి పని చేయాలి. విముక్తి కల్పించడమే కాకుండా వారు మళ్లీ ఆ నరక కూపంలోకి వెళ్లకుండా చూడాలి.
  8. బాలల దినోత్సవం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కార్యక్రమాలను ఆర్భాట ప్రకటనలకు పరిమితం కాకుండా అమలు విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి.
  9. గ్రామీణ ప్రాంతాల నుంచి బాలబాలికలు ఉద్యోగం నిమిత్తం పట్టణాలకు వెళ్తుంటారు. వీరు పట్టణాల్లో ఆలనా పాలనా లేక అన్ని రకాల దోపిడీలకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూసంస్కరణలు పటిష్టంగా అమలు చేస్తే పేద ప్రజల పరిస్థితులు మెరుగుపడతాయి. తమ పిల్లలను పట్టణాలకు పంపించాల్సిన అవసరం ఉండదు.
  10. ప్రభుత్వం విద్య, ఇతర అవకాశాల విషయాల్లో కల్పిస్తున్న వసతుల గురించి నిరక్షరాస్యలైన తల్లిదండ్రులకు అవగాహన లేకుండా పోతోంది. వీరికి అవగాహన కల్పించేందుకు బడిబాట వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజం, ప్రభుత్వం ఉమ్మడిగా కృషి చేయాలి.
  11. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించాలి.
భారమైన శ్రమకు బలైపోతున్న బాలబాలికల చేత పలకా బలపం పట్టిస్తే ఎంతో మంది మహాత్మాగాంధీలు, మదర్ థెరిస్సాలు, సచిన్ టెండూల్కర్ లు, ఆమర్త్య సేన్ లు, రవీంద్ర నాథ్ ఠాగూర్ లు, సర్ సీవీ రామన్ లు, ఐన్ స్టీన్ లు తయారవుతారు. దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి తోడ్పడే సమర్థ మానవ వనరులవుతారు. బాలల ప్రగతి దేశ ప్రగతికి సోపానం అనే విషయాన్ని మనం విస్మరించరాదు.


ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.
Published date : 05 Nov 2013 03:11PM

Photo Stories