Skip to main content

Gun Culture: 33 కోట్ల మందికి 39 కోట్ల తుపాకులు... 50 ఏళ్లలో 15 లక్షల మంది బలి.. ఆరు దాటితే అడుగు బయటపెట్టాలంటే హడల్‌..!

పేరుకే అగ్రరాజ్యం. కానీ, అక్కడ బతుకు నిత్య భయానకం. సాయంత్రం ఆరు దాటితే ఒంటరిగా రోడ్డు మీద నడవడానికి కూడా భయమే. వీకెండ్స్‌లో పబ్‌లలో జాలీగా ఎంజాయ్‌ చేయాలంటే వణుకు. ఎవడు ఎప్పుడు కాల్చేస్తాడేమోనని... కానీ, తమ దేశంలో ఉన్న జీవన ప్రమాణాలు ఏ దేశంలోనూ లేవని డబ్బా కొట్టుకుంటుంది అమెరికా.

ఆ దేశంలో ఉన్న జీవన ప్రమాణాలు ఏపాటివో కరోనా నిరూపించేసేంది. అయితే అమెరికాను పట్టిపీడిస్తోన్న తుపాకి సంస్కృతికి మాత్రం సొల్యూషన్‌ దొరకడం లేదు. గత 50 ఏళ్లలో 15 లక్షల మంది ప్రాణాలు వదిలారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
తాజాగా 9 మంది మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ మళ్లీ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మూడు వేరు వేరు ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్‌ బేలో రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్‌ మష్రూమ్‌ సోయిల్‌ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్లు వెల్లడించారు పోలీసులు. మరోవైపు డెస్‌ మొయిన్స్‌లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు.

gun


జనాభా కంటే తుపాకులే ఎక్కువ..!
అమెరికాలో ఇలా తుపాకీ కాల్పులు జరగడం కొత్త కాదు. ఏటా తుపాకీ కాల్పుల్లో  ఎందరో అమాయకులు చనిపోతున్నారు. అగ్రరాజ్యం పేరును తుపాకీ రాజ్యంగా మారిస్తే బెటరన్న సెటైర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో తుపాకులు 39 కోట్లకు పైగా ఉన్నాయి. అవి 33 కోట్ల మంది ప్రజల ఇళ్లల్లో ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి.
యుద్ధాల్లో మరణించిన సంఖ్యకంటే ఇదే అధికం...!
1968 నుంచి 2017 వరకు 50 ఏళ్ల వ్యవధిలో అమెరికాలో తుపాకులు 15 లక్షలమంది ప్రాణాలు తీసేశాయి. వీటిలో ఆత్మహత్యలూ, హత్యలూ ఉన్నాయి. ఆకతాయిగా చిన్నపిల్లలే  దీపావళి తుపాకీ కాల్చినట్లు కాల్చి సాటి పిల్లల్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి.  1775లో అమెరికా స్వాతంత్య్ర పోరాటం నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో జరిగిన అన్ని యుద్ధాలు.. అమెరికా సైన్యం పాల్గొన్న అన్ని యుద్ధాల్లో కలుపుకున్నా అమెరికాలో తుపాకుల బారిన పడి చనిపోయిన వారికన్నా తక్కువ మందే మరణించారు. 
రోజుకు 53 మంది ప్రాణాలు గాల్లోకి...
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నేవల్‌ బేస్‌ పెరల్‌ హార్బర్‌ పై జపాన్‌ చేసిన మెరుపుదాడిలో చనిపోయింది కేవలం 2400 మంది మాత్రమే. సెప్టెంబరు 11న ట్విన్‌ టవర్స్‌ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మూడువేల చిల్లర మంది మాత్రమే చనిపోయారు. అంతకు ఎన్నో వందల రెట్లు మంది ఏటా తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. సగటున ప్రతీ ఏటా 41 వేల మంది తుపాకీ గుళ్లకు తలలు వాల్చేస్తున్నారు. ఇంకా సింపుల్‌ గా చెప్పాలంటే ప్రతీ రోజూ సగటున 53 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. 
బొమ్మలు కొన్నంత ఈజీగా..
మన దగ్గర సూపర్‌ మార్కెట్ల తరహాలోనే అమెరికాలో తుపాకుల దుకాణాలు ఉంటాయి. లైసెన్స్‌ చూపిస్తే చాలు షాప్‌లో తుపాకీ అమ్మేస్తారు. ఆ తుపాకీ కూడా పెద్ద ఖరీదేం కాదు. నలుగురు యువకులు ఓ మందు పార్టీకి ఖర్చుపెట్టే సొమ్ముతో ఓ మాంచి తుపాకీ వచ్చేస్తుంది. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా సరే అమెరికాలో య«థేచ్ఛగా తుపాకీ కొనుక్కోవచ్చు. దాన్ని జేబులో పెట్టుకుని తిరగచ్చు. తుపాకీ ఎందుకు కొన్నావ్‌? జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావ్‌? అని ఎవరూ అడగరు.
మద్యానికి 21 ఏళ్లు.. తుపాకికి 18 ఏళ్లే....
చిత్రం ఏంటంటే అమెరికాలో మద్యం కొనడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. కానీ తుపాకీ మాత్రం 18 ఏళ్లు నిండితే చాలు. ఇంత లిబరల్‌గా తుపాకులు అమ్మేస్తున్నారు. ఒక్క 2020 లోనే అమెరికాలో 26 లక్షల తుపాకులు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంత విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో గన్‌ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతోంది.

gun


ఇప్పుడు పుట్టింది కాదు....
అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇప్పుడు పుట్టింది కాదు. బ్రిటిష్‌తో స్వాతంత్య్ర పోరాటం చేసే సమయంలో పూర్తి స్థాయి ఆర్మీ లేని అమెరికా పౌరులందరికీ తుపాకులు కలిగి ఉండే హక్కు కల్పించింది. అవసరం వచ్చినపుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత తుపాకులతో యుద్ధంలో పాల్గొనాల్సి ఉండేది. దీంతో పాటే ఆహారం కోసం వేటపై ఆధార పడే వాళ్లకు తుపాకులు కలిగి ఉండే హక్కు ఉండేది. అమెరికాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని రెండవ సవరణలో ప్రతీ అమెరికన్‌ పౌరుడూ తుపాకీ కలిగి ఉండే స్వేచ్ఛను కల్పించారు. శతాబ్దాల క్రితం  పౌరులకు సంక్రమించిన ఈ రాజ్యాంగ బద్ధ హక్కే ఇపుడు అమెరికాని ఆందోళనలోకి నెట్టేస్తోంది. 
కోపం వస్తే... పిట్టను కాల్చినట్లు కాల్చేయడమే
ఇంటిమిటెంట్‌ ఎక్ప్‌ ప్లోజివ్‌  డిజార్డర్‌ అనే మానసిక వ్యాధితో బాధపడేవారు అమెరికాలో ఎక్కువ అవుతున్నారు. వీరికి ఉన్నట్లుండి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో ఇష్టమొచ్చినట్లు కాల్చిపారేస్తున్నారు. ఆ సమయంలో తన, మన అనే బేధం కూడా చూపించడం లేదు. ఆమధ్య టెక్సాస్‌ లో 18ఏళ్ల కుర్రాడు తన 18వ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడే దుకాణానికి వెళ్లి ఓ తుపాకీ కొన్నాడు. వెంటనే ఫేస్‌ బుక్‌ లో తాను ఆ తుపాకీతో స్కూల్‌ కి వెళ్లి కాలుస్తానని పోస్ట్‌ పెట్టాడు కూడా. అయితే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ కుర్రాడు తాను కొన్న తుపాకీతో తన నాయనమ్మను కాల్చి చంపి ఆ తర్వాత స్కూల్‌ కి వెళ్లి పదేళ్ల వయసుండే పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 19 మంది అక్కడి కక్కడే చనిపోయారు.
బలంగా ఆయుధ వ్యాపారుల లాబీ...
తుపాకుల వ్యాపారంలో మునిగి తేలే ఆయుధ వ్యాపారులే అమెరికాని శాసిస్తూ ఉంటారు. ఆయుధ వ్యాపారులకు కోపం తెప్పించే పని చేయడానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు. గతంలో తుపాకుల విక్రయాలపై ఆంక్షలు ఉండాల్సిందేనని బారక్‌ ఒబామా గట్టిగానే అన్నారు. కానీ, రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఆపని చేయలేకపోయారు. ఒబామా తర్వాత అధ్యక్షుడైన ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత కాబట్టి తుపాకులకు సహజంగానే  సానుకూలం. ఇపుడు డెమొక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ అధ్యక్షుడి గా ఉన్నాడు. 
పాలకుల నిర్లక్ష్యమే శాపం..!
తుపాకుల విక్రయంలోనూ అమెరికాకు దరిదాపుల్లో మరో దేశం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యమే అతి పెద్ద విలన్‌ అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరచి తుపాకీల వ్యాపారంపైనా, వాటి వినియోగంపైనా  ఉక్కుపాదం మోపకపోతే అమాయక బాల్యం తుపాకీ కాల్పుల్లో కాలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Published date : 28 Jan 2023 03:44PM

Photo Stories