India Ban's Rice exports: బియ్యమో.. రామచంద్రా! అంటున్న ప్రవాస భారతీయులు
దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది.
అత్యధిక బియ‍్యం ఎగుమతి మన దేశం నుంచే:
ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది.
అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు.
☛☛ India's Rice Exports Ban: బియ్యం ఎగుమతులను నిషేధించిన భారత్
ఈ నిషేధం తాత్కాలికమేనా?
సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది.