Skip to main content

సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. ఆర్కిటెక్చర్‌ అంటే ఆసక్తి. ఈ రంగంలో నా అభిరుచికి తగిన కోర్సులు ఏవైనా ఉన్నాయా?

Question
సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. ఆర్కిటెక్చర్‌ అంటే ఆసక్తి. ఈ రంగంలో నా అభిరుచికి తగిన కోర్సులు ఏవైనా ఉన్నాయా?
ఆర్కిటెక్చర్‌ రంగంలో సివిల్‌ ఇంజనీర్లకు మంచి అవకాశాలుంటాయి. అయితే అవి సివిల్‌ పనులకు సంబంధించినవే అయి ఉంటాయి. ఈ రంగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేకుండా పూర్తి స్థాయి ఆర్కిటెక్చర్‌గా పనిచేసే అవకాశం లేదు. అలాగే మీరు మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(ఎం.ఆర్క్‌) కోర్సు చేయడానికి కూడా అర్హులు కారు. మీ ఆసక్తికనుగుణంగా మాస్టర్‌ స్థాయిలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు..
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌- న్యూఢిల్లీ, ఆఫర్‌ చేస్తోన్న కోర్సులు:
మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, అర్బన్‌ ప్లానింగ్‌).
అర్హత: 55 శాతం మార్కులతో ప్లానింగ్‌/ ఆర్కిటెక్చర్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా జాగ్రఫీ/ ఎకనామిక్స్‌/సోషియాలజీలో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి.
మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: 55 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌/బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌, ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌/ బిల్డింగ్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా కన్‌స్ట్రక్షన్‌ టెక్నాల జీలో ఐదేళ్ల డిప్లొమా కోర్సును పూర్తి చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.spa.ac.in
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూని వర్సిటీ-హైదరాబాద్‌. మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌ కోర్సు అందిస్తోంది. బీఆర్క్‌/బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణత లేదా ఎకనామిక్స్‌ /జాగ్రఫీలో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్‌: https://jnafau.ac.in
సీఈపీటీ యూనివర్సిటీ- అహ్మదాబాద్‌, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అర్హత-ఆర్కిటెక్చర్‌ లేదా సివిల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ .ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సివిల్‌ ఇంజనీర్లకు స్ట్రక్చరల్‌ డిజైన్‌లో ఎంటెక్‌, మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌) కోర్సులను కూడా అందిస్తోంది. వెబ్‌సైట్‌: www.cept.ac.in
హామ్‌స్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ సంస్థ ఇంటీరియర్‌ డిజైన్‌లో రెండేళ్ల డిప్లొమా, ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు, ఏడాది డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.hamstech.com

Photo Stories