Skip to main content

సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్‌కు సంబంధించి ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఆర్.చంద్రశేఖర్, తార్నాక.
Question
సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్‌కు సంబంధించి ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
అభ్యర్థులు ఏ అంశానికి సంబంధించైనా స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా సిద్ధమవాలి. కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరచుకోవాలి. సిలబస్‌లోని అంశాలకు సంబంధమున్న సమకాలీన పరిణామాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
  • 11, 12వ పంచవర్ష ప్రణాళికలు; ప్రభుత్వ రంగం- వనరుల సమీకరణకు ఆధారాలు; ఉపాధి రహిత వృద్ధి; శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు, లోటు బడ్జెట్ విధానం, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఉపాధిస్తంభన తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • 11, 12వ ప్రణాళికల పత్రాల్లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడం; సామాజిక అభివృద్ధి ద్వారా సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాలి. భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాల స్థితిగతుల నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన అంశం ఆధారంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం. 2016-17 బడ్జెట్‌ను అధ్యయనం చేయాలి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, మూలధన రాబడి, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
  • దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. భారత్‌లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకోవాలి. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి. భారత్‌లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవాలి.

Photo Stories