బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ విభాగాలకు ఎలా సిద్ధమవాలి?
- షేక్ బషీర్
Question
బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ విభాగాలకు ఎలా సిద్ధమవాలి?
కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు పత్రికలు ఉపయోగించుకోవడం ముఖ్యం. ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్స్‌లో రాసుకోవాలి. ఆ అంశంతో ముడిపడిన ఇతర అంశాలపైనా దృష్టిసారించాలి. ఉదాహరణకు యూఎస్, ఇజ్రాయెల్.. యునెస్కో నుంచి వైదొలగిన అంశాన్ని తీసుకుంటే ఆయా దేశాల రాజధానులు, కరెన్సీ, అధ్యక్షులు, ఇటీవల కాలంలో ఆయా దేశాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలపై దృష్టిసారించాలి. ఇలాచేస్తే ప్రశ్న ఏ విధంగా వచ్చినా సరైన సమాధానం ఇచ్చేందుకు వీలవుతుంది.
- బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, బ్యాంకింగ్ టెర్మినాలజీ, నియామకాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అధిక శాతం ప్రశ్నలు పరీక్షకు ముందు మూడు, నాలుగు నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలపైనే వస్తున్నాయి. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ సాగించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు-నివేదికలు తదితరాలను అధ్యయనం చేయాలి. అంతార్జాతీయ అంశాలకు సంబంధించి వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, సదస్సులు, తీర్మానాలు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి వాటిని చదవాలి.
- ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఆవిష్కరణలు, క్షిపణులు, ఇంధన వనరులు; సమాచార, సాంకేతిక రంగాల్లోని పరిణామాలు తదితరాలను అధ్యయనం చదవాలి.
- క్రీడల్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల గురించి తెలుసుకోవాలి. వివిధ టోర్నీలు, విజేతలపై దృష్టిసారించాలి. క్రీడా వేదికలు, వివిధ దేశాలు సాధించిన పతకాలు, క్రీడా పదజాలం వంటివి ముఖ్యమైనవి.
- స్టాక్ జీకేలో భాగంగా జనాభా, రవాణా వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థలు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వ్‌లు, ప్రముఖుల బిరుదులు, ఐక్యరాజ్యసమితి-అనుబంధ సంస్థలు, ఐరాస సంవత్సరాలు, దేశాల కరెన్సీలు, నియామకాలు, అధ్యయన శాస్త్రాలు, దినోత్సవాలు తదితరాలు ముఖ్యమైనవి.