Skip to main content

బ్యాంకు పరీక్షల్లో విజయానికి ఎలా చదవాలి?

-ఎం.అవినాష్, హైదరాబాద్.
Question
బ్యాంకు పరీక్షల్లో విజయానికి ఎలా చదవాలి?
బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనలో అన్వయ సామర్థ్యం అవసరం ఎంతగానో ఉంటుంది. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్‌లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ ప్రధాన పరిష్కారం నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తిచేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అని విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కాదా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి.

సమయపాలన కీలకం:
రోజూ ప్రతి సబ్జెక్టును చదివేలా టైం మేనేజ్‌మెంట్ ను అలవరచుకోవాలి. చదివిన అంశాల పునశ్చరణకు కొంత సమయం కేటాయించుకోవాలి. ఇప్పటికే పలు బ్యాంక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వాటిలో తమకు వచ్చిన మార్కులు, ఎందులో వెనుకంజలో ఉన్నామో గమనించి, ఆ అంశాలపై మరింత దృష్టి సారించాలి. పరీక్షకు రెండు వారాల ముందు నుంచి రివిజన్‌కే కేటాయించాలి. కనీసం అయిదు మాక్‌టెస్ట్‌లకైనా హాజరు కావాలి.

Photo Stories