Private Schools: వీధికో ప్రైవేట్ స్కూల్... హంగులు, ఆర్భాటాలు చూసి మోసపోకండి!
చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ఈ నెల 13న పునఃప్రారంభం కానున్నాయి. మేడిపండు చూడ మేలిమైనుండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందాన ఆకర్షణీయ ప్రకటనలు, ఆకట్టుకునే ఆఫర్లు చూపించే ప్రైవేట్, కార్పొరేట్ మోసాలకు లోనుకాకూడదని పలువురు విద్యావేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్చాలనుకునే తల్లిదండ్రులు సదరు పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందింది? లేనిదీ గమనించాలని, ఆ తరువాత పాఠశాలలో ఉన్న సదుపాయాలు, బోధన సిబ్బంది తదితరాలు పరిశీలించిన తరువాతనే ముందుకు వెళ్లాలని హితవు పలుకుతున్నారు.
● ప్రైవేట్ స్కూల్స్‌పై ఆరా తీయండి
● అన్నీ పరిశీలించాకే పిల్లలను చేర్పించాలి
● హంగులు, ఆర్భాటాలు చూసి వెళ్లొద్దు
● అనుమతులు, గుర్తింపులపై అడిగి తెలుసుకోవాలి
● ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం బాధ్యతగా విధుల నిర్వహణ
● మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
గుర్తింపు పొందిన స్కూల్స్ 1,177
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 1,177 ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ ఉన్న ప్రాథమిక పాఠశాలు 459, ప్రాథమికోన్నత పాఠశాలలు 251, ఉన్నత పాఠశాలలు 702 ఉన్నాయి. ఇందులో దాదాపు 2,54,421 మంది విద్యార్థులు అన్ని తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా అధికారులు గుర్తింపు లేని పాఠశాలలు ఏమీ లేవని చెబుతుంటారు. అయితే పలు చోట్ల విద్యాశాఖ అధికారులను కార్పొరేట్ విద్యాసంస్థలు మోసం చేసి గుర్తింపు లేని శాఖలను నిర్వహిస్తున్నారు. వీటిపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Also Read : ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అనుమతుల్లేని బడుల్లో చేర్చొద్దు
రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చైల్డ్ ఇన్‌ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని స్కూల్స్‌లో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట విద్యార్థులుగానే పేర్కొంటారు. కొత్త ప్రైవేట్ పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరిచి విద్యార్థులను చేర్చుకోవాలి. ప్రాథమిక స్థాయి పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత పాఠశాలకు విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషన్‌న్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
తెలుసుకోవాల్సిన అంశాలు
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటాయి. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రైవేట్ విద్యార్థిగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అవసరం.
అనుమతులు లేకుంటే పాఠశాలలు సీజ్
ప్రైవేట్, కార్పొరేట్ బడులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. పాఠశాలలు పున:ప్రారంభం నాటికి అనుమతులు లేకుంటే ఖచ్చితంగా సంబంధిత పాఠశాలలను సీజ్ చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే ముందు తప్పనిసరిగా అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ బడుల ఎదుట నోటీస్ బోర్డులో తప్పనిసరిగా సంబంధిత పాఠశాల వివరాలు నమోదు చేయాలి. పాఠశాల బోర్డుపై అనుమతి పొందిన నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకుంటే శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు జిల్లా