AISSEE-2022: సైనిక్ స్కూల్స్‌లో బాలికలకూ ప్రవేశం
- కొత్తగా వచ్చే ఏడాది నుంచి 100 సైనిక్ స్కూల్స్
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు
- బాలికలకు ప్రవేశ అర్హత కల్పించాలని నిర్ణయం
- ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్
- 2022 సంవత్సరానికి కొనసాగుతున్న ప్రవేశ ప్రక్రియ
సైనిక్ స్కూల్స్.. యాభై ఏళ్ల క్రితం దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన విద్యా సంస్థలు. సైనిక్ స్కూల్స్ పర్యవేక్షణకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా సైనిక్ స్కూల్ సొసైటీని నెలకొల్పారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. రెసిడెన్షియల్ విధానంలో సీబీఎస్‌ఈ విద్యా బోధన అందిస్తారు. చదువుతోపాటు విద్యార్థుల్లో ధైర్యసాహసాలు నూరిపోస్తూ.. త్రివిధ దళాల్లో చేరేలా స్కూల్ స్థాయి నుంచే శిక్షణ ఇవ్వడం ఈ స్కూల్స్ ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న సైనిక్ స్కూల్స్‌కు సంబంధించి సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కొత్తగా వంద సైనిక్ స్కూల్స్
కొత్తగా వంద సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో, లేదా ఆసక్తి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా కొత్తగా ప్రతి ఏటా దాదాపు అయిదు వేల మందికి సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం లభించనుంది. ప్రస్తుతం దేశంలో 33 సైనిక్ స్కూల్ ఉండగా.. వాటిలో ప్రతి ఏటా మూడు వేల మంది ఆరో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు. తాజా నిర్ణయంతో మొత్తం ఎనిమిది వేలకు పైగా విద్యార్థులకు సైనిక్ స్కూల్స్‌లో చదువుకునే అవకాశం లభించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సైనిక్ స్కూల్స్‌కు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది.
సీబీఎస్‌ఈ గుర్తింపు
కొత్తగా ఏర్పాటు చేయనున్న సైనిక్ స్కూల్స్‌కు సీబీఎస్‌ఈ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోనున్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనలో నాణ్యత, కరిక్యులం తదితర అంశాల్లో ప్రభుత్వం సహాయ,సహకారాలు అందించనుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో సైనిక్ స్కూల్స్ విద్యార్థులు ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది.
బాలికలకూ ప్రవేశం
ఇప్పటి వరకు సైనిక్ స్కూల్స్‌లో కేవలం బాలురకే ప్రవేశ అర్హత ఉంది. ఇకపై బాలికలకు కూడా అన్ని సైనిక పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. దీన్ని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్‌గా 2019 నుంచే మిజోరాం సైనిక్ స్కూల్‌లో అమ్మాయిలకు ప్రవేశం కల్పిస్తున్నారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి బీజాపూర్, చంద్రపూర్, ఘోరకల్, కలికిరి, కొడగులలోని సైనిక పాఠశాలల్లో కూడా బాలికలు అడ్మిషన్ పొందుతున్నారు.
పెరగనున్న ప్రాతినిథ్యం
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భవిష్యత్తులో సాయుధ దళాల్లో మహిళల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల త్రివిధ దళాల్లో మహిళలకు పర్మనెంట్ కమిషన్ ర్యాంకు ఇవ్వడం, ఎన్‌డీఏకు అర్హత కల్పించడం తెలిసిందే. భవిష్యత్తులో త్రివిధ దళాల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మహిళలు సైతం పోటీపడేలా పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో సైనిక్ స్కూల్స్‌లో బాలికలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 8వేల వరకు ఉంది.
సాయుధ కొలువులు
త్రివిధ దళాలకు ఎంపికయ్యే వారిలో సైనిక్ స్కూల్స్ విద్యార్థుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఎన్‌డీఏకు ప్రతి ఏటా ఎంపికయ్యే వారిలో 30 శాతం వరకు సైనిక్ స్కూళ్ల విద్యార్థులే ఉంటున్నారు. దీనికి ప్రధానంగా హైస్కూల్ స్థాయి నుంచే ఆ దిశగా శిక్షణ ఇవ్వడం, ఎన్‌సీసీ శిక్షణ, ఇతర ఫిజికల్ ట్రైనింగ్ కారణంగా భావిస్తున్నారు. కొత్తగా వంద సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో రానున్నరోజుల్లో త్రివిధ దళాల్లోని కొలువుల్లో సైనిక్ స్కూళ్ల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రవేశ ప్రక్రియ.. ఇలా
సైనిక్ స్కూళ్లలో 2022–23 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)–2022 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో.. ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఆరో తరగతిలో ప్రవేశాలకు బాలికలను కూడా అర్హులుగా ప్రకటించారు. ప్రతి సైనిక్ స్కూల్లో పది సీట్లను అమ్మాయిలకు కేటాయించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రతి సైనిక్ స్కూల్‌లో 67శాతం సీట్లు హోం స్టేట్ కోటా కాగా.. మిగిలిన సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీపడొచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కలికిరి, కోరుకొండలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.
ఆరో తరగతి పరీక్ష
సైనిక్ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. సెక్షన్ ఎ మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు–150 మార్కులు, సెక్షన్ బీ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ సీ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ డీ 25 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు.
తొమ్మిదో తరగతి పరీక్ష
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం నాలుగు వందల మార్కులకు నిర్వహిస్తారు. ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ ఏ మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు–200 మార్కులు, సెక్షన్ బీ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ సీ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ డీ జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ ఈ సోషల్ సైన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. ఈ రెండు పరీక్షలు పెన్, పెన్సిల్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2022 ముఖ్య సమాచారం
- వయసు: ఆరో తరగతికి బాల బాలికల వయసు 31.03.2022 నాటికి 10–12ఏళ్ల మధ్యలో ఉండాలి. ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2012 మధ్యలో జన్మించి ఉండాలి.
- తొమ్మిదో తరగతికి బాలుర వయసు 31.03.2022 నాటికి 13–15ఏళ్ల మధ్యలో ఉండాలి. ఏప్రిల్ 1, 2007 నుంచి మార్చి 31, 2009 మధ్యలో జన్మించి ఉండాలి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న బాలురు మాత్రమే తొమ్మిదో తరగతికి అర్హులు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2021
- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో సవరణ: అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు.
- ఏఐఎస్‌ఎస్‌ఈఈ ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ: జనవరి 9, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://aissee.nta.nic.in
సైనిక్ స్కూల్స్.. ముఖ్యాంశాలు
- ప్రస్తుతం 33 సైనిక్ స్కూల్స్‌లో మూడు వేల మందికి అవకాశం.
- వచ్చే విద్యా సంవత్సరం పీపీపీ విధానంలో కొత్తగా వంద సైనిక్ స్కూల్స్.
- కొత్త సైనిక్ స్కూల్స్‌తో అదనంగా మరో అయిదు వేల మందికి ప్రవేశం.
- సైనిక్ స్కూల్స్‌లో ఇక అమ్మాయిలకూ ప్రవేశ అర్హత.
- ప్రతి సైనిక్ స్కూల్లో పది శాతం సీట్లు బాలికలకే.
- త్రివిధ దళాల్లో 30 శాతం మేర సైనిక్ స్కూల్స్ విద్యార్థులు.